Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జలియన్ వాలాబాగ్ మారణ కాండకు వందేళ్లు దాటాయి. బ్రిటిషు పాలన పోయి భారతీయుల పాలన వచ్చి 75సంవత్సరములు ముగిసింది. బీజేపీ ''అమృతకాలం''లో ప్రవేశించాం. ఈ 75సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రని తులనాత్మకంగా వర్గదృష్టితో పరిశీలిస్తే బ్రిటిషు సామ్రాజ్యవాదుల పాలనకు, నేటి పెట్టుబడిదారీ భూస్వామ్య పాలనకు పదే పదే పోలికలు కనపడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం తీవ్రమైనప్పుడు, అది రాజకీయాలలో ప్రతిఫలించేకొద్దీ నిర్భంధం, నిరంకుశత్వం పెచ్చరిల్లుతాయి. సాధారణ పార్లమెంటరీ ప్రజాస్వామ్య హక్కులను కూడా సహించలేని అసహన ఆలోచనలకు పాలకవర్గాలు నెట్టబడుతూ ఉంటాయి. ఇది ప్రస్తుత బీజేపీ కేంద్ర పాలనలో మరింత తేటతెల్లమవుతున్న సత్యం. నిజానికి గతంలో కాంగ్రెస్ తన ఏకఛత్ర పాలనకు ముప్పువచ్చినప్పుడు 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించారు. అనేక నల్లచట్టాలు అమలులోకి వచ్చాయి. మరి 2014లో ప్రారంభమైన బీజేపీ పాలన మరింత క్రూరంగా, అమానుషంగా తయారైంది. తమకి, తమ నాయకులకు ముప్పు వచ్చినప్పుడు మాత్రమే బూర్జువా ప్రతిపక్ష పార్టీలు నిర్భంధంపై మాట్లాడు తున్నాయి. అధికారంలో ఉన్న బూర్జువా పార్టీలు ఈ విషయంలో దాదాపుగా ఒకే రకంగా ప్రవర్తించడం అనేక రాష్ట్రాలలో ఈ రోజు మనం చూస్తున్నాం. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం అప్రజాస్వామికంగాను, అభివృద్ధి నిరోధకంగానూ చిత్రించడం సర్వసాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలో జలియన్ వాలాబాగ్ మారణ హౌమాన్ని, అందుకు కారణాలను, తదనంతర పరిస్థితిని, వీటన్నింటిలో నాటి, నేటి భారత బూర్జువా, భూస్వామ్య వర్గాల ప్రతినిధుల పాలన గురించి చర్చించుకుందాం.
జలియన్ వాలాబాగ్ ఘోరకలి
అది 1919 ఏప్రిల్ 13వ తేదీ. నాటి పంజాబ్‌లోని ప్రముఖ నగరమైన అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ మైదానంలో 20 వేల మందితో గాంధీజీ ఇచ్చిన పిలుపును అందుకొని శాంతియుతంగా సభ మొదలైంది. ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూ లను ముందురోజే అరెస్టు చేసి దూర ప్రాంతాలకు తరలించేశారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. అందుకోసమే కాసుకు కూర్చున్న బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ 90మంది పోలీసులతో వచ్చి ఆ స్థలానికున్న ఏకైక ద్వారాన్ని మూసివేసి 1650 బుల్లెట్లు కురిపించాడు. 1200మంది చనిపోవడం, వేలమంది తీవ్రంగా గాయపడటం జరిగింది. ఎందుకు ఇంత భయానకమైన నిర్ణయానికి డయ్యర్ వెళ్లాడు? వాస్తవానికి డయ్యర్ ఒక్కడిదే ఈ నిర్ణయం కాదు. నాటి జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు తీసుకువచ్చిన అనేక ఘటనలు బ్రిటిషు పాలకులను ఉక్కిరి బిక్కిరి చేశాయి. అందులో ముఖ్యమైనది ప్రపంచవ్యాపితంగా వలస వాదానికి వ్యతిరేకంగా పెల్లుబికిన విముక్తి పోరాటాలు. వాటి మధ్య సంఘీభావం, సారూప్యత. ఈ క్రమంలోనే మన దేశంలోనే కాక కెనడా, జర్మనీ, సింగపూర్, ఇంగ్లండ్ వంటి దేశాలలో భారతీయ విప్లవ గ్రూపులు పుట్టుకు వచ్చాయి. 1914 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. జర్మన్ రాజధాని బెర్లిన్‌లో ఎయిడ్ ఇండియా కమిటీ స్థాపించబడింది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాత్కాలిక విప్లవ ప్రభుత్వం 1915లో పురుడు పోసుకుంది. శాన్ఫ్రాన్సిస్కోలో గదర్ (విప్లవ) పార్టీ 1913లో ఏర్పడింది. దేశంలో కూడా కార్మికవర్గ పోరాటాలు ప్రారంభ మయ్యాయి. కార్మికోద్యమం 'సంఘటిత దశ'లోకి ప్రవేశించింది. వీటన్నింటికీ తలమానికంగా యావత్తు పెట్టుబడిదారీ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ 1917లో సాగిన రష్యన్ కార్మికవర్గ మహా విప్లవం. ఈ రష్యన్ విప్లవ ప్రభావం స్వాతంత్య్రోద్యమం మీద, ముఖ్యంగా కార్మికవర్గ నాయకుల మీద పడుతున్నది. ఇది అత్యంత ప్రమాదకరమని బ్రిటీషు ప్రభుత్వం భావించింది.
