Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో చెప్పుకోదగ్గ బౌద్ధ చక్రవర్తులలో హర్షవర్ధనుడు ఒకరు. ఈయనకు 'శిలాదిత్య' అనే బిరుదు ఉంది. శిలాదిత్య అంటే బుద్ధుడు చెప్పిన 'పంచశీల'ను పూర్తిగా ఆచరించేవాడు - అని అర్థం. పంచశీల-అంటే ఏమిటి? 1. హింసకు పూనుకోకూడదు. 2. దొంగతనం చేయకూడదు. 3. వ్యభిచరించకూడదు. 4. అబద్దాలు చెప్పకూడదు. 5. మద్యం సేవించకూడదు. ఇవి బుద్ధుడు చెప్పిన అయిదు సూత్రాలు. హర్షుడు కాన్యకుబ్జ్ రాజధానిగా సాధారణ శకం 606 నుండి 647 మధ్యకాలంలో నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలన సాగించాడు. కాన్యకుబ్జ్-పేరు మారి తర్వాత కాలంలో కన్నౌజ్ అయింది. ఇది నేటి ఉత్తరప్రదేశ్లో ఒక నగరం. హర్షవర్ధనుడి తండ్రి ప్రభాకర వర్థన్ నేటి హర్యానాప్రాంతంలోని థానే సర్ అనే ఒక చిన్న రాజ్యానికి రాజు. ఈయన పుష్యభూతి వంశపు రాజులలో అయిదవ వాడు. ఈయన భార్య యశోమతి. ప్రభాకర వర్థన్ - యశోమతి దంపతులకు రాజ్యవర్థన్-హర్షవర్థన్ అనే ఇద్దరు కొడుకులు, రాజశ్రీ అనే కూతురు ఉండేవారు. రాజశ్రీ సంగీత సాహిత్యాలలో మంచి ప్రావీణ్యం గడిస్తుంది. ఆమె వివాహం కన్నౌజ్ రాజు గ్రహవర్మన్తో జరుగుతుంది. వారు సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్న సమయంలో మాల్వాను పరిపాలించే దేవగుప్త దండెత్తివచ్చి, గ్రహవర్మను చంపేస్తాడు. విషయం రాజ్యవర్థన్కు తెలిసి కోపోద్రిక్తుడై తన బావను చంపిన దేవగుప్తుడిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అతణ్ణి చంపి విజయుడై తిరిగి వెళుతున్నప్పుడు, అవకాశం కోసం ఎదురు చూస్తున్న గౌడ్ రాజు (నేటి బంగ్లాదేశ్ ప్రాంతపు రాజు) శశాంక్ కుట్రపూరితంగా రాజ్యవర్థన్ను చంపిస్తాడు. శశాంక్ అసలు పేరు నరేంద్ర గుప్త. ఈయన బెంగాల్ ప్రాంతపు రాజు. బలీయమైన రాజ్యకాంక్ష ఆ విధంగా రాజ కుటుంబాలను సర్వనాశనం చేస్తూ ఉండేది. హర్షుడు పుష్పవర్మన్ కుమార్తె పుష్పవతిని పెండ్లి చేసుకుంటాడు. వారికి సంతానం కలగకపోవడం వల్ల హర్షుడి తర్వాత ఆ రాజ్యం అనతికాలంలో ఛిన్నాభిన్నమైంది.
