Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెత్తనం కేంద్రానిది. లాభాలు ఆశ్రిత పెట్టుబడిదారులవి, కార్పొరేట్ సంస్థలవి. బరువు బాధ్యతలు రాష్ట్రాలవి. భారాలు ప్రజలకు. విద్యుత్ రంగంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, విధానాల పర్యవసానాల సారాంశం ఇది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రాలపై బాధ్యతలు పెరుగుతున్నాయి. వినియోగదారులపై భారాలు పెరుగుతున్నాయి. కేంద్రం ఎటువంటి బాధ్యతను వహించటం లేదు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్రాల విద్యుత్ పంపిణీ కంపెనీలను (డిస్కామ్) గట్టెక్కించే పేరుతో షరతులతో కూడిన పథకాలను కేంద్రం ప్రవేశపెడుతున్నది. డిస్కాముల పేరుకుపోయిన నష్టాలు, అప్పులలో అధిక భాగం రాష్ట్ర ప్రభుత్వాలు భరించటం ఈ పథకాల సారాంశం. ఆర్థిక పునర్నిర్మాణ పథకం, ఉజ్వల్ డిస్కాం ఎస్యూరెన్స్ యోజన (ఉదరు), అందరికి విద్యుత్ వంటి పథకాలను కేంద్రం ప్రతిపాదించింది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి డిస్కాములతో ఒప్పందాలపై సంతకాలు చేయించింది. ఈ పథకాల ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాలు గత ఎనిమిదేళ్ళుగా వేల కోట్ల రూపాయల మేరకు వాటి డిస్కాముల పేరుకుపోయిన నష్టాలను, అప్పులను భరిస్తూ వస్తున్నాయి. 2015 నవంబరు 20న ప్రవేశపెట్టిన ఉదరు పథకం కింద తెలంగాణ ప్రభుత్వం 2022-23 వరకు రూ.15,976.80 కోట్ల మొత్తాన్ని డిస్కామ్‌లకు సమకూర్చింది. ఇందులో రూ.8015.91 కోట్లు గ్రాంటు కాగా, రూ. 7960.89 కోట్లు ఈక్విటీగా చేసిన సర్దుబాటు. ఈ మొత్తాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఏటేటా సమకూర్చుతున్న వేల కోట్ల రూపాయల సబ్సిడీలకు అదనం. 2023-24లో తెలంగాణ ప్రభుత్వం రూ.9124.82 కోట్ల మేరకు సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం టిఎస్‌ఇఆర్‌సి నిర్ధారించిన ట్రూఅప్ (2022-23 వరకు ఏడేళ్ళ కాలానికి) నిమిత్తం రూ.12718.40 కోట్ల మొత్తాన్ని డిస్కామ్‌లకు చెల్లించేందుకు అంగీకరించింది. ఈ భారాల పెరుగుదలకు తన విధానాలు ప్రధాన కారణమైన మోడీ ప్రభుత్వం మాత్రం తానుగా ఇందుకు దమ్మిడీ ఆర్థిక సహాయం చేయటం లేదు. గత ఎనిమిదేళ్ళ మోడీ ప్రభుత్వ కాలంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాల పారుబకాయిలు దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయల మేరకు మాఫీ అయ్యాయి. ఇందులో అత్యధిక భాగం ప్రైవేటు కార్పొరేట్ సంస్థల పారుబకాయిలే. రాష్ట్ర ప్రభుత్వాల డిస్కామ్‌ల రుణాల బకాయిలలో ఈ విధంగా ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు.
షరతులతో... కేంద్రం దోపిడీ!
