Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ వ్యాప్తంగా ఉన్న పండిత మేధావుల టీమ్‌ను భాగస్వాముల్ని చేసి కొత్త పాఠ్యపుస్తకాలను తయారