Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎదుగుతున్న వారిపైనే ఎవరికైనా ద్వేషముంటది. ఎంత ప్రేమ ఉన్నా అది ఒకింత ఉండనే ఉంటది. అలాగే ఆటుపోట్లన్నీ అందరూ అన్నట్లు పండ్లున్న చెట్టుకే! ఎన్ని మైల్లు దాటితే అల ఒడ్డు చేరేది? ఎన్ని కన్నీళ్లు కారిస్తే ఎద బరువు దిగేది?
కెపి.లక్ష్మీ నరసింహ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువకవి, కథకుడు. నిండా ముప్పై యేళ్ళు దాటకముందే 7 పుస్తకాలు వెలువరించాడు. కొందరు తన రచనలను చూసి ఆకాశమంత పొగిడారు. మరికొందరు తాను రాసినవి కథలే కావని నిరుత్సాహపరిచారు. అయినా వెనుదిరగలే! రాస్తూనే పోతున్నాడు. అయితే సీనియర్ రచయితలు కొత్తతరం వారికి సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవడం బాధాకరమని భావిస్తాడు కెపి.లక్ష్మీ నరసింహ. ఆయనతో ఈవారం నర్రా అభిముఖం...
మీ తొలి కవితాసంపుటి 'కుట్ర జేస్తున్న కాలం'. మీకు ఏ మేరకు పేరు తెచ్చింది?
నా తొలి కవితాసంపుటి 'కుట్రజేస్తున్న కాలం' నేను పోస్టు గ్రాడ్యుయేట్ రెండో సంవత్సరం చదుతున్న రోజుల్లో తేవడం జరిగింది. నిజానికి అవ్వి నా సాహిత్య ప్రయాణానికి తొలి అడుగులు. అందులో కవిత్వం కంటే ఎక్కువ వచనమే ఉంటుంది. కాని అప్పుడు నాకు అదే కవిత్వమేమో అనిపించేది. అది చదివిన మిత్రులు, మా లెక్చరర్స్, తెలిసినవాళ్ళు బాగుంది అని చెప్పేవాళ్ళు. నేను కూడా హ్యాప్పీగా ఫీల్ అయ్యేవాన్ని. అందులో ఎక్కువ రైతుల గురించి, వ్యవసాయానికి సంబంధించిన వస్తువు తీస్కోనే రాయడం జరిగింది. ఈ పుస్తకం రావడానికి మాత్రం అప్పుడు మా కాలేజిలో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ నక్క సుభాషిణి మేడం, ఉదయమిత్ర, భీంపల్లి శ్రీకాంత్ గార్లు బాగా ప్రోత్సహించారు.
'ఆరుతున్న మెతుకు దీపా'నికి ప్రధాన భూమిక
ఇది కూడా వ్యవసాయాన్ని ప్రధానంగా తీస్కోని రాశాను. అందరికీ అన్నం పెట్టే అన్నదాత ఆఖరికి తనకే తిండి దొరక్క అన్నమో సూర్యచంద్ర అన్న విధమైన స్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్నే నాకు వచ్చినట్లుగా రాసుకోవడం జరిగింది. నేను కూడా రైతుకుటుంబంలో పుట్టినవాన్ని కావడంతో రైతులపట్ల తెలియకుండానే ప్రేమ ఏర్పడింది. అన్నదాతల ఆత్మహత్యలు కళ్ళారా చూసి, పేపర్లలో చదివి 'ఆరుతున్న మెతుకు దీపం' అని పేరు పెట్టాను. 'దేశాన్ని నడిపిస్తున్నది అతడే / దేశం ఏడిపిస్తున్నది అతన్నే'! రైతు స్వయంగా తన పంటని మార్కెట్ కు తీస్కపోతే తక్కువ ధరలకు కొని తర్వాత దళారులు ఎక్కువ ధరలకు అమ్ముకోవడం జరుగుతున్నది. అలా పంట పండించిన రైతు నష్టపోతుండు. ఇది మారి రైతు ఆనందంగా జీవించే రోజులు రావాలని చిన్న ఆశ. అందుకే ఈ సంపుటి.
'వోగుల పారుతున్న నీళ్ళని ముట్టుకుంటే/ నీ సేతిని పట్టుకున్నట్లే అనిపిస్తది' అంటూ ప్రణయ కవిత్వం రాసారు కదా! యవ్వనం కవి చేత ప్రేమకవిత్వాన్ని రాపిస్తుందంటారా?
ప్రేమ అనేది యూనివర్సల్. ప్రేమ కాకుండా ఏ అంశాన్ని తీస్కున్నా వాటికి ఫలానా కోణాలు ఉండవచ్చు. దీనికి ఉండవు. మీరన్నట్లు కొంత వయసు ప్రభావం కూడా ప్రేమ కవిత్వం రాయడానికి కారణం కావొచ్చు. నేను ఈ ప్రేమ కవిత్వం పుస్తకం 'చెరగని ఆటోగ్రాఫ్' వేసినప్పుడు నా వయస్సు 26 సంవత్సరాలు. అదే సమయంలో మా జిల్లా నుంచే 81 ఏండ్ల జలజం సత్యనారాయణగారూ అద్భుతమైన ప్రేమకవిత్వం 'శంగార బిల్హనీయం'ను సంస్కతం నుంచి తెలుగులోకి అనువాదం చేయడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
'ధర్మాగ్రహం' నానీల ప్రకియలో వచ్చిన పుస్తకం. నానీలు ప్రక్రియను ఎందుకు ఎంచుకున్నారు? సులభమనా?