తల్లిదండ్రులు, అన్న, బావ ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం వల్ల ఆ రాజకుటుంబంలో మిగిలింది ఒక్క హర్షవర్థనుడే. అప్పుడతని వయసు కేవలం పదహారేళ్ళు. కుమిలి కుమిలి ఏడుస్తూ కాలం గడుపుతున్న సమయంలో రాజ్యాధికారం చేపట్టవలసి వచ్చింది. మంత్రులు, సైన్యాధ్యక్షులు, ప్రజలూ అందరూ హర్షుడిపై ఒత్తిడి తెస్తారు. సింహాసనం అధిష్టించి పరిపాలన కొనసాగించమని వేడుకుంటారు. తన వ్యక్తిగత దుఃఖాన్ని దిగమింగి, అనుభవం లేకపోయినా మంత్రుల అండదండలతో, ప్రజల ప్రేమాభిమానాలతో బాధ్యతను స్వీకరిస్తాడు - హర్షుడు. అలాంటి కిష్టపరిస్థితిని ఎదుర్కొని, నిలబడి, నిలదొక్కుకుని, అనుభవజ్ఞుడిలాగా అందరూ అబ్బురపడేలా ఏకరాజాధిపత్య ప్రభుత్వాన్ని కొనసాగించాడు. వ్యక్తిత్వ వికాసం - విషయంలో నేటి యువతీ యువకులు హర్షుడి జీవితం నుండి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. కల్పిత కథల్లోని, అభూత కల్పనల్లోని, పుక్కిటి పురాణాల్లోని పాత్రలను ఆదర్శంగా తీసుకోకుండా ఇలాంటి చరిత్రక పురుషుల జీవితాల్లోంచి, వాస్తవ ఘటనల్లోంచి, వారి అనుభవాల్లోంచి నేటి యువతీ యువకులు స్ఫూర్తిని పొందాలి. ముందు పురాణాలకు, చరిత్రకూ గల తేడాను తెలుసుకోగలగాలి. ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. రాముడు, కృష్ణుడు వంటి కల్పిత పాత్రలు మనకు ఆదర్శం అని చెప్పే వారి అజ్ఞానాన్ని ఎండగట్టాలి!
కుటుంబపరంగా వీరు శైవులు అయినప్పటికీ, హర్షవర్థనుడు (శిలాదిత్య) బౌద్ధధమ్మం పట్ల ఆకర్షితుడయ్యాడు. అందులో మహాయాన శాఖను స్వీకరించాడు. అశోకుడు ప్రపంచంలో తొలి బౌద్ధచక్రవర్తి అయితే, బహుశా హర్షుడే చివరి బౌద్ధచక్రవర్తి. ఆ కాలంలో హుణుల దండయాత్రలు విరివిగా కొనసాగుతూ ఉండేవి. వారిని తిప్పికొడుతూ ప్రభాకరవర్థన్ తన రాజ్యాన్ని పదిలంగా కాపాడుకున్నాడు. అయితే విస్తరించుకోలేకపోయాడు. ఆ పని ఆయన చిన్నకుమారుడితో సాధ్యమైంది. హర్షుడు ఒక్కొక్క రాజ్యాన్ని గెలుచుకుంటూ ఉత్తరాన అరబ్ ప్రాంతం నుండి దక్షిణాన నర్మదా నది దాకా రాజ్యాన్ని విస్తరింపజేశాడు. పడమరలో ఒక్క పంజాబ్ ప్రాంతం, దక్షిణంలో చాళుక్యుల రాజ్యం తప్ప మిగతా భారతదేశమంతా హర్షుడి పాలనలోనే ఉండేది. ఆక్రమించుకుంటూ రాజ్యం విస్తరించుకోవడం ఒక ఎత్తయితే, శాంతియుతంగా ప్రజారంజకంగా పరిపాలించడం మరొక ఎత్తు. కుట్రలతో అధికారంలోకి రావడం, అవివేకంతో ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తం చేయడం, అబద్దాలతో కొనసాగాలనుకోవడం, తమని ప్రజలు విశ్వసిస్తున్నారని భ్రమించడం మనం ఈ రోజుల్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆ రోజుల్లో జీవన విలువలు, నైతికత సమాజాన్ని నడిపిస్తే - ఇప్పుడు అవి పూర్తిగా కనుమరుగై పోయాయి.
