Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిహెచ్. ఉషారాణి, 9441228142
కొన్ని తరాల నుంచీ, కొన్ని యుగాల నుంచీ ఆమె ఆలోచనలోనే ఉంది. పుట్టకముందే మృత్యువు ఒడిలో పడుకోబెట్టినప్పుడు అమ్మగా ఆలోచిస్తూనే ఉంది. మొదటి అడుగు జీవితంలోకి ప్రవేశిస్తున్నాను అనుకున్నప్పుడు భార్యగా ఆచించింది. ఉద్యోగంలో ఎదుగుతూ గొప్ప భవిష్యత్తును కలగంటున్నప్పుడూ, భయంకరమైన మృత్యుకుహరంలోకి నెట్టేసే అఘాయిత్యాలకు బలి అవుతూ, పరిష్కారం లేని సమస్యలుగా మారిన చావులను గురించి ఆలోచిస్తూనే ఉంది. ఆమె దశలవారిగా జీవనపోరాటం చేస్తూనే ఉంది. ఏ వర్గానికి సంబంధించిన జీవితమైనా స్త్రీ అంటేనే పోరాటం.
వి. శాంతి ప్రబోధ ''ఆలోచనలో... ఆమె'' అనే కథల పుస్తకం. స్త్రీని ఒకే అద్దంలో అమ్మమ్మ, అమ్మ, అక్క, నేను, చెల్లి... ఇలా ప్రతి పాత్ర ఒక అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుందో, అలాంటి బతుకు చిత్రాన్ని చూపిన కథలు ''ఆలోచనలో...ఆమె'' .
ఆమె ఉనికి ఎక్కడి నుంచి ఎక్కడివరకూ విస్తరించింది? ఆమె లేకుండా ఒక్కఅడుగు కూడా వేయలేనితనం ఎలా ఉంటుందో చూపిన కథలు ఉన్నాయి. శీలం అంటే కేవలం శరీరానికి సంబంధించి నదేనా, మనస్సుకు సంబంధించినదా? ఈ ప్రశ్నకు సమా ధానం ''తొలగిన మేఘం'' కథ. ''తేలియాడే మేఘాల్లో తనూజ'' ఈ కథలో తనూజ పాత్రలోకి ప్రతి అమ్మాయి మనసు ప్రవేశించక మానదు. అందరి అమ్మాయిలకూ ఉండే కోరికలు కొన్ని కోరికలుగానే ఉంటాయి. అవి చాలా చిన్నవి, లేదా పెద్దవిగా భావించే చిన్నవి. కాని ఒక అమ్మాయి ఒంటరిగా అడుగుకూడా వేయలేని తనాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన సమాజంలో ఉన్నాం మనం. షాపుకో ఎక్కడికో వెళ్లాలంటే తనకన్నా చిన్నవాడైన తమ్ముని తోడిచ్చి పంపించే భద్రత అనే అభద్రత భావాలను పెంచే సమాజంలో ఉన్నాం మరి. ఒక అమ్మాయి సినిమాకో, కాలేజికో ఏ పక్క ఊరికో కాదు, తనకు ఇష్టమయిన, కలల్లో మాత్రమే దగ్గరగా చూడ గలిగే హిమాలయాలకు ఒంటరిగా ప్రయాణం. ఈ ప్రయాణం లో మనకు కొద్దిసేపు రచయిత్రి కనుపిస్తుంది. అక్కడి నుంచీ మనమే ఆ తనూజలోకి ప్రవేశంచేసామేమో అనిపిస్తుంది. అనుభూతిని పొందడమే కాదు ''మహిళ జ్ఞానం, తెలివితేటలు, ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం పువ్వునే అతుక్కున్న పరాగ ధూళిలా ఇంటికే కాదు. నాలుగు గోడల నుంచి విశాల ప్రపం చంలోకి సాహసంతో ప్రవహించాలి. అద్భుతమైన జగత్తులో తనదైన అజెండాతో ముందుకు సాగాలి. ఈ విశాల ప్రపం చంలో తనకో చిరునామా సృష్టించుకోవాలి'' అంటున్నప్పుడు రచయిత్రి స్వరంలోని ఆలోచనా విధానం వినబడుతుంది.
