Authorization
Mon April 14, 2025 02:45:04 pm
కూలిపోకుండా
నిలదొక్కుకోవాల్సిందిప్పుడే
వాలిపోకుండా
దుర్మతుల పని పట్టాల్సిందిప్పుడే
నిన్నటి వరకు
నీ చేతుల్లో పదిలంగా ఉన్నది
ఒక్కసారిగా
పరాయి పాలౌతున్నట్టు..
మొన్నటి వరకు
నీ పాదాలకిందున్నదే
కిరాయి పాలౌతున్నట్టు..
బడాయి మాటలు చెప్తూ
నీ ఒంట్లో ఉన్న రసాన్నంతా
చెఱుకు మెషిన్లో వేసి
పీల్చి పిప్పి చేస్తుంటే...
కూలి పోకుండా
నిలదొక్కుకోవాల్సిందిప్పుడే
వాలి పోకుండా
దుర్మతుల పని పట్టాల్సిందిప్పుడే!
ఏదైనా, ఏమైనా
ముందడుగేసిన పాదాన్ని
మడమ తిప్పకుండా
ముందుకెళ్తూనే ఉండు
నువ్వేంటో..
నిఖిల ప్రపంచానికి
ఘంటాపథంగా చాటడానికి
అసలైన సమయమిదే!
రగులుతున్న రగుతం మీద
జకమొక రాయెట్టి కొట్టి
నిప్పు పుట్టించాల్సిన సమయమిదే
మదమెక్కిన కరమగపు
మొనదేలిన కొమ్ములను
ఆకురాయితో అరగదీయాల్సిన
అనువైన సమయమిదే
శ్రమజీవుల శవాల పై నుండి
ద''ర్భారు'' కెళ్లే
దౌర్భాగ్య, దౌర్జన్య పాలకుల
పనిపట్టడానికి
ఇన్నాళ్లు ఒరల అరల్లో దాచిన
తళ్వారులను
సానబట్టాల్సిన సమయమిదే
మరింత పట్టుదలతో
సత్తా చూపాల్సిన సమయమిదే
మనం
మరణశయ్యనెక్కడం కాదు
నయా హిట్లర్, తుగ్లక్లకు పాడె కట్టి
ఊరి పొలిమేరలోనే
పాతరేయాల్సిన సమయమిదే
మితిమీరిన ఆగడాలను
కాగడాలతో కాల్చాల్సిన కాలమిదే
ముష్కర మత్తగజాలను
చిత్తు చేయాల్సిన కత్తి ఇదే
గుండుకెదురెళ్ళిన
గుండు సూదంటి
గుడాటిపల్లె గుండెధైర్యాన్ని
పడావు పడకుండా
చూడాల్సిన తరుణమిదే!
- గంగాపురం శ్రీనివాస్
9676305949