Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఏడాది ఏప్రిల్ 2 అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రోజు ఇది. ప్రపంచవ్యాప్తంగా ఆటిస్టిక్ వ్యక్తుల గురించి అవగాహన పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం ఆదేశించింది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు దీన్ని యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయి. మానవ హక్కులను మెరుగు పరచడం కోసం ఐరాస అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఆటిజం దినోత్సవం ఒక్కటి. ''ఆటిజం అవేర్నెస్ డే'', ''ఆటిజం అవేర్నెస్ మంత్'' అనే పదాలు తరచుగా న్యాయ నిపుణులు ఉపయోగిస్తున్నారు. ఆటిజంపై ఐరాస ఒప్పందాలను అమలు చేస్తామని భారత ప్రభుత్వం కూడా సంతకం పెట్టింది. కానీ ఆ దిశగా కృషి చేయడం లేదు. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆటి జంతో బిడ్డను కలిగి ఉండటం అంత తేలికైన పరిస్థితి కాదు. పిల్ల వాడు అనేక సామాజిక సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా, పిల్లలకు భద్రత, గౌరవం, అవకాశాలను నిర్ధారించడం తల్లిదండ్రులకు కూడా కష్టమవుతుంది.
ఆటిజంను ''ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్'' (ఏఎస్డీ) అని కూడా పిలుస్తారు. ఇది జీవితంలో మొదటి మూడు సంవత్సరాలలో అభివృద్ధి చెందుతుంది. సామాజిక, కమ్యూనికేషన్ సామర్ధ్యాల పరంగా మెదడు సాధారణ అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఇది నాడీ సంబంధిత (నాడీ వ్యవస్థ) పరిస్థితి, దీనిలో మెదడు నాడీ కణాలు సమస్యలను కలిగిస్తాయి. పిల్లలకి 18నెలల వయస్సు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఏదో తప్పును గుర్తిస్తారు. పిల్లవాడు 1 లేదా 2 సంవత్సరాల వయస్సు వరకు సాధారణంగా ఉంటాడు. తరువాత సామాజిక, భాషా నైపుణ్యాలను కోల్పోతారు. లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రమైన వరకు మారుతాయి. ఆటిజం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఆటిజంతో బాధపడే పిల్లలు అందరూ ఒకే రకంగా ఉండరు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో సుమారు 50లక్షల మంది పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ప్రతి 66మంది పిల్లలలో ఒక్కరికి ఆటిజం సమస్య ఈ సమస్య కలిగిన పిల్లల్లో 40శాతం మంది పిల్లలు మాట్లాడలేక పోతున్నారు. ఇది బాలికల కంటే అబ్బాయిల్లో 40శాతం ఎక్కువగా నిర్ధారణ అవుతుందనీ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నవి. 2016 విక లాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ఆటిజంను కూడా అంగవైకల్యంగా గుర్తించింది. కానీ నేటికీ వారికి వైకాల్య ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. నేషనల్ ట్రస్ట్ ద్వారా ఆటిజం, సెరి బ్రల్ పాల్సి, మానసిక వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ట్రస్ట్‌కు ఛైర్మన్‌ను నియమించకుండా కాల యాపన చేస్తోంది. రూ.100కోట్ల కార్పస్ ఫండ్‌తో నేషనల్ ట్రస్ట్ ఉన్నా అది ఎవ్వరికి ఉపయోగపడటం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 5లక్షల మంది పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు. వీరి గురించి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో స్వచ్చంద సంస్థలు, ప్రయి వేటు సంస్థలు ఆటిజం సమస్యపై ప్రత్యేక కేంద్రాలను నడుపుతున్నవి. రాష్ట్ర వ్యాపితంగా వందలాది ప్రయివేటు క్లీనిక్స్ నడుస్తున్నవి. ఆర్థిక స్థోమత లేనటువంటి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రయివేటు క్లీనిక్స్ విచ్చలవిడిగా నెలకు రూ.15వేల నుండి 50వేలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రయివేటు క్లీనిక్స్‌పై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండవలసిన అవసరం ఉంది. సికింద్రాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ మెంటల్లి హ్యాండిక్యాపడ్(ఎన్ఐఎంహెచ్) ఉంది.కానీ అక్కడ సరిపడా సిబ్బంది లేరు. పరికరాలూ అంతకన్నా లేవు. 33జిల్లాల నుండి ట్రీట్మెంట్ కోసం చంటి పిల్లలతో హైదరాబాద్‌కు రావడం చాలా కష్టం. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మూడేండ్ల వయస్సు కలిగిన పిల్లలకు ఆటిజం పరీక్షలు నిర్వహించి, వారికోసం ప్రభుత్వం ఉచితంగా థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.ఆటిజం సమస్య కలిగిన పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆటిజం స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలి. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రు ల్లోనూ, సమాజంలో ఆటిజంపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
(నేడు అంతర్జాతీయ ఆటిజం డే)
- ఎం. అడివయ్య
9490098713