Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''త్రిపురలో చెలరేగుతున్న హింస హద్దులు దాటుతుంది. వెయ్యికి పైగా హింసాత్మక సంఘటనలు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే నమోదయ్యాయి. బీజేపీ పాలక ప్రభుత్వ మద్దతుదార్లు రాష్ట్రంలో భారీ విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. భారీ సంఖ్యలో గృహాలు, ఆస్తులు ధ్వంసం చేయబడటం లేదా దహనాలకు గురవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజల్ని, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకొని నేరగాళ్లు అనాగరిక దాడులకు పాల్పడుతున్నారని'' సీపీఐ(ఎం)కు చెందిన రాజ్యసభ సభ్యుడు వి.శివదాసన్ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ కర్కు మార్చి 11న రాసిన లేఖలో పేర్కొన్నారు.
భారతీయ జనతాపార్టీ త్రిపుర రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. మార్చి 8వ తేదీన మాణిక్ షా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హౌం మంత్రి అమిత్ షాలు హాజరయ్యారు. అదే రోజు నిరుపేద రిక్షా డ్రైవరైన ఖొవారుకి చెందిన హరిమోహన్ ఘోష్ తన ఇంటికి వచ్చిన సమయానికి తన ఆవుల పాక ధ్వంసమై ఉండడం, తన రెండు ఆవులు మంటల్లో చనిపోవడం, తన రిక్షా కూడా ధ్వంసమై ఉండడం గమనించాడు. ఘోష్ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) కార్యకర్తగా గుర్తించబడిన తరువాత ఆయన ఇంటిని వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను ఇంట్లో లేని సమయంలో మార్చి 8వ తేదీ తెల్లవారుజామున కాషాయ పార్టీకి చెందిన అల్లరిమూక తన ఆవుల పాకను తగులబెట్టింది. సీపీఐ(ఎం) పార్టీ నాయకత్వంలోని వామపక్ష కూటమి, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమాచారం ప్రకారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, ఇన్డైజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ)కూటమి రెండవసారి అధికారాన్ని చేపడుతుందనే ప్రకటన వచ్చిన మార్చి 2వ తేదీ నుండి ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సభ్యులపై వెయ్యికి పైగా దాడులు జరిగాయి. ఎన్నికల అనంతరం జరిగిన హింస ఏ స్థాయిలో జరిగిందంటే, ఆఖరికి నిజనిర్థారణ కమిటీ సభ్యులైన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, ఎంఎల్ఏ లను కూడా విడిచి పెట్టలేదు.
ఒకే ఒక ఎజెండా
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మార్చి 2వ తేదీ నుండి త్రిపుర రాష్ట్ర ప్రజలు రాజకీయ హింసతో మానసికంగా, శారీరకంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో కలిసి పోటీచేసిన వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దతుదారులు, కార్యకర్తలు బీజేపీ చేతిలో నిత్యం దాడులకు గురవుతున్నారు. వారి జీవనాధారంగా ఉన్న వారి ఇండ్లు, దుకాణాలు, ఇతర ఆస్తులన్నింటినీ ధ్వంసం చేశారు. దాదాపు వెయ్యిమందికి పైగా ఇళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వామపక్ష పార్టీలకు లేదా కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారు కాబట్టి వారు ఇంటికి తిరిగి రావాలంటే డబ్బు చెల్లించాలని పాలక బీజేపీ మద్దతుదార్లు ఒత్తిడి చేశారు. స్థానిక బీజేపీ నాయకునికి 50 వేల రూపాయలు చెల్లించిన తరువాత మాత్రమే తాను ఇంటికి రాగలిగానని సెపహిజాలా జిల్లాకు చెందిన ఒక సీపీఐ(ఎం) కార్యకర్త ఫ్రంట్ లైన్తో చెప్పాడు. వారికి డబ్బు చెల్లించడంతో పాటు ఇకముందు ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొననని వారికి ప్రమాణం చేయాల్సి వచ్చిందని ఆ కార్యకర్త చెప్పాడు.
''ప్రతిపక్షాన్ని, ప్రజాస్వామిక కార్యకలాపాలు లేకుండా నాశనం చేయడమే భారతీయ జనతా పార్టీ ఏకైక ఎజెండా. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2018 నుండి ఐదు సంవత్సరాలుగా తన రాజకీయ ప్రత్యర్థుల్లో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తూ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ పుణ్యమా అని కొన్ని నెలలుగా ఈ భయానక వాతావరణం తాత్కాలికంగా లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటువేసి ఓడించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. దాని ఫలితంగానే బీజేపీ ఓట్ల భాగస్వామ్యం భారీగా తగ్గింది. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయిన కారణంగానే బీజేపీ విజయం సాధించింది. మళ్ళీ అధికారం చేపట్టిన తరువాత శాంతి భద్రతల్ని అదుపులో ఉంచే అవకాశం వారి చేతుల్లోకి వచ్చింది. వారికి ఓట్లు తగ్గిన ప్రాంతాల్లో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పార్లమెంటరీ ప్రతినిధుల సందర్శన సందర్భంగా ఈ విషయాలు బహిర్గతమ య్యాయని'' త్రిపుర రాష్ట్ర సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శి జితేంద్ర చౌదరి ఫ్రంట్ లైన్తో అన్నారు.
