Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిందూ రాష్ట్రం ఏర్పడితే దేశ సమైక్యతకు గొడ్డలిపెట్టు అని అంబేద్కర్ ఆనాడే చెప్పారు. కుల నిర్మూలన కోసం అంబేద్కర్ పనిచేస్తే అందుకు భిన్నంగా ఆర్ఎస్ఎస్ మతోన్మాద బీజేపీ చాతుర్వర్ణ వ్యవస్థను కోరుతున్నది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఫాసిస్టు సిద్ధాంతం. వారి లక్ష్యం విభజనవాదం, హిందూ రాజ్యస్థాపన, ఏక సంస్కృతి, మధ్యయుగాల నాటి విధానాలను పునరుద్ధరణే వారి ధ్యేయం. నేడు అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్- బీజేపీ, సంఫ్‌ు పరివార్ శక్తులు అంబేద్కర్ భావజాలం, ఆచరణకు పెద్ద ఆటంకంగా, సవాల్‌గా మారాయి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయ కోవిదుడు. ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, సామాజికోద్యమ నాయకుడు. కుల నిర్మూలన కోసం ఎంతగానో కృషిచేసిన మహానుభావుడు. స్వతంత్ర భారతదేశపు మొదటి కేంద్ర న్యాయ శాఖామంత్రి, రాజ్యాంగ శిల్పి. కొలంబియా విశ్వ విద్యా లయం నుండి పీహెచ్డీ, లండన్ విశ్వవిద్యాలయం నుండి డీఎస్సీ డాక్టరేట్ పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించిన విజ్ఞాన వేత్త. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్థ్రాల్లో పరిశోధనలు చేసిన మేధావి. ఆయన 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలో జన్మించారు. చిన్నతనం నుంచే కుల అసమానతలను చవిచూశారు. చదువుకోవాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా ఆయనకు కులమే అడ్డుగా నిల బడింది. ఆయన జీవితాంతం ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నారు. తన స్వ అను భవాలను దృష్టిలో పెట్టుకుని సమాజంలో వర్ణ, వర్గ బేధాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. అంబేద్కర్ విభిన్న అంశాలపై విస్తృతంగా రచనలు చేశారు. ప్రజాస్వామ్యం, అంటరానితనం, మత మార్పిడులు, బౌద్ధమతం, హిందూ మతంలోని చిక్కుముడులు, సంస్కరణలు, దళితులు, భారతదేశ చరిత్రలోని వివిధ అంశాలపై కూడా రచనలు చేశారు. కుల వ్యవస్థ రద్దు చేయడానికి కుల నిర్మూలనను ప్రతిపాదించాడు. స్వతంత్ర భారతావనిలో తొలి న్యాయ శాఖామంత్రిగా అంబేద్కర్ పనిచేశారు. కుల వ్యవస్థను సవాల్ చేసిన సామాజిక విప్లవకారుడు అంబేద్కర్. సమానత్వం, ఒక మనిషికి ఒక విలువను ఆయన ముందుకు తీసుకొచ్చారు. కుల వ్యవస్థ, అంటరానితనం, మానవ, కార్మిక, స్త్రీల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారు. సమాజాన్ని సమానత్వం, హేతుబద్ధమైన పద్ధతుల్లో పునర్ వ్యవస్థీకరించాలని కోరుకున్నారు. నిచ్చెనమెట్ల సామాజిక నిర్మాణంపై ఆధారపడిన కులాన్ని ఆయన వ్యతిరేకించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం ఆధారంగా సమాజాన్ని నిర్మించబడాలని ఆయన దృఢంగా విశ్వసించారు. కానీ నేడు దేశంలో జరుగు తున్నది అంబేద్కర్ ఆలోచనలకు భిన్నం. స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు దాటినా, అంబేద్కర్ ఏ వివక్షలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడారో, ఆ వివక్ష నేటికీ కొనసాగుతున్నది. జనాభాలో 70శాతం మందికి పైగా ఉన్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు అనాగరికమైన కుల వివక్షకు, అణిచివేత, లైంగికదాడులకు గురౌతున్నారు.