మొదటి ప్రపంచ యుద్ధంలో విజయం సాధించినప్పటికీ ఇంగ్లండు ఆర్ధికంగా తీవ్రమైన సంక్షోభంలోకి కూరుకుపోయింది. యుద్ధం జరిగేటప్పుడు కాంగ్రెస్ నుండి విడివడి హౌమ్రూల్ సంస్థ ప్రారంభించిన అనీబిసెంట్, బాలగంగాధర తిలక్‌లు యుద్ధానికి భారతీయులను సైనికులుగా పంపిస్తామని, తమకు కనీసం కెనడా, ఆస్ట్రేలియాలో మాదిరిగా ఏదో ఒకస్థాయిలో స్వపరిపాలనకు అవకాశం కలుగజేయమని విన్నవించారు. కాని యుద్ధానంతరం బ్రిటిషు ప్రభుత్వం ఒక పక్క కొన్ని పాలనా సంస్కరణలు (1919 ఇండియన్ యాక్ట్) ప్రకటిస్తూనే మరో ప్రక్క స్వాతంత్య్రోద్యమంపై తీవ్ర నిర్భంధాన్ని ప్రారంభించింది. అందుకు అనుగుణంగా 1919లో రౌలట్ చట్టం ప్రవేశపెట్టారు. భారత దేశంలో విప్లవోద్యమానికి సంబంధించిన ''నేరపూరితమైన కుట్రల'' యొక్క స్వభావాన్ని, విస్తృతిని పరిశోధించి నివేదించడం అనే కర్తవ్యం ఈ రౌలట్ చట్టంలోని సారాంశం. దీనిపై పంజాబ్‌లో ముఖ్యంగా అమృత్సర్, పక్కనే ఉన్న లాహౌర్ నగరాలలో ప్రజలు వేల సంఖ్యలో నిరసన కార్యక్రమాలకు దిగారు. పరిస్థితిని అర్థం చేసుకున్న గాంధీజీ సత్యాగ్రహ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏప్రిల్ నెలలో ఒకరోజు సమ్మెకు కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. బ్రిటిషు ప్రభుత్వం అగ్గిమీద గుగ్గిలమైంది. గాంధీజీని పంజాబ్ వెళ్లరాదని, వెళితే అరెస్టు చేస్తామని ఆర్డర్లు విడుదల అయ్యాయి. పంజాబ్ ఉన్నతాధికారి జనరల్ డయ్యర్ గాంధీజీని బర్మాకి పంపాలని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సత్యపాల్, కిచ్లూ లను నిర్భందించి అజ్ఞాత ప్రదేశానికి తరలించడం పెద్ద అలజడి లేపింది. రౌలట్ చట్టం పుణ్యమా అని పంజాబ్ ప్రాంతం అగ్నిగుండంగా మారింది. దీంతో రెచ్చిపోయిన డయ్యర్ ఉద్దేశపూర్వకంగానే ''పంజాబ్‌కే గాదు యావత్ దేశానికే హెచ్చరిక చేయడానికే అన్నట్లు...'' మారణకాండ సృష్టించాడు. అదే జలియన్ వాలాబాగ్!
