Authorization
Mon April 14, 2025 05:48:06 am
చూపులేమో తీక్షణం
ఏమరుపాటుకుతావులేదు ఏ క్షణం
సింగిల్ వే డబుల్ వే ఏదైతేనేం
బండిగేర్లు మారుస్తూ తీయిస్తాడు దౌడు
ఓవర్ టేక్ లు కొన్ని
సడెన్ బ్రేక్ లు కొన్ని
గాడి తోలడం పూలుకోయడంకాదు
కాళ్లచేతుల సమన్వయ నాట్యం
సుదూరస్వప్నసాక్షాత్కారం
తీర్థ క్షేత్రాలపుణ్యఫలం
ఆయన చలవే
మనఅవసరాలు,ప్రేమానుబంధాలు
ఆయన చేసే up and down జర్నీలే
సగటు జీవితాలు
ఆయన స్పీడువల్లే సురక్షితం
దివారాత్రుల సంచారం
వందలకిలోమీటర్లకొద్ది దూరం
మధ్యమధ్యలో కాసిన్ని నీళ్లు
మిర్చీబొండాలు కొన్ని
ఒక గరం ఛారు అంతేచాలు
ఆపై తోవెంట రరు రరు
కొండల, గుట్టల గుండా
కొండమలుపుల దారులగుండా
లోతైన లోయలగుండా
అడవి అందాలగుండా
జలపాతాల,నదుల గుండా
వంతెనల గుండా
రాష్ట్రాల సరిహద్దు స్వాగత ద్వారాల గుండా
ఆనందానుభూతిని పంచుతూ
కనిపించే ఆకాశంకోసం పరుగిడుతూ
ఎనిమిదిగంటల ఆన్ డ్యూటీ
ఆయనది అందాల శ్రమబ్యూటీ
ఎర్రని ఎండల దగళ్లలో ఉత్తరాయణం
వానాకాలం గుంతల దారుల్లో దక్షిణాయణం
మైలేజి ఎంత ఇస్తేఎంలాభం చతుశ్శకటం
ఆవరేజి జీవితమే డ్రైవర్‌ది ఈ శతాబ్దం
లెఫ్ట్ రైట్ లుచూస్తూ
వెనకాముందూ చూస్తూ
ఎక్స్‌లేటర్ తొక్కుతూ
వీనులకు విందైన పాటలు
ఎన్నెన్నో వినిపిస్తూ తోల్కొనిపోతున్నా
ఎదురు మాట్లాడ స్వేచ్ఛలేని స్వరం
ఎదురుతిరుగ లేదు బలం
శాలువలేదు సత్కారం లేదు
ఆయన సర్వీస్‌కు మధ్యలోనే బ్రేకుపడుతుంది
అవసరంలేదు ఆయన అనుమతి
వయసైందని VRS బహుమతి
టైర్ పంక్చరైతే జాకీ ఎక్కించిన వాడు
ఉద్యోగం ఊస్టింగైతే ఏ జాకీ వెదుకుతాడో?
నమ్ముకున్న జీవితం
నట్టేట్లో ముంచుట బహు చిత్రం
టైర్ల క్రింద నలుగిపోతున్నవి కన్న కలలు
కుప్ప కూలిపొతున్నవి ఆశల సౌధాలు
గుండెళ్లో బెంగతీరదు
కళ్లల్లో గంగ ఆరదు
త్రికాలాలు త్రిప్పినా ప్రగతి రథచక్రం
ఎందుకో ఏమో బ్రతుకేమో ECG వక్రం
వేనవేలసార్లు త్రిప్పిన స్టీరింగ్ నుండి
చిట్టచివరికి ఆయనకు జీర్ణమయ్యుంటుంది
RTCచోదకుని జీవితం పూర్ణం కాదని.
- రమేశ్ నల్లగొండ
8308452179