Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రజల ప్రగతి కోసం పరిశ్రమిస్తూ, ప్రజాభిమానంతో విస్తరించేది ప్రజాస్వామ్య పార్టీ'' ''ప్రతిపక్షాల వారిని అణిచేసి విస్తరించేది ఫాసిస్టుపార్టీ'' 'బీజేపీ' ఎలాంటి పార్టీయో మీ చర్యల ద్వారా తెలియజెప్పారు. ధన్యవాదాలు మోడీజీ!
కొందరు ఉగ్ర మూకలున్నంత మాత్రాన ముస్లింలంతా ఉగ్రవాదులనటం ఎంత తప్పో గాంధీని చంపిన గాడ్సే హిందువైనంత మాత్రాన హిందువులంతా హంతకులనడం అంతే తప్పు. నీరవ్ మోడీ, నిషన్ మోడీ, లలిత్‌మోడీ వంటివాళ్ళు వేల కోట్లు బ్యాంకుల ధనం కొల్లగొట్టినంత మాత్రాన, ప్రజాధనానికి కాపలాదారుగా ఉంటానన్న వాగ్దానంతో గద్దెనెక్కిన నరేంద్రమోడీ వాళ్ళను పట్టించుకోనంత మాత్రాన దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఏమిటి? అని రాహుల్ అడగడంలో తప్పేముంది. విజరుమాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, పుష్పేష్ బైద్యా, సన్నీకలారా, జతిన్ మెహతా, ఉమేష్ పరిఖ్, వినరు మిట్టల్, ఏకలవ్యగార్గ్, చేనేత జయంతిలాల్, రాజీవ్ గోయల్, రితేష్ జైన్, మయూరిబెన్ పటేల్, ఆశిష్ సురేష్భారు మొదలైన 28మంది భారతీయ బ్యాంకుల నుండి కొల్లగొట్టిన ధనం అక్షరాలా 'పదిలక్షల కోట్ల రూపాయలు'. వీళ్ళంతా ఘరానా హిందూ వ్యాపారులే! అంతమాత్రాన హిందూ వ్యాపారు లంతా దొంగలనవచ్చా? పై 28మందిలో విజయమాల్యా తప్ప తక్కిన వాళ్ళంతా గుజరాతీయులే! అయినంత మాత్రాన గుజరాతీయులంతా దొంగలనవచ్చా? భారత స్వాతంత్య్రం కోసం తన జీవితాన్నే అర్పించిన మన జాతిపిత గాంధీ గుజరాతీయుడే గదా! వల్లభ్‌భారు పటేల్ గుజరాతీయుడేగా?!
ప్రస్తుతం మన పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలను మట్లాడనివ్వని మాట నిజం! చర్చకు పెట్టకుండానే బిల్లులు, చట్టాలను మోడీ ప్రభుత్వం చేస్తున్నదీ నిజం! అయినా సరే ఈ వాస్తవాలను విదేశాల్లో చెప్పుకోవటం, మనదేశానికి అవమాన కరం కదా? అనేది మోడీ సర్కార్ వాదన. 'మా దేశపు గత పాలకులు ఏడు శతాబ్దాలుగా అభివృద్ధి చేయనందున భారతీయులు వలస వెళ్ళారు' అని నరేంద్రమోడీ విదేశాల్లో ఎలుగెత్తి చాటటమూ మనదేశానికి అవమానకరమే! ఆ మాటకొస్తే యూపీఏ పదేండ్ల పాలనలో వలస వెళ్ళిన భారతీయులకు రెట్టింపు సంఖ్యలో మోడీ పాలనలో వలస వెళ్ళినట్లు గణాకాంలు చెబుతున్నాయి.
ఎందుకంటే? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న వాగ్దానంతో గద్దెనెక్కిన మోడీ, కొత్త ఉద్యోగాలివ్వకపోగా, పెద్దనోట్ల రద్దు కారణంగా లక్షలాది పరిశ్రమలు మూతబడి, కోట్లాది కార్మికులు, ఉద్యోగులు వీధినపడ్డారు. వాళ్ళకు వలసలే గతయ్యాయి. మరి స్వదేశీ లోటుపాట్లను విదేశాల్లో వెల్లడించిన రాహుల్ గాంధీ దేశద్రోహి అయితే, అదే పని చేసిన మోడీ దేశభక్తుడెలా అవుతాడు? బీజేపీ ఆరెస్సెస్ వాళ్ళకిది భారతీయుల ప్రశ్న!