కుల నిర్మూలన, వివక్షపై పోరాడాలన్న అంబేద్కర్
అణగారిన వర్గాలు-ముఖ్యంగా కార్మికవర్గాలు ఆర్ధిక, సామాజిక దోపిడీకి గురౌతుండటంపై అంబేద్కర్ ఆవేదన చెందారు. వైస్రాయి కార్యనిర్వాహక కౌన్సిల్లో 1942 జూన్ వరకు అంబేద్కర్ సభ్యుడిగా ఉన్నప్పుడు కార్మికుల ప్రయోజనాల కోసం కీలకచర్యలు ప్రతిపాదించారు. కార్మికులందరికీ సరైన వేతనాలు, పని పరిస్థితులు హక్కుగా ఉండేందుకు కృషిచేశారు. పరిశ్రమల్లో రోజుకు 12గంటల పని విధానాన్ని వ్యతిరేకించారు. పని గంటలు ఎనిమిది గంటలకు తగ్గింపు, సమాన పనికి - సమాన వేతనం చట్టాల కోసం పోరాడారు. పని గంటలపై 1942 నవంబర్ 27న ఢిల్లీలో అంబేద్కర్ అధ్యక్షతన నిర్వహించిన 4వ భారత కార్మిక సదస్సులో ఆయన తొలిసారి ప్రతిపాదించాడు. 1945 నవంబర్ 27, 28 తేదీల్లో జరిగిన 7వ భారత కార్మిక సదస్సు వారానికి 48గంటల పని విధానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సదస్సులో కేంద్ర, ప్రొవిన్షియల్ ప్రభుత్వాలు, యాజమాన్య సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మనదేశంలో వర్గంలోనే కులం ఇమిడి ఉందని ఆయన నమ్మారు. కుల నిర్మూలన, వివక్ష, సామాజిక న్యాయం కోసం పోరాడకుండా భారతదేశంలో వర్గ ఐక్యతను సాధించలేమన్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మనం ఎటు వెళ్ళినా కులం దారికి ముళ్ల కంచెలా అడ్డం నిలుస్తుందని హెచ్చరించారు. రాజ్యాంగ నిర్మాణ సభకు షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ తరఫున సమర్పించిన ''రాష్ట్రాలు - మైనార్టీలు'' అనే డాక్యుమెంట్లో అంబేద్కర్ ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానాన్ని కోరారు. మౌలికమైన కీలక పరిశ్రమలు, ఇన్సూరెన్స్ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలనీ, సాగుకు అనువైన భూములకు పరిహారం చెల్లించి పేద రైతులకు, భూమిలేని వ్యవసాయ కూలీలకు పంచాలన్నారు. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు నెలకొల్పాలని, మైనార్టీలకు తగు రక్షణ కల్పించాలని కోరారు.1937 సెప్టెంబర్‌లో మైసూరులో జరిగిన దళిత మహాసభలో అధ్యక్షోపన్యాస మిస్తూ సాంఘిక, ఆర్థిక సమానత్వం అనే లక్ష్యాల ద్వారా మాత్రమే సామాన్య మానవునికి తన అభిమతానుసారంగా స్వేచ్ఛగా పురోగమించడానికి అవకాశాలేర్పడుతాయని, ఉత్పత్తి సాధనాలు కొద్ది మంది చేతుల్లో ఉండి దోపిడీ చేయడానికి వీలున్నంత కాలం సామాన్య ప్రజలు అభివృద్ధి చెందడానికి ఏ మాత్రం అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు. 1938లో కొంకన్ ప్రాంతంలో కౌలు రైతుల హక్కుల కోసం జరిగిన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో ఆయన న్యాయశాఖా మంత్రిగా ఉన్న సమయంలో హిందూ కోడ్ బిల్లు ద్వారా స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించేందుకు ఆయన చేసిన కృషికి ఆనాటి నెహ్రూ ప్రభుత్వం ఆటంకాలు కల్పించడంతో 1957లో తన పదవికే రాజీనామా చేశారు.
