Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిట్ట మధ్యాహ్నం. సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. మండిపోతున్నాడు. ఆ సమయంలో నడినెత్తిన కాక ఏ తూర్పునో, పడమరో ఉంటాడా అని మజాక్ చేసేవాళ్ళూ ఉండొచ్చు మిత్రుల్లో. ఏ సమయంలోనైనా సూర్యుడు మండిపోతూనే ఉంటాడు మనకు తెలీదంతే అని ఇంకో విషయ నేర్పరి, తెలుగులో చెప్పుకుంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అన్న మాట, చెప్పొచ్చు. సాక్షాత్తు మెగాస్టారే ఒక సినిమాలో ఓ ఇంగ్లీషు పదం తెలుగైపోయిందన్నాడు అది వేరే సంగతి. ఆంగ్లంలో ఇతర భాషా పదాలు ఎన్నో చేరాయి అందుకే అది ప్రపంచాన్ని ఏలుతోంది అంటూ ఒక విషయం వదిలేసి వేరే సబ్జెక్టులోకి సునాయాసంగా అంటే తెలుగులో ఈజీగా వెళ్ళిపోవచ్చు. అసలు విషయానికొస్తే, ఆ ఎండలు మండిపోవడానికి సూర్యుడే కారణమా, లేక తనకి దగ్గరగా పోయే భూమి కారణమా, ప్రపంచమంతా యుద్ధాలు చేయిస్తూ భూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్న దేశమా, ఇతర ప్రపంచమా, ప్రపంచ ప్రజలా? ఇలా ఎవరు కారణం అని ఆరా తీసుకుంటూ పోతే ఒక పుస్తకం రాయొచ్చు, మొత్తం ఈ పేపరంతా మన ఒక్క ఆర్టికలుకే సరిపోతుంది.
విషయానికొస్తే, అసలు ఇషయానికొస్తే అంటూ రాయడం కొందరికి అలవాటు. అంటే నీవు అసలు విషయం వదిలేసి ఎటో పోయి ప్రపంచమంతా తిరిగి, చదివేవాళ్ళను తిప్పి సడెన్గా విషయానికొచ్చి ఆ విషయం చెప్పి మరీ పేజీలు పేజీలు నింపేస్తే నేవేదో పెద్ద తోపువని చదవాలా అనొచ్చు కూడా. వస్తా సబ్జెక్టుకొస్తా. అవునంటె కాదనిలే, కాదంటె ఔననిలే అని ఒక కవి రాశారు. మొన్న ఎనిమిదో తేదీననే మహిళా దినోత్సవం ఐపోయింది కాబట్టి ఆయన ఎవరిమీద రాశాడో చెప్పకూడదు. చెప్పను అనుకుంటూ అసలు విషయం చెప్పేయడం ఓ టెక్నిక్. చెప్తాను అనుకుంటూ విషయాన్ని దాచేయడం, వేరే విషయం చెప్పడం ఇంకో టెక్నిక్. అప్పుడే మనిషి పైకొచ్చేది.
ఉందంటె లేదనిలే, లేదంటె ఉందనిలే రాజకీయ మాటలకు అర్థాలు వేరులే అని మనమూ రాయొచ్చు. దీని వెనుక ఒక తెలుగు పాట అదీ సాలూరివారు స్వరపరచి ఏ.ఎం రాజా తీయగా పాడిన పాట ఉందని తెలియనోళ్ళు మస్తుగ చెప్పిండ్రా అనుకునే ప్రమాదం అదే డేంజర్ ఉంది. ఆ మెగా స్టారు తమ్ముడు తన సినిమాల్లో పాత పాటలను వాడబట్టి అవి కొందరికి తెలుస్తున్నాయి, అది వేరే సంగతి. అసలు సంగతి గాలికి వదిలేసి వేరే సంగతులెందుకు చెబుతారు అన్న అనుమానం అంటే డవుట్ వేయకూడదు. ఎందుకంటేె లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనికట్టు విద్యలు నేర్చినోళ్ళే ఇప్పుడు నేర్పరులు, అంటే ఎక్స్పర్టులన్నమాట.
వివాహాల కాలం, అంటే మ్యారేజీ సీజన్. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో పెళ్ళికి పోయినా అన్నింటినీ కవర్ చేయలేని పరిస్థితి. అందులో ఎండలు. నూతన వధూవరులకు అంటే న్యూలీ మారీడ్ కపుల్ కు ప్రెజెరేషన్ ఇచ్చి ఫొటో దిగిపోదామనుకుంటే వాళ్ళు స్టేజి మీదకు ఎంతకూ రారు. ఏమంటే వాళ్ళతో ఎన్నో పూజలు, హౌమాలు చేయించి చివరికి ఆ ఎండలోనే అరుంధతీ నక్షత్రాన్ని చూపించి వచ్చేవరకూ మనం తెలిసినోళ్ళతో మాట్లాడుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ, వాటిని ఇతరుల ఫోనుల్లో నింపేసుకుంటూ ఉండాలి. తినింది అరగాలంటే ఏదో ఒకటి చేయాలిగా అంటాడు మా మిత్రుడు. మొత్తం మీద అరుంధతీ స్టారును చూసి వస్తారు. ఎలా చూస్తారు అంటే చూపిస్తే చూస్తారు అనాలంతే. పొరపాటున కూడా కనబడలేదని అనకూడదు. ముందే చెప్పుకున్నట్టు, ఉందంటే ఉందనాలి అంతే ఇంక వేరే క్వెస్చెను లేదు. అంతే. దట్సాల్.