సరే.. ఒకసభలో దొంగల పేర్లన్నీ మోడీలే అన్నాడన్న నెపంతో అందుకు రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసేదాకా, ప్రణాళికా బద్ధంగా మీరు చేసిన కృషికి, నెహ్రూ వారసుల అడ్డు తొలగించుకుంటే మీకిక ఎదురుండదన్న మీ ఎత్తుగడకు 'అభినందనలు!'. కానీ దేవాలయంగా భావించి మీరు ప్రణమిల్లిన నిండు లోక్‌సభలో 'నువ్వేతండ్రికి పుట్టావంటూ ఎంపీ రాహుల్‌గాంధీని ఘోరంగా అవమానించిన సన్నివేశం, కౌరవసభలో ద్రౌపతీ వస్త్రాపహరణ సన్నివేశాన్ని తలపించి భారతీయులంతా కుత కుత లాడిపోయారు మోడీజీ! కానీ మీకు చీమకుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే మీరా సభలో దృతరాష్టునిలా వ్యవహ రించారు గదా? లేకుంటే దుశ్శాసనుని వంటి సదరు బీజేపీ ఎంపీని ఎందుకు శిక్షించలేదు? అది సరే, భర్త ఇంటిపేరు భార్యకు, తండ్రి ఇంటిపేరు బిడ్డకు వర్తిస్తుందని తెలిసికూడా నెహ్రూ పేరెందు కు పెట్టుకోలేదంటూ ఇందిరాగాంధీని, రాహుల్ గాంధీని అవహేళన చేసిన మీరు శిక్షార్హులు కాదా?
గత ప్రధానులందరికన్నా మామోడీ గొప్పవాడు, విశ్వగురువంటూ మీ బీజేపీ, మీ మీడియా ఊదరగొడుతున్నయి. మరి సర్వోత్తమ ప్రధానిగా భారతీయులకు కలకాలం గుర్తుండి పోయేలా మీరు చేసిన ఒక్కటంటే ఒక్క ఘనకార్యాన్ని చెప్పగలరా మోడీజీ? నెహ్రూగారి నుండి మన్మోహన్సింగ్ వరకు ప్రతి ప్రధానీ కొత్త కొత్త ప్రభుత్వ సంస్థల్ని నెలకొల్పి రిజర్వేషన్లు కల్పించి సామాజిక సమతుల్యతకు పాటుపడిన ప్రజానేతలే మోడీజీ! 'వాజ్‌పేయి' ఏడింటిని అమ్మినా, కొత్తగా 17 సంస్థల్ని నెలకొల్పాడు మన్మోహన్సింగ్ మూడింటిని అమ్మినా 23 సంస్థల్ని నెలకొల్పాడు. ప్రయివేటీకరణ పాపం కాంగ్రెస్‌దే అంటూ, మీరు పాపాన్ని కడిగేసుకో వాలనుకుంటున్నారు. పి.వి. 14 ప్రభుత్వరంగ సంస్థల్ని నెలకొల్పాడన్నది జగమెరిగిన సత్యం! కొత్తగా ఒక్కటంటే ఒక్క సంస్థను నెలకొల్ప కలిగారా? ఉన్న ప్రభుత్వ సంస్థల్ని తెగనమ్ముతున్న భారత ఏకైక ప్రధాని తమరే, తమరే, తమరే మోడీజీ!