స్వతంత్ర భారత పాలకులు ఇప్పటివరకు బ్రిటిషు ప్రభుత్వాన్ని మన దేశానికి క్షమాపణ చెప్పాలని నిలదీసిందీ లేదు. నిజానికి కొన్ని విషయాలు ప్రస్తుతం అప్రస్తుతం అయినా ఆశ్చర్యం కలిగిస్తాయి. గాంధీజీ 1919 ఏప్రిల్ 18వ తేదీన అంటే మారణకాండ జరిగిన 5వ రోజున తన సత్యాగ్రహాన్ని అర్థంతరంగా విరమిస్తూ ''సత్యాగ్రహం గురించి అర్థం కాని వాళ్ల చేతుల్లో దీన్ని పెట్టి హిమాలయ పర్వతమంత తప్పు చేశానని'' ప్రకటించాడు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా రవీంద్రుడు తనకి బ్రిటిషు ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత బిరుదు ''నైట్‌హుడ్ ఆఫ్ ఇండియా''ను త్యజిస్తూ ప్రకటించాడు. గాంధీజీ కూడా బ్రిటీషు ప్రభుత్వం తనకిచ్చిన ''కైజర్ ఎ హింద్'' బిరుదును త్యజించాడు. కాని మరో ప్రక్క మారణకాండ జరిగిన మరుక్షణం నుండి నాటి పంజాబ్ ప్రాంతం అయిన అమృత్సర్, గుర్జన్‌వాలా, లాహౌర్ (పస్తుతం పాకిస్తాన్‌లోని నగరం) లలో గొప్ప తిరుగుబాట్లు ప్రారంభం అయ్యాయి. అందులో ప్రధానంగా రైతాంగం వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. విద్యార్థులు సమ్మెలు ప్రారంభించారు. బ్రిటిషు ప్రభుత్వం గడగడలాడింది. నాటి ఉన్నతాధికారుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలని బట్టి చూస్తే 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం లాంటి పరిస్థితులు వస్తున్నాయని, సాయుధ తిరుగుబాట్లకు ప్రజలు సిద్ధపడుతున్నారని, మరీ ముఖ్యంగా హిందూ ముస్లింల ఐక్యత బలంగా ముందుకు వస్తున్నదని, వీటిపై వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారని అర్థం అవుతుంది. ఈ ప్రాంతంలోనే మార్షల్ లా పేరిట 18మందిని ఉరితీయడం, 23మంది నాయకులని ప్రవాసానికి పంపటం, 1229మందికి యావజ్జీవ కారాగార శిక్షలు విధించడం జరిగింది. జలియన్ వాలాబాగ్ మారణకాండ ముందు, ఆ తరువాత ఘటనలు పరిశీలిస్తే స్వాతంత్య్రోద్యమం, అందులో ప్రజల సమరశీలత దాన్ని భరించలేని నాటి పాలకుల నిరంకుశ వైఖరి కళ్లకు కట్టినట్లు కనపడుతున్నది. అందువలన నేడు అసామాన్యంగా పెరుగుతున్న నిర్భంధం ప్రజా ఉద్యమాలను సహించలేని నేటి పాలకుల నియంతృత్వ పోకడలను అర్ధం చేసుకోవడానికి జలియన్ వాలాబాగ్ ఉజ్వల చరిత్ర మనకెంతో దోహదపడుతుంది. పాలకుల రంగు, జాతి కన్నా వారి వర్గ ప్రయోజనాలు ఎంత తీక్షణంగా ఉంటాయో, వాటిని తిప్పికొట్టడానికి జన బాహుళ్యాన్ని ప్రజా పోరాటాలలోకి తీసుకురావలసిన ఆవశ్యకత ఏమిటో మనం అర్ధం చేసుకోవాలి.
ఆ రోజులే గుర్తొస్తున్నాయి...
కాలం మారింది. విధానాలు, పద్ధతుల్లో కూడా కనీసం రూపంలోనైనా చాలా మార్పులు వచ్చాయి. నేడు బీజేపీ పాలన గత ప్రభుత్వ పాలనలో ఉన్న అనేక నిరంకుశ పోకడలను, నియంతృత్వ పద్ధతులను పరాకాష్టకు తీసుకువచ్చింది. రౌలట్ చట్టాన్ని తలదన్నే హింసాత్మక చట్టాలు పదేపదే అమలులోకి వస్తున్నాయి. 1975 ఎమర్జెన్సీ కాలం నాటి నిర్భంధానికి వంద రెట్లు ఎక్కువ నిర్బంధం అమలు చేయబడుతున్నది. ప్రభుత్వాన్ని విమర్శించారన్న కక్షతో అనేకమంది సామాజిక కార్యకర్తలు, రచయితలు, కవులు, వ్యంగ వ్యాఖ్యాతలు చివరికి కార్టూనిస్టులను కూడా జైళ్లలో కుక్కుతున్నారు. అనేకమంది మేధావుల పుస్తక పరిచయాలను, పుస్తకావిష్కరణలను సైతం కేంద్ర ప్రభుత్వం అర్థంతరంగా నిలిపివేస్తున్నది. ఆర్ఎస్ఎస్ (హిందూత్వ శక్తులు) కార్యకర్తలు నిస్సిగ్గుగా నిలబడి అల్లర్లు సృష్టిస్తున్నారు. 'ఉపా చట్టం' ఎన్ఐఎ అరెస్టులు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులకే కాకుండా ఈ జాడ్యం ఉన్నత న్యాయస్థానాలకు కూడా ఎగబాకింది.
అందువలన ఈ నేపథ్యంలో జలియన్ వాలాబాగ్ మారణకాండనే కాకుండా అందుకు కారణమైన రౌలట్ చట్టం, దాని వెనకాల ఉన్న నాటి వలస పాలకుల ఆక్రోశం, దానికి వ్యతిరేకంగా స్వాతంత్య్రోద్యమం ఒక ప్రజా ఉద్యమంగా మారిన తీరు అన్నింటిని కలగలిపి మనం అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని, వాక్స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడేశక్తి అందుకు పీడిత వర్గాలను కలుపుకురాగల శక్తి కార్మికవర్గానికే ఉంది. దానికి ప్రాతినిధ్యం వహించే కమ్యూనిస్టుపార్టీకి మాత్రమే ఉంటుంది. ఇది చరిత్ర నేర్పేపాఠం. సెల్:
- ఆర్. రఘు
9490098422