Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరి కళ్ళల్లో పూసిన కాయలకు
నువ్వు పువ్వు అవుతావు
ఎవరో గీసిన నాలుగు గీతలతో
గోడలు నిర్మించుకుంటావు
ఎవరో పీకేసిన ఈకలతో రెక్కలు కట్టుకుంటావు
ఎక్కడెక్కడో ఎవరెవరి ముందో
అదుపుతప్పి పడిపోతావు
ఎవరెవరి ఆలోచనల్లోనూ
ఎవరెవరి ఊసుల్లోనూ
ఎవరెవరి ఊహల్లోనూ
ఉయాలలూగుతూ ,ఊగిసలాడుతూ
అసలు నువ్వు ఎవరో మర్చిపోయి
ఓ కిరాయి మనిషిలా
ఏ నియమవాంఛలతో సరిగమ పాడుతున్న
జీవితం సర్దుతూ సర్దుతూ
ఒక గది లోనే ఇరుక్కుపోతావు.
ఒక్కో చోట ఒకలా ఒక్కడివే తప్పిపోతూ, తడబడుతూ తడికళ్ళతో
దేన్ని తడిమి చూసుకొని తీరికలేని
తారీఖుల వెంబడి నడుస్తూనే ఉంటావు.
అవిచ్ఛిన్నం కాని ప్రశ్నల పరంపర
నిన్ను పట్టుకోవాలని అనుకున్నప్పుడల్లా
తప్పించుకోవడం తమాషాగా జరిగిపోతుంది
ఉదయం నుంచి రాత్రి దాకా
ఒక్కడివే కానీ
నీకు నువ్వు ఓ వేల కిలోమీటర్ల దూరంలో
బ్రతుకుతూ ఉంటావు
ఎప్పుడూ కాకపోయినా
అప్పుడప్పుడైనా నీకు నువ్వున్నావని తెలుసుకోవాలి
నీకు నువ్వుగా నిన్ను నీవు వెతుక్కోవాలి.
ఉన్నపళంగా దారలన్నీ ఊడిపోతే
ఏ మిగిలిన కొనల్లోనైనా
నువ్వు మిగిలుండడానికైనా
నిన్ను నీవు మిగుల్చుకోవాలి
ఏ కాలమో నువ్వెవరని నిలదీస్తే
చెప్పుకోవడానికి ఓ భంగిమలో
భద్రంగా నిన్ను నువ్వు దాచుకోవాలి ..
- పి.సుష్మ , 9959705519