Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వానమామలై వరదాచార్యుల గూర్చి ఎవరు చెప్పినా ఆయన 'పోతన చరితము' గురించి చెపుతారు. పోతన భాగవతం రాస్తే, పోతన చరిత్రను వానమామలై రాశారని, అదీ అద్భుతంగా రాశారని, భోగినీ విలాసము అత్యద్భుతమనీ చెపుతారు. నాట్యానికి తన కావ్యంలో అత్యంత ప్రాధాన్యమిచ్చారని నటరాజ రామకృష్ణ లాంటి వారే సెలవిచ్చారు. భక్తి భావనకు, ఆధ్యాత్మిక చింతనకు, సంప్రదాయానికి, పద్యనిర్వహణా దక్షతకు వానమామలై రచనలు పెద్దపీట వేశాయి. ఈ విషయంలో దివాకర్ల నుండి విశ్వనాథ వరకు, బి. రామరాజు నుండి సినారె వరకు అందరూ కొనియాడిన వారే. వ్యక్తిగతంగా ఆయనతోను, ఆయన రచనలతోనూ పరిచయం లేని నేను, చాలా కాలం ఆయన రచనలు చదవలేదు. నాకు పద్య కవిత్వంతో పరిచయం లేకపోవడం ఒక కారణమైతే, నేను ఇష్టపడే అంశాలు ఆయన రచనల్లో కనిపిస్తాయో లేదో అన్న అనుమానం మరొక కారణం కావొచ్చు. ఏమైనా కాలం గడిచిపోయింది. ఇటీవల ఆయన శత జయంతి ఉత్సవాలు రాష్ట్రమంతటా ఘనంగా జరుగుతూ ఉండటం, ఆయన పుస్తకాలు పునర్ముద్రణ జరుగుతూ ఉండటం వల్ల అసలు ఈ కవి రాసిందేమిటి? అని 'మణిమాల' తిరగేశాను. ఇది తిరగేయాల్సింది కాదు శ్రద్ధగా చదవాల్సిన గ్రంథమని అనిపించింది. పద్యాలు అర్థం చేసుకోగలిగే భాషా పటిమ లేకపోయినా పట్టుబట్టి చదివాను.
ఈ రోజుల్లో సాహిత్యం చదివేవారే తక్కువ. అందులో కవిత్వం చదివేవారు ఇంకా తక్కువ. అందులో మళ్ళీ పద్య కవిత్వం చదివి ఆనందించేవారు మరీ మరీ తక్కువ. కొందరు కవుల గూర్చి పదే పదే చర్చించడం, మరి కొందరి గూర్చి పూర్తిగా మరిచిపోవడం మన తెలుగు సాహిత్య రంగంలో కొత్తేమీ కాదు. ఆ రకంగా చూస్తే వానమామలై కవిత్వంపై లోతైన చర్చ జరగలేదని అనిపించింది. కొత్త కోణంలో కొత్త అంశాన్ని విశ్లేషించుకునే పని అసలే జరగలేదు.
'మణిమాల'లో అన్నింటిలోకి 'పాకీవాడు' శీర్షికతో రాసిన కవిత అత్యుత్తమమైందని నా భావన. సెప్టిక్ సిస్టం బాగా వాడుకలోకి వచ్చిన తర్వాత పాకీవాడు కనుమరుగయ్యాడు. కానీ, కొన్నేళ్ళ క్రితం ఆ వ్యవస్థ వాడుకలో ఉంది. దాశరథి బాల్యంపై రాసిన కవిత, తిలక్ పోస్ట్‌మాన్ సుబ్బారావు కవిత, కరుణశ్రీ పుష్పవిలాపం, శ్రీశ్రీ భిక్షుకి కవితల స్థాయిలో వానమామలై 'పాకీవాడు' కవిత ఉంది. అసలు ఆ ఇతివృత్తం తీసుకుని కరుణ రసాత్మకంగా, సామాజికాంశాల్ని కలబోసుకుని కవిత రాయడం గొప్ప విషయం. జగతే తన ఇల్లని, జగతిలోని వారంతా తన కుటుంబ సభ్యులనుకుని ఈ చేయి ఆ చేయి అనే భేదం లేకుండా ఇల్లిల్లూ తిరిగి మల, మూత్రాలు ఎత్తిపోసే పాకీవాడిని చూసి సంఘ సంస్కర్తలు సిగ్గు దెచ్చుకోవాలి అని అంటారు.
''జగతియె నాదునిల్లనుచు సర్వ జనమ్ములు నా కుటుంబ మం
చగపడు చోట్ల నెల్లగల నా కసవంతయు నెత్తిపోయి చుం
దగ నిలునిల్లు సొచ్చి యతి దారుణ శాంత్యసి బూని దొడ్లలో
నగపడు దుష్ట మూత్ర మలినాదులనే గతి పేరు మాపెదో?''
