Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ప్రతి ఏట జనవరి 12న ''జాతీయ యువ దినోత్సవం'' ఘనంగా నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలు, యువశక్తిని దేశాభివృద్ధికి వినియోగించుకోవడం, ఆధునిక నైపుణ్యాలను అందించడం లాంటి పలు అంశాలను చర్చించే వేదికలుగా జాతీయ యువ దినోత్సవాలు వినియోగపడుతాయి. భారత ప్రభుత్వం 1984లో తీసుకున్న తీర్మానం ప్రకారం 12 జనవరి 1985 నుంచి ప్రతి ఏట స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ''జాతీయ యువ దినం (నేషనల్ యూత్ డే)'' నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. వివేకానందుడి జీవితం లోంచి స్పూర్తిని నింపాలనే సదుద్దేశంతో దేశ నలుమూలల విస్తరించి ఉన్న విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, పౌర సమాజంలో యువతకు సంబంధించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, సెమినార్లు, యోగాసనాలు, ర్యాలీలు, రక్తదాన శిభిరాలు, అవయవదాన ప్రతిజ్ఞలు, ప్రదర్శనలు, సంగీత వేదికలు, ధ్యానాలు, ప్రాణాయామాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు, చర్చాగోష్టులు, యువజనోత్సవాలు, రేడియో ఉపన్యాసాలు లాంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు.
నరేంద్రనాథ్ దత్త లేదా స్మామి వివేకానందుడు 12 జనవరి 1863న బెంగాలీ కుటుంబంలో భువనేశ్వరి దేవి-విశ్వనాథ దత్త దంపతులకు కలకత్తాలో జన్మించారు. రామకృష్ణ పరమహంస శిష్యరికంలో భారతీయ ఆత్మను, హిందూమత సారాన్ని, వసుదైక కుటుంబ భావనలను విశ్వవ్యాప్తం చేసి ప్రపంచ మానవాళిని కుల మతాలకు అతీతంగా ఏకం చేసే ప్రయత్నాలు కొనసాగించారు. మత సామరస్యాన్ని కోరుకున్నారు.. నిస్వార్థ యువశక్తి వినియోగంతోనే దేశ భవిత సుసాధ్యమని గట్టిగా నమ్మి దేశ యువతను జాగృత పరిచారు. తన 39వ ఏట 4 జూలై 1902న మరణించిన వివేకానందుడు భారత జాతిని నిరంతరం జాగృత పరుస్తూనే ఉంటారు. సామాజిక పునరుజ్జీవనం, ఆధునిక భావనలను ప్రచారం చేయడంలో సఫలీకృతమైన వివేకానందుడి బోధనలు విశ్వజనీనాలు, నిత్య ప్రేరణలుగా నిలుస్తూనే ఉంటాయి. వాటిని అందిపుచ్చు కోవడం నేటి యువత బాధ్యత.
భారత దేశానికి మాత్రమే అందుబాటులో ఉన్న అపూర్వ వనరు అత్యధిక యువశక్తి అని మనకు తెలుసు. దేశ జనాభా(దాదాపు 140 కోట్లు)లో 15-59ఏండ్ల ఉత్పత్తి సామర్థ్య జనాభా దాదాపు 62శాతం ఉండడం, 25ఏండ్ల లోపు జనాభా 54శాతం ఉండడంతో మన దేశానికి యువ భారతం అని పేరుంది. భారతీయుల సగటు వయస్సు 29ఏండ్లు ఉండగా, అమెరికన్లకు 40ఏండ్లు, యూరోపియన్లకు 46ఏండ్లు, జపనీయుల సగటు వయస్సు 47ఏండ్లు ఉండటం గమనించాలి. యువ శక్తి అధికంగా ఉన్నప్పటికీ 73ఏండ్ల స్వతంత్ర భారతాన్ని పేదరికం, నిరక్షరాస్యత, అధిక జనాభా, లింగ అసమానతలు, మతవిద్వేషాలు, అనారోగ్యాలు, అత్యాచార హత్యలు, హింసలు, పోషకాహార లోపం, అవినీతి, ఆర్థిక-సామాజిక-రాజకీయ అసమానతలు లాంటి పలు సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో హూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో 130వ ర్యాంకు, హూమన్ కాపిటల్ ఇండెక్స్‌లో 115వ ర్యాంకు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 100వ ర్యాంకు, వరల్డ్ హాపినెస్ ఇండెక్స్‌లో 122వ ర్యాంకు, ఇన్‌క్లూజివ్ డెవలప్మెఎట్ ఇండెక్స్‌లో 62వ ర్యాంకు, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో 141వ ర్యాంకు, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్‌లో 145వ ర్యాంకులో ఉండడం అత్యంత విచారకరం. దేశం ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటికీ యువశక్తే సరైన సమాధానాన్ని వెదకాలి. యువత నాయకత్వం వహించి సమతా భారతిని నిర్మించాలి. శాస్త్రసాంకేతిక నైపుణ్యాలను ప్రోది చేసుకుంటూ, వివేకానందుడి వారసులుగా మతోన్మాదాన్ని ఎండగట్టాలి. భరతమాత ముద్దు బిడ్డలుగా మానవీయ విలువలతో కూడిన ఆధునిక భారతాన్ని సుసాధ్యం చేయాలి.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037