అవును. అయితే నేను నానీలు రాయడానికి ఇద్దరు వ్యక్తులు కారణం. భీంపల్లి శ్రీకాంత్, వెన్నెల సత్యం గార్లు. గతంలో వెన్నెల సత్యం వాట్సాప్ గ్రూపుల్లో నానీల సిరీస్ లాగా రోజూ ఐదు నానీలు పెట్టేవారు. అవ్వి చదివి ఇవ్వేవో భలే ఉన్నరు అనిపించేది. అలా బాగా అనిపించి నేను రాయడం మొదలుపెట్టిన. వాటినే నానీల సష్టికర్త ఎన్.గోపి సార్ గారికి చూపించడం వారు బాగున్నాయని ప్రోత్సహిం చడంతో పుస్తకం తేవడం జరిగింది. అలా వారి వల్లనే పుస్తకం వేయాల్సి వచ్చింది.
'వెన్నెల వాడ' కవిత్వమంతా మనువాదాన్ని target చేసినట్లు అనిపిస్తుంది! దళితకవులు తమ జీవితకాలం ఎక్కడో ఒకచోట మనువాదాన్ని వ్యతిరేకిస్తూనే రాస్తారా?
ఒక ప్రముఖ కవి చెప్పినట్లుగా 'నేను పుట్టకమునుపే నా చావుని ముందే రాసుకొని వచ్చిన'. నేటికీ కొందరు కులం పేరున కొందరిని దూరం పెడుతూ . మానసి కంగా బాధపెట్టడం భావ్యం కాదు. ఒక మనిషి మరో మనిషిని అంటరాని వాడని ద్వేషం పెంచుకొని కంటికి కనిపించని కులాన్ని ప్రేమిస్తాడు. గతంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమికి రాములోరి కళ్యాణంలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవాన్ని. కాని కొన్ని సంవత్సరాల క్రితం అదే కళ్యాణంలో నేను అన్నం వడ్డిస్తుంటే 'మాదిగోడు' అన్నం పెడితే మేము తినాల్నా? అని చాలా బాధపెట్టిండ్రు కొందరు. దేవుడు అందరివాడా? కొందరివాడా? ఇది ఎంతవరకు సమంజసం? ఆ మధ్య ప్రముఖ సినీనటి, అమితాబచ్చన్ భార్య జయాబచ్చన్ గారు అన్నట్లు ఒక జంతువు మీద ఉన్న ప్రేమ సాటి మనిషి మీద లేకుండా పోయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లు అయినా ఇంకా ఆర్థిక అసమానతలు, కుల మత ఘర్షణలు జరుగుతూనే ఉన్నరు. అందుకే మేము మనువాదాన్ని వ్యతిరేకిస్తూ కవిత్వం రాస్తున్నాం.
ప్రముఖ విమర్శకులు జి.లక్ష్మీ నరసయ్య గారు మీ కవిత్వాన్ని గురించి 'ఇతని కవితలు చదవటానికంటే, వినటానికి బాగుంటారు' అనడం వెనుక ఉన్న ఉద్దేశ్యం?
వాస్తవంగా చెప్పాలంటే జి.లక్ష్మీనరసయ్య సార్ ని నా పుస్తకానికి ముందుమాట రాయమని అడగడానికి కొంచెం భయపడ్డాను. ఎందుకంటే ఆయన కవిత్వఉద్యమాన్ని నడిపిన వ్యక్తి. అలాంటి వాడు కొత్తగా రాస్తున్న నాకు రాస్తాడా? అనే సందేహం ఉండే. కాని కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే వారు నాకు ముందుమాట రాసి, ఆ మాట అన్నారేమో అని నాకనిపిస్తుంది. లక్ష్మీ నరసయ్య, కొల్లాపురం విమల గార్ల ప్రోత్సాహం నా కవిత్వానికి చాలా ఉపయోగపడింది.
మీవి కథలే కావని కొందరి విమర్శకుల అభిప్రాయం! మీ స్పందన?
ఈ మాట వాస్తవమే. ఈ పిలగాడు పరిణతి చెందకుండానే కథలు రాస్తున్నాడు, అవసరమా? అని వాళ్ళ అభిప్రాయం అనుకుంటాను. కానీ వాళ్ళు కూడా ఇలా కాదు... అలా ఉంటుంది కథంటే... అని సూచనలు చేసి ఉంటే బాగుండేది. కొత్తగా రాస్తున్నప్పుడు, తప్పులు చేసినప్పుడు అనుభవం ఉన్నవాళ్ళు సలహాలు, సూచనలు చెయ్యాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ అలా చేయరు. కేవలం లోపాలను మాత్రమే ఎత్తి చూపుతారు. అదేనా వారు కొత్తవారికిస్తున్న ప్రోత్సాహం? కొందరు కొత్తవారు రాయడం లేదు, కొత్తతరం సాహిత్యంవైపు రావడం లేదు అని వేదికలు ఎక్కినప్పుడు మాట్లాడుతుంటారు. కానీ సహకరించరు. కొందరు మాత్రమే ప్రోత్సహిస్తారు. ఇక నా కథలంటే నాకు తెలిసినట్టు రాసిన. పుట్టగానే పరుగెత్తలేం కదా!
- నర్రా ప్రవీణ్ రెడ్డి
ఉస్మానియా విశ్వవిద్యాలయం