Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రత్యామ్నాయమంటే ఉన్న దాంట్లో నుండి మెరుగైనది సృష్టించటమే కదా, అంతేగాని పాతవాటిని పూర్తిగా తొలగించి ప్రత్యామ్నాయాన్ని శూన్యం నుండి సృష్టించలేం! అలాంటి వాటికి జనామోదం కూడా కష్టమే! ఈ వివాహ పద్ధతిలో అర్థంకాని అంశాలు ఏమీ ఉండవు. పెళ్ళికి వచ్చిన అతిథుల్లో వీలయినంత మందిని వేడుకలో భాగస్వామ్యులను చేయవచ్చు. ఆచరణలో ప్రత్యామ్నాయ పద్ధతులకై శక్తికొలది ప్రయత్నం చేయాలన్న ధోరణి, సమాజ మార్పు కోసం కృషి చేసే వారిలో ఉంటేనే, ప్రజలపై ప్రభావం ఉంటుంది.
ప్రత్యామ్నాయ వివాహ పద్ధతులు కోరుకుంటున్న వారు ఏ అంశాలకు ప్రాధాన్యత యివ్వాలో ఒక కుటుంబం ఎదుర్కొన్న సమస్యలు - పరిష్కారానికై చేసిన కృషి-అనుభవాలు.
మా పెద్దమ్మాయి తను ప్రేమించిన తన క్లాస్‌మెట్ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటామన్నారు. ఓకే అన్నాం. కాని ఆ అబ్బాయి వారిది సాంప్రదాయ కుటుంబం. కులాంతర వివాహానికి వారిని ఒప్పించటానికి అబ్బాయి ఎంతో కృషి చేయాల్సి వచ్చింది. పెండ్లి ప్రత్యామ్నాయ పద్ధతిలో జరగాలన్న దానిపై మరో సమస్య ఎదురైంది. సాంప్రదాయ వాదులను కూడా మెప్పించేలా ప్రత్యామ్నాయ వివాహ పద్ధతిని రూపొందించటం, ఆ పద్ధతికూడా వినోదంతో కూడిన వేడుకగా ఉండాలనే పిల్లల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందిచాల్సిన అవసరం ఏర్పడింది.
అలాంటి తగిన వివాహ పద్ధతికై వామపక్ష, అభ్యుదయ వాదులను సంప్రదించటం జరిగింది. కాని నమూనాగా ఏమీ దొరకలేదు. కుటుంబంలో మొదట కొంత నిరుత్సాహపడ్డాం. దాదాపు 4 దశాబ్దాలు పైగా ఉద్యమంలో పనిచేస్తున్నాం. ఇంట్లో పిల్లలు అభ్యుదయ పద్ధతిలో పెండ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉంటే వారికి ఒక పద్ధతి చూపెట్టలేని స్థితిలో ఉండటం అన్యాయమనిపించింది. కుటుంబంలో పట్టుదల పెరిగింది. విషయం అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు, కొద్దిమంది ఉద్యమ సహచరులు తోడుగా నిలిచారు.
వివిధ ప్రదేశాలలో జరుగుతున్న పెళ్ళిళ్ళ రీతులపై మా పరిశీలన ప్రారంభమయ్యింది. దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగే సాంప్రదాయ పెండ్లిండ్లలో సింపుల్‌గా జరిగే పద్ధతులు కూడా కనిపించాయి. కొన్ని చోట్ల తాళి, కాలి మెట్లకు ప్రాధాన్యతే లేదు. మరికొన్ని చోట్ల జిలకరబెల్లం, కన్యాదానం చేసే పద్ధతే లేదు. సింపుల్‌గా చేసుకునే సాంప్రదాయ పెండ్లి కేరళీయులలో కనిపించింది. అమ్మాయి, అబ్బాయి ఎన్నికలోనే ఎంతో అభ్యుదయంగా ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్నది. మొదట అమ్మాయి అబ్బాయిని ఎన్నిక చేసుకొని తన తల్లిదండ్రులకు చెపుతుంది. అబ్బాయి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్ళి నిర్ణయించటం జరుగుతుంది. ఈ పద్ధతి ఎంతో అబ్బుర మనిపించింది. అన్ని సాంప్ర దాయ పెండ్లిండ్లలోనూ మతాచారాలతో పాటు వేడుకగా జరుపుకునే పద్ధతులు కూడా ఎక్కువగా కనిపించాయి. తెలుగు రాష్ట్రాల మైదాన ప్రాంతాల్లో జరుగుతున్న హిందూ వివాహ పద్ధతుల్లో స్త్రీ, పురుషుల మధ్య అసమానతలకు అవకాశం ఉండే రీతులు ఎక్కువగా ఉన్నాయని అర్థమైంది.
