Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో పరవళ్లు తొక్కి పచ్చని పంటలతో, జలచరాలతో, స్వచ్ఛమైన గాలి, వాతావరణంలో కళకళలాడిన మూసీ నది పరివాహక ప్రాంతాలు నేడు శవాకారాలు అవుతున్నాయి. ఆనాడు ఈ నీటితో చక్కటి పాడి పంటలతో పాటు అందులో సమృద్ధిగా విలసిల్లాయి. అయితే అది గతం. ప్రస్తుతం దీని పరీవాహక గ్రామాల్లో ఇప్పుడు ముక్కుపుటాలదిరే దుర్గంధం దుర్వాసనలు. గతంలో పంట పొలాలకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతాల్లో నేడు కాలుష్యపు నీటి కారణంగా వరి పంట దిగుబడి తగ్గిపోయింది. ఆ పండిన పంట సైతం రంగు మారి, తాలు (ఊక) రూపంలో బరువు తక్కువగా పండుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పండించిన వరి పంటకు సైతం సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ కారణంగా ఇక్కడ బడా భూస్వాములంతా పశుగ్రాసం కోసం వినియోగించే పచ్చిగడ్డి సాగుకు, గడ్డి వ్యాపారులకు అప్పగించి సాగు చేయిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు మాత్రం తమ పొలాల్లో వరి పండించుకుని అదే ఆహారంగా తింటున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉద్భవించిన మూసీ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ మహానగరం మీదుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి, ఘట్కేసర్ మండలాల్లోని పీర్జాదిగూడ, పర్వతాపూర్, కాచివానిసింగారం, ప్రతాపసింగారం, కొర్రెముల, వెంకటపూర్ ఎదులాబాద్ తదితర ప్రాంతాల గుండా ప్రవహిస్తూ యాదాద్రి, నల్గొండ జిల్లాల మీదుగా కృష్ణానదిలో విలీనమవుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూ వందలాది కెమికల్ కంపెనీలు నెలకొనడం, వ్యర్థాలన్నీ కాలువలు, పైప్ లైన్లు, మరి కొన్ని ట్యాంకర్ల ద్వారా వాటి నుంచి వెలువడతున్న విషపూరిత రసాయనాలు మూసీలోకి నేరుగా కలిపేస్తుండడంతో దాని పరీవాహక ప్రాంతాల ప్రజల జీవనం, ఆరోగ్యం ప్రమాదంలోకి నెట్టబడుతోంది. ఈ విష రసాయనాలు, ఇతర వ్యర్థాలతో మూసీనది కూపంగా, విషపూరితంగా మురికిగా మారుతుండడంతో పరీవాహక గ్రామాల ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందని పర్యావరణ వేత్తలు, పరిశోధకులు, వైద్య నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న కాలుష్యంతో ఇక్కడి ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతోందని, చర్మ శ్వాసకోశ తదితర వ్యాధులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ నీటిలో మూడు తుల్యమైన పలు రకాల రసాయన పదార్థాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే విష రసాయనాల వల్ల జ్ఞాపకశక్తి సైతం తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన నడుం బిగిస్తేనే రాబోయే తరాలకు మేలు చేసినవారవుతారు. లేదంటే భవిష్యత్తు తరాలు అంథకారమే.
- హనుము, 8519836308.