Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో కథా వైవిధ్యం గొప్పది. మొదటి నుంచీ తెలంగాణ కథల్లో ''రియలిజం'' (వాస్తవికత) ఎక్కువగానే ఉంది. కోస్తా కథలు సంస్కరణోద్యమం, హేతువాదోద్యమ నేపథ్యంలో, రాయలసీమ కథలు కరువు నేపథ్యంలో ఎక్కువగా వచ్చాయి. సోషలిస్టు దృక్పథంతో పరిశీలించినపుడు కథల్లో ఉండే వాస్తవికతను ''రియలిజం'' అంటారు. ఇది వివిధ రకాలుగా ఉంటుంది. మాజిక్ రియాలిజం (అతీత శక్తులు కలిగిన పాత్రలు), రొమాంటిక్ రియలిజం (కాల్పనిక వాస్తవికత), మార్కిస్ట్ రియలిజం, సోషల్ రియలిజం, క్రిటికల్ రియలిజం, సోషలిస్టు రియలిజం (సమసమాజ వాస్తవికత).
నేటి కథలు ఎక్కువగా 'ఫొటోగ్రాఫిక్ స్టిల్స్' కథలుగా (కదలిక లేకుండా) ఉంటున్నాయి. అలా కాకుండా పాఠకుడిలో భూకంపంలా ఒక ఆలోచన, ఒక అలజడిని సృష్టించే సిస్మోగ్రాఫిక్ కథలు తక్కువగా వస్తున్నాయి. శీలం భద్రయ్య రాసిన ''గంగెద్దు'' కథలు సిస్మోగ్రాఫిక్ కథల్లా ఉన్నాయి. ఈ కథల్లో ప్రధానంగా రియలిజం ఉంది. ఇవి సమాజానికి అద్దం పట్టినట్టు ఉండే కథలు. కథల్లోని పాత్రలు సామాజిక దుర్నీతిని బయటపెట్టి, పాఠకులకు ఒక మేల్కొలుపును కలుగజేసే ప్రయత్నం చేస్తాయి. 'పరువు, పాకీజ, కుర్చీ, అద్దం, యాక్సిడెంట్, భయం, ఆశ, సంఘర్షణ' వంటి కథలు.
రష్యన్ నవలల్లో ఎక్కువగా 'విప్లవ వాస్తవికత' (రివల్యూషనరీ రియలిజం) ఉంటుంది. దీనిలో విజయం సాధిస్తామనే ఆశావాద దృక్పథం ఉంటుంది. గంగెద్దు కథల్లోని ''పరువు'' కథలో వేశ్యావృత్తి కుటుంబం నుంచి వచ్చిన మనోరమ కష్టపడి చదివి గౌరవంగా బతుకుతూ, తన స్నేహితురాలు రమ్య కొందరు దుర్మార్గుల వలలో చిక్కి వేశ్యా వాటికకు అమ్ముడుపోయే విషయం తెలుసుకుని, దానికి కారణమయిన వారినందరినీ చట్టానికి పట్టిస్తుంది. ''తావు'' కథలో ప్రభుత్వ అభివృద్ధి వల్ల నష్టబోయిన శాంతమ్మ తన పిల్లల ద్వారా తిరుగుబాటు ఉద్యమం చేసి, తనలా అన్యాయానికి గురైన తమ గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుంది. తిరుగుబాటుకు కారణాలను సహేతుకంగా చూపించిన కథలు ఇవి.
తీరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కథల్లో 'క్రిటికల్ రియాలిజం' (సవిమర్శనాత్మక విమర్శ)తో వచ్చినవి గురజాడ, రావిశాస్త్రి లాంటి వారి కథలు. ఈ కథలు సమాజంలోని లోపాలను ఎండగడుతూ, సమాజాన్ని తప్పుబడుతూ ఉంటాయి. 'గంగెద్దు' కథల్లోని 'ఆశ' కథలో ఇలాంటి సామాజిక ఆక్షేపణ ఉంటుంది. రచయిత 'ఆకలికి, పిచ్చికీ మందు ఉంది. కానీ ఆశకు లేదు' అని సామాజిక ఆక్షేపణతో కథను ముగిస్తాడు. కథలో వివిధ రకాల పాత్రల మనస్తత్వాలు, ఆశలు ఆక్షేపణతో ఉంటాయి.