చౌదరి చెప్పిన దాని ప్రకారం, చెడు ప్రచారం, ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం ఫలితంగా బీజేపీ నుంచి దాడులు చేస్తున్నవారు, దాడులు చేస్తున్నట్లు కనిపించకుండా ఉండే విధంగా, వారి అసలు ఎజెండాను చాలా నేర్పుగా అమలుచేసే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దతుదార్లు, కార్యకర్తలు వెళ్ళి తమ పనులు తాము చేసుకొని, తమ జీవనోపాధి ద్వారా సంపాదించుకోకుండా, తమ దుకాణాలను తెరిచి, వ్యాపారం చేసుకోకుండా బీజేపీకి చెందిన దౌర్జన్యకారులు అడ్డుకుంటున్నారు. వారు ప్రతిపక్షాలకు చెందిన వారిని భౌతికంగా హత్యలు చేయకపోవచ్చు, కానీ వారిని ఆర్థికంగా నాశనం చేస్తున్నారు. మార్చి 16వ తేదీ నాటికి, వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి వ్యతిరేకంగా 2000పైగా కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఏమీ చేయకుండా కేవలం నిలబడి చూస్తున్నారు. బీజేపీవారు చేస్తున్న దాడులను ప్రతిఘటిస్తున్న వారిని మాత్రం అరెస్ట్ చేస్తున్నారని జితేంద్ర చౌదరి చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నప్పటికీ, బీజేపీ విజయం సాధించే విధంగా పథకాలు రచించింది. ప్రతిపక్ష పార్టీల గొంతుకలను అణిచివేయడం ద్వారా ప్రజాస్వామిక క్రమాన్ని బలహీనపరచడానికి పాలకపార్టీ అనుసరించిన బెదిరింపు ధోరణులు, హింసాత్మక చర్యలే ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు గల కారణాల్లో ప్రధానమైనది. ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్టీ కూటమి 2018లో సాధించిన (44సీట్లు) విజయానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు మొత్తం 60సీట్లకు కేవలం 33సీట్లలో మాత్రమే విజయం సాధించింది. త్రిముఖ పోటీ జరిగిన ఫలితంగానే తమకు అనుకూలమైన ఫలితాలొచ్చాయని ఆఖరికి బీజేపీ నాయకులే ఒప్పుకున్నారు. టీఐపీఆర్ఏ కొన్ని గిరిజనేతర నియోజకవర్గా ల్లో ఓట్లు చీల్చి ఉండకపోయి ఉంటే ఐదు నుండి ఆరు స్థానాలను మేం లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి చేతిలో కోల్పోయి ఉండెడివారమని బీజేపీ ప్రతినిధి ఫ్రంట్ లైన్తో చెప్పాడు.
ఈసారి ఎన్నికల అనంతరం జరిగిన హింస స్వభావరీత్యా కొంచెం భిన్నంగా ఉంది. బీజేపీ భౌతికంగా కంటే కూడా ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, కార్యకర్తల జీవనోపాధిని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడిందని వామపక్ష రాజకీయ పరిశీలకుడు, సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ సిన్హా అభిప్రాయపడ్డాడు. మొదటి ఐదు సంవత్సరాల్లో ఎక్కువగా భౌతిక దాడులు చేశారు. ఇరవై ఐదు మంది వామపక్ష పార్టీల కార్యకర్తలు, మద్దతుదార్లు హత్య గావించబడ్డారు. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులే వేల సంఖ్యలో దాడులకు గురయ్యారు. వారి పార్టీల కార్యాలయాల్ని ధ్వంసం చేశారు. ఇండ్లను తగులబెట్టారు. ఈసారి ప్రజల జీవనోపాధిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ఒక వ్యక్తికి రబ్బర్ తోట ఉందనుకోండి, ఆ తోటను ధ్వంసం చేస్తారు, లేకుంటే ఆటోరిక్షా, లేదా దుకాణం, లేదా ఏదైనా చిన్న వ్యాపారం. మీకు ఒకవేళ వ్యవసాయం చేయడానికి (వేరే ఎలాంటి వనరులు లేకుండా)మోటార్ పంపుసెట్టు ఉంటే దాన్ని ఎత్తుకెళ్లి పోతారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు ఇళ్ళవద్దకు రావడానికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్టు అనేకమంది తెలియజేశారు. ఆ విధంగా ప్రజల జీవనోపాధిని పునరుద్ధరించి, మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా భయపెట్టి ప్రజల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్నది.
