Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరెన్సీ విలువ పడిపోతున్నప్పుడు (దానినే ద్రవ్యోల్బణం అంటాం) దానిని అరికట్టడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థికవ్యవస్థలో మాంద్యాన్ని సృష్టిస్తుంది (అంటే సరుకుల ఉత్పత్తి వృద్ధి చెందే వేగాన్ని తగ్గిస్తుంది). నిజానికి ద్రవ్యోల్బణం ఫలితంగా పెట్టుబడిదారుల లాభాల వాటా పెరుగుతుంది (ద్రవ్యోల్బణం భారాలు అటు వినియోగ దారులపైన, ఇటు కార్మికులపైన పడతాయి. వినియోగదారులు ఎక్కువ కరెన్సీ చెల్లించి సరుకులు కొనుక్కోవలసివస్తుంది. కార్మికుల వేతనాల నిజవిలువ పడిపోతుంది. అందువలన పెట్టుబడిదారులకు వచ్చే లాభాలు పెరుగుతాయి). ఒకసారి పెరిగిన లాభాల వాటాను ఆ తర్వాత తగ్గించు కోడానికి పెట్టుబడిదారులు ఎప్పుడూ సిద్ధంగా ఉండరు. ఒకసారి మాంద్యం మొదలైతే అప్పుడు సరుకుల ఉత్పత్తికి అవసరమయే ముడిసరుకులకు డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు ఆ ముడిసరుకుల రేట్లు తగ్గిపోతాయి. (వాటిని అమ్మే రైతాంగం దాని ఫలితంగా ఎక్కువ నష్టపోతారు). అప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అదే సమయంలో ఆర్థికమాంద్యం నిరుద్యోగాన్ని మరింత పెంచుతుంది. దాని వలన కార్మికులు మెరుగైన జీతాలకోసం బేరసారాలాడే శక్తి కోల్పోతారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ జీతాలను పెంచుకోలేక పోతారు.
ద్రవ్యోల్బణం ఎందుకు కలుగుతుంది? పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో జరిగే ఉత్పత్తిలో వాటాదారులు ముగ్గురు. ఒకరు పెట్టుబడిదారులు, రెండవవారు కార్మికులు, మూడవవారు ముడిసరుకులను అందించే వారు (వారిలో రైతులు ఒక భాగం). జరిగిన ఉత్పత్తి విలువ కన్నా ఈ ముగ్గురూ తమ తమ వాటాలుగా కోరుకునేదాని విలువ ఎక్కువ అయిపోతే అప్పుడు ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అప్పుడు పెట్టుబడిదారీ వర్గం తన వాటాను తగ్గించుకోకుండా తక్కిన ఇద్దరు వాటాదారులకూ దక్కవలసినదానిని తగ్గించివేసి, తద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తుంది. అలా ఆ ఇద్దరు వాటాదారులకూ దక్కవలసిన వాటాలను తగ్గించే మార్గమే ఆర్థిక మాంద్యం.
ప్రస్తుత ద్రవ్యోల్బణానికి బలౌతున్నది కార్మికవర్గమే అని ఒకవైపు ఉదారంగా అంగీకరిస్తున్న ఆర్థికవేత్తలు మరోవైపు కార్మికుల వేతనాలను తగ్గించడం ద్వారానే ఆ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయవచ్చునని సిఫార్సు చేస్తున్నారు! ఇది పెట్టుబడిదారీ వర్గం ముందుకు తెచ్చే వాదన. ఈ ఉదారవాద ఆర్థికవేత్తలు కూడా ఆ పెట్టుబడిదారీ వ్యవస్థకే కట్టుబడివున్నవారు అవడం చేత వారి దృక్పధం కూడా ఆ చట్రం పరిధిలోనే సంచరిస్తోంది. అందుచేత ఎవరైనా ద్రవ్యోల్బణం కారణంగా కార్మికవర్గం నష్టపోతోందని వాపోతున్నారంటే అటువంటివారందరూ కార్మికవర్గానికి అనుకూలంగానే ఉన్నారని అనుకోలేము. ఆ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వారేమి చర్యలను సిఫార్సు చేస్తున్నారనేది ఇక్కడ ముఖ్యం. సంపన్న వర్గాల దగ్గరున్న ఆస్తుల విలువలు ఎట్టిపరిస్థితుల్లోనూ పడిపోకూడదని కోరుకునేవారు కార్మికవర్గం పొందుతున్న వేతనాలను అదుపు చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయవచ్చునని వాదిస్తారు.
కార్మికుల వేతనాలను, ముడిసరుకుల ధరలను తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి పెట్టుబడిదారీ వర్గం పూనుకుంటుందని నేను పైన చెప్పాను. ఆ రెండు తరగతులలో (కార్మికులు, ముడిసరుకుల సరఫరాదారులు) ఎవరైనా ఒక తరగతివారు గనుక తమ రేట్లను తగ్గించడానికి ఒప్పుకోకుండా ప్రతిఘటిస్తే అప్పుడు ఆ రెండో తరగతిమీద మరింత భారాన్ని మోపడానికి పెట్టుబడిదారీ వర్గం పూనుకుంటుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది.
