Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాపటిపొద్దుకి పొలంకాడికెళ్ళచ్చె కొడుకులకోసం...
కొప్పెరకింద మంటవెట్టి నీళ్లేచ్చవెట్టేది అమ్మమ్మ.....
బర్లచ్చే యాల్లకు కుడిదికుండల తవుడేసి
దుడ్డేల్ని కొట్టంల కట్టేసి గడ్డేసేది...
సీకటి వడితే పిల్లచ్చి కోళ్ళన్నందుకవోతదని
ఎలుగున్నప్పుడే గూడుకిందేసి కమ్మేది...
సందెవడుతందని పెద్దర్వాజ తలుపులు తీసి పెట్టి
కందిల గాస్ నూనె పోసి....
నెరివడచ్చే కొడుకుల కోసం
జొన్నరొట్టెలు చేసి ఉడుకన్నం తయారుంచేది.....
నూతికాడ తోడి వెట్టిన ఎచ్చటి నీళ్ళు
పెర్యు మీద వడంగనే
పొద్దాక పడ్డ కట్టమంత ఆ నీళ్ళల్ల కొట్టుకుపోయేది.....
అన్నం గిన్నెలు తెచ్చి నడిట్లవెడితే....
సక్లముక్లం పెట్టుకొని అందరు పళ్ళెం ముందు కూకొని...
అంటు కిందపోకుండ అంగి అన్నం తినేది...
కచ్చిరింట్ల నవారు మంచమాన్షి
కాళ్ళకట్టకు దుప్పట్లు ఎస్కోని ..
కన్నట్టుకునే దాకా కడుపు నిండా మాట్లాడుకొని, మలస్క పంటే....
పొద్దుగాల్తే లేశి ఏ పని చేసుడోనని ఆరాటమే తప్పా...
ఎంత సంపాదిస్తాన్నమనే ఆలోచన లేనోల్లే
పల్లెటూరోల్లు....
కూడబెట్టింది ఏమన్న ఉన్నదా అంటే
ఇంటెన్క ఉప్పునీళ్ళ బాయి....
సాయవాండ్ల పొయ్యి....
సంసారం పెద్దగ చేసుడంటే
పైసలు ముల్లెలు కట్టుడు కాదట..
నియతిగ బతుకుడట...
పాలోల్ల దగ్గర తలెత్తుకొని బజార్ల నడ్సుడట.....
- తుమ్మల కల్పన రెడ్డి,
9640462142