Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజా జీవితాలకు - రాజకీయాలకు మౌలిక సంబంధం ఉన్నదనే విషయం చాలా సందర్భాల్లో విస్మరణకు గురవుతుంది. ముఖ్యంగా కళారంగంలో...
'నాటు నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందని పొంగిపోవడం లేదని సంగీతదర్శకులు కీరవాణి అంటే, 'అద్భుతం లాంటి నిజం' అని రచయిత చంద్రబోస్ సంబరపడిపోయారు. 'బలంగం', రంగమార్తాండ' వంటి చిత్రాల్లో భావద్వేగాలే ప్రధాన భూమిక పోషించాయనే విషయం తెలిసిందే. అయితే వాటి ప్రాధాన్యతను తక్కువ చేయడంలేదు. కానీ అదే సందర్భంలో భావోద్వేగాలకు - జీవితంలోని సుఖదుఃఖాలకు తెరవెనుక నడిచే రాజకీయాలే కారణభూతమనే విషయాన్ని కాదనలేం. అందుకే లెనిన్ మహాశయుడు అంటాడు... మీరు రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోతే రాజకీయాలే మీ జీవితాల్లో చివరకు జోక్యం చేసుకుంటాయని.
రాజకీయాలను - కళారంగాన్ని తన జీవితకాలం పర్యంతం అనుసంధానించిన వాడు కామ్రేడ్ సఫ్దర్ హష్మి. 1954 ఏప్రిల్ 12వ తేదీన జన్మించిన హష్మి, 1989 జనవరి 1న ఢిల్లీకి సమీపాన ఘజియాబాద్ కార్మికవాడల్లో 'హల్లాబోల్' నాటిక ప్రదర్శిస్తుండగా కాంగ్రెస్ కిరాయి గూండాల చేతిలో అమానుషంగా హత్యగావించబడిన విషయం విదితమే. స్వానుభవంతో తాను రూపొందించిన ఆధునిక వీధినాటిక ప్రక్రియను ఆ విధంగా పోరాటాయుధంగా మలచి పీడిత ప్రజలకు అందించాడు. సమకాలీన ప్రజా కళాకారులకు అలా తిరుగులేని మార్గదర్శకుడయ్యాడు.
అక్రమాలు, దోపిడీ, అణచివేత తీవ్రమవుతున్న కొద్దీ ప్రజా ఉద్యమాలు పెల్లుబుకుతూనే ఉంటాయి. ఈ పెల్లుబికే ప్రజా ఉద్యమాల్లో రంగస్థలాన్ని (థియేటర్‌ను) చైతన్యవంతంగా మమేకం చేయడం, అదీ ఓ రాజకీయ కర్తవ్యంగా గుర్తెరిగి దీక్షగా చేయడం సాధారణమైన పనికాదు, ప్రాపంచిక దృక్పథం, కళానైపుణ్యం, స్థానిక ప్రజల సాంస్కృతిక స్థాయి, అన్నింటిని గమనంలోకి తీసుకుని సందర్భోచిత చాకచక్యంతో పనిచేసినప్పుడు మాత్రమే వీధినాటికను శక్తివంతంగా ఉద్యమాల్లో మమేకం చేయగలం. ఇది కత్తిమీద సాములాంటి కష్టసాధ్యమైన పని అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
హష్మి వీటన్నిటా నిర్మాణాత్మకంగా కృషి చేశాడు గనుకనే అందరికంటే ఓ మెట్టు పైస్థాయిలో ఉన్నాడు. కళకు తప్పనిసరిగా ఓ సామాజిక ప్రయోజనం ఉన్నదని నమ్ముతూ, వీధుల్లో ప్రదర్శించే ప్రతికళను (రంగస్థలంను) ప్రజా కళగా హష్మి భావించలేదు.
ఎక్కడబడితే అక్కడ, ఎలా బడితే అలా, అలరించే కళలు పుంఖాను పుంఖాలుగా ఉంటాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి. కానీ వీటిల్లో ఆలోజింపచేసేవి ఎన్ని? కదిలించేవి ఎన్ని? ప్రజలను ఉద్యమబాటన నడిపించేవి ఎన్ని? ఉరకలతో పరుగులెత్తించేవి ఎన్ని? ఇవన్నీ ప్రజా కళాకారులు ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాల్సిందే. నిత్యవిద్యార్థిలా తమని తాము సరిదిద్దుకోవాల్సిందే.
ఒక పక్క నిరంతరం మారుతున్న రాజకీయాలను అధ్యయనం చేయాలి. మరో పక్క కళారంగంలో వస్తున్న నూతన పోకడల్లో సానుకూలమైన వాటిని అధ్యయనం చేయాలి. ప్రజాకళాకారులు ఈ జోడుగుర్రాల స్వారీ అధ్యయనాన్ని ఆపకుండా నిత్యం కొనసాగించాలని హష్మి నొక్కి చెబుతాడు. ఒకటి ముందుకు పోతే రాజకీయవాదిగాను, మరొకటి ముందుకుపోతే కేవలం కళాకారునిగాను మిగిలిపోయే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తాడు. రాజకీయ చైతన్యాన్ని అత్యున్నత చైతన్యంగా హష్మి భావిస్తాడు. తమను ఎవరు ఎలా పాలిస్తున్నారో కచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి. అక్రమాలని ప్రశ్నించాలి. హక్కుల్ని సాధించుకోవాలి. అదీ సమిష్టి ఉద్యమాల ద్వారా, సమరశీల పోరాటాలు ద్వారా. మనప్రజాస్వామ్య జీవన గమనంలోనే ఈ చారిత్రక సత్యం ఇమిడి ఉన్నది. దీనిని విస్మరిస్తే ఎలా..? ప్రజా రాజకీయాలు అంటే ఇవిగాక మరేమిటి?' అని అడుగుతాడు.