డిస్కామ్‌లు వాటికి విద్యుత్ సరఫరా చేస్తున్న ఉత్పత్తిదారులకు, ముఖ్యంగా ప్రయివేటు ఉత్పత్తిదారులకు, భారీగా బకాయి పడటంతో కేంద్రం అప్పులు మంజూరు చేయించేందుకు ప్రతిపాదించి, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ గ్యారంటీ ఇచ్చేందుకు షరతు విధించింది. కేంద్రానికి చెందిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుత్ సంస్థలతో అలా మంజూరు చేయించిన రుణాల మొత్తాలను విద్యుత్ ఉత్పత్తిదారులకు నేరుగా ఆ రుణ సంస్థలతో చెల్లింపచేసింది. డిస్కాములకు మంజూరు చేసిన ఆ సంస్థలు ఈ రుణాలపై బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తిదారుల అవసరాలు తీరుతున్నాయి. రుణాలిచ్చిన కేంద్ర ఆర్థిక సంస్థలకు లాభదాయక వడ్డీ వ్యాపారం జరుగుతున్నది. ఇలాంటి పథకాల వల్ల విద్యుత్ ఉత్పత్తిదారులకు డిస్కాముల బకాయిలు కేంద్ర రుణ సంస్థలకు చెల్లించాల్సిన రుణాల బకాయిలుగా మారుతున్నాయి. డిస్కాముల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఇలాంటి ఏర్పాట్లు ఏ మాత్రం దోహదం చేయటం లేదు.
మంత్రివర్గంలో, పార్లమెంటులో, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా ప్రధానమంత్రి మోడీ అంతర్జాతీయ వేదికలపై ఏకపక్షంగా పునరుత్పత్తి విద్యుత్తును (ఆర్.ఇ) దేశం అదనంగా చేర్చే లక్ష్యాలుగా ప్రకటించారు. వాటికి అనుగుణంగా, అవసరం లేని ఆర్.ఇ ని ఆర్పిపిఓ పేరుతో, దాని కింద నిర్ణయించిన మితిమీరిన లక్ష్యాలకు మించి డిస్కాములు కొనుగోలు చేయటం వల్ల నివారించదగిన అదనపు భారాలు వినియోగదారులపై పడుతున్నాయి.
అవసరం లేని ఆర్ఇ కొనుగోలు వల్ల విపరీతంగా మిగులు విద్యుత్ తేలి, వినియోగదారులపై ట్రూఅప్ రూపంలో భారాలు పడుతున్నాయి. వాటిని తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయటం లేదు. మిగులు విద్యుత్తుతో విద్యుత్ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యం నిరుపయోగంగా ఉన్న మేరకు రాష్ట్రాలు పిపిఎల ప్రకారం పొందని విద్యుత్‌కు స్థిర ఛార్జీలను వేల కోట్ల రూపాయల మేరకు చెల్లించాల్సి వస్తున్నది. ఆ భారాలు వినియోగదారులపై పడుతున్నాయి. ఇది ఆందోళనకర అంశమని పేర్కొంటూ, అలా చెల్లిస్తున్న స్థిర ఛార్జీల నిమిత్తం కేంద్రం సహాయం అందించాలని ఫోరం ఫర్ రెగ్యులేటర్స్ సిఫార్సు చేసింది. కేంద్ర ప్రణాళికా నిధులను సమకూర్చుతున్న పద్ధతిలోనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఈ భారాన్ని 60:40 నిష్పత్తిలో భరించాలని ఫోరం సిఫార్సు చేసింది. మోడీ ప్రభుత్వం నుండి దీనిపై చలనం లేదు.