తరువాత ఒకడుగు ముందుకేసి 'సోషలిస్టు రియాలిజం' తో కథలు రాసినవారు అల్లం రాజయ్య. 'సోషలిస్టు రియాలిజం'లో విప్లవానికి అనుకూల శక్తులు, ప్రతికూల శక్తులుంటాయి. విప్లవానికి అనుకూల శక్తిని నడిపించే నాయకుడు పాజిటివ్ హీరో. ఇతను కథానాయకుడు. ఉద్యమానికి నాయకత్వం వహించి, అందరినీ కూడగట్టి సామూహిక తిరుగుబాటు ద్వారా అంతిమ విజయం సాధిస్తాడు. విప్లవానికి అవరోధాలను కల్పిస్తూ విప్లవాన్ని అణిచి వేయాలనుకునే పాత్రను నెగెటివ్ హీరో అంటారు. సమాజంలోని చెడును గుర్తించడం, దానికి నిరసన వ్యక్తం చేయడం, ఇంకో నలుగురిని పోగు చేసి, దానికి వ్యతిరేఖంగా పోరాడడం ''సోషలిస్టు రియలిజం'' పేర్కొంటుంది. అల్లం రాజయ్య రాసిన ''కొలిమి అంటుకున్నది'' నవలలోని నర్సింహులు పాత్ర అన్యా యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే పాజిటివ్ హీరోగా కనబడుతుంది. నర్సిం హులు అందరినీ సమీకరించి, 'సామూ హిక తిరుగుబాటు'కు నాయకుడుగా మారి అన్యాయంపై అంతిమవిజయం సాధి స్తాడు. 'గంగెద్దు' కథలో కూడా ఇలాంటి పాజిటివ్ హీరో 'శివుడు' కనబడుతాడు. గ్రామంలోని కర్ణం పంతులు ఊరిని, ఊరి పెద్దలను, భూమిని తన గుప్పిట్లో పెట్టు కొన్నాడు. కథా నాయకుడు శివుడు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అత్యంత బలహీనుడు. కనీసం ఉపాధి, నివాసం, సాంఘీక జీవనానికి సైతం అర్హత లేని వ్యక్తి. మొదట 'శివుడు' తనకు తానే సంఘర్షిస్తాడు. తరువాత స్వీయ చైతన్యం పొందుతాడు. ఆ తరువాత సమాజంలో తనలా అన్యాయానికి గురైన అందరినీ ఏకం చేస్తాడు. అంతిమంగా సామూహిక తిరుగుబాటుతో భూమిని, సాంఘీక జీవనాన్ని సాధిస్తాడు. విప్లవంతో గ్రామీణ జీవనంలో కొత్త సమసమాజ స్థాపనకు నాంది పలుకుతాడు. తెలంగాణ తొలి నవల అనదగిన వట్టికోట ఆళ్వారుస్వామి 'ప్రజల మనిషి'లోని కంఠీరవం పాత్ర, నిజాం వ్యతిరేక ప్రజా పోరాటాన్ని చిత్రించిన దాశరథి రంగాచార్య రాసిన 'మోదుగపూలు' నవలలోని రఘు పాత్ర, అల్లం రాజయ్య రాసిన ''కొలిమి అంటుకున్నది'' నవలలోని నర్సింహులు పాత్ర, శీలం భద్రయ్య రాసిన ''గంగెద్దు'' కథల్లో శివుడు పాత్ర సోషలిస్టు రియాలిజం కలిగినవి.
''గంగెద్దు'' కథల్లో బ్యురోక్రసి (ఉద్యోగ సమాజం) జవాబుదారితనం మరొక ప్రధానమైన అంశం. ''తావు, అద్దం, యాక్సిడెంట్, భయం, ఆశ' వంటి కథల్లో దారితప్పిన ఉద్యోగస్తులు ఉంటారు. నిస్తేజం, స్వార్ధం కలిగిన ఉద్యోగ సమాజం అభివృద్ధికి గొడ్డలిపెట్టు. రష్యన్ విప్లవం తరువాత సమాజం చైతన్యం కోల్పోయి, నీరసించిపోవడానికి అక్కడి బ్యురోక్రసి పద్ధతులే ప్రధాన కారణం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజా సమస్యల పట్ల సానుభూతి అవసరం. అయితే కథా రచయితగా శీలం భద్రయ్య ఈ అంశంపై లెజిట్మేట్గా విమర్శ చేయడం గమనార్హం.
