Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అజంతా ఎల్లోరా గుహల నుంచి దిల్వారా టెంపుల్ వరకు, తాజ్మహల్ నుంచి మధుర మీనాక్షి ఆలయం వరకూ మనదేశంలో నిర్మాణాలకు కొదవ లేదు. అయితే, ఈ దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వ పాలకులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాధినేతలు, ధార్మిక సంస్థలు వివిధ విగ్రహాలు నిర్మిస్తూ ప్రజల దృష్టినే కాదు, ప్రపంచం దృష్టిని కూడా ఇటు వైపు మళ్ళిస్తున్నారు. విగ్రహాలు ఆవిష్కరిస్తూ వారి ఆశయాలతో, సిద్ధాంతాలతో పాలన అందిస్తామని చెబుతున్న పాలకులు వారు చెప్పేమాటలకు చేసే పనులకు మాత్రం పొంతన కుదరడం లేదు. వాస్తవానికి విగ్రహాలను పెట్టడం వల్ల ప్రజల బతుకులు మారుతాయా? వారి సంక్షేమం, భద్రత, ఉపాధి కోసం తీసుకుంటున్న చర్యలేవి? ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఓట్ల, సీట్ల రాజకీయాల కోసం మహనీయుల పేర్లను వాడుకోవడం ఎంతమాత్రం సరికాదు.
గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది సమీపంలో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం సుమారు రూ.3వేల కోట్లతో 597అడుగులతో స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్ వల్లభారు పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి 562 సంస్థానాలుగా ఉన్న భారతదేశాన్ని తన మాటలు, క్రియల ద్వారా భారతదేశాన్ని ఏకం చేసిన వ్యక్తిగా పటేల్ నిలిచాడు. అందుచేతనే 'స్టాట్యు ఆఫ్ యూనిటీ' పేరుతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయన ఆశయాలు 'ఐక్యత' అనే భావన నేటి పాలకులు ఏమేరకు అమలు చేస్తున్నారనేదే ప్రశ్న? ఓట్లు కోసం ప్రజలను మతం, కులం, భాష పేర్లతో విభజిస్తూ అధికారం చేజిక్కించుకుంటున్నారే తప్ప ఆశయసాధనకు పాటుపడేవారే లేరు. ఎన్ఆర్సీ, సీఏఏ వంటి కొత్త చట్టాలతో సిద్ధంగా ఉంటూ ప్రజలను విభజన చేయడానికి సిద్దపడుతూ, సమైక్యతకు స్వస్తి పలికే పనిలో ఉంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ఇదేనా?
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో 108అడుగుల ఎత్తు, 218 టన్నుల బరువు కలిగిన నవీన బెంగుళూరు నిర్మాతగా సంఘ సంస్కర్తగా, వాటర్ రిజర్వాయర్ నిర్మాణాలకు ఆద్యుడుగా పేరుగాంచిన 'కెంప గౌడ' విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, ఆరోజుల్లో మోరస్ ఒక్కలిగాస్ వర్గంలో ఉన్న ఆడపిల్లల ఎడమ చేయి చివరి రెండు వేళ్లను నరికి (తొలగించే) అమానుష ఆచారాన్ని తొలగించిన సంఘసంస్కర్తగా 'కెంపగౌడ' పేరుగాంచగా, మరి నేడు అదే ప్రాంతంలో హిజాబ్ ధరించే విషయంలో వివక్షతలు రేపుతూ మహిళలు చదువుకు దూరం చేసే పనిలో కొంతమంది ఉండటం గమనార్హం. పాలకులు కూడా మతపరమైన అంశాల్లో పరోక్షంగా కొమ్ముకాస్తున్న తీరు హాస్యాస్పదం. మత సామరస్యానికి భంగం కలిగించడంతో పాటు విద్యా సిలబస్లో మతపరమైన అంశాలను ప్రమోట్ చేయడం ద్వారా ఈ సంఘసంస్కర్త కెంపగౌడ ఆశయాలను ఈ పాలకులు ఏమి పాటిస్తునట్లు?
ఇక రాజస్థాన్లోని పాలీ ప్రాంతంలో 151అడుగుల ఎత్తు, 8లోహాలతో తయారు చేసిన జైన ఆచార్య 'శ్రీ విజరు వల్లభ సురేష్వర్ జీ మహారాజ్'' విగ్రహాన్ని ''స్టాట్యు ఆఫ్ పీస్'' పేరుతో నిర్మించి, ఆవిష్కరణ చేశారు. ఈ ఆచార్యుడు మహాత్మా గాంధీ చేస్తున్న అహింసా స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు ఇస్తూ, దేశవ్యాప్తంగా విద్యాభివృద్ధికి కృషి చేశారు. ముఖ్యంగా మహిళలు, బాలికలు విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. మరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన పాలకులు విద్యను కమిర్షలైజేషన్, కమ్యునైలేజేషన్, కార్పొరేటీకరణ చేస్తున్నారు. బడ్జెట్లో నిధులు కేటాయింపులు అరకొరగా చేయుట గమనార్హం. విద్యలో మతపరమైన అంశాలు జోడిస్తూ అంతరాలను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా చరిత్రను తిరగరాసే పనిలో పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో నేటి పాలకులు ఈ విగ్రహ వ్యక్తుల ఆశయాలకు విరుద్ధంగా పయనిస్తూ, పైకి మాత్రం షో చేస్తూ పాలన చేయడం గమనార్హం.
ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నేటి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రపంచంలోనే ఎత్తయిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 125అడుగుల ఎత్తు, రూ.146 కోట్లతో నిర్మించారు. 'స్టాట్యు ఆఫ్ నాలెడ్జ్'గా పిలవవచ్చు. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరుగాంచిన అంబేద్కర్ ఈ దేశంలో కుల వివక్షత పూర్తిగా నశించాలని ఆశించాడు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాంగం ద్వారా అనేక రాయితీలు, ప్రోత్సాహాకాలు కల్పించాడు. అయినా సరే నేటికీ సమాజంలో 65శాతం పైబడి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వర్గాలకు చెందిన ప్రజలు అనేక విషయాలలో వెనుకబడి ఉన్నారు.
స్వాతంత్య్రం సాధించి 75సంవత్సరాలు పూర్తి అయినా, రాజ్యాంగం అమలులోకి వచ్చి 72సంవత్సరాలు కావస్తున్నా అందరికీ విద్య, వైద్యం అందుబాటులో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మహానుభావులు విగ్రహాలు నిర్మించి, ఆవిష్కరించి షాజహాన్ చక్రవర్తివలే చరిత్ర పుటల్లో పేర్లు లిఖించుకోవడం తప్ప, సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఏమి చేస్తున్నారో నేటి పాలకులు సమాధానం చెప్పాలి? ఓవైపు ధరల పెరుగుదల, నిరుద్యోగం, వివక్షతలు, ఆర్థిక అసమానతలు, బాలకార్మికులు, బాల్య వివాహాలు, మహిళలపై అఘాయిత్యాలు, పనిగంటలు పెంపు, పోషకాహార లోపం, అనారోగ్యాలు, హత్యలు, ఆత్మహత్యలు, నకిలీ దందా, కాలుష్యాలు, అవినీతి, అభ్రతా భావం లాంటి సమస్యలతో నేటి ప్రజలు సతమతం అవుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలు చూపి ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటూ ప్రజల అభివృద్ధి చేసినప్పుడే విగ్రహాల్లో ఉన్న మహనీయుల ఆశయాలు నెరవేరుతాయి.
- ఐ. ప్రసాదరావు