భారతదేశంలో 'సతీ సహగమనం' ఎలా వాడుకలోకి వచ్చిందో తెలుసుకోవాలంటే... హర్షుడి తల్లి గురించి, ఆమె తీసుకున్న నిర్ణయం గురించీ తెలుసుకోవాలి. హర్షవర్థనుడి తండ్రి ప్రభాకర వర్థన్ మరణశయ్యపై ఉంటాడు. ఆ సమయానికి కొడుకులు ఇద్దరూ యుద్ధభూమిలో దూరంగా ఎక్కడో ఉత్తర భారత దేశంలో ఉంటారు. తండ్రి ఆరోగ్యం విషమంగా ఉన్న విషయం వేగుల వల్ల హర్షుడికి తెలుస్తుంది. ఆయన హుటాహుటిన యుద్ధభూమి నుండి వెనుదిరిగి తండ్రి దగ్గరికి వస్తాడు. మరణశయ్యపై ఉన్న తండ్రితో చివరిసారి మాట్లాడుతాడు. పక్కనే శోకదేవతలా కూర్చుని ఉన్న తల్లి యశోమతిని చూస్తాడు. తండ్రి ప్రాణాలు కాపాడటానికి ఇంకా ఏమేం చేయాల్సి ఉందో వైద్యులతో, మంత్రులతో సంప్రదించడానికి బయటికి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత ఒక పరిచారిక ''రాజమాతను కాపాడండి'' అని కేకలేస్తూ పరుగు పరుగున ఆయన మందిరంలోకి వస్తుంది. హర్షుడికి ఏమీ అర్థం కాదు. మరణశయ్యపై ఉన్నది తన తండ్రిగారైతే, ఈ పరిచారిక ఏమిటీ రాజమాతను కాపాడమంటుందీ- అని ఆశ్చర్యపోతాడు. విషయం ఏమిటో నిదానంగా స్పష్టంగా చెప్పమంటే అప్పుడు చెపుతుంది... ''రాణిగారు తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంటున్నారు - వెళ్ళి కాపాడండి'' అని కుమిలి కుమిలి ఏడుస్తూ చెపుతుంది.
గుండె పగిలిన హర్షుడు ''అమ్మా!'' అంటూ చిన్న పిల్లాడిలా రాజభవనం బయటికి పరిగెత్తాడు. అక్కడ కొంత దూరంలో చితి పేర్పించుకుని ఆయన తల్లి యశోమతి చితిచుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటుంది. చితి మీద అగ్నికీలలు పైకి ఎగిసి పడుతుంటాయి. హర్షుడు తల్లి కాళ్ళమీద పడతాడు. అగ్ని ప్రవేశం చెయ్యొద్దని, ప్రయత్నం మానుకోవాలని వేడుకుంటాడు. పొంగివచ్చే దుఃఖాన్ని ఆపుకోలేక పోతాడు. 'కరుణించు మాతా! దయచూడు తల్లీ - నువ్వు లేకుండా మేమెలా బతకాలమ్మా' అంటూ ఆమెను అడుగుముందుకేయనివ్వడు. అప్పుడు ఆ తల్లి యశోమతి కుమారుడికి ఇలా చెపుతుంది. ''కుమారా! నేను చెప్పే విషయం శ్రద్ధగా విను - మీ నాన్నగారు, ఏ క్షణంలోనైనా ప్రాణం వదిలేయవచ్చు. అందువల్ల అంతకన్నా ముందే నేను సుమంగళిగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. విధవరాలిగా ఈ ప్రపంచానికి నా ముఖం చూపదలుచుకోలేదు. పుత్రా! నువ్వు యువకుడి వయ్యావు. యుద్ధాలు చేసి వీరుడి వయ్యావు. ఇక నా సంరక్షణ నీకు అక్కరలేదు. నన్ను సుమంగళిగా వెళ్ళిపోనీరు! నా దారికి అడ్డు నిలవకు. నేను బలమైన నిర్ణయం తీసుకున్నాను. దానికి తిరుగులేదు. మీ నాన్నగారు లేని ఒంటరి జీవితం నాకు అక్కరలేదు..'' అంటూ ఆ తల్లి ముందుకు సాగిపోయింది. హర్షుడు మళ్ళీ మళ్ళీ బేలగా తల్లికాళ్ళకు అడ్డం పడ్డాడు. ఆమె మళ్ళీ మళ్ళీ ఆ మాటలే చెప్పింది. భిన్నుడైన హర్షుడు తల వంచుకుని దఃఖంలో కూరుకుపోయాడు. రాణి యశోమతి వెళ్ళి అగ్నిలో లీనమై పోయింది. హర్షుడు నేల మీద జీవచ్ఛవంలా పడిపోయాడు.
