Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాదేది కవితకనర్హం అన్న చందాన రాజకీయ అవధానాలకు అధికార పార్టీల నేతలే తెరతీస్తున్నారు! రాహుల్ గాంధీ 2019లో మోడీ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఒక ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని అవి దేశం మొత్తం ఓబీసీ కులాలను కించపరిచేవిగా ఉన్నాయని, దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అతిపెద్ద జాతీయ పార్టీ. దీనిని తెలంగాణ భాషలో 'బజ్జాతీకి' ఎత్తుకోవడం అంటారు అనగా దొంగే దొంగ దొంగ... అని అరవడం అన్నమాట. రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యం ఆనాటి పరిస్థితులు అవన్నీ ఒక ఎత్తు, వాటిపైన రాజకీయ పార్టీగా ప్రత్యర్థులు దాడి చేయడం షరా మామూలే, అయితే నాలుగేళ్ల తర్వాత గుజరాత్ లోని ఓ కోర్టు రాహుల్ గాంధీని క్రిమినల్ డెఫమేషన్ కేసులో దోషిగా నిర్ధారించడం.. సంబంధించిన విషయాలన్నీ న్యాయ వ్యవస్థ పరిధిలోనివి. కోర్టు తీర్పుని ఇవ్వడం, ఆ వెంటనే బెయిల్ తీసుకోవడం, ఆ తర్వాత స్పీకర్ రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుని చేయడం కూడా న్యాయ ప్రక్రియలోని భాగాలే.
అయితే ఉన్నట్లుండి ఈ ఓబిసికి సంబంధించిన చర్చ ఎందుకు ముందుకు తెచ్చారన్నది ఆసక్తి గొలిపే అంశం. మోడీ అనే పేరుకు సంబంధించిన వ్యాఖ్యలపై మాత్రమే ఆనాడు కేసు వేయడం జరిగింది. ఉన్నఫలంగా సదరు వ్యాఖ్యలను ఓబీసీ కులానికి ఆపాదించడం, వాటిని కులపరమైన దూషణగా భావించడం, దానిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకో జూస్తున్న తీరు మాత్రం జుగుప్సాకరం కాక ఏమవుతుంది? అంతటితో ఆగకుండా ఏప్రిల్ 6 నుండి 14 వరకు దేశవ్యాప్తంగా లక్ష గ్రామాలకు, కోటి కుటుంబాలకు చేరి ఓబీసీలపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను అందరికీ తెలియపరిచే పెద్ద క్యాంపెయిన్ నిర్వహించాలని బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా, ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిజంగా కులపరమైన దూషణో కాదో ఒక విషయమైతే, నాలుగేళ్ల తర్వాత వాటి గురించి ఇలా ప్రస్తావించడం దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగిన సామెతను గుర్తుకు తెస్తుంది! సాక్షాత్తూ మహాత్మా గాంధీని కులం పేరుతో 'బనియా...' అంటూ మంత్రిపదవిలో ఉన్నవారు అన్నప్పుడు ఏ నిప్పూ రాజుకోలేదు! రాజ్యాంగబద్ధమైన పాలన చేసి కుల రహిత సమాజాన్ని నిర్మించండి బాబు అని అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనకు సమర్పిస్తే, కులపరమైన విభజన ద్వారానే ఓట్లు రాబట్టుకునే ప్రజాస్వామ్యాన్ని నిర్మించడంలో నేతలు ఆరితేరుతున్నారు! నిజంగా లక్ష గ్రామాలకు వెళ్లి ఓబిసిల ప్రస్తావన చేస్తే ప్రజలు తిరగబడి కొట్టే ప్రమాదం ఉన్నది సుమా! ఎందుకంటే ఓబీసీల సమస్యలు అత్యంత నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నవి.
ప్రజా బహుళ్యంలోకి వెళ్లే ముందు జనాభా లెక్కల సేకరణలో ఓబీసీల కుల గణన ఎందుకు చేపట్టడం లేదో సదరు పెద్దలు సమాధానం చెప్పాలి? మొత్తం జనాభాలో మూడో వంతుగా ఉన్న ఓబీసీల కుల గణన చేస్తే అసలు బండారం బయటపడుతుంది! కులాల వారిగా ఈ దేశంలో ఎంతెంత వెనుకబాటుతనం ఉన్నది, అది ఏయే ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నది అనే వాస్తవాలు బయటికి వస్తే రాజకీయపరమైన తాకిడి పెరిగే అవకాశం ఉన్నది. అందుచేత కేంద్ర పెద్దలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కోరినప్పటికీ ఓబిసి కుల గణన చేయడానికి సిద్ధంగా లేరు. సంక్షేమ పథకాలను పూర్తిగా తీసివేయాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి కులగణన చేపడితే కష్టమవుతుందని కేంద్రం భావించి ఉండవచ్చు. అంతేకాకుండా లబ్ధిదారుల ఎంపికలోను ఇబ్బందులు ఏర్పడతాయని భావించి ఉండవచ్చు. కానీ దేశ జనాభాకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రభుత్వం దగ్గరనే కాకుండా ప్రజల దగ్గర కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ పరిపాలనాపరంగా ఎదుర్కొనే సత్తా లేనందు వల్లే ఈ కుల గణనకు వెనకడుగు వేస్తున్న సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇలాంటి చిత్తశుద్ధి లేకుండా కేవలం రాహుల్ గాంధీ మిమ్ములను కులం పేరుతో అవమానపరిచాడు అని చెప్పడానికి కోటి కుటుంబాలను కలవబోతున్నారా? ఓబీసీల వెనుకబాటుకు కారణం రాహుల్ గాంధీ దూషణలు కాదు, అనాదిగా నిర్నీతమైన వృత్తులకు మాత్రమే పరిమితం చేసి, అనేక వృత్తులను నిషేధించడం తద్వారా ఏర్పడిన, నెలకొన్న అసమానతల తగ్గింపును ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం శ్రద్ధ పెట్టకపోవడం.