ఇదంతా ఏకపక్షంగా ఉంది గురూ, నువ్వేది చెబితే దానికి ఊ కొట్టాలా, నమ్మాలా? అంటే ఇప్పుడు మీరు చేస్తున్నది అదే కదా అంటా. అసలేం మాట్లాడుతున్నావ్, అసలు విషయం చెప్పు అని రివర్సులో నన్నే విషయంలోకి రమ్మంటే సమాధానం ఒకటే నేను సబ్జెక్టును వదిలి ఒక్క మాట కూడా అస్సలు చెప్పలేదంటా. ఐతే నీవు ముఖ్య మంత్రి, ప్రధానమంత్రి అయ్యే ఛాన్సులున్నాయి, ఎక్కువరిస్తే గవర్నరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనొచ్చు గిట్టని వాళ్ళు. సరే, ఆ వెలుగులు చూడు అని చీకటిని చూపిస్తే, అవును సారూ అనాలి. పెట్రోలు నూటాపది అని మొత్తుకుంటే ఇంకో దేశంలో అదే పెట్రోలు రెండువేలు తెలుసా అంటే అబ్బో పంతొమ్మిది వందలు మిగిలిందని ఆనందపడాలి. అసలే ఉద్యోగాలు లేకుంటే ఉన్న ఉద్యోగాలను తీసేసి సంస్థలను మూసేస్తున్నారని చెబితే ఫ్లిప్ కార్టులో, వాల్మార్టులో ఇన్ని వేలమందిని తీసేశారని గుర్తు చేయాలి. అలా ఒకటి చెబితే ఇంకోటి చెప్పి సము దాయించాలి. ఒక్కో దేశంలో ఆర్ధిక మాంద్యం ఎలా ఉందో ఊకదంపుడు ఉపన్యాసాలివ్వాలి. మనమెలా నిలబడగలిగామో స్పీచులివ్వాలి. ఇప్పుడు పడనట్టు, మనమూ ఇబ్బందులు పడే రోజులు వస్తాయని పేపర్లలో రాస్తున్నారుగా ఎలా అంటే ఆ ఛాన్సే లేదు అంటే ఓకే అనాలి. ముందే పడ్డాము ఇంక పడేదేముంది అని సంతోషపడాలి.
నిరుద్యోగాన్ని అంతమొందిస్తాం, కొన్ని లక్షల పనిగంటలు సష్టిస్తాం అని గంటలు గంటలు ఉపన్యాసాలివ్వొచ్చు. ఉద్యోగాలెక్కడ అని అడిగే వీలు లేకుండా రాజకీయ నిరుద్యోగాన్ని తగ్గించడం చూడొచ్చు. కరువు వల్ల వలసల్ని ఆపలేకపోవచ్చు కాని రాజకీయ వలసల్ని చూడండి ఎంత చకచకా చేయిస్తున్నామో అనొచ్చు. ఒక సమస్య ఉంది చూడు అంటే ఇంకో అభివధ్ధి చూపొచ్చు. రైతు కూలీలు, రైతులు, కార్మికులు రోజూ ప్రయాణం చేసే రైళ్ళను ఇన్ని రద్దు చేశారి అనేలోపు విలాసవంతమైన రైళ్ళు ఎలా పరుగులు తీస్తున్నాయో చూడమనొచ్చు. సైన్సులో, వైద్యంలో ఇంకా కొన్నింటిలో పరిశోధనలు ఆగిపోయాయి వాటి కథ చూడమంటే పాత పుస్తకాల్ని తర్జుమా చేయిస్తున్నాము ఆగండనొచ్చు. దేశంలో పరిస్థితి బాగోలేదంటే ప్రపంచంలో మనం నాయకులమనొచ్చు. అదే ప్రపంచంలో ఆకలి సూచీలో మన ఎదుగుదలను చూడమంటే మీరెప్పుడూ అంతే బాగుపడరు అందుకే ఇంకా అక్కడే ఉన్నారనొచ్చు.
ఒకేమాదిరి ఉన్న చిత్రాలు రెండు పక్కపక్కనే పెట్టి ఒకదాంట్లో కొన్ని మార్పులు చేసి వాటిని కనిపెట్టండి అని మెదడుకు మేత పెట్టే పనిలో కొందరున్నట్లే అసలు కనిపెట్టలేని తేడాలతో కంటికి మెదడుకు పరీక్షలు పెడతారు. ఫలానాది ఉందా బొమ్మలో అని లేనిదాని గురించి అడిగితే ఉంది కొట్టొచ్చినట్టు, తన్నొచ్చినట్టు కనిపిస్తోందనాలి. అప్పుడు నీకు వందకు వంద మార్కులు. అదే ప్రశ్నకు లేదు అని సమాధానం చెబితే మాత్రం సున్నా మార్కులేసి పక్కన పెడతారు. అందుకే రాజుగారి దుస్తుల కథలో మాదిరిగా ఎలా ఉన్నాయి అంటే భలే బాగున్నాయి రాజుగారి దుస్తులు అనాలి. ఏ కలర్లో ఉన్నాయంటే మాత్రం కష్టమొచ్చి పడుతుంది. నా కళ్ళకు జబ్బుంది, రంగులు కనబడవు అని సింపుల్గా జారుకోవాలి. ఉందంటె లేదనిలే అన్న సూత్రం మాత్రం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.
జంధ్యాల రఘుబాబు
9849753298