నవతెలంగాణ - హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని బీఎఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా వారితో పని చేయించుకొని ఇప్పుడు వారిపై వివక్ష చూపించడం సరైంది కాదని విమర్శించారు. జేపీఎస్‌లపై ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఓవైపు బలవన్మరణాలకు పాల్పడుతున్నా.. ఈ రోజు విధుల్లో చేరకపోతే కొత్త వారిని నియమించుకుంటామని ప్రభుత్వం పేర్కొనడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటూ, యువత జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగా శుక్రవారం బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు కోల్పోయిన జేపీఎస్ భైరి సోనికి నివాళిగా ప్రతి గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించాలని, పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని ప్రవీణ్‌కుమార్ కోరారు. ఒక్కరి కోసం అందరం.. అందరి కోసం ఒక్కరం.. అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm