Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె హృదయం ద్రవిస్తే ఆనకట్టలు అడ్డుకట్ట వేయగలవా..? ఆమె అంతరంగం ఆవిష్కరిస్తే రాయి సైతం మంచులా కరగాల్సిందే కదా..! మనసు పొరలను చీల్చుకొచ్చే ఒక్కో అక్షరం ఒక్కొక్క నీటి బిందువై సముద్రాలనే సృష్టించగలదు. అందులో చెలరేగే అలల తాకిడికి వివక్ష కొట్టుకు పోవాల్సిందే. ఎన్ని అడ్డంకులను ఎదుర్కుంటేనో ఆమె ఆమెగా నిలబడింది. ఎన్ని ఆంక్షలను ఎదిరిస్తేనో ఆమె విజయపతాకాన్ని ఎగరవేసింది. వాటి వెనక దాగిన విస్పోటనాలను వినాలంటే గుండె దిటవు చేసుకోవాలి. ఈ వలపోతలను, కలపోతలను ఓ దగ్గరకు చేర్చింది తెలంగాణ సాహితి 'అంతరంగ ఆవిష్కరణ'. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భైరి ఇందిర ప్రాంగణంలో రచయిత్రుల కోసం ఏర్పాటు చేసిన అంతరంగ ఆవిష్కరణలో ఒక్కో హృదయం విప్పుతుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇన్నేండ్లు లోలోపల దాచుకున్న బాధ ఒక్కసారిగా ఏరులై ప్రవహించింది. ప్రసిద్ధులైన కవయిత్రులు, రచయిత్రుల నుండి కొత్తగా రాస్తున్న కవయిత్రులందరూ వారి వారి నేపథ్యాలను, ఎదుర్కొన్న సవాళ్ళను వివరిస్తూ ఉద్వేగానికి గురయ్యారు. అందులోని కొన్ని నేటి దర్వాజాలో ఆవిష్కరించుకుందాం...
అంతరంగ ఆవిష్కరణలో సుమారు 54 మంది రచయిత్రులు, కవయిత్రులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు ఇటీవల కాలంలో మరణించిన ప్రముఖ రచయిత్రులు భైరి ఇందిర, ఆరుద్ర రామలక్ష్మి, కందాళ శోభారాణీలకు మహిళా ఫెస్ట్ నివాళలర్పించింది. అనంతరం రోజంతా ఐదు సెషన్లుగా సాగింది సభ. అంతరంగ ఆవిష్కరణ ప్రారంభ సభకు తెలంగాణ సాహితి రాష్ట్ర సహాయకార్యదర్శి సలీమ అధ్యక్షత వహించగా డా.సూర్యాధనంజరు, ఆత్మీయ నిర్మల తమ అంతరంగాలను ఆవిష్కరిస్తూ కన్నీటి పర్యాంతమయ్యారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి ప్రసంగిస్తూ ప్రస్తుతం మన దేశంలో మహిళలను మళ్ళీ వంటింటికే పరిమితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనుసంస్కృతిని ముందుకు తీసుకొస్తున్నారు. వీటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం జరిగిన సెషన్‌కు తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళపల్లి యాకమ్మ అధ్యక్షత వహించగా సీనియర్ రచయిత్రులు తిరునగరి దేవకీ దేవి, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సెషన్లో సుమారు 15 మంది రచయిత్రులు తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు. తదుపరి తెలంగాణ సాహితి నాయకులు రూపరుక్మిణి అధ్యక్షతన జరిగిన సెషన్లో శిలాలోలిత, జూపాక సుభద్ర, కొప్పిసెట్టి ఝాన్సీలు అతిథులుగా హాజరయ్యారు. ఇందులో 12 మంది రచయిత్రులు తమ అంతరంగాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటి సభ్యులు సునంద అధ్యక్షతన జరిగిన సెషన్లో డా. షహనాజ్‌బేగం, సమ్మెట ఉమాదేవి, జ్వలిత, సుమిత్ర ఆనంద్ అతిథులుగా హాజరుగాక మరో 14 మంది రచయిత్రులు, కవయిత్రులు తమ మనసులోని భావాలను పంచుకున్నారు. చివరగా తెలంగాణ సాహితి నగర ఉపాధ్యక్షులు మేరెడ్డి రేఖ అధ్యక్షతన జరిగిన సెషన్లో 12 మంది రచయిత్రులు తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఈ సభలో పాల్గొన్న ప్రతి రచయిత్రికి తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారితో పాటు నగర నాయకులు ఏభూషి నరసింహా, రామకృష్ణ చంద్రమౌళి, శరత్ సుదర్శి జ్ఞాపికతో పాటు షాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో గాధ
వాస్తవానికి ఈ భూమిపై పుట్టిన ప్రతి మహిళ జీవితం ఓ ప్రత్యేకమైన చరిత్రను చాటిచెబుతుంది. అందులోనూ ఆమె అట్టడుగు వర్గానికి చెందిన మహిళైతే. ఆ జీవితం మరింత కఠినం. అడవులు, కొండలు, కోనలు దాటుకుంటూ తమ కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకునేందుకు అలవికాని పోరాటాలు చేసింది ఒకరైతే... అంటరాని తనాన్నే కాదు మరణాన్ని సైతం జయించించిన ఘనత మరికొందరిది. ఆడపిల్ల పుడితే అరిష్టమనో, ఆర్థికభారమనో కడుపులపోనే కడతేర్చాలని చూసే చూపుల కత్తులను దాటుకుని బతికి బట్టకట్టినవారు ఉన్నారు. ఆడతనాన్ని, అమ్మ తనాన్ని ప్రశ్నిస్తూ ఎగతాళి చేసినా భరించి తమ చరిత్రను తాము లిఖించుకున్న స్త్రీ మూర్తులున్నారు. పుట్టింది ఏ వర్గమైనా స్త్రీగా, ద్వితియ శ్రేణి పౌరురాలిగా అనుభవించిన బాధలను, ఎదుర్కొన్న సమస్యలను, తమ జీవితాలను తామే ఆవిష్కరించుకోవడం ఓ ప్రత్యేకం.
సమాజ మార్పు కోసం రాస్తున్నారు
సమస్యలు వేరైనా, కన్నీటి గాథలు వేరైనా, అనుభవించిన బాధలు వేరైనా అందరిలో ఓ సారుప్యత ఉంది. అదే సాహిత్యం. అదే అందరినీ ఓ దగ్గరకు గుదిగుచ్చింది. చదివారు... విరివిగా చదివారు.. చదువుతూనే ఉన్నారు. రాసారు... రాస్తూనే ఉన్నారు. రాస్తారు కూడా. వివక్షలేని సమాజం వచ్చే వరకు రాస్తూనే ఉంటారు. సమస్యలని ఎదుర్కోడానికి, సమాజంలో తమని తాముగా నిలబెట్టుకోవడానికి సాహిత్యాన్ని దన్నుగా చేసుకున్నారు. చదువుతూ, రాస్తూ తమ సమస్యలను మరిచారు. సమాజంలో తనలాగే ఇతర స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏనాడో అన్వేషణ మొదలుపెట్టారు. తమ ప్రతి అక్షరాన్ని సమాజ మార్పు కోసం నిలబెడుతున్నారు.
- సలీమ
ఓ సామూహిక దుఖం
ఈ అంతరంగ ఆవిష్కరణ కార్యక్రమం చూస్తుంటే స్త్రీలకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినట్టుగా ఉంది. కొంత మంది ఇప్పటి వరకు ముడుచుకుపోయి ఉన్నారు. కొందరు భయంతో ఉన్నారు. వారంతా ఇప్పుడు మనసు విప్పి మాట్లాడినట్టు అనిపించింది. ఎదుర్కొంటున్న సమస్యలు వేరైనా ఓ సామూహిక దుఖం అందరిలో కనిపించింది. ఒక్కొక్కరిది ఒక్కో దుఖం. నాకు యాకుబ్ పరిచయమయ్యే నాటికి ముస్లిం అని తెలియదు. ఏ కులం అయితే ఏంటి ఏ మతం అయితే ఏంటి ఆయన మనిషి. నాకు నచ్చిన మనిషి కాబట్టి పెండ్లి చేసుకున్నాను. మాకు ఇద్దరు అబ్బాయిలు. సమాజంలో మనుషులు మనుషులుగా ఉంటే సమాజంలో మార్పు దానంతట అదే వస్తుంది అని నా నమ్మకం.
