Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహజ, ఖనిజ నిక్షేపాలే కొన్ని దేశాలకు శాపంగా మారినట్టు చరిత్ర చెబుతున్న వాస్తవం. 'డచ్ డిసీజ్' పేరుతో నెదర్లాండ్స్ ఎదుర్కొన్న పరిస్థితులు ప్రపంచానికి ఇప్పటికీ ఒక ఉదాహరణగా ఉన్నాయి. 1959లో నెదర్లాండ్స్‌లో భారీ ఎత్తున గ్యాస్ నిల్వలను కనుగొనగా అప్పటి నుంచి ఆ దేశం వాటిని పెద్ద ఎత్తున ఎగుమతి చేయడం పారంభిం చింది. ఇన్‌స్టంట్‌గా అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూర్చినా, దీర్ఘకాలిక వృద్ధిలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఓ దశాబ్దం తర్వాత అంటే 1970-77 మధ్యలో పరిశీలిస్తే ఆ దేశ నిరుద్యోగ రేటు 5.1శాతానికి చేరుకున్నది. అంతకు ముందు అది ఒక శాతానికి మాత్రమే పరిమితమై ఉన్నది. ఎందుకంటే పెట్టుబడు లంతా ఒకే రంగంలో కేంద్రీకతం కావడం, ఇతర రంగాలు, తయారీ పరిశ్రమలను పట్టించుకోక పోవడంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైందని ఆర్థిక విశ్లేషకులు నిర్థారించారు.
బ్యాటరీ తయారీలో కీలకమైన లిథియమ్ నిల్వలను జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల కనుగొన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. 59లక్షల మెట్రిక్ టన్నుల లిథియం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ అంచనా నిజమైతే ప్రపంచంలోనే అత్యధిక లిథియమ్ నిల్వలున్న దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంటుంది. అంతేకాకుండా జమ్మూకాశ్మీర్, ఏపీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణల్లో 51 చోట్ల ఖనిజ నిల్వలను గుర్తించారు. వాటిలో ఐదు బంగారు గనులు సైతం ఉన్నాయి. అంతేకాకుండా పొటాష్, మాలిబ్డినం వంటి లోహాలను గుర్తించారు. అయితే ఇలాంటి సహజ, ఖనిజ నిక్షేపాలు ఆయా ప్రాంతాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు, భవిష్యత్తుకు వరమా? శాపమా? అనే చర్చ అవసరమవు తున్నది.
పర్యావరణంపై తీవ్ర ప్రభావం
లిథియమ్ అయినా ఇతర ఖనిజ నిక్షేపాలైనా వాటిని మైనింగ్ చేసి, వెలికి తీయాలంటే ప్రకృతి, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నేల, నీరు, గాలి కలుషితమవుతాయి. ఉదాహరణకు ఒక టన్ను లిథియమ్‌ను ఉత్పత్తి చేయడానికి 2.2 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుంది. పర్యా వరణంపై పడే ప్రభావాన్ని పట్టించుకోకుండా లిథియమ్‌ను వెలికి తీయడానికి ప్రయత్నిస్తే 'జోషి మఠ్' లాంటి సంఘటనలు మరింత పెరిగే ప్రమాదముంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీల్లో లిథియమ్‌ను వినియోగిస్తున్నారు. దీంతో కర్బన ఉద్గారాలు ఎంతో మేర తగ్గించవచ్చని వాదించే వారూ ఉన్నారు. అయితే లిథియమ్ మైనింగ్ ద్వారా ఉత్పత్తి అయ్యే కర్బన ఉద్గారాలను కూడా మనం తోసిపుచ్చలేం. లాభనష్టాలను బేరీజు వేసుకొని, అన్నింటిని సమతుల్యం చేసి ముందుకు సాగితేనే ఫలితముంటుంది. పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుండడంతో లిథియమ్ వెలికితీతపై ఇప్పటికే అర్జెంటీనా, బొలీవియా వంటి దేశాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర గనుల శాఖ అంచనా వేసినట్టు జమ్మూకాశ్మీర్‌లో 59 లక్షల టన్నుల లిథియమ్ నిల్వలు ఉండి, పర్యావరణంపై కనీస ప్రభా వంతో వాటిని వెలికితీసినా... అది దేశ ఆర్థిక వ్యవస్థకు, భౌగోళిక పరిస్థితులకు ఏ మేరకు లాభసాటిగా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చమురు నిల్వలను కనుగొన్నప్పుడు గల్ఫ్ దేశాలు జాక్ పాట్ కొట్టినట్టే భారతదేశ పరిస్థితి ఉండబోతున్నదనే వాదనా ఉన్నది.
చరిత్రను పరిశీలిస్తే...
ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున సహజ నిక్షేపాలను కనుగొన్నప్పుడు ఆ దేశాలపై పడ్డ ప్రభావాన్ని చూస్తే అనేక ఆసక్తికర విషయాలను మనం గమనించవచ్చు. కొన్ని దేశాలు సానుకూల పరిస్థితులను సష్టించుకొని అభివృద్ధి దిశలో పయనించగా, సరైన ప్రణాళికలు లేకుండా మరికొన్ని దేశాలు దీర్ఘకాలికంగా అనేక రంగాల్లో వెనకబాటుకు గురయ్యాయి. గతంలో గల్ఫ్ దేశాలతోపాటు నార్వే, ఆస్ట్రేలియా, రువాండా లాంటి దేశాల్లో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొన్నారు. వీటి వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి. అదే సమయంలో వీటికి భిన్నమైన ఉదాహరణలు సైతం మనకు కనిపిస్తాయి.
'డచ్ డిసీజ్' ఒక ఉదాహరణ
సహజ, ఖనిజ నిక్షేపాలే కొన్ని దేశాలకు శాపంగా మారినట్టు చరిత్ర చెబుతున్న వాస్తవం. 'డచ్ డిసీజ్' పేరుతో నెదర్లాండ్స్ ఎదుర్కొన్న పరిస్థితులు ప్రపంచానికి ఇప్పటికీ ఒక ఉదాహరణగా ఉన్నాయి. 1959లో నెదర్లాండ్స్‌లో భారీ ఎత్తున గ్యాస్ నిల్వలను కనుగొనగా అప్పటి నుంచి ఆ దేశం వాటిని పెద్ద ఎత్తున ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇన్‌స్టంట్‌గా అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూర్చినా, దీర్ఘకాలిక వద్ధిలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఓ దశాబ్దం తర్వాత అంటే 1970-77 మధ్యలో పరిశీలిస్తే ఆ దేశ నిరుద్యోగ రేటు 5.1శాతానికి చేరుకున్నది. అంతకు ముందు అది ఒక శాతానికి మాత్రమే పరిమితమై ఉన్నది. ఎందుకంటే పెట్టుబడులంతా ఒకే రంగంలో కేంద్రీకృతం కావడం, ఇతర రంగాలు, తయారీ పరిశ్రమలను పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైందని ఆర్థిక విశ్లేషకులు నిర్ధారించారు. అంతేకాకుండా 1908లో ఇరాన్లో ఆయిల్ నిల్వలను కనుగొన్నారు. అక్కడ ఇతర రంగాలు అభివద్ధి చెందకపోవడం, అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉండడంతో పెట్టుబడులు, మానవ వనరులన్నీ 'ఆయిల్' రంగం వైపు మళ్లాయి. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒకే వనరుపై ఆధారపడి నడపాల్సి వచ్చింది. దీంతో మిగిలిన రంగాలు భారీ నష్టాలను చవిచూశాయి. ఎన్నో సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలున్నా అవినీతి, సరైన ప్రణాళిక లేకపోవడంతో కాంగో, జింబాబ్వే లాంటి దేశాలు ఇప్పటికీ పేదరికంలోనే మగ్గుతున్నాయి.
ఇతర దేశాలను పరిశీలిస్తే...
గల్ఫ్ దేశాల కరెన్సీ పూర్తి స్థాయిలో పెట్రో ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నది. ఇతర ఎలాంటి వస్తువులను ఆ దేశాలు ఎగుమతి చేయవు. దీంతో 'డచ్ డిసీజ్' లాంటి పరిస్థితులను అవి ఎదుర్కోలేదు. అదే సమయంలో ఆస్ట్రేలియా, నార్వే దేశాలను పరిశీలిస్తే ఖనిజ నిక్షేపాలతోపాటు ఇతర రంగాలపై కూడా దృష్టి సారించాయి. విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో పెద్ద ఎత్తున ఖర్చు చేసి 'డచ్ డిసీజ్' లాంటి పరిస్థితులు రాకుండా తప్పించు కోగలిగాయి. అంతేకాకుండా సౌది, దుబాయి, యుఎఇ వంటి దేశాలు తమ ప్రాంతాలను టూరిస్ట్ హబ్‌లుగా మార్చి తమ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఎంత పెద్ద ఎత్తున సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలు దొరికినా..పూర్తి స్థాయిలో వాటిపై ఆధారపడక పోవడమే మంచిది. ఆ నిక్షేపాల వద్ద ఒకరిద్దరు వ్యాపారులు మాత్రమే లాభపడేలా కాకుండా... సరైన ప్రణాళికలు రూపొందించి ప్రజలందరికీ లాభం జరిగేలా చర్యలు చేపట్టాలి. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి లాభాలను విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో ఖర్చు చేయాలి. అంతేకాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపర్చాలి. అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు. అప్పుడే అన్ని పరిస్థితులను ఎదుర్కొనేలా దేశ ఆర్థిక వ్యవస్థను తయారు చేయవచ్చు. లేకుంటే ఆ సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలే దేశానికి శాపంగా మారుతాయి.
- ఫిరోజ్ ఖాన్
9640466464