బీజేపీ పాలనలో ప్రతిపక్షం పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని, సీపీఐ(ఎం) పాలనా కాలంలో ఇప్పుడున్న పరిస్థితి ఏనాడూ లేదని, నాటి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. ప్రస్తుత బీజేపీ పాలనలో ఉన్నంత భయానకమైన పరిస్థితులు సీపీఐ(ఎం) పాలనా కాలంలో లేవని త్రిపుర రాష్ట్ర పీసీసీ కార్యదర్శి హిమాన్షు కర్ ఫ్రంట్ లైన్తో చెప్పాడు. ఆనాడు(సీపీఐ(ఎం) పాలనలో) ప్రతిపక్ష పార్టీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునేది, తన గొంతుకలను వినిపించేది. కానీ ఇప్పుడు ఒక పథకం ప్రకా రం ప్రతిపక్షాల నోళ్ళు పూర్తిగా నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.
కేంద్ర బృందం సందర్శన
హింసాయుత దాడులు ఏ మాత్రం తగ్గకుండా కొనసాగుతున్న పరిస్థితుల్లో వామపక్ష పార్టీల, కాంగ్రెస్ పార్టీల ఎంపీలతో ఏర్పడిన ఒక నిజనిర్ధారణ బృందం రాష్ట్రంలోని ఎంఎల్ఏలు, స్థానిక నాయకులతో కలసి త్రిపుర రాష్ట్రంలో దాడులు జరిగిన ప్రాంతాల్ని సందర్శించారు. ''వారు (బీజేపీ వారు)గ్రామాల్లోకి ప్రవేశించి, ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తల్ని గుర్తించి, వారి ఇళ్ళను ధ్వంసం చేశారు. నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే మీకు కూడా ఇదే గతి పడుతుందని బీజేపీ వారు ఇరుగు పొరుగునున్న వారిని కూడా బెదిరించారు. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంది. కానీ పోలీసులు వారి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా వారు భయపడుతున్నారని'' నిజనిర్థారణ బృందం సభ్యుడు పశ్చిమబెంగాల్ నుండి రాజ్యసభకు ఎన్నికైన బికాస్ రంజన్ భట్టాచార్య ఫ్రంట్ లైన్తో చెప్పాడు.
ఆఖరికి పార్లమెంటరీ బృందాన్ని కూడా వదిలి పెట్టలేదు. సెపాహిజాల జిల్లాలో నీహల్ చంద్రనగర్లో ఈ బృందం దాడికి గురైంది. ఎంపీలను, ఎన్నికైన శాసనసభ్యులనే ఈ విధంగా బెదిరిస్తే, సామాన్య ప్రజానీకం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. బెదిరింపులతో వారు ప్రజల నోళ్ళు నొక్కేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని భట్టాచార్య అభిప్రాయపడ్డారు.
మొదట ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని అనుకున్నప్పటికీ, దీని వలన ఎలాంటి ఉపయోగం ఉండదని భట్టాచార్య భావించారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్యని బీజేపీ అంటుంది కాబట్టి దీనిని పార్లమెంట్లో ప్రస్తావించ లేదు. ఈ భయానక వాతావరణాన్ని ప్రతిఘటించడానికి ప్రజల్ని ఐక్యం చేయడమే ఏకైక పరిష్కారం అని ఆయన అభిప్రాయపడ్డారు.
''త్రిపురలో చెలరేగుతున్న హింస హద్దులు దాటుతుంది. వెయ్యికి పైగా హింసాత్మక సంఘటనలు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే నమోదయ్యాయి. బీజేపీ పాలక ప్రభుత్వ మద్దతుదార్లు రాష్ట్రంలో భారీ విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. భారీ సంఖ్యలో గృహాలు, ఆస్తులు ధ్వంసం చేయబడటం లేదా దహనాలకు గురవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజల్ని, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకొని నేరగాళ్లు అనాగరిక దాడులకు పాల్పడుతున్నారని'' సీపీఐ(ఎం)కు చెందిన రాజ్యసభ సభ్యుడు వి.శివదాసన్ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ కర్కు మార్చి 11న రాసిన లేఖలో పేర్కొన్నారు.
అయినా బీజేపీ ఈ దాడులకు సంబంధించిన ఆరోపణల్ని కొట్టిపారేసింది. ఆ రాష్ట్ర పాలక పార్టీని, త్రిపుర ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి జరుగుతున్న కుట్రగా పేర్కొంది. ''స్థానిక ప్రజలు జరుగుతున్న కుట్రను నిరసించారు. వారు భయానక వాతావరణ ఆరోపణల్ని అంగీకరించలేదు. ఆ ప్రాంతంలో ఎలాంటి రాజకీయ హింసాత్మక ఘటనలు జరిగిన సందర్భాలు లేవని, ఆ ఆరోపణలను తిరస్కరించారు. వామపక్ష- కాంగ్రెస్ పార్టీల నాయకులు దీనిని సహించలేకపోయారని'' త్రిపుర బీజేపీ అధికార ప్రతినిధి నబేందు భట్టాచార్య ఎంపీలపై దాడి జరిగిన తరువాత ఓ పత్రికా ప్రకటన విడుదల చేశాడు.
- సుహ్రిద్ శంకర్ ఛటోపాధ్యాయ
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్,
9848412451