'వీధి నాటిక ప్రక్రియ' ఒక వార్తా పత్రికను దృశ్యమాన రూపంలో నడిపించడం వంటిది. సమకాలీన అంశాలమీద, రోజువారీ పరిణామాల మీద, వార్తా పత్రికలకు ఏది మంచి? ఏది చెడు? అన్న వివేచన కలిగించేలా వార్తలు ఇస్తాయో... వీధినాటిక దృశ్యమానరూపంలో ఆపని చేయగలగాలి. వీధినాటికను కేవలం ప్రచారాందోళన సాధనంగా పరిమిత దృష్టితో చూడకూడదు. సాంస్కృతికంగా వెనుకబడి ఉన్న కార్మికులకు కష్టజీవులకు ఆ భర్తీ చేయగల సాధనంగా వీధినాటిక ప్రక్రియను మలచాలి' అని దిశానిర్దేశం చేశాడు హష్మి. అంటే ఆధునిక వీధినాటిక సిద్ధాంత రూపకర్త హష్మీ అని చెప్పక తప్పదు.
1978లో ఆనాటి కార్మికవర్గం సమస్యలపై 'మిషన్' వీధినాటికను తన జనమ్ బృందంచే ప్రదర్శింపజేసాడు హష్మి. అనూహ్య ఆదరణ లభించింది. ఏమిటిది? ఎందుకిలా సాధ్యపడింది? బృందంలోని ప్రతి ఒక్కరిలో అదే మధనం. ఏ హంగులూ లేవు. ఆహార్యం, తెరల ఆర్భాటాలు కానరావు, పట్టపగలు నడిరోడ్డుపై ప్రదర్శన. అప్పుడు అర్థమయింది... విషయం వారిదైతే (ప్రేక్షకులదైతే) ఓ ప్రధాన సమస్యను వారు ఎదుర్కొంటుంటే, దానినే ఇతివృత్తంగా తీసుకుంటే చాలా తేలికగా ఆ కళారూపానికి ఆ ప్రజానీకం ఆకర్షితమవుతుందని. వారి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది. 'ఈ ప్రాతిపదికపైనే వీధినాటిక స్వభావాన్ని మనం పసిగట్టాలి. అవసరమైన కొత్త వ్యాకరణం (గ్రామర్) కనిపెట్టాలి' అనే నిర్ణయానికి హష్మి రావడం, ముసాయిదాను రూపొందించి ప్రతిపాదించడం అన్ని వెన్వంటనే జరిగిపోయాయి. ఈ వీధినాటిక సిద్ధాంత పత్రం చిన్నదే గావచ్చు. కానీ అది భావోద్వేగ పరంగానే కాదు హేతుబద్దంగా కూడా ఉంటుందని హష్మి సహచరుడు సుధన్వాదేశ్ పాండే తను రచించిన 'హల్లాబోల్' గ్రంథంలో పేర్కొంటాడు.
హష్మి నాటకాలు 'హల్లా బోల్', 'చక్కాజామ్', 'ఔరత్', 'గావ్ సే షెహర్ తక్', 'మత్ బాటో ఇన్సాన్ కో' మొదలైనవన్ని ఇదే వ్యాకరణంతో కష్టజీవుల ఇతివృత్తాలతో సాగుతాయి. పాలకుల రాజకీయ విధానాల కారణాన ఆ జీవితాలు ఎలా ఆటుపోట్లకు లోనవుతున్నాయో తెలుపుతూ, సంఘటితంగా పోరాడి సమస్యను పరిష్కరించు కోవాల్సిన సత్యాన్ని చాటుతాయి.
అయితే ఈ చెప్పే పద్ధతి కేవలం నినాదప్రాయంగా ఉంటే ఆ కళారూపం ఆందోళనారూపంగానే ఆగిపోతుంది. కళాత్మకంగా చెప్పగలిగినప్పుడు మాత్రమే అది ప్రజల్ని కదిలించగలదు. ప్రజల హృదయాలను హత్తుకుని కదిలించేలా రసాత్మకంగా చెప్పగలిగామా లేదా అన్నది ప్రజాకళాకారులకు ఎప్పుడూ పరీక్షే.
ఇక్కడే కళాకారుల ప్రతిభ, కౌశల్యం, నైపుణ్యం తప్పనిసరి. ఇది సాధన ద్వారానే వస్తుందని హష్మికి స్పష్టంగా తెలుసుగనుకనే నిత్యం రాజకీయ అవగాహనతో కూడిన కళాకారుల వర్క్‌షాపుల్లో, శిక్షణా శిబిరాల్లో ఓ బోధకుడిగా మునిగితేలేవాడు. అందుకే హష్మి వీధినాటిక ప్రక్రియ రాజకీయ రంగస్థలంగా (పొలిటికల్ థియేటర్) గణతికెక్కింది. ప్రజా కళాకారులకు ఇది శిరోధార్యం.
- కె శాంతారావు
9959745723