శాంతి ప్రబోధ కథల్లో ఎక్కువగా మధ్య తరగతి స్త్రీ తన స్వగతాన్ని దశలవారీగా కనులముందు దృశ్య రూపంలో చూపిస్తున్న అనుభవాన్ని ఇస్తుంది. 90 లలో రాసిన కథలే అయినప్పటికీ కొన్ని విషయా లలో ఇప్పుడు మార్పు వచ్చి ఉండవచ్చు, కాని ఆ మార్పు ఆమె విద్యా, ఉద్యోగాలలో మాత్రమే. సమస్యలు కొన్ని రూపాంతరం చెందాయి. ఒకప్పుడు చిన్నపిల్లలపై అఘాయి త్యాలు ఉండేవికావు. ఇప్పుడు చట్టాలు కఠినమైనా సమస్యలు, నేరాలు వికృత రూపంలోకి మారాయి. దీనికి కారణం సమాజంలో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానమా, మార్పు చెందిన మనిషి మనస్తత్వమా?
ప్రశ్నించేతత్వం అనేది చిన్ననాటి నుంచి అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లితండ్రులదే. చిన్న విషయమే కావచ్చు దేనిని అయినా ప్రశ్నించడం, ఆలోచించడం నేర్పించాలని, తమ హక్కులను కాపాడుకోవడం అనేది ప్రతి ఆడపిల్ల బాధ్యత. ''రేపటి రాగిణి'' కథలో మనం గమనిస్తే, రోజూ అనేక సంఘటనలను చూసి చూడనట్లుగా పోవడం, తప్పించు కోవడం, మనకు కాదులే అనే తత్వం కలిగి ఉండడం చాలా సహజమైపోయిన రోజులివి. ఒంటరిగా ఉన్నప్పుడు మన అంతరాత్మలో ప్రశ్నావలయాలై చుట్టుముట్టినా, వాటిని మరుగున పెట్టి మనలో మనం, మనతో మనం నడిచిపోతున్న రోజులు ఇవి. ఈ ధోరణి మారినప్పుడు ఆడవాళ్ళ మీద జరిగే అనేక అఘాయిత్యాలను అరికట్టవచ్చు.
మధ్యపాన నిషేధం మొదలైంది స్త్రీల నుండే. స్త్రీ నుంచి మొదయిన ఉద్యమాలనేకం. ఎలాంటి సమస్యల పట్ల అయినా ఆమె ఆలోచించే విధానం, ఎదుర్కొనే విధానంలో ఆమె ధోరణే వేరు. కాని అవకాశం కల్పించుకోలేని స్థితి. వీటికి కారణం తిరిగి సమాజమే.
సమాజంలో పేరుకుపోయిన అనేక రకాల సమస్యలకు సునిశితమైన పరిశీ లనతో ప్రతిసున్నితమైన సమస్యను, స్పృశించారు శాంతిప్రబోధ.
వ్యక్తీకరణలో ప్రతి కథను ఆసాంతం చదివించగలిగే శైలి ఈ రచయిత్రి ప్రత్యే కత, కథను ఆవిష్కరించేప్పుడు కూడా కొన్ని కవితాత్మకమైన పదాలతో ఆకట్టు కొంటారు. తెలంగాణ భాషలో రాసిన కథలు ఉన్నాయి.
స్త్రీ చుట్టూ ఎప్పటినుండో అల్లుకు పోయిన వివక్షత ఇది. మార్పు అనివార్య మైన సందర్భం ఇది. ఇలాంటి సమయం లో ఈ కథలు రావడం అవసరం.
''ఆలోచనలో... ఆమె'' కథల సంపుటే కాదు అంతకు ముందు వెలువరించిన శాంతి ప్రబోధ ''జోగిని'' నవల మంచి గుర్తింపును ఇచ్చింది. ఆమె సామిజకమైన ధృక్పథాన్ని చాటి చెప్పే నవలగా నిలిచింది. రచయిత్రికి అభినందనలు. ఆమె నుంచి మరిన్ని సామాజిక చైతన్యం ప్రధానమైన రచనలను స్వాగతిస్తున్నాను.