పొట్ట గడవడానికి ఈ వృత్తే చేయాలా? కాయలు, గడ్డలు లేవా తిని బతకడానికి? అని ప్రశ్నిస్తారు. రాజు, గృహిణి, కన్నతల్లి, కవి లాంటి వారికన్నా పాకీ మనిషిని ఉన్నత స్థానంలో నిలిపారు వానమామలై.
అలాగే 'తృణము' అనేది వైజ్ఞానికాలకాలతో వెలువడి బలమైన కవిత ''సాగరుడే పయికెక్కి వచ్చినా / నిని పడి గప్పి ప్రాణమిడినీ కిడుమల్ సుజనుం గలంచునే? - అని అంటారు కవిత ముగింపులో వత్యంత ప్రీతితోడ / తృణమ! నీ ప్రాణ వాయువే మనసు గలదొ'' అంటారు. సూర్యుడి వేడికి సముద్రపు నీరు ఆవిరై పైకి వెళ్ళి వర్షంగా కురిసి నేల మీద పత్రహరితాన్ని కాపాడటం, అది జీవులకు ప్రాణవాయువు నందించడం వర్ణించారు కవి. 'పాలేరు' శీర్షికతో రాసిన పద్యాలు కూడా కళ్ళకద్దుకోవాల్సినవి. గ్రామీణ భారతాన్ని చిత్రించిన కవితలో మొదట అంటారు..
''కర్రు గాదది జీవ గణ కాయముల నిల్ప /
గల యమృతపు ఓవగర్ర గాని''
''కాదె నీ యెద్దు పోటు రక్తపు చుక్క
నృపుని మకుటాన వెల్గెడి కెంపు ముక్క'' రైతులేనిదే రాజు మన లేడు కదా? మరోచోట 'గంటము - కర్రు' కవితలో కవిరాజు గంటాన్ని, కర్షకుడి కర్రును ప్రస్తుతించారు. ఆ రెండూ ఒక తల్లి బిడ్డలేనని చెబుతారు.
''కవిరాజు గంటమ్ము కర్షకుని కఱ్ఱు
కవిరాజు కర్షకుడు, కంటి పాపలు నాకు
... ఇవి రెండు నొక తల్లి కవల బిడ్డలు గాదె''
వానమామలై వరదాచార్యులు సామాజి కాంశాలతో పాటు విద్య, వైద్య, ఆరోగ్య, వైజ్ఞానిక అంశాలపై కూడా దృష్టి సారించారు. 'చుట్ట గాల్పు' 'గెలిసేతు' కవితలు పొగతాగుట హానికరం అనే ప్రకటన వలె పని చేస్తాయి. అంతే కాదు వైజ్ఞానిక అవగాహన కలిగిస్తాయి. ''పయిన బూడిది చేయు పట్టుదలయె కాని / చవి యుండునే జుట్ట జప్పరింప / ఆరోగ్యమునకు నిప్పంటించు కొనుటె పో / సిగరెట్టు కాల్చుట చిన్న పనియె / శ్వాస కోశామయ శక్తులన్ పాటించు కొనుటెగా / తెగత్రావి ముక్కుతో పొగవిడుచుట / దొండపండు బొల్పదవుల నుండ నీక / కాకి ముక్కుతో గమ్మరి కారు మొనల / తోడ వియ్యంబు లందుంచు వీడరాని / చుట్టరికము గల్పించుటె చుట్ట బీల్వ'' అలాగే 'గేలి సేతు' కవిత ప్రారంభంలో ''పైస బూడిద సేయు ఫర్మాయుషీ చుట్ట / గాల్వ డబ్వెతయో కాల్వవలె నూరు'' కవితలోని వ్యంగ్య వైభవం అర్థం చేసుకుని ఆనందించాల్సిందే!
భక్తి భావనలో పూర్తిగా మునిగిపోయిన కవి, సంప్రదాయవాది, ఆచారాలు బాగా పాటించే కుటుంబ నేపథ్యంలోంచి ఎదిగి, తెలుగు భాషపై పట్టు సాధించి పద్యకవితను పరుగులు పెట్టించిన వారు వరదాచార్యులు. తన చట్రంలోంచి ఒక్కసారిగా బయటపడి ప్రగతిశీల భావజాలంతో సామాజిక, వైజ్ఞానిక, ఆరోగ్య విషయాలు తడుముతూ కవిత చెప్పారు. 1912లో పుట్టిన వానమామలై రజాకార్ల అఘాయిత్యాలు జరిగిన దశలో సుమారు ముప్పయ్యేళ్ళ యువకుడు. ఆయన నిజాం ప్రభుత్వంలోని అవలక్షణాల్ని ఎండగట్టక ఎలా ఉంటారూ? ''నిజాం రాష్ట్రపు బీద వెట్టివాడు'' అనే కవితలో ఆయన ఆనాటి వెట్టి చాకిరిని నిర్దద్వంతంగా నిరసించారు.
