Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నప్పుడు పదవ తరగతి పరీక్ష రాసేటప్పుడు డిబార్ అనే పదాన్ని విన్నాం. డిబార్ అంటే విద్యార్థులకు హడల్. అందుకే నఖచిటీలు (మాస్ కాపీయింగ్) ఎంతో చాకచక్యంగా తీసుకెళ్లి, భయం భయంగా రాసేవారు. నఖచిటీలు తీసుకెళ్లాలంటే, పాకిస్థాన్ బార్డర్ దాటడానికి ఎంత కుస్తీ పడతారో, పరీక్ష హాల్లోకి నఖ చిటీలు తీసుకెళ్లేందుకు అంతగా ఆలోచించాల్సి వస్తుంది. ఇన్విజిలేటర్ చెక్ చేయడానికి కూడా భయపడే చోట కూడా చిటీలు పెట్టుకుని పోవాల్సి వచ్చేది. తలబద్దలు కొట్టుకుని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా... దురదృష్టం వెంటాడి స్క్వాడ్‌కు దొరికామా? ఇక అంతే సంగతులు. నఖ చిటీలు రాస్తుంటే దొరికితే అప్పటి పరిస్థితిని బట్టి స్క్వాడ్ డిబార్ చేసే వారు. దాంతో ఇజ్జత్ పోయినంత పని అయ్యేది. తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడేవారు. నఖ చిటీలు రాసి విద్యార్థులు డిబార్ అయితే... ప్రస్తుతం పదవ తరగతి పేపర్ లీకులు చేసి ఏకంగా రాజకీయ నాయకులు అరెస్టులవుతున్నారు. పేపర్ లీకులు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే తపన తప్ప... దీంతో లక్షలాది మంది విద్యార్థులు బాధపడుతారనేది వారికి అప్రస్తుతం. పేపర్ లీకుల విషయంలో అరెస్తైయి, జైలుకు పోయినప్పటికి పశ్చత్తాపం లేదు. జైలు నుంచి బయటకు వస్తున్న క్రమంలో గర్వంగా ఫీలవుతున్నారు. రాజకీయ నాయకుల కంటే విద్యార్థులే ఎంతో నయం. ఎందుకంటే డిబారైతే వారు సిగ్గుపడతారు. అరెస్టు ఊసలు లెక్కబెట్టినా, జైల్లో చిప్పకూడు తిన్నా సిగ్గు, ఎగ్గూ లేకుండా నవ్వుతూ అభివాదం చేస్తూ... 'నవ్వితే నాంకేటి సిగ్గు' అన్నట్టు ఫోజులు కొట్టారు.
- గుడిగ రఘు