వధూవరుల మధ్య అసమానతలకు అవకాశం లేకుండా, వివాహం వేడుకగా జరిగేలా ఇరు కుటుంబాల ఆమోదంతో వివాహ పద్ధతి రూపొందించటానికి దాదాపు 6 మాసాలు పట్టింది. ఎదుర్కోలు, సన్నాయి మేళం, వధూవరులపై పూలు జల్లుతూ వేదికపైకి ఆహ్వానించటం, ప్రమాణ పత్రాలు చదివించటం, ఉంగరాలు మార్పిడి, దండలు మార్చుకోవటం, అనంతరం పూలతో తలంబ్రాలు పోసుకోవటంతో వివాహం పూర్తవుతుంది. ఆ తరువాత ప్రశ్నలతో వేడుకగా వధూవరులతో వేదికపైనే ఆటలాడించటం జరిగింది. పెండ్లికి హాజరయిన అతిథులను ఈ పద్ధతి ఎంతో అలరించింది. అందులో సాంప్రదాయ పెళ్ళిని ఎక్కువగా యిష్టపడే బంధు మిత్రులు కూడా తాళి, కన్యాదానం లాంటివి మినహా, వివాహం ఎంతో వేడుకగా, ఆహ్లాదకరంగా చేశారని అభినందనలు తెలిపారు. ఉభయ కుటుంబాలకు ఎంతో రిలాక్స్ అనిపించింది. అభ్యుదయ వివాహం ఇంత వేడుకగా ఉంటే మేం కూడా ఇలాంటి పెండ్లి చేసుకుంటామని కొన్ని తెలిసిన కుటుంబాల యూత్ కొందరు కలిసి చెప్పారు. 2015 నవంబర్ నుండి నేటి వరకు మమ్మల్ని సంప్రదించి ఉభయ రాష్ట్రాల్లో దాదాపు 10మంది ఈ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.
ఇక రెండో అమ్మాయి పెండ్లి విషయంలో మరొక సమస్య ఎదురైంది. తెలిసిన పెద్దలు అమ్మాయికి ఒక సంబంధాన్ని సూచన చేశారు. అబ్బాయి తల్లిదండ్రులు కుటుంబ నేపథ్యం చాలా బాగుంది. వామపక్ష భావాలున్న కుటుంబం. రెండు కుటుంబాల తరపున ఈ పెండ్లి జరిగితే బాగుంటుదనుకున్నాం. కానీ పిల్లలిద్దరికి గతంలో అసలు పరిచయమే లేదు. పిల్లలిద్దరూ ముందు మాట్లాడుకోవాలని ఇరు కుటుంబాల వారం భావించాం. కేవలం పెద్దల నిర్ణయంతో కాకుండా పిల్లలు ఇష్టపడి పెండ్లి చేసుకోవాలనుకున్నాం. పిల్లలిద్దరూ ఒక నిర్ణయానికి రావటానికి 9 మాసాల సమయం తీసుకున్నారు. ఆ తరవాత ఇద్దరూ ఇష్టపడి పెండ్లి చేసుకుంటామన్నారు.
ఇక వివాహ పద్ధతిపై ఇద్దరు పిల్లల మధ్య, రెండు కుటుంబాలలోనూ చర్చలు జరిగాయి. వైవాహిక జీవితం లోకి అడుగిడే వధూవరుల మధ్య అసమానతలకు అవకాశం లేకుండా, వివాహం వేడుకగా జరపాలని భావించాం. గత అనుభవంతో వివాహాన్ని ఇంకా మెరుగ్గా చేయాలనుకున్నాం. పెళ్ళిసందడి సమయం అందరికి అనుకూలంగా సాయంత్రం 6గంటలకు అనుకున్నాం.
