Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వీలైతే క్షమించు... లేదంటే మన్నించు... కానీ నేనున్నానని గుర్తించు అత్తా...' అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్‌లో పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ వదిలిన ఈ డైలాగ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన రాష్ట్రంలోని ఫొటో జర్నలిస్టులు సైతం ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇదే రకమైన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోట్ల, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సీఎంలుగా ఉన్నప్పుడు ప్రతీ కార్యక్రమానికి అన్ని పత్రికల నుంచి ఫొటో జర్నలిస్టులను ఆహ్వానించి... ఫొటోలు తీయించుకునేవారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పద్దును ప్రతిపాదిం చేటప్పుడు, ప్రతిపక్షాలు వాకౌట్ చేసిన సందర్భాల్లోనూ ఫొటో జర్నలిస్టులకు సముచిత ప్రాధాన్యతనిచ్చి ఆయా కార్యక్రమాలను కవర్ చేయించుకునేవారు. ఆ క్రమంలో వారు తమదైన యాంగిల్లో, విభిన్న రీతిలో ఫొటోలు తీసేందుకు పోటీలు పడేవారు. తెల్లారి పేపర్లలో తాము తీసిన ఫొటో సృజనాత్మకంగా ఉందా..? లేదా..? అనే విషయాన్ని ఇతర పత్రికల్లో అచ్చయిన ఫొటోలతో సరి పోల్చుకుని మురిసి పోయేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవటంతో సొంత రాష్ట్రంలో ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తోంది... మా 'ఆత్మగౌరవం' దెబ్బ తింటోందని వాపోతున్నారు ఫొటో జర్నలిస్టులు. తాజాగా ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందుకు, అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానించక పోవటంతో ఓ సీనియర్ ఫొటో పాత్రికేయుడు ఆవేదన వ్యక్తం చేసిన తీరిది...
- కేఎన్ హరి