1991 తరువాత గ్లోబలీకరణ వచ్చింది. ప్రజల జీవన విధానంలో, 'వైయుక్తిక సంఘర్షణ' నేపథ్యంగా గల ''గంగెద్దు'' కథలు ''అద్దం, కుర్చీ, సంఘర్షణ'' వంటివి. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ నేపథ్యంలో కథలు రావాల్సిన అవసరం ఉంది. రచయిత పర్యావరణ స్పృహతో రాసిన కథ 'సిగ్గు'. ఈ కథలో అమ్మమ్మను దేవదారు చెట్టుతో పోల్చి చెబుతూ, చివరికి చెట్టు మురవడంతో కథను ముగిస్తాడు. పోడు భూముల నుంచి గిరిజనులు, ఆదివాసీలను తరమడంతో వారి జీవనం దెబ్బ తింటున్నది. ఇది కూడా పర్యావరణ సమస్య కిందనే వస్తుంది. విదేశాల్లో అనర్ధమని వదిలేసిన అణు విద్యుత్ కర్మాగారాలకు ఇక్కడ అనుమతి ఇస్తున్నారు. ఇది మనిషి తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుతున్నట్టుగా భావించాలి. మనిషి జంతువులను వేటాడడం ఆదిమకాలపు లక్షణం. ప్రకృతి మనిషిపై తిరగబడడం ఆధునిక లక్షణంగా మారుతుంది. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలలో పర్యావరణం మీదనే అధికంగా సాహిత్యం వస్తుంది. గంగెద్దు కథల్లో 'తావు' కథలో తండాకు చెందిన గిరిజన మహిళ ఇల్లు, వ్యవసాయ భూమిని ప్రభుత్వం లాక్కోవడం, ఆమె తట్టుకోలేక బిడ్డలతో పాటు బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఇకోఫెమినిజం దృష్టితో, గ్రామస్థుల తరపున పోరాడి వారికి న్యాయం చేయడం 'సోషలిస్టు ఫెమినిజం' దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది.
శీలం భద్రయ్య రాసిన ''గంగెద్దు'' కథా సంపుటిలోని 'సిగ్గు, పరువు, పాకీజ, యాక్సిడెంట్, కాగడా, బ్యాడ్ టచ్, ఆశ' వంటి కథలు నూతన స్త్రీవాద దృక్పథం (ఫెమినిజం)తో ఉన్నాయి. ఫెమినిజంలో చాలా రకాలున్నాయి. ఫెమినిజం మధ్య తరగతి, సంపన్న వర్గాలకే పరిమితమయ్యిందన్న విమర్శ లేకపోలేదు. ఇందులో కూడా 'సిగ్గు' అనే కథలో అమ్మమ్మకు పెండ్లి చేసే మనీష ఆధునిక ఫెమినిస్టుగా కనబడుతుంది. కానీ ఫెమినిజంలో 'సోషల్ ఫెమినిజం, సోషలిస్టు ఫెమినిజం, ఇకో ఫెమినిజం' అనేవి ఆధునిక పరమైనవి. చర్చనీయాంశాలు. గ్రామీణ వ్యవసాయంలో పాల్గొనే స్త్రీలు కలుపు తీయడం, చేను మందు చల్లడం, పంట సేకరణ, ఇంటి శుభ్రత, వంట చేయడం వంటి పనుల్లో భద్రతను చర్చించేది ఇకో ఫెమింజం. వీరి భద్రతకు ముప్పు ఆధునిక వ్యాపార సముదాయాలు తయారు చేసే రసాయన ఎరువులు కావొచ్చు. లేదా మరొక అంశం కావొచ్చు. ఆధునిక ఫెమినిజం విమర్శ దృష్టితో చూడాల్సిన కథలు 'తావు, పాకీజ, బ్యాడ్ టచ్' వంటి కథలు.
''జీవితం తెలిసి రాసిన రచనలు బాగుంటాయి. జీవితాలను నడిపించే శక్తుల గురించి రాసిన రచనలు మరింత బాగుంటాయి.'' శీలం భద్రయ్య రాసిన ''గంగెద్దు'' కథలు జీవితం తెలిసి, జీవితాన్ని నడిపించే వ్యక్తులు, శక్తుల గురించి రాసిన కథలు. ఈ కథల్లో వస్తువు వైవిధ్యం, శైలిపరంగా చూసినపుడు వర్ణన, నాటకీయత, ఆఖ్యానం అనే మూడు ప్రధాన లక్షణాలున్నాయి. దీనికి తోడు అచ్చమైన తెలంగాణ నుడికారం, గ్రామీణ జీవన కళాత్మకత, ఆసక్తికర కథనం ప్రధాన భూమిక పోషించాయి. కథా రచనలో ఒక్కో రచయితకు ఒక్కో శైలి ఉంటుంది. శీలం భద్రయ్య శైలి ప్రత్యేకం. అతని ''శైలీయే శీలం. శీలమే శైలి''.
- చేకూరి శ్రీనివాస రావు, 9949340559