Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథలంటే కేవలం నీతులు ఉపదేశాలు కాదు. అనుభవ సారాలు, ఎరుకకు ఉదాహరణలు. మారుతున్న కాలంలో ఎదుగుతున్న తరం కోసం రాసిన పెద్ద పిల్లల కథలు ''మారుతున్న వేళ''. ఈనాడు తెలుగులో బాల సాహిత్యం చాలా వస్తుంది. అయితే కౌమార దశలోకి అప్పుడే ప్రవేశించిన ''అడల్ట్స్'' కోసం తక్కువగానే పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు పెద్ద పిల్లల కోసం డాక్టర్ బి.ఆర్ శర్మ ''మారుతున్న వేళ'' కథల సంపుటిని తెచ్చారు. తప్పనిసరిగా పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు చదవాల్సిన పుస్తకమే.
డాక్టర్ వి. ఆర్ శర్మ కవి, రచయిత, పరిశోధకుడు, బాలవికాస ఉద్యమకారులు. అంతేకాకుండా బాల సాహిత్య కార్యశాలల్లో వెన్నుదన్నుగా నిలిచిన వారిలో ఒకరు. నిరంతరం పిల్లల కోసం ఆలోచించే వి.ఆర్.శర్మ ఉపాధ్యాయుడు గా, సంఘ నాయకుడిగా మూడున్నర దశాబ్దాలుగా పిల్లల కోసమే రాస్తున్నారు. అంతే కాకుండా దశాబ్ద కాలంగా తెలుగు నాట వివిధ సంస్థలు, వ్యక్తులు నిర్వహిస్తున్న పలు బాలవికాస కార్యక్రమాలు, సజనాత్మక రచన కార్యాశాలలో ముందుండి నడిపిస్తున్న సాహిత్య సేవకుడు శర్మ. అతని కలం నుంచి జాలువారిన కథల సంపుటి మారుతున్న వేళ.
''మానాన్న నాకు యాభై వేలు ఇచ్చాడు'' అనే కథలో పిల్లలకు బాధ్యత అనే అంశాన్ని చాలా చక్కగా పరిచయం చేశారు. ఎదుగుతున్న పిల్లల్లో కోరికలు, ఆలోచనలు అందులో మధ్యతరగతి వర్గం అటు ఇటు కాకుండా సతమతమవుతూ పడే తండ్లాట చాలా చక్కగా ఆవిష్కరించారు. ఈ కథ నిజానికి పెద్ద పిల్లలు చదవాల్సిందే. ఈ కథ చదవడం ద్వారా వారిలో తప్పనిసరిగా కుటుంబంపైన బాధ్యత పెరుగుతుందని సందేశాన్ని శర్మ చక్కగా ఆవిష్కరించారు. ఈ కథ చదివిన తర్వాత రచయితను మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేం. ఇంకా ''బహుమతి'' అనే కథ లో రోడ్డు మీద పెన్నులు అమ్ముకునే ఒక పిల్లవాడు ఒక ఉపాధ్యాయుడు కొడుకు పుట్టినరోజు సందర్భంగా బహుమతి ఇస్తాడు. ఇందులో పెద్ద సందేశాన్ని రచయిత అందిచాడు. అదేమిటో తెలుసుకోవాలంటే కథను తప్పనిసరిగా చదవాల్సిందే.
''నీలోఫర్ రాజకుమారి'' కథలో ఇంతవరకు ఎవరు చెప్పలేనటువంటి విషయాలను రచయిత చెప్పాడు. హైదరాబాదుకు ఆత్మ లాంటిదే నీలోఫర్. ఇలాంటి కథలు పిల్లల కోసమే కాదు పెద్దవాళ్ళ కోసం రావాల్సిన అవసరం ఉంది. తెలుసుకోదగ్గ విషయాలను రచయిత భావితరానికి అందించడం అభినందనీయం.
''ఆధునిక అంతరంగాలు'' కథలో ఈనాటి పెద్ద వాళ్లకు, వారి పిల్లలకు మధ్య దూరం తగ్గించడానికి, దగ్గరి సంబంధాలు పెంచడానికి చేసిన ప్రయత్నమే. ఈనాటి వాస్తవ పరిస్థితులనుద్దేశించి రాసిన కథ. ఈ కథను చదివితే తప్పనిసరిగా వారి మధ్య అంతరాలు తగ్గి, దగ్గరవుతారు అనే నమ్మకం కలుగుతుంది.
ఇంకా కొత్త చదువు, అద్భుత యాత్ర, రూపాంతరాళ వేళ, మేము సైతం, చదువు పోరు చామంతి చెప్పిన కథ మొదలవు కథలన్నీ కూడా చక్కటి సందేశాన్ని అందించాయి. ప్రతి ఇంట, ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి చేతిలో ఉండాల్సిన కథల పుస్తకం ''మారుతున్న వేళ'' ఇందులోని మొత్తం 13 కథలు అన్ని ఆణిముత్యాలు పెద్దపెద్దలకు ఊరిలో మార్పు రావడానికి ఉపయోగపడే పుస్తకం మీద ఇలాంటి పుస్తకాలు మరెన్నో శర్మ కలం నుంచి జాలువారాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేద్దాం.
- యాడవరం చంద్రకాంత్గౌడ్,
9441762105