Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నవ్వటం ఓ యోగం... నవ్వించటం ఓ భోగం... నవ్వలేకపోవటం ఓ రోగం...' అన్నారో ప్రముఖ సినీ దర్శకులు. నిజమే మరి... సర్వ రోగ నివారిణి జిందా తిలిస్మాత్ లాగా ఆరోగ్యకరమైన నవ్వు ద్వారా అనేక రుగ్మతల నుంచి దూరం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఆ కోవలోనే సమయం, సందర్భం ఏదైనా జనాన్ని నవ్వించటమే పనిగా పెట్టుకున్నారు రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి. అది ప్రెస్‌మీట్ అయినా... బహిరంగ సభ అయినా... కాలేజీ విద్యార్థుల వేదికైనా... ఆఖరికి అసెంబ్లీ అయినా.... తనదైన శైలిలో నవ్వుల పువ్వులు పూయించటం ఆయనకు ఆనవాయితీగా మారింది. మల్లన్న జోకులకు, పంచ్‌లకు జనం ఎంతగా ఘొల్లుమంటున్నారంటే ఎప్పుడూ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ... సీరియస్‌నెస్ పాటించే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సైతం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ ఎంజారు చేస్తున్నంతగా. విక్టరీ వెంకటేశ్ నటించిన బ్లాక్ బాస్టర్ గణేష్ సినిమాలో విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఒక సీన్లో 'తమ్మీ ముష్టోళ్లతో కలిసి తిన్న, కుష్టోళ్లలో కలిసి పడుకున్న... నేను పైకి రానీకి చానా కష్టం పడ్డ తమ్మీ... జర నా పేపర్లు నాకియ్యరాదే...ఎందుకంటే నే బతకాలె తమ్మీ...' అనే డైలాగుకు తన అద్భుత మైన నటనను జోడించి, సన్నివేశాన్ని రక్తి కట్టించారు. అచ్చం అదే తరహాలో...'నేను పాలమ్మిన.. పూలమ్మిన... కాలేజీలు పెట్టించిన, ఆస్పత్రులు కట్టించిన... సానా కష్టపడి పైకొచ్చిన, నన్ను జూసి నేర్చుకోండ్రి బరు...' అంటూ మంత్రి మల్లన్న పటాసుల్లాగా పేలుస్తున్న జోకులు ఇటు టీవీల్లోనూ, అటు యూ ట్యూబుల్లోనూ వైరలవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారు జవహర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ సైతం మల్లారెడ్డి డైలాగుల్ని చెప్పి...సభికులతో చప్పట్లు కొట్టించారు. అందుకే... మల్లారెడ్డా... మజాకా...
- బి.వి.యన్.పద్మరాజు