''కరకు తురక యాఫీసర్ల కాళలందు / బడుచు వంగి సలామని వాకొనుచును / పొట్టకేమి లేకయు వారి తిట్టుల బడి / వెలయుదే నయిజాం బీద వెట్టివాడ!'' మరో చోట అంటారు.. ''కండు యే యవయవమున గానరాక / నేడు నెత్తురు బొట్టుల నీవెత్రావి'' అని వెట్టి పని చేసేవాడి త్యాగాన్ని ఎత్తి చూపుతారు. కవిత చివరలో మరో చోట నిరంతరం పనిలో నిమగమై ఉండే అతను ఇంట్లో భార్యాపిల్లలకు బంధువు వలె కనిపిస్తాడట! ''బత్తెమును జీవితమును లేని బంటు వగుచు / బతికి ఉన్నంత కాలము బానిసవై / ఆలు బిడ్డలకు బందుగువోలె నుండి / నీ గృహస్థతా ధర్మము నెఱపునట్టి / వీరుడా! నయిజాం బీద వెట్టివాడ'' బాధ్యత గల ఏ కవైనా తన చుట్టూ జరుగుతున్న అరాచకాల్ని ఎండగట్టక మానడు. ఎంత సంప్రదాయవాదైనా వానమామలై సామాజిక కాంశాల విషయానికి వచ్చేసరికి తీవ్రంగా స్పందించిన తీరు ఈ తరానికి, ముందు తరాలకూ ఆదర్శప్రాయమవుతుంది.
అలాగే మరొక సామాజిక దురాచారాన్ని తీసుకుని ''వితంతు బాలిక'' రాశారు. ఇదీ గొప్ప కవితే! గురజాడ అప్పారావు 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' కవిత్వ స్థాయి దీనికి ఉంది. అంతటి గుర్తింపు దీనికి రావాల్సింది. బాల్య వివాహాల్ని నిరసిస్తూ, బాల్య వితంతువుల దుర్భరమైన జీవితాన్ని కళ్ళకు కట్టించారు. అది మంగళసూత్రమో ఉరితాడో తెలియని వయసు. వారు బ్రాహ్మణులో దొంగలో తెలియదు. అవి మంత్రాలో తిట్లో తెలియదు. ఏదీ తెలియని ఆ చంటిపాపకు 'ముండా' అని ముద్రవేసి ఎందుకు చంపుతారూ? అని ఆక్రోషించాడు కవి. ''బట్ట విడిచి వైచి బరిమేన తిరిగెడి / చంటిపోరికేమి సకల శాస్త్ర / సారవేత్తలైన మీరలుపెండిలి / సేయుటేమి చాల సిగ్గు సిగ్గు'' అని ఆగ్రహించారు. అక్రమ సంతానాన్ని ఫుట్‌పాత్‌లపై విడిచి వెళ్ళడం, పసికూనల్ని పెంట దిబ్బలపై పారేసి పోవడం ఈ రోజుల్లో చూస్తున్నాం గానీ, ఈ కవి ఒక అర్థ శతాబ్ది క్రితమే ఈ పద్యం చెప్పారు. ''కొందఱో ఱంకుటాండ్రయి కులములోనే బయట పడకుండ చాటు గర్భముల నెన్నొ /కడకు దిగద్రాలియో లేక కన్న బిడ్డల / పిసికి పాతిపెట్టుట లేని వినబడవొకొ?''
సంప్రదాయ పద్య కవిత్వం రాసిన కవి, అందులోంచి బయటపడి పురోగమన పధంలో వచన కవిత్వం కూడా రాయగలగడం హర్షించదగింది. కాలంతో పాటు నడవని మహా కవులు మనకు ఉన్నారు. వారితో పోలిస్తే వానమామలై ఎంతో నయం కదా? పోతనపై కావ్యం రాసినందుకు ఆయన 'అభినవ పోతన' అయ్యారు. రజాకార్ల బాధలు పడలేక చాలా మంది ఆరోజుల్లో బెజవాడ (విజయవాడ) వెళ్ళి తలదాచుకున్నారు. యాదృచ్ఛికంగా వరదా చార్యులు కూడా చాలా కాలం మిత్రులకు కనబడలేదు. హైదరాబాదు, కోఠిలోని శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయంలో సాహిత్య సభ జరుగుతూ ఉంటే అనూహ్యంగా ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యారట! కొందరు మిత్రులు ఎదురెళ్ళి ''మీరు కూడా పోయారనే అనుకున్నాం'' అని అన్నారట! అప్పుడు వానమామలై ''నేను పోతనా?'' అని అన్నారట. అంటే అందరిలాగా నేను బెజవాడ పారి పోతానా పోను - అని అర్థం! అప్పటి నుండి 'పోతన' నామం మరింత బలపడింది అని చెపుతారు. ఒక సంప్రదాయ కవి హేతువాదం వైపు నిలబడినందుకు మనం సంతోషించాలి!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.