మనువాద రాజ్యాగం అమలుకు ఆరెస్సెస్-బీజేపీ కుట్రలు
హిందూ రాష్ట్రం ఏర్పడితే దేశ సమైక్యతకు గొడ్డలిపెట్టు అని అంబేద్కర్ ఆనాడే చెప్పారు. కుల నిర్మూలన కోసం అంబేద్కర్ పనిచేస్తే అందుకు భిన్నంగా ఆర్ఎస్ఎస్ మతోన్మాద బీజేపీ చాతుర్వర్ణ వ్యవస్థను కోరుతున్నది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఫాసిస్టు సిద్ధాంతం. వారి లక్ష్యం విభజనవాదం, హిందూ రాజ్యస్థాపన, ఏక సంస్కృతి, మధ్యయుగాల నాటి విధానాలను పునరుద్ధరణే వారి ధ్యేయం. నేడు అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్- బీజేపీ, సంఫ్‌ు పరివార్ శక్తులు అంబేద్కర్ భావజాలం, ఆచరణకు పెద్ద ఆటంకంగా, సవాల్‌గా మారాయి. ఒకే మతం అంటూ హిందూయేతర ముస్లిం - క్రిస్టియన్, మైనార్టీ మతస్తులపై దాడులు సాగిస్తున్నారు. అణగారిన కులాలకు చెందిన దళిత, గిరిజన, మహిళ, వెనుకబడిన తరగతులపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. కులాల పేరుతో, మతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. తినే తిండిపై, కట్టే బట్టలపై ఆధిపత్యం చేస్తున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని లౌకిక విలువలకు తూట్లు పొడిచి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం అంబేద్కర్‌ను తనవాడంటూ బీజేపీ స్వంతం చేసుకుంటున్నది. ప్రజల్ని నమ్మించడానికి నాటకాలాడుతున్నది. మరోవైపు అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి మూల స్తంభాలైన సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయాన్ని పునాదులతో సహా ధ్వంసం చేసేందుకు ఆర్ఎస్ఎస్-మతోన్మాద బీజేపీ బుల్డోజర్ రాజకీయాలను నడిపిస్తున్నాయి. అంబేద్కర్ కార్మిక చట్టాల కోసం పోరాడితే, అదే స్ఫూర్తితో కార్మికవర్గం పోరాడి, అనేక త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం రద్దుచేసింది. పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల్ని బానిసలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నది. మౌలిక వసతులు, సహజ వనరులు జాతీయం కావాలని అంబేద్కర్ కాంక్షిస్తే, బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థల్లో 100శాతం వాటాలను తెగనమ్ము తున్నారు. దీంతో రాజ్యాంగంలో అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లు కనుమరుగైపోతున్నాయి. ఉద్యోగుల కష్టార్జితమైన పీఎఫ్, పెన్షన్ నిధులను ప్రయివేటు ఇన్సూరెన్స్, మ్యూచ్యువల్ ఫండ్ సంస్థలకు అప్పజెప్తు న్నారు. ఎల్ఐసిలో కోట్లరూపాయల వాటాలను ఐపిఓ ద్వారా విక్రయిస్తున్నారు.
ఆరెస్సెస్-బీజేపీ విధానాలను ప్రతిఘటించాలి...
అంబేద్కర్ విగ్రహారాధనకు వ్యతిరేకం. 'ఎక్కడా నా విగ్రహాలు పెట్టొద్దు' అనే ఆయనే హెచ్చరించారు. నేను తలపెట్టిన లక్ష్యసాధనకు, ఆశయాల అమలుకు చిత్తశుద్ధితో అంకితమవ్వాలని పిలుపునిచ్చారు. కానీ నేడు పాలక వర్గాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు సామాజిక న్యాయానికి భంగం కలిగిస్తున్నాయి. అంబేద్కర్ కోరుకున్న ప్రణాళికాబద్ధ ఆర్థిక విధాన స్థానంలో బహుళజాతి సంస్థలు, ఆదానీ, అంబానీల నమూనా ఆర్ధిక వ్యవస్థ నడుస్తున్నది. అంబేద్కర్ ఆశించినట్లు భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేసే కార్యక్రమాన్ని అటకెక్కించారు. కార్పొరేట్ సంస్థలకు వేల ఎకరాల భూములను కట్టబెడుతున్నారు. కార్మికుల, పేద ప్రజల జీవన ప్రమాణాలను దిగజారుస్తున్న బీజేపీ విధానాలను అర్థం చేసుకోవాలి. దానికి వ్యతిరేకంగా పేదలను, కార్మికులను సమీకరించాలి. అంబేద్కర్ ఆశయాలను సమాధి చేస్తున్న ఆర్ఎస్ఎస్, మతో న్మాద బీజేపీ విధానాలను ప్రతిఘటించేందుకుత పోరాటాలను ఉధృతం చేయాలి. అందుకు సామాజిక - వర్గ పోరాటాలను మమేకం చేయాలి. అదే అంబేద్కర్‌కి మనమిచ్చే నిజమైన నివాళి.
- పాలడుగు భాస్కర్