పటేల్ విగ్రహాన్ని ఎందుకు నెలకొల్పాడుమోడీ! అడుగుతున్నారు ప్రజలు! లేకుంటే నాడు ఆరెస్సెస్‌ను నిషేధించిన పటేల్ విగ్రహాన్నెందుకు నెలకొల్పేవాడు? పోనీ పటేల్ పట్ల ప్రత్యేక గౌరవంతో నెలకొల్పాడనే అనుకుందాం! అదే నిజమైతే గుజరాత్‌లోని స్టేడియంకు పటేల్పేరు తొలగించి 'నరేంద్రమోడీ స్టేడియం' అని తన పేరెందుకు పెట్టుకున్నట్లు? అని కూడా చర్చించుకుంటున్నారు ప్రజలు.
స్వాతంత్య్ర సమర వీరునిగా ఏండ్ల తరబడి జైళ్ళలో మగ్గి, భారత తొలి ప్రధాని అయిన నెహ్రూ 32 ప్రభుత్వ రంగ సంస్థల్ని నెలకొల్పి, రిజర్వేషన్లు కల్పించి, సామాజిక సమతుల్యతకు బీజం వేశాడు! హీరాకుడ్, బాక్రానంగల్, నాగార్జున సాగర్ వంటి భారీ ఆనకట్టల ద్వారా వ్యవసాయాభివృద్ధికి - రూర్కెలా, భిలారు వంటి ఉక్కు కర్మాగారాల ద్వారా పారిశ్రామికాభివృద్ధికి దృఢమైన పునాది వేసిన నెహ్రూతో మోడీకి పోటీనా?
'అధికార వాంఛ' ఎంత కర్కశంగా, కృతజ్ఞతారహితంగా వ్యవహరిస్తుందో ప్రతిపక్ష పార్టీలకు, ప్రజలందరికీ మీ చర్యల ద్వారా రుజువు చేస్తున్నారు! గుజరాత్ అల్లర్ల కారణంగా వాజ్‌పేయితో సహా దేశ దేశాల వారి మీ రాజీనామా డిమాండ్ నుండి కాపాడిన అద్వానీని అడ్డుతొలగించుకున్నారు. కాంగ్రెస్ వ్యతిరేక అవినీతి ఉద్యమం ద్వారా అన్నహజరేతో పాటు మీ విజయానికి తోడ్పడిన కేజ్రీవాల్‌ను అడ్డు తొలగించుకునే పనిలో ఉన్నారు. అలాంటి మీరు రాహుల్‌గాంధీ పట్ల తద్భిన్నంగా వ్యవహరిస్తారని అనుకోవటం అవివేకమేననుకుంటున్నారు ప్రజలు.
మన కష్టజీవుల ఓట్లతో గద్దెనెక్కిన మోడీ మనకోసం ఏమి చేయకపోగా మన పెద్దలు కూడ బెట్టిన సంస్థల్ని, బ్యాంకుల్లోని మనడబ్బును కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడు. ఉదాహరణకు గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పాటు 18వేల ఎకరాల భూముల్ని రూ.3వేల చొప్పున ఆదానీకి కట్టబెట్టాడు మోడీ! కార్పొరేట్లకు లక్షల కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేశాడు. వాళ్ళ టాక్యును 23శాతం నుండి 15శాతానికి తగ్గించాడు. ఆలోటు భర్తీ కోసం పిల్లలు తాగేపాలు, పెరుగు, రాసుకునే పుస్తకాలు, పెన్సిల్, రబ్బర్ల మీద సామాన్యులు వాడుకునే లెట్రీ, డీజిల్, గ్యాస్‌లపై భారీగా పన్ను విధించాడు! బీసీనని చెప్పుకుంటూ బడాకార్పొరేట్ల సేవలో తరిస్తున్నాడు మోడీ! అంటూ బావురు మంటున్నారు ప్రజలు! రంగుతో వచ్చిన జట్టు నల్లదనం - ప్రచారంతో వచ్చిన నాయకుని గొప్పతనం ఆట్టే నిలవవు మోడీజీ!
మీ తొమ్మిదేళ్ళ పాలనలో, భారతదేశానికి వివిధ రంగాలలో మీరు సాధించిన అంతర్జాతీయ ర్యాంకులను బట్టి, గత ప్రధానుల కన్నా మీరేపాటి గొప్పవారో మీరే బేరీజు వేసుకోండి మోడీజీ!
- పాతూరి వెంకటేశ్వరరావు
9849081889