Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ రాజధాని నుదుట చెరగని నెత్తుటితిలకం హష్మి! భావిస్వర బాస్వరాన్ని మండించే సూర్యరశ్మి హష్మి!! వీధినాటికలతో పాలకుల వైఫల్యాల్ని ఎలుగెత్తిచాటిన కళాకారుడు హష్మి. ప్రజాకళలకే జీవితం అంకితం చేసిన నాయకుడు హష్మీ. చివరకు ఆ కళాప్రాంగణంలోనే ప్రభుత్వ కిరాయిగుండాల చేతిలో హత్యకు గురైన చిరస్మరణీ యుడు. ఆయన గురించి తెలుసుకునే ముందు ఒక్కమాట. పీవీ నరసింహారావు హయాంలో ప్రారంభించబడిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష కార్మిక సంఘాలు నిర్వహించిన మొదటి సార్వత్రిక సమ్మె సందర్భంగా నిర్వహించిన ''అప్పా-అమ్మకమా'' వీధి నాటకం తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇవ్వ బడింది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సింగరేణి ప్రాంతంలో ఇచ్చిన ప్రదర్శనల్లో ప్రజానాట్యమండలి కళాకారులు సఫ్దర్ హష్మిని స్మరించు కుంటూ పాడే గీతంలోని చరణం, ఆనాటికలో నటులుగా ఉన్న నాకు, ఉద్యమ సహచరుడైన ముత్యంరావు లాంటి వాళ్లకు హష్మీ గురించి అంతగా తెలియదు. కానీ ఆయన రూపొందించిన వీధి నాటికలతో ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఆయనొక వీధి నాటిక అధునిక రూపకర్త. ప్రజల్లో చైతన్యం నింపిన ఉద్యమకర్త.
హష్మి 1954 ఏప్రిల్ 12న హనీఫ్- క్వామర్ ఆజాద్ హష్మిలకు ఢిల్లీలో జన్మించారు. అక్కడే తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రుడయ్యాడు. ఢిల్లీ విశ్వ విద్యా లయం నుండి ఆంగ్లంలో ఎం.ఎ. పూర్తి చేశారు. ఆ సమయంలో హష్మీ ఎస్ఎఫ్ఐ సాంస్కృతిక విభాగంతో సంబంధం ఏర్పరచుకున్నారు. 1977 బీహార్‌లో దళిత వ్యవసాయ కూలీలను కాల్చిచంపిన భయంకరమైన సంఘటన ఆధారంగా ఈ సంఘం మొదటి వీధి నాటకం ''బెల్చి'' మొదటి ప్రదర్శన 1978లో జరిగింది. మొత్తం 2500 ప్రదర్శనలు జరిగాయి. 1978లో మెషిన్ వీధి నాటికతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లారు. 20 నవంబర్ 1978న రెండు లక్షల మంది కార్మికులతో కూడిన ట్రేడ్ యూనియన్ సమావేశంలో ప్రదర్శించ బడింది. బెల్చి, ది మెషిన్ మధ్య అద్భుతమైన సారూప్యతలు ఉన్నాయి. రెండు నాటకాలు ఒకే సంవత్సరంలో నిర్మించబడ్డాయి. రెండూ వాస్తవ హత్యలపై ఆధారపడి ఉన్నాయి. మిషన్ పారిశ్రామిక శ్రామికవర్గం, బెల్చి గ్రామీణ శ్రామికవర్గం రెండూ నాటక పరంగా కొత్త శైలి నాట కాలు. ఎమర్జెన్సీ స్పందన రెండింటిలోనూ వినిపించింది. రెండూ త్వరగా అనువదించబడ్డాయి. దేశవ్యాప్తంగా ఆడబడ్డాయి. బెల్చి సాహిత్యం సి.జి. కృష్ణస్వామి రాశారు. దళిత కవి సిద్దలింగయ్య పాటలు రాశారు. మురికివాడల్లో పెద్ద ఎత్తున ప్రదర్శించారు. దాని నటీనటులు కూడా మురికివాడల నుండి తీసుకోబడ్డారు. 1977లో ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత చిన్న రైతుల కష్టాలు (గావ్ సే షహర్ తక్), మతాధికారుల ఫాసిజం (హత్యారే, అపరాన్ భైచారే కే), నిరు ద్యోగం (టీన్ కోటి), మహిళలపై హింస (ఔరత్), ద్రవ్యోల్బణం (డిటిసి కి దంధ్లీ)పై నాటకాలు ప్రదర్శించబడ్డాయి. హష్మీ దూరదర్శన్ కోసం అనేక డాక్యుమెంటరీలు, టీవీ సీరియల్‌ని నిర్మించారు, ఇందులో ఖిల్తి కలియన్ (పూలు మొగ్గలు) గ్రామీణ సాధికారతను పరిశీలించారు. అతను పిల్లల కోసం పుస్తకాలు కూడా రాశారు. భారత ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికలలో రిగ్గింగ్ చేశారని ఆరోపించ బడినప్పుడు ''కుర్చీ, కుర్చీ, కుర్చీ'' అనే వీధి నాటకాన్ని నిర్మిం చారు. రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా ఉన్న న్యూ ఢిల్లీలోని బోట్ క్లబ్ లాన్స్‌లో ఈ నాటకం వారం రోజుల పాటు ప్రతిరోజు ప్రదర్శించబడింది. ఇది జన నాట్య మంచ్ (జెఎన్ఎమ్)కు కీలక మలుపు.
