Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొన్న సికింద్రాబాద్ రూబీ హోటల్, నిన్న స్వప్నలోక్ కాంప్లెక్స్, నేడు కుషాయిగూడ టింబర్‌డిపో... ఇలా నగరాన్ని వరుస అగ్ని ప్రమాదాలు చుట్టుముడుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. ఈ ఘటనల్లో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ప్రమాదాల నుంచి గుణపాఠం నేర్వడం లేదు. యథావిధిగా యాక్సిడెంట్స్ జరగడం, అధికారులు హడావిడి చేయడం... ఘటనా స్థలాన్ని నేతలు పర్యవేక్షించడం... కంటితుడుపు చర్యగా పరిహారం ప్రకటించడం... ఇదో తంతుగానే మారుతున్నది. అంతేతప్ప దీనికి బాధ్యులెవరు? అనే కోణంలో విచారణ మాత్రం సాగడం లేదు. అసలు అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగు తున్నాయి? ఫ్యాక్టరీల యజమానులు, బిల్డర్స్, ఫైర్‌సెప్టీ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఇదో అంతుచిక్కని రహస్యంగానే ఉంది. మొన్నటివరకు కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్న పిల్లలను చంపితేగాని అధికారులు స్పందించలేదు. అయినప్పటికీ కుక్కల భయంతో చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు భయపడుతూనే ఉన్నారు. ఇప్పుడేమో అగ్ని ప్రమాదాలతో ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాలకులు తీసుకుంటున్న చర్యలేంటి? ప్రజలు ప్రశాంతంగా జీవించేలా నమ్మకం కలిగించేది ఎవరు? అసలు నగరంలో భద్రత ఉందా? లేదా! ఇలాంటి అనేక ప్రశ్నలు సామాన్యుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
2022 సెప్టెంబర్ 13న సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ స్కూటీ షోరూంలో అగ్ని ప్రమాదం జరగడంతోపై అంతస్తులో ఉన్న రూబీ హోటల్‌కు మంటలు వ్యాపించి ఎనిమిది మంది చనిపోయారు. దట్టమైన పొగ వారిని కమ్మేయడంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఐదుగురు సజీవదహన మయ్యారు. మరో ఐదుగురు బిల్డింగ్‌పై నుంచి దూకేసి తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందారు. ఈ ఘటన తర్వాత గానీ హోటల్, షోరూం నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని విచారణలో వెల్లడైంది. వారు నిబంధనలు పాటిస్తే ప్రాణనష్టం జరగకుండా ఉండేది. సెల్లార్లో షోరూంకు అనుమతివ్వడం దగ్గరినుంచి మొదలుపెడితే అన్నింట్లోనూ అధికారులు నిబంధనలు గాలికొదిలేశారు. అక్కడ ఎలక్ట్రిక్ స్కూటీల అసెంబుల్ చేసిన బ్యాటరీల్లో వినియోగించే లిథియం పేరుకుపోయి ఉంది. అధికారులు తనిఖీలు చేసిఉంటే గనుక ఇది బయటపడేది. అది చేయకపోవడంతో బ్యాటరీ పేలి షార్ట్‌సర్క్యూట్ అయింది. కార్బన్ మోనాక్స్లడ్ విడుదలై మంటలు వ్యాపించడంతో 37 బైకులు కాలిపోయాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా అనే ఆలోచన కూడా నిర్వాహకులు చేయలేదు. పై అంతస్తుల్లోకి వెళ్లడానికి, రావడానికి ఒకే దారి ఉంది. సెట్‌బ్యాక్ కూడా లేకపోవడంతో పొగకు ఊపిరాడక పాపం అమాయకులు మెట్లమీదనే ప్రాణాలొదిలారు.