స్వచ్ఛ ఇంధన సుంకాన్ని (సియిఎస్) టన్ను బొగ్గుకు రూ.400 చొప్పున కేంద్రం వసూలు చేస్తున్నది. దీనిని తగ్గించాల్సిన అవసరం ఉందని, పరిసరాల నియమాలను పాటించేందుకయ్యే ఖర్చుల నిమిత్తం సియిఎస్ మొత్తాన్ని విద్యుత్ రంగానికివ్వాలని ఫోరం సిఫార్సు చేసింది. సియిఎస్ను కేంద్రం జిఎస్టిలో చేర్చి వసూలు చేస్తున్నది. బొగ్గు, సహజ వాయువు ధరలను సహేతుకంగా నిర్ణయించాలని, ఇందుకు స్వతంత్ర రెగ్యులేటర్‌ను నియమించాలని ఫోరం సిఫార్సు చేసింది. బొగ్గు రవాణాకు రైల్వే చార్జీలలో కేంద్రం సబ్సిడీ యిచ్చే అంశాన్ని పరిగణించాలని సిఫార్సు చేసింది. కేంద్రం చేసిన కేటాయింపుల మేరకు సహజ వాయువును సరఫరా చేయించక పోవటంతో, ఆ ఇంధనంతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నాయి. అయినా, పిపిఎల నిబంధనల ప్రకారం డిస్కాంలు వాటికి స్థిర ఛార్జీలను చెల్లించాల్సి వస్తున్నది. ఈ స్థిర చార్జీలను చెల్లించేందుకు కేంద్రం డిస్కాంలకు సహాయం అందించాలని ఫోరం సిఫార్సు చేసింది. మోడీ ప్రభుత్వం ఈ సహేతుక సూచనలను పట్టించుకోకుండా యథావిధిగా మొరాయిస్తున్నది. బొగ్గు దిగుమతి చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఆదేశిస్తున్న మోడీ ప్రభుత్వం, అందుకయ్యే అధిక వ్యయ భారాన్ని వినియోగదారులపై తగ్గించేందుకు ఎలాంటి సహాయం చేయటం లేదు.
వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు ముందస్తు చెల్లింపు (ప్రీ పెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయటం, మొత్తం సాంకేతిక, వాణిజ్య (ఎ.టి అండ్ సి) నష్టాలను 12-15 శాతానికి తగ్గించటం, సగటు కాస్ట్ ఆఫ్ సర్వీస్ (ఎసిఎస్) కు, మొత్తం రెవెన్యూ అవసరానికి (ఎఆర్ఆర్)కు మధ్య తేడాను పూర్తిగా తగ్గించి వేయటం రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం లక్ష్యాలు. డిస్కామ్‌లు ఈ పథకాన్ని అమలు చేస్తే, ప్రీ పెయిడ్ మీటర్ల కొనుగోలుకు మీటరుకు రూ. 900 చొప్పున గ్రాంట్‌గా ఇస్తామని కేంద్రం ప్రతిపాదించింది. ప్రీ పెయిడ్ మీటర్ల వల్ల వినియోగదారులకు చేకూరే లాభం ఏమీ లేదు. పైగా వినియోగదారులకు చేతి చమురు వదులుతుంది. మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా విద్యుత్ పంపిణీ రంగంలోకి ప్రవేశించే ప్రైవేటు పెట్టుబడిదారుల పబ్బం గడిపేందుకే ఈ ప్రీ పెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయించేందుకు పై గ్రాంటును కేంద్రం ఎరగా వేసింది. కొనుగోళ్లు అంటే అధికార వర్గాలు ఉబ్బితబ్బిబ్బు అవుతాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కంకణం కట్టుకున్న మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల డిస్కామ్లను నేరుగా ప్రైవేటీకరించే అధికారం తనకు లేకపోవటంతో, ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నది.
సాంకేతిక కారణాలను మినహాయించి, డిస్కాంలు వినియోగదారులకు విద్యుత్తును నిరంతరం సరఫరా చేయటంలో విఫలమైతే జరిమానాలను చెల్లించాలనే దాకా మోడీ ప్రభుత్వం వెళ్ళింది. విద్యుత్ ప్రాజెక్టులకు తాను చేసిన కేటాయింపుల మేరకు బొగ్గు, సహజ వాయువు వంటి ఇంధనాలను సరఫరా చేయించటంలో విఫలమౌతూ, వాటికి కృత్రిమ కొరత సృష్టిస్తూ, వాటి ధరలను సహేతుకంగా నియంత్రించటంలో, తగు రవాణా ఏర్పాట్లు చేయించటంలో విఫలమౌతూ, విద్యుత్ కొరతకు కారణమవుతున్న తన వైఫల్యాలకు మాత్రం మోడీ ప్రభుత్వం ఎలాంటి బాధ్యత, జవాబుదారీతనం వహించటం లేదు. తన విధానాలు, వైఫల్యాల వల్ల డిస్కామ్‌లపై, వినియోగదారులపై పడుతున్న భారాలను తగ్గించేందుకు ఎలాంటి సహాయం అందించటం లేదు
- ఎం. వేణుగోపాలరావు
9441193749