80వ దశకం చివరలో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మిక ఆందోళనలు, సమ్మెలు పెద్దఎత్తున జరిగాయి. 1941లో ఢిల్లీ జనాభా కేవలం 9లక్షలకు పైగా ఉండేది. అది తర్వాత యాభై ఏండ్లలో పది రెట్లు పెరిగి 1991లో 94లక్షలకు చేరుకుంది. ఈ యాభై ఏండ్లలో, విభజన సమయంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు ఢిల్లీ వైపు వచ్చారు. తరువాత సంవత్సరాలలో ఎక్కువ మంది గ్రామీణ వలస కూలీలు చేరారు. క్రమంగా ఢిల్లీ పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. 1988 నవంబర్ 22 నుండి 28 వరకు ఘజియాబాద్, ఫరీదాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో 13లక్షల మంది కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చారిత్రాత్మకమైన ఏడురోజుల సమ్మె చేశారు. సమ్మె జయప్రదానికి జన నాట్య మంచ్ నిర్వహించిన ''చక్కా జామ్/ హాల్లా బోల్'' వీధి నాటిక అత్యంత ప్రభావం చూపింది. రచన కార్మికల గుండెను తట్టి లేపింది. నవంబర్ 2 నుండి నవంబర్ 21 వరకు 16 రోజులలో సమ్మె జయప్రదం కోసం 27ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రదర్శనలు కార్మిక నివాసాలు, పారిశ్రామిక ప్రాంతాలలో నిర్వహించారు. 18వేల నుంచి 19వేల మంది కార్మికులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె జయప్రదం కోసం 6లక్షల 80 వేల కరపత్రాలు, 40 వేల పోస్టర్లు, వెయ్యికి పైగా వీధి సమావేశాలు నిర్వహించబడ్డాయి. కార్మికుల నివాసాలలో ప్రతీ మూలకు ప్రచారం చేరుకుంది. 1989 జనవరి 1న ఘజియాబాద్ జండాపూర్లో ''హల్లా బోల్'' వీధినాటిక ప్రదర్శిస్తున్నప్పుడు అక్కడి ఇండిస్టియల్ ఏరియా పారిశ్రామిక వేత్తల తొత్తులు, కాంగ్రెస్ గుండాలు దాడిచేశారు. జనవరి 2న రామ్మనోహర్ లోహియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. సఫ్దర్ హష్మి జీవిత భాగస్వామి, సహనటి అయినా కామ్రేడ్ మలాయశ్రీ జనవరి 4న ఎక్కడైతే సఫ్దర్ హష్మీ, తోటి కళాకారులపై దాడి జరిగి, హల్లా బోల్ వీధి నాటిక నిలిపివేయబడిందో అదే స్థలంలో మిగిలిపోయిన నాటిక భాగాన్ని ప్రదర్శించి యజమాను లకు వారి గుండాలకు సవాల్ విసిరారు. కార్మికవర్గానికి మనోధైర్యం కల్పించారు. దేశంలో హష్మీ చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలోనూ ఉద్యమించడం కార్మికవర్గం ముందున్న ఏకైక మార్గం.
- గీట్ల ముకుందరెడ్డి
9490098857