Authorization
Fri April 11, 2025 05:47:50 am
తెగదు తెల్లారదు...
ఎంతసేపో అడుగంటని ఆలోచనల జడి
గుర్తు తెలియనంతగా కూరుకుపోవడం తప్ప
ప్రాణాల్ని ఉగ్గబట్టి బొటనేలు మీద నిలపటం తప్ప
అగమ్య అంతస్సమీరాలలోతుల్లో నిర్హేతుకంగా ఉరితీయడం తప్ప
ప్రపంచ యవనికపై హదయాన్ని నగంగా ఆరబెట్టుకోవడం తప్ప
నిప్పులవాన కౌగిలిలో మంచుతో మార్మికంగా దహించకపోవడం తప్ప
లోపలకు బయటకు ప్రయాణించలేని ఉరిశిక్ష తప్ప
తెగదు తెల్లారదు...
ఎంతసేపో అడుగంటని ఆలోచనల జడి
గతాను గతికంగా ప్రవహంలో హాయిగా కొట్టుకుపోవడం తప్ప
రెండు చంద్ర గోళాల మధ్య ధారగా కురుస్తున్న యవ్వనం తప్ప
అక్షర కుంజర జగత్తులో స్వాప్నిక బిందువులుగా మారడం తప్ప
బైరాగి జోలిలోని నాలుగు బియ్యపు గింజల వాసన తప్ప
బిక్కమొహం వేసుకున్న వాకిళ్లలో కంపు కొడుతున్నచూపులు తప్ప
ఆవేదనకు, నిజాయితీకి మధ్య రుచి చూడని తపస్సు తప్ప
తెగదు తెల్లారదు...
ఎంతసేపో అడుగంటని ఆలోచనల జడి
నటనానుకూల స్వాభావిక సంచలనాలు తప్ప
గుండెల బరువెక్కే కన్నీటి సెగల జీవరాసుల తప్ప
పరిమళ భరిత ప్రకతి క్షోభాయమాన శకలాలు తప్ప
జోడించడం, తొలగించడం, ఫార్వర్డ్ లలో క్రియేషన్ తప్ప
నన్ను నేను పిడికెడు యంత్రంలో పూర్తిగా పారేసుకోవడం తప్ప
బతికీ బతకని క్షణాల మధ్య నాకు నేనే ఉలిగా మారడం తప్ప
తెగదు తెల్లారదు...
ఎంతసేపో అడుగంటని ఆలోచనల జడి
- ఎ. రవీంద్రబాబు 8008636981-