- శిలాలోలిత
గాయాలు పచ్చిగానే ఉన్నాయి
తండా నుండి ఉస్మానియా విశ్వవిద్యా లయానికి రావడాని ఎన్నో సంఘర్షణలు పడ్డాను. నేను ఇంట్లో తొమ్మిదో దాన్ని. మా అమ్మ నేను పుట్టిన తర్వాత చాలా ఏడ్చేదంట. మళ్ళీ ఆడపిల్లనే పుట్టిందని నన్ను చంపి పాతి పెట్టాలని అనుకున్నారంట. అది కూడా మా అమ్మనే చెప్పింది. అయితే ఈ విషయం నాన్నకు తెలిసి నన్ను చంపనీయలేదు. అలా నేను బతికి బట్ట కట్టి మీ ముందు ఇలా నిలబడగలిగాను. మా నాన్న నా ఐదేండ్లపుడు చనిపోయాడు. తర్వాత మా అందర్ని మా అమ్మనే పెంచి పెద్ద చేసింది. మంది సూటి పోటి మాటలు భరించింది. ఆడపిల్లలు చదువుకోవడం ఏంటి, బయటకు వెళ్లడం ఏంటి అని అందరూ అనేవారు. అందరికంటే ప్రత్యేకంగా ఉండాలి, ఏదో చేయాలి అనే తపన మాత్రం నాలనో ఉండేది. మొత్తానికి పై చదువులకు వెళ్ళాను. కానీ భాష సమస్య. లంబడోళ్ళ పిల్ల అని ఎగతాళి చేశారు. ఇలా ఎన్నో గాయాలు ఉన్నాయి. ఆ గాయలు ఇప్పటికీ పచ్చిపిచ్చిగానే ఉన్నాయి. అవన్నీ నన్ను ఏం చేయలేదు. అక్కడే ఆగిపోలేదు. కాబట్టే ఈ స్థాయికి రాగలిగాను.
- డా.సూర్యధనంజరు
గిరిజన జీవితాలను దగ్గరగా చూశాను
నా చిన్ననాట ఇంట్లో మంచి సాహిత్య వాతావరణం ఉండేది. అమ్మానాన్న మా మేనమామలు బోలెడన్ని పత్రికలు, నవలలు తెచ్చే వాళ్ళు. రచనలు చదువుతూ ఆనందించడమే తప్ప రచయితల మీద దృష్టి ఉండేది కాదు. తర్వాత కాలంలో అనారోగ్యం కారణంగా రెండు సంవత్సరాలు స్కూలుకు వెళ్ళలేదు. అప్పుడు సాహిత్యం బాగా చదివాను. పై చదువులు చదువుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత గిరిజన జీవితాలు దగ్గరగా చూశాను. అందుకే నా రచనల్లో వారి జీవితాలే ఎక్కువగా కనిపిస్తాయి. పిల్లల కోసం పుస్తకాలు ముద్రించాను. ఉపాధ్యాయినిగా పిల్లలతో గడిపిన క్షణాలు ఎంతో ఆనందంగా గడిచిపోయాయి.
- సమ్మెట ఉమాదేవి
ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది
మహిళా సాధికారతను నేను నా చిన్నతనంలో మా అమ్మలోనే చూశాను. అమ్మ పెద్దగా చదువుకోలేదు. దాంతో మమ్మల్ని బాగా చదివించాలని కష్టపడింది. అమ్మ స్ఫూర్తితోనే 'అనాచ్ఛాదిత' నవల రాశాను. దానికి మంచి పేరు వచ్చింది. మా అమ్మాయి డాక్టర్‌గా ఉండి బాగా సంపాదిస్తూ తన భర్త నుండి సమస్యలు భరించింది. చివరకు విడాకులు తీసుకుంది. తన జీవితాధారంగానే వినోభాభాస అనే మరో నవల రాశాను. ఆడపిల్ల చదువుకూ, మగవారి ఆధిపత్యానికి సంబంధం లేదని మా అమ్మాయిని చూసిన తర్వాతనే తెలిసింది.