ఈ ఘట్టం ఈ దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రచన 'డిస్కవరీ ఆఫ్ ఇండియా'లో ఉంది. ఆ రచన ఆధారంగా ప్రఖ్యాత సమాంతర సినిమా దర్శకుడు శ్యాం బెనెగల్ సమర్పించిన దూరదర్శన్ సీరియల్ ''భారత్ ఏక్ ఖోజ్''లో ఈ దృశ్యం చిత్రితమైంది. ఇది సాధారణ శకం ఏడవ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటన. ఈ ఘటనకంటే ముందు భర్త చనిపోకముందే భార్యలు అగ్నికి ఆహుతికావడం అనేది జరగలేదు. ఇది కూడా ఒక రాణిగారు తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం - అప్పటికి అది ఒక సంప్రదాయంగా లేదు. భర్త మరణించకముందే ఇక్కడ ఒక భార్య తనకు తాను నిర్ణయం తీసుకుని, అగ్నికి ఆహుతైంది. విధవరాలిగా బతకడానికి భయపడింది. అంతే- ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యుల వారు రంగప్రవేశం చేశాక, వైదిక మత ఉద్దరణలో భాగంగా 'సతీ సహగమనా'నికి రూపకల్పన జరిగింది. భర్త చనిపోయిన తర్వాత భార్యలు బతికి ఉండకూడదన్న కఠినమైన నిర్ణయం వాడుకలోకి వచ్చింది. యుద్ధాల్లో భర్తలు చనిపోయారని తెలియగానే భార్యలు బావుల్లోకి దూకి మరణించడం - ఆ తర్వాత కాలాల్లో జరుగుతూ వచ్చింది.
ఇష్టం ఉన్నా లేకపోయినా భర్త చితిపైకి భార్యను సజీవంగా తోసేసి హత్య చేసేవారు. మంటల్లో కాలుతూ భరించలేక కేకలేస్తూ ఆమె లేచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తే, మళ్ళీ కర్రలతో లోపలికి తోసేసే ఏర్పాటు ఉండేది. ఇంతటి క్రూరమైన మానవ హననం ప్రపంచంలో ఏ సమాజంలోనూ లేదు. భారతీయ ఔన్నత్యం గొప్పగా పెంచి డబ్బాకొట్టుకునే ప్రబుద్ధులకు ఇలాంటి మూర్ఖపు ఆచారాలు కనబడవా? ఇదెక్కడి స్త్రీ జనోద్దరణ? ఇదెక్కడి మానవ వాదం? ఇలాంటి అమానవీయ, అనాగరిక ఆచారాలు ఏర్పరుచుకున్నందుకే ప్రపంచం మన దేశం వైపు వింతగా చూస్తోంది. మనలో కొందరు మాత్రం ''మా సంస్కృతే గొప్పది'' అని వృధాగా చంకలు కొట్టుకుంటున్నారు.
సతీ సహగమనాన్ని అరికట్టడానికి దేశ స్వాతంత్య్రానికి ముందు నుండే విస్తృతంగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాజా రామ్మోహన్రారు లాంటి సంఘ సంస్కర్తలు నాటి బ్రిటిష్ పాలకులతో నిరంతరం సంఘర్షించాల్సి వచ్చింది. చివరకు ఇందులో మూర్ఖత్వాన్ని అర్థం చేసుకుని, నాటి బ్రిటిష్ పాలకులే ఈ ఆచారాన్ని రద్దు చేస్తూ చట్టం చేశారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారి పనులు కిందిస్థాయిలో ఉన్నవారిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ! హర్షుని తల్లి - ఒక రాణి గారు - తన ఇష్ట ప్రకారం అగ్నికి ఆహుతవుతుంది - నిజమే! కానీ, అది కొంత మంది కుత్సిత బుద్ధులకు ఒక దురాలోచనను ఇచ్చింది. 'సతీ సహగమనం పేర ఒక దుష్ట సంప్రదాయానికి దారి తీసింది. దేశ జనాభాలో సగభాగమైన స్త్రీలను అణిచిపెట్టడానికి వైదిక ప్రభోదకులకు ఒక మార్గం దొరికింది. చెడగొట్టడం తేలిక - దాన్ని పునరుద్దరించుకోవడం చాలా కష్టం!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి
అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.