ఇది జరిగి దాదాపు ఆరునెలలు గడిచాయి. అధికారులు అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లను తనిఖీలు చేసి నిబంధనలు పాటిస్తున్నారా అని చూసి ఉంటే కొంతైనా ప్రమాదాలకు అడ్డుకట్టపడేది. కానీ వారి నిర్లక్ష్యం మరో ఆరుగురి ప్రాణాలను బలిగింది. ఈ ఏడాది మార్చి 17న సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్‌లో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత బాధాకరం. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మొదట ఎనిమిదో అంతస్తులో మంటలు వ్యాపించి 5,6,7 అంతస్తుల్లోకి వచ్చాయి.ఆ సమయంలో 16మంది అందులో చిక్కుకున్నారు. కానీ ఐదో అంతస్తులో కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఆరుగురిలో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. వీరంతా 20 నుంచి 25 ఏండ్ల వయసువారే. ఎక్కడినుంచో వచ్చి చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉండేవారు. కానీ అగ్ని ప్రమాదం వారిని బుగ్గి చేసింది. మొన్న తెల్లవారుజామున మూడన్నర గంటలకు కుషాయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో దంపతులతో సహా వారి ఐదేండ్ల కుమారుడు సజీవ దహనమయ్యారు. ఎక్కడో సూర్యపేట జిల్లా తుంగతుర్తి నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబం అగ్నికి ఆహుతైంది. ముందు టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ను తాకింది. దట్టమైన పొగ మంటలు వ్యాపించడంతో రెండో అంతస్తులో ఉన్న కుటుంబం హాహాకారాలు చేస్తూ కిందకు వస్తుండగానే ఊపిరాడక మెట్లమీదే చనిపోయారు.
మరో ఘటనలో బోయగూడ గుజిరి గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన పదకొండు మంది చనిపోయారు. వీరంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు. పొట్ట చేత పట్టుకుని పనికోసం వచ్చిన కూలీలు. వీరి బతుకులకు భద్రత లేదు. పనికోసం తీసుకొచ్చిన యజమానికి పట్టింపు లేదు. మరి వీరికోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఎవరు జవాబు చెప్పాలి? ఇలా నగరంలో జరుగుతున్న అనేక అగ్ని ప్రమాద ఘటనల్లో అనేకమంది అమాయకులు అసువులు బాస్తున్నారు. రేపు మరో అగ్ని ప్రమాదం జరగదని గ్యారంటీ లేదుకదా! నగరంలో జీవనం గాల్లో దీపమైతే ఎలా? ప్రజల రక్షణకు తీసుకుంటున్న చర్యలేవి? నిబంధనలు పాటించని యజ మానులకు నోటీసులు ఎందుకివ్వడం లేదు! ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలేవి? ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తోంది. ఇలా అనేక ప్రశ్నల పరంపర ప్రజల్ని వేధిస్తున్నాయి. ఒకటి కాకపోతే మరొకటి, ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలే! దీనికి తగిన కారణాలు వెతకాల్సిన అవసరం ఉన్నది. ప్రమాదాలు అరికట్టడానికి నూతన భద్రతా విధానాన్ని తీసుకు రావాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.
కోటీ జనాభా ఉన్న మహానగరంలో ప్రజల రక్షణ ఇంత బలహీనంగా ఉంటే ఎలా? పేరుకే విశ్వనగరం కానీ ఇక్కడ ఉన్నదంతా లోపభూయిష్టం. ఎందుకంటే పది మంది కార్మికులు పనిచేసే పరిశ్రమలు, లేదా హోటల్, గోదాం ఏదైనా సరే! బలమైన రెగ్యులేటరీ వ్యవస్థ ఉండాలి. అనుకోని ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే బీమా, రూ.50 లక్షల పరిహారంతో పాటు జీవనోపాధికి విద్యార్హతను బట్టి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కేటాయించాలి. ప్రమాద కారకులు తప్పించు కోకుండా కఠిన సెక్షన్లు విధించాలి. ప్రతి నెలా పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశంపై విస్తృతంగా చర్చించి నివారణోపాయాలు వెతకాలి. కొత్తగా ఇండిస్టియల్ సేఫ్టీ పాలసీ తీసుకొచ్చి ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలను పటిష్టం చేయాలి. వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇండిస్టియల్ పార్కులు, గ్యాస్ గోదాంలను హైరిస్క్ జోన్లుగా గుర్తించాలి. వీటిపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ నిబంధనలు పాటించని వారి ఫ్యాక్టరీలను సీజ్ చేయాలి. సినిమాహాళ్లలో నైతే నిర్మాణలో పాలతో పాటు భద్రతా చర్యలు ఏమాత్రం కానరావడం లేదు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. నిర్మాణంలో ఉన్న భవనాలకు అన్ని సదుపాయాలు ఉంటేనే ప్లానింగ్ అధికారులు అనుమతులివ్వాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలను కాస్తాయినా అరికట్టవచ్చు. లేదంటే అసలే వేసవికాలం, చిన్న అగ్గిరవ్వ తగిలితే చాలు విస్ఫోటనాలు సంభవించే అవకాశాలెక్కువ. ఇప్పటికైనా జరిగిన ప్రమాదాలనుంచి అధికారులు గుణపాఠాలు నేర్చుకుని ప్రజల జీవన భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- ఎన్. అజరుకుమార్