వాస్తవానికి రిజర్వేషన్ల ద్వారా లభించే ఉపాధి రోజురోజుకు తగ్గిపోతుంది అందుబాటులో ఉన్న మొత్తం ఉద్యోగాలలో 10 శాతం కూడా రిజర్వేషన్లు అమలుపరిచే స్థితిలో లేదు. 29 రాష్ట్రాలలో కేవలం ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే. ఈ ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని పాటిస్తున్నవి. అనేక కేంద్ర ప్రభుత్వ రంగాలలో ఓబీసీ రిజర్వేషన్ల ద్వారా ఎంపికలు, ప్రమోషన్లు అస్తవ్యస్తంగా ఉన్నవి. వీటన్నిటిపై సమగ్ర విధానాన్ని ప్రకటించకుండా, ప్రయత్నాలు చేయకుండా రాహుల్ గాంధీ మాటలను మాత్రమే ప్రస్తుతిస్తే సమస్యలు ఎలా తీరుతాయి? దేశం మొత్తం మీద మూడు వేల పైచీలుకు ఉప కులాలు ఓబీసీ వర్గంలో ఉన్నాయని అనేక రిపోర్టుల ద్వారా తెలుస్తుంది. ఓ డజనుకు పైగా ఓ బి సి కులాల, అధికారికంగా డిక్లేర్ చేయబడిన, వృత్తి ''భిక్షాటన''. భిక్షాటనకు వెళ్లిన వారిని ప్రజలు ఎలా చూస్తారో చెప్పనవసరం లేదు. ఇవన్నీ ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా ఉన్నవి. ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ బద్ధత కల్పించిన తర్వాత ఒరిగిన లాభమేంటో, ఎంత మందికి ఉపశమనం కలిగిందో గ్రామాలు తిరిగినప్పుడు వివరిస్తే బాగుంటుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిలో ఎక్కువ మంది ఓబిసిలే. మరి ఈ స్కీమ్ కింద నిధులు దాదాపు ముప్పై శాతం తగ్గించబడ్డాయి. ఇది వారికి అపకారం కాదా? వ్యవసాయ కార్మికుల్లో అత్యధికులు ఓబిసి లే. వీరి ఉపాధి, భద్రత కోసం జాతీయ స్థాయిలో సమగ్ర ప్రణాళిక లేదు. చేతి వృత్తుల కుటుంబాలన్నీ ఓబిసిలే. ఇప్పుడు గ్రామ స్వరాజ్యం గంగల కలిసి చేతి వృత్తుల చేతులిరిగిన మాట వాస్తవం కాదా? ఇళ్ళ పనివారల్లోనూ అత్యధికులు ఓబిసిలే ఉంటారు. ఎందుకంటే సో కాల్డ్ ఇంటి యజమానులు (ఒబిసిలతో సహా) దళితులను ముస్లింలను ఇళ్ళల్లో పనికి తీసుకోవటానికి సుముఖత చూపరని అనేక రిపోర్టులున్నవి. ఎలాగూ నడ్డా, లక్ష్మణ్ కోటి కుటుంబాలను కలుస్తారు కాబట్టీ పనిలో పనిగా ఈ సమస్యలకు పరిష్కారాన్ని కూడా వెతకాలి. అలా కాకుండా, అప్పనంగా పోగైన ఎన్నికల బాండ్ల డబ్బుందిగదా అని కేవలం రాహుల్ వ్యాఖ్యల ప్రచారానికి పరిమితమైతే ఎవ్వరూ హర్షించరు. చివరకు మహిళా బిల్లునెలా మూలకు పడేశారు గనక చట్టసభల్లో ఓబిసిలకేమైనా మేలు చేస్తారేమో చెప్పాలి.
మితవాద ధోరణికి బాగా సహకరించి, రెచ్చగొడితే పరమత అసహనంతో తెగబడి జైలు పాలయ్యే భారీ సైన్యం ఈ ఓబిసిలు. అత్యంత పెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న ఓబీసీలను మచ్చిక జేసుకోవడం ఈరోజు ప్రధాన పార్టీకి అవసరం. అందుచేత నాలుగేళ్ల కింది అంశాన్ని, అందులో ఏ రకమైన బలం లేక పోయినా, దానిద్వారా కులం పేరుతో అందరినీ కలిపి కూడగట్టాలనే కుటిల ప్రయత్నమే ఇది. మోడీ అనే సర్ నేమ్ ఉన్న కులం వేల కులాలలో ఒకటి మాత్రమే తప్ప, మొత్తం ఓబీసీలకు అది ప్రాతినిధ్యం వహించదనే చిన్న సత్యాన్ని ఎలా మిస్సయ్యారు పాపం?!. తెలిసి కూడా క్యాంపెయిన్ బాట దిగుతున్నారు అంటే దురుద్దేశం స్పష్టంగా కనిపిం చడం లేదు? ప్రాంతీయ, కుల, మత, అతి జాతీయ వాదాలన్నీ అభద్రతా, ఆధిపత్య భావజాలపు రుగ్మతలు. ఇందులో బలయ్యేది మాత్రం దీనిని ప్రేరేపించిన వాళ్ళు కాదు అమాయకంగా సహకరించిన వాళ్లు.
- జి. తిరుపతయ్య
9951300016