- ఝాన్సీ కొప్పిశెట్టి
నిత్య సంఘర్షణ
మహిళలు రాయడమే పెద్ద పోరాటం. ఇంటి గడప దాటుకొని బయట సమాజంలో నిలబడడం నిత్య సంఘర్షణ. ఏడో తరగతిలోనే పెండ్లి ప్రయత్నాలు మొదలు పెట్టినా అమ్మను చూసి ఎనిమిదో తరగతిలో విజ్జమ్మ పెళ్ళి పేరుతో రాసిన కథ మొదటి రచన. పదో తరగతిలో పెళ్ళి అంటే బాల్య వివాహంతోనే లెక్క. ఆ దశ నుండి స్త్రీ వాదం వైపు కొనసాగడం ఒక సుదీర్ఘ ప్రయాణం. ఈ దశలో కూడా మహిళలు ఏం రాస్తున్నారు, అసలు ఏం కోరుకుంటున్నారు అనే ప్రశ్నలు ఎదురైతున్నాయంటే నిజంగా మహిళలకు ఏం కావాలో ఈ సమాజానికి నిజంగా అర్థం కావట్లేదు అనుకోవాలా..? వివక్ష లేని, ఎటువంటి హింసలేని గౌరవ ప్రధమైన జీవితాన్ని నేటి మహిళలు కోరుకుంటున్నారు. స్త్రీలంతా ఐక్యంగా నిలబడటానికి ప్రయత్నిస్తున్నారు.
- జ్వలిత
ఒంటరిగానే కష్టపడ్డాను
అంతరంగాన్ని తలచుకున్నప్పు డల్లా మిగిలేది కన్నీరే. అయితే వాటి వెనక కొన్ని కావ్యాలు ఉద్భవిస్తున్నాయి. మహబూబ్ నగర్లో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుండి వివక్ష. మాది జమిందారి కుటుంబం. దాంతో ఆడపిల్లల్ని బయటకు పంపించే వారు కాదు. మా నాన్న తెలుగు పండితుడు. ప్రతి పుస్తకం, పత్రికలు మా ఇంటికి వచ్చేవి. వాటన్నింటినీ చదువుతూ చిన్నతనంలోనే కవిత్వం రాయడం మొదలుపెట్టాను. అయితే అప్పట్లో ఆడపిల్లకు చిన్నప్పుడే పెళ్ళి చేసి పంపించేవారు. కానీ నేను పెద్దమనిషిని కాలేదు. దాంతో కాలేజీకి వెళ్ళి చదువుకున్నాను. ఏవో ఇంజక్షన్లు చేసిన తర్వాత పెద్దమనిషిని అయ్యాను. పెండ్లి చేసిన తర్వాత అత్తగారింట్లో కట్నం కోసం చంపాలనుకున్నారు. కోట్లు డబ్బులు ఉన్నా మా నాన్న ఆడపిల్లల కోసం ఖర్చు చేసేవాడు కాదు. నా కాళ్ళపై నేను బతకాలని టీచర్ ఉద్యోగంలో చేరాను. ఇలా ఎన్నో కష్టాలు భరించి ఈ స్థాయికి వచ్చాను.
- లక్కరాజు నిర్మల
కష్టాన్ని ఇష్టంగా భరించాను
మా బాపుది హుజూరాబాద్. మా అమ్మ అక్కడ ఉండలేక తల్లిగారి ఊరైన హన్మకొండకు వచ్చింది. మా స్కూలు ఫీజు కట్టడానికి కూడా నాన్న దగ్గర డబ్బులు ఉండేవి కాదు. స్కూల్లో బతిమలాడు కొని చదువుకునే వాళ్ళం. కాలేజీకి వచ్చిన తర్వాత సాయంత్రం ట్యూషన్లు చెప్పి ఆ డబ్బుతో చదువు కున్నాను. పీయూసీకి వెళ్ళే సరికి భాష సమస్య అయింది. దాంతో ఫేలయ్యాను. సప్లిమెంటరీ చదివి పాసయ్యాను. అప్పుడే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అందులో మమేకమై పని చేశా. అయినా చదువును నిర్లక్ష్యం చేయలేదు. పై చదువులు చదివి ఉద్యోగం సంపా దించుకున్నాను. నాతో పాటు ఉద్యోగం చేసే అభ్యుదయవాది శంకరయ్యతో పరిచయమై పెండ్లి చేసుకున్నాను. అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. ఆయన ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉండేవారు. ఆయనన్నా, అభ్యుదయమన్నా ఇష్టం కాబట్టి కష్టాన్ని కూడా ఇష్టంగా భరించాను.
- తిరునగరి దేవకీ దేవి
అత్తగారి ప్రోత్సాహంతో...