చమురు ఉత్పత్తి దేశాలు (ఇందులో ఒపెక్ గా ఒక కూటమిగా ఉన్నవి 13కాగా ఆ కూటమిలో లేనివి రష్యాతో కలుపుకుని మరో 11 దేశాలు ఉన్నాయి) మొత్తం 24 ఇటీవలే, ఏప్రిల్ 2న తమ రోజువారీ ఉత్పత్తిని ఒక మిలియన్ బ్యారెళ్ళమేరకు (10 లక్షల బ్యారెళ్ళ మేరకు) మే ఒకటవ తేదీనుండి తగ్గించాలని, ఈ తగ్గింపు కనీసం ఈ 2023 చివరిదాకా కొనసాగించాలని నిర్ణయించాయి. ఇంతకు ముందే అక్టోబర్ 2022లో ఒపెక్ దేశాలు తమ రోజువారీ ఉత్పత్తిని రెండు మిలియన్ల బ్యారెళ్ళమేరకు తగ్గించాలని నిర్ణయించివున్నాయి. ఇప్పుడు అదనంగా మరో మిలియన్ బ్యారెళ్ళు తగ్గించబోతున్నారు. ఆ విధంగా తగ్గించవద్దని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చాలా పెద్ద ఎత్తున రాయబారాలు నడిపాడు. తాను చాలా దేశాలకు స్వయంగా పర్యటించడమే కాక, తన క్యాబినెట్ మంత్రులను చాలా దేశాలకు పంపాడు. అయినా ఉపయోగం లేకపోయింది. తాజా తగ్గింపు విషయంలో కూడా అమెరికా చాలా గట్టిగా వ్యతిరేకించింది. అయినా చమురు దేశాలు తగ్గింపుకే సిద్ధపడ్డారు. అమెరికా పెత్తనం బలహీనపడుతోందనడానికి ఈ పరిణామాలు సంకేతాలు.
ఇంతకూ తమ ఉత్పత్తులను తగ్గించుకోవాలని చమురు ఉత్పత్తి దేశాలు ఎందుకు భావించాయి? ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా చమురు ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతోంది. దాని ఫలితంగా చమురు ధరలు పడిపోతున్నాయి. ఆ విధంగా తక్కువ ధరలకు చమురును అమ్ముకోవడం కన్నా ఉత్పత్తిని తగ్గించుకుని చమురు ధర పడిపోకుండా చూసుకోవడం మంచిది. చమురుకు డిమాండ్ ఎంతమేరకు తగ్గుతుంటే అంతమేరకు ఉత్పత్తిని గనుక తగ్గించుకుంటే అప్పుడు చమురు ధర పడిపోకుండా స్థిరంగా నిలబడుతుంది. అదే చమురు ఉత్పత్తిని తగ్గించుకోకపోతే అప్పుడు ధర పడిపోయి నష్టం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో చమురు ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉందో అంతమేరకే చమురును ఉత్పత్తి చేస్తే అప్పుడు చమురు ధరలు తమ అదుపులో ఉంటాయి. -ఇదే చమురు ఉత్పత్తి దేశాల ఆలోచన. చమురు ఉత్పత్తిపై ఆ విధమైన అదుపును కొనసాగించగలుగుతున్నందువల్లనే చమురు ఉత్పత్తి దేశాలు తాము కావాలనుకున్నప్పుడల్లా చముురు ధరలను పెంచివేయగలుగుతున్నాయి. నిజానికి ఈ దేశాలు తమ చమురు ఉత్పత్తులను తగ్గించుకుంటున్నాయి అన్న వార్త రాగానే, ఇంకా వాస్తవంగా ఉత్పత్తి తగ్గింపు అమలులోకి రానప్పటికీ, ముడిచమురు ధరలు 6శాతం పెరిగిపోయాయి. కొన్ని చముకు ఉత్పత్తి కంపెనీల వాటాల ధరలు కూడా పెరగడం మొదలైంది.
ఎప్పుడైతే చమురు ఉత్పత్తి దేశాలు ఈ విధంగా తమ ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చూసుకుంటున్నాయో, అప్పుడు పెట్టుబడిదారీ వర్గం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి చేస్తున్న ప్రయత్నం వెనకపట్టు పడుతుంది. (అంటే ముడి సరుకుల ధరలను, కార్మికుల వేతనాలను తగ్గించడం ద్వారా ఆర్థిక మాంద్యాన్ని పెంచడానికి ప్రయత్నించడం.) ఆ విధంగా జరగకూడదనుకుంటే అప్పుడు పెట్టుబడిదారీ వర్గం చమురు ఉత్పత్తి దారులు మినహా తక్కిన ముడిసరుకుల ఉత్పత్తిదారుల మీద (ప్రధానంగా రైతులమీద), కార్మికులమీద మరింత ఎక్కువగా భారాలను మోపాలి. మరింత ఎక్కువగా వారి వేతనాలకు కోత పెట్టాలి.