వధూవరుల తల్లి దండ్రులు నలుగురం సాయంత్రం 6గంటల నుండి వేదిక గేటు వద్ద విచ్ఛేసిన బంధు మిత్రులకు ఆహ్వానం పలికాం. అదే సమయంలో సన్నాయి బృందం స్టేజిపైన పెండ్లి పాటలతో అలరించారు. సాయంత్రం 6గంటల 30నిమిషాలకు వధువు, వరుడు బంధు మిత్ర బృందాలతో హాలులోకి రెండు వైపుల నుండి ప్రవేశించారు. ఇరు బృందాలు, ఎదుర్కోలుతో పరామర్శలు, చమత్కార సంభాషణలు నడిచాయి. ఆ తరువాత వధూవరులు ఒకరికొకరు స్వీటు తినిపించుకున్నారు. అనంతరం సన్నాయి బృందం స్వాగతంతో వధూవరులు ముందు నడువగా, వారి వెనక కుటుంబ సభ్యులు, మిత్ర బృందం అనుసరించారు. వేదిక వద్దకు వెళ్లే దారిలో ఇరు వైపుల అమ్మాయిలు, అబ్బాయిలు నిలబడి పూలు జల్లుతూ వధువు వరులకు స్వాగతం పలికారు. స్టేజిపైకి వధూవరులు-వారి కుటుంబ సభ్యులను పిలిచారు. పెళ్ళి పెద్ద 'ఐద్వా' రాష్ట్ర నాయకురాలు స్వరూప రాణిని పెండ్లి నిర్వహణకై వేదిక పైకి ఆహ్వానించారు. వధూవరులతో మొదట ప్రమాణ పత్రాలు చదివించారు. ప్రమాణ పత్రాలపై సాక్షుల సంతకాల అనంతరం ఉంగరాలు, దండలు మార్చుకున్నారు. వధూవరు లిద్దరు దంపతులుగా మారినట్లుగా పెళ్ళి పెద్ద ప్రకటించారు. నేటి అవసరాలకనుగుణంగా జరుగుతున్న ఈ వివాహ పద్ధతి గురించి, వైవాహిక జీవితంలో దంపతులు ప్రాణమిత్రులుగా మెలగాల్సిన విషయాలపై పెళ్ళి నిర్వాహకురాలు కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత పూల తలంబ్రాలు పోసుకునే వేడుక కొంతసేపు నడిచింది. అనంతరం వైవాహిక జీవితం భవిష్యత్తులో సుఖ సంతోషాలతో గడపటానికి అవసరమైన సూచనలు, నిబంధనలతో పెళ్ళి ఒప్పందాన్ని స్నేహితులు వధూవరులకు అందచేశారు. తగిన సమాధానాలతో వధూవరులు స్పందించి సంతకాలు చేయటం వినోద భరితంగా సాగింది. ఆ తర్వాత వధూవరులు ఒకరి పట్ల మరొకరికి ఉన్న అంచనాలపై అడిగిన ప్రశ్నలు, చమత్కారంగా వారిచ్చిన సమాధానాలతో వినోద భరితంగా జరిగింది. సాంప్రదాయ పద్ధతి కాదు కనుక పెండ్లిలో తరువాత సీను ఏం ఉంటుందోనన్న ఆసక్తితో పెళ్ళికొచ్చిన అతిథులందరూ చివరి వరకూ తిలకించారు. వేడుకలో భాగస్వాములయ్యారు.
ఈ వివాహ పద్ధతిలో వధూవరుల మధ్య జెండర్ వివక్షతకు తావు లేకుండా, వైవాహిక జీవితంలో ఇద్దరూ సమానమేనన్నది ప్రామాణికంగా తీసుకోవటం జరిగింది. ఈ వివాహ వేడుకలో సాంప్రదాయానికి సంబంధించినవి కొన్ని, మరి కొన్ని నేటి కాలానికి సంబంధించిన వాటిని కలిపి పెట్టడం జరిగింది. ఉదా: ఉంగరాలు, తలంబ్రాలు (బియ్యం బదులు పూల తలంబ్రాలు వాడాము) తరతరాలుగా పెళ్ళికి సింబల్‌గా గుర్తింపు పొందినవి. అందులో వధూవరుల మధ్య అసమానతలకు అవకాశం లేదు. పైగా అందరి నుండి ఆమోదం కూడా ఉంటుంది.
ప్రత్యామ్నాయమంటే ఉన్న దాంట్లో నుండి మెరుగైనది సృష్టించటమే కదా, అంతేగాని పాతవాటిని పూర్తిగా తొలగించి ప్రత్యామ్నాయాన్ని శూన్యం నుండి సృష్టించలేం! అలాంటి వాటికి జనామోదం కూడా కష్టమే! ఈ వివాహ పద్ధతిలో అర్థంకాని అంశాలు ఏమీ ఉండవు. పెళ్ళికి వచ్చిన అతిథుల్లో వీలయినంత మందిని వేడుకలో భాగస్వామ్యులను చేయవచ్చు. ఆచరణలో ప్రత్యామ్నాయ పద్ధతులకై శక్తికొలది ప్రయత్నం చేయాలన్న ధోరణి, సమాజ మార్పు కోసం కృషి చేసే వారిలో ఉంటేనే, ప్రజలపై ప్రభావం ఉంటుంది. ప్రత్యామ్నాయ పద్ధతి అమలులో కుటుంబంలో సమస్య ఎదురవగానే పరిష్కారానికి కృషి చేయకుండా, రాజీ ధోరణికి అలవాటు పడితే ప్రత్యామ్నాయాలకై ప్రజల్లో నిజాయితీగా ప్రచారం చేయలేం. ప్రత్యామ్నాయ పద్ధతులకై మార్పు కోరుకునే వారికి మా ఈ చిరు ప్రయత్నం ఉపయోగ పడాలనే ఉద్దేశంతో అందరి దృష్టికి తీసుకొస్తున్నాం.
- పద్మ హరి, 9493216695
- సీహెచ్. కృష్ణారావు.9490098586