నేను కర్నాటక మ్యూజిక్ నేర్చుకు న్నాను. పెండ్లి తర్వాత నా గొంతు పోయింది. మాట కూడా పడిపోయింది. మా అత్తయ్య అమ్మ స్థానంలో ఉండి నన్ను చూసుకున్నారు. మళ్ళీ నన్ను మామూలు మనిషిని చేశారు. అయితే ఒకరి కూతురుగానో, భార్యగానో, తల్లిగానో ఉండిపోవాలనే మనస్థత్వం కాదు నాది. మా అత్తగారు ప్రోత్సహించి సాహిత్యం నీ చేతుల్లో ఉంది కదా దాన్ని కొనసాగించు అన్నారు. అలా మూడు కథా సపుటాలు, ఐదు నవలలు రాశాను. ఎన్నో సమీక్షలు చేశాను. 12 పుస్తకాలు తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువాదం చేశాను. ఎన్ని చేసినా ఇంకా ఏదో చేయాలని ఉంటుంది.
- శైలజ మిత్ర
నన్ను నేను మలుచుకుంటూ...
మా నాన్న చదువుకోలేదు. అమ్మ ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. పదో తరగతి తర్వాత వేసవి సెలవల్లో ఓ కవిత రాశాను. అది కవిత అని అప్పట్లో నాకు తెలియదు. అప్పటి నుండి ఇప్పటి వరకు రాయడంలో నాకు ఎవరి గైడెన్స్ లేదు. ఎవరి సహకారం లేదు. అలాంటి సమయంలో గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వ చదివి నాకేం అనిపించిందో ఓ వ్యాసం రాసుకున్నాను. ఆయన అది ఆయన పుస్తకంలో వేసుకున్నారు. అది నాకు చాలా ప్రోత్సాహంగా అనిపించింది. తర్వాత చదువుకుని ఉపాధ్యాయురాలిగా పని చేశాను. పిల్లలతో గడిపాను, వాళ్ళకు ఏం కావాలో తెలుసుకున్నాను. కాబట్టి బాలసాహిత్యం ఎక్కువగా రాశాను. అనేక పత్రికల్లో వ్యాసాలు రాశాను. నన్ను నేను మలుచుకుంటూ, ప్రోత్సహించుకుంటూ నా సాహిత్యాన్ని కొనసాగించాను.
- రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి
కనిపించని సాహిత్యం పరిచయం చేయాలని
నేను ఇంట్లో పదకొండే సంతానం. అప్పటికే అమ్మ పది మందిని కన్నది. నన్ను కడుపులోనే చంపాలని పసరు తాగింది. అయినా పోలేదు. కానీ చాలా వీక్‌గా పుట్టాను. ఇంట్లో శ్రమ తప్ప చదువు అనే మాట లేని మాదిగ కుటుంబం మాది. నాకు మాత్రం చదువుకుంటే ఉద్యోగం చేసి పేదోళ్ళకు సాయం చేయొచ్చు అనే ఆలోచన ఉండేది. మొదట్లో సైంటిస్టు కావాలనుకున్నాను. తర్వాత డాక్టర్ కావాలనుకున్నాను. చివరకు సెక్రటేరియట్లో జాబ్ వచ్చింది. విద్యార్థి దశలో ఉద్యమంలో పాల్గొన్నాను. విపరీతంగా చదవడం కూడా అప్పుడే మొదలుపెట్టాను. శ్రమ చేసే వారి సాహిత్యం నాకు అందులో దొరకలేదు. అందులో కనిపించని సాహిత్యాన్ని పరిచయం చేయాలనే ఆలోచనతో నేను రాయడం మొదలుపెట్టాను.
- జూపాక సుభద్ర
అవకాశాలు పెరిగాయి
సంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టినా మా ఇంట్లో అందరూ చదువుకున్న వారే కావడంతో నేనూ చదువుకోగలిగాను. చిన్నప్పటి నుండి పుస్తకాలంటే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా పుస్తకాల కోసం వెదుక్కుంటూ ఉండేదాన్ని. 1981లో నా మొదటి కథ 'త్యాగం' అచ్చయింది. అప్పటి నుండి అనేక కథలు రాశాను. పుస్తకాలు, నవల ప్రచురించాను. కొన్ని అనువాద కథలు కూడా ఉన్నాయి. అయితే 40 ఏండ్ల కిందట నేను రాసిన పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితి వేరు. అప్పట్లో స్త్రీలు ఇంతగా రాయడం లేదు. అప్పట్లో స్త్రీల జీవితాలు కూడా వేరుగా ఉండేవి. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. అవకాశాలు పెరిగాయి. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
- షహనాజ్ బేగం