అ విధంగా పెట్టుబడిదారీ వర్గం పూనుకుంటే అప్పుడు కార్మికవర్గం వైపు నుండి ప్రతిఘటన కూడా పెరుగుతుంది. ఒకపక్క ఉద్యోగాల కోతకు వ్యతిరేకంగా, మరోవైపు వేతనాల కుదింపునకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటాల్లోకి వస్తారు. ఇప్పటికే యూరప్ ఖండం అంతా కార్మిక పోరాటాల వెల్లువలతో అట్టుడుకుతోంది.
అంతేకాదు. ఆర్థికమాంద్యం ప్రభావం బ్యాంకులమీద ఒత్తిడిని పెంచుతుంది. సంపన్న పెట్టుబడిదారీ దేశాలలోని బ్యాంకింగ్ వ్యవస్థమీద ఇప్పటికే పెరుగుతున్న ఒత్తిడి ఫలితంగా రెండు అమెరికన్ బ్యాంకులు మూతబడ్డాయి. ఆర్థికమాంద్యం మరింత పెరిగి, దాని ఫలితంగా బ్యాంకులకు కట్టవలసిన అప్పుల వాయిదాలు కట్టలేనివారి సంఖ్య మరింత పెరిగితే అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.
పెట్టుబడిదారీ విధానం పైకి చూసినప్పుడు చాలా సాఫీగా నడుస్తున్న వ్యవస్థలాగా అనిపిస్తుంది. అయితే ఆ వ్యవస్థ ఆ విధంగా కొనసాగాలంటే చాలా నిబంధనలు లేదా షరతులు అమలు కావల్సివుంటుంది. వాటిలో ఏ ఒక్కటి అమలు కాకుండా పోయినా, దాని పర్యవసానంగా గొలుసుకట్టు మాదిరిగా తేడాలు ఒకదానివెంట ఒకటిగా తన్నుకొస్తాయి. అందువలన మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడే ప్రమాదంలో పడిపోతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థమీద అమెరికా నాయకత్వంలో ఉన్న సంపన్న పశ్చిమ దేశాల పెత్తనం కొనసాగడం అనేది అటువంటి షరతులలో ఒకటి. ఇన్నాళ్ళూ ఆ పెత్తనం కొనసాగుతూ వచ్చినందువలన దాని ప్రాధాన్యతను చాలామంది ఆర్థిక విశ్లేషకులు గమనించలేకపోతున్నారు. కాని ఇప్పుడు ఒక్కసారి ఆ పెత్తనాన్ని కాదని ఒక్క దేశం, సౌదీ అరేబియా, చమరు ఉత్పత్తిని తగ్గించుకోడానికే నిర్ణయించుకోగానే దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయో చూడండి. మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థనే సవాలు చేసే పరిణామాలు తలెత్తుతున్నాయి.
నిజానికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా కాలం క్రితం నుండే సంక్షోభంలో ఉంది. 2008లో హౌసింగ్ బుడగ పేలిపోయినప్పటినుంచీ అదే పరిస్థితి. ఒక సంక్షోభంలోనుండి బయట పడడానికి అది తీసుకునే చర్యలు ఆ వ్యవస్థను మరొక రూపంలో ఉండే సంక్షోభంలోకి నెడతాయి. మొదట సంక్షోభం ఆర్థిక మాంద్యం రూపంలో వచ్చింది. దానినుండి బయట పడడానికి చాలా దీర్ఘకాలం పాటు అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించారు. దానితోబాటు కరోనా సమయంలో పెద్ద మోతాదులో ద్రవ్యలోటు పెంచి ప్రభుత్వ వ్యయాన్ని పెంచారు. ఇప్పుడు ఆ చర్యల ఫలితంగా ద్రవ్యోల్బణం వచ్చింది. ఇక అమెరికా పెత్తనం ఈ ప్రపంచం మీద కొనసాగించాలనే పంతంతో కొనసాగిస్తున్న ఉక్రెయిన్ యుద్ధం కూడా ద్రవ్యోల్బణానికి తోడైంది. ఇప్పుడు ఆ ద్రవ్యోల్బణం అమెరికా కొనసాగిస్తున్న పెత్తనానికే ఎసరు పెట్టింది. దానికి తోడు కార్మికవర్గం నుండి ప్రతిఘటన కూడా పెరుగుతోంది. ప్రస్తుతం మనం నయా ఉదారవాద పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కోల్పోయి బీటలు వారడాన్ని చూస్తున్నాం.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్