Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం
పియా బాజ్ ప్యాలా పియా జాయే నా
పియా బాజ్ యక్ తిల్ జియా జాయే నా
కహీ థీ పియా బిన్ సుబూరీ కరూ
కహయా జాయే అమ్మా కియా జాయే నా
నహీ ఇష్క్ జిస్ దూ బడా కోడ్ హై
కధీ ఉస్ సే మిల్ బే-సియా జాయే నా
'కుతుబ్' షా న దే ముజ్ దివానే కో పంద్
దివానే కూ కుఛ్ పంద్ దియా జాయే నా
అనువాదం
ప్రియురాలే లేకుంటే మధువు నేను త్రాగలేను
ప్రియురాలే లేకుంటే క్షణమైనా బ్రతకలేను
ఆమె లేకున్నా సహనంతో ఉండాలని అన్నారు
చెప్పగలరే కానీ ఎవరూ ఆచరించి చూపలేరు
ప్రేమించలేని వారందరూ కుష్టు వ్యాధిగ్రస్తులే
నేనెన్నటికీ అలాంటి వారితో స్నేహం చేయలేను
ఓ 'కుతుబ్ షాహ్', నాలాంటి పిచ్చివానికి బోధించకు
పిచ్చివానికి ఎటువంటి బోధనలనూ చేయలేరు
ఉర్దూ సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయనాన్ని సష్టించుకున్న ముహమ్మద్ కులీ కుతుబ్ షా, తొలితరం ఉర్దూ మహాకవులలో ప్రముఖుడు. 16వ శతాబ్దంలో గోల్కొండలో జన్మించిన ఇతను, కుతుబ్ షాహీ పాదుషాలలో ఐదవ వాడు. బహుభాషా ప్రావిణ్యం గల కుతుబ్ షా, ఫారసీ, తెలుగు, దక్కనీ మొదలైన భాషల్లో వైవిధ్యమైన సాహిత్య సజన చేసాడు (తెలుగు రచనలు దొరకలేదు). సామాన్య ప్రజల పండుగలు, విశ్వాసాలు, జీవనశైలి, ఐక్యత, లౌకిక తత్వం మొదలైన అంశాలు తన కవితల్లోని ప్రధాన నేపథ్యాలని విశ్లేషకులు అంటారు. కుతుబ్ షా తన సమగ్ర సాహిత్య సంకలనానికి కుల్లియత్-ఎ-కులీ కుతుబ్ షా అనే శీర్షికతో నామకరణం చేశాడు. అప్పటివరకు ఏ ఉర్దూ కవి కూడా ఒక్క దీవాన్ని కూడా సంకలనం చేయలేదు. దీవాన్ కాదు కదా విరివిగా గజళ్ళు కూడా రాసేవారు కాదు. ఈ విధంగా ఉర్దూ సాహిత్య చరిత్రలో మొట్టమొదటి దీవాన్ సంకలనం చేసి ప్రచురించిన ఘనత ఈ తెలంగాణీయుడికే చెందింది.
గజల్ జన్మస్థలం ఇరాన్ దేశమే అయినా, ఇది ఫారసీ కంటే ఎక్కువగా ఉర్దూలోనే వ్యాప్తి చెందింది. అసలు ఉర్దూ సాహిత్యం కోసమే గజల్ జన్మించిందా అనేంతగా ఇది ప్రఖ్యాతి గాంచింది. ఈ స్థాయిని చేరుకోవడానికి ఉర్దూ భాష, గజల్ ప్రక్రియ రెండూ కొన్ని శతాబ్దాల వరకు పరిణామం చెందాల్సి వచ్చింది. ఆ పరిణామ క్రమం భారతదేశ సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కతిక పరిస్థితులపై ఆధారపడి ఉంది. అమీర్ ఖుస్రో 13వ శతాబ్దంలోనే మన దేశంలో, గజల్ ప్రక్రియకు ప్రయోగాత్మకంగా పునాది రాయి వేసాడు. కానీ దీని వ్యాప్తి మాత్రం 17వ శతాబ్దం నుండే ప్రబలమయ్యింది. వాస్తవానికి 17వ శతాబ్దం వరకు ఉర్దూ, కేవలం ఒక సామాన్య
వ్యవహారిక భాషగా మాత్రమే ఉండేది. అప్పుడు అందులో చెప్పుకోదగిన సాహిత్యం ఇంకా జనించ లేదు. ఎందుకంటే అప్పటివరకు మన దేశంలో ఉన్న పండితులందరూ (హిందూ పండితులు, ముస్లిం పండితులతో సహా) కేవలం ఫారసీ భాషలో సాహిత్య సజన చేయడమే గర్వకారణమని విశ్వసించే వారు. భారతదేశంలో గజల్ ఉన్నతి చెందిన తీరును అర్థం చేసుకోవాలంటే ముందు ఉర్దూ భాష పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిని అర్థం చేసుకునే క్రమంలో మనకి రెండు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఒకటి- ఉత్తర భారతదేశంలో ఉర్దూ గజల్ కు ముందే పునాది పడినా కూడా, దాని వికాసం మాత్రం దక్షిణం నుండే ప్రారంభమైంది. రెండు- 17వ శతాబ్దం వరకు కేవలం ఒక సామాన్య వ్యవహారిక భాషగా ఉన్న ఉర్దూకి, దక్షిణ భారతంలో దక్కనీ అనే పేరుతో ఒక సంపూర్ణమైన సాహిత్య భాషగా పరిణామం చెందడానికి అనువైన చారిత్రక పరిస్థితులు ఏర్పడ్డాయి (దక్కనీ-ఉర్దూ భాషా రూపాలలో ఒకటి). దక్షిణ భారతం, ఉత్తర భారతం రెండూ పూర్తిగా భిన్నమైన సంస్కతీ సంప్రదాయాలు గల ప్రాంతాలు. ఉత్తర భారతంలోని సంస్కతి దక్షిణాదికి ఎలా పాకింది? గజల్ అక్కడే ఎలా ప్రగతి చెందింది? ఇదంతా జరగడానికి ఏర్పడిన పరిస్థితులు ఏంటనేది చరిత్ర చదివితే తెలుస్తుంది. ఏదేమైనా ఉర్దూ సాహిత్య భాషగా రూపాంతరం చెందడం, ఉర్దూ గజల్ విజంభించడం, రెండూ మొదలైంది దక్షిణ భారతంలోనే అనే విషయం ఉర్దూ సాహిత్య చరిత్ర చదివితే తెలుస్తుంది. ఈ కాలమ్ లో తీసుకున్న గజల్ కూడా ఆ నాటి కాలానికి చెందినదే. మరాఠీ పదాలను, సామాన్య ప్రజలకు అర్థం అయ్యే భాషను ఉపయోగించడం వంటి ప్రయోగాల వల్ల, కుతుబ్ షా గజళ్ళలో దక్షిణ భారతదేశంలోని వాతావరణం స్పష్టంగా ఏర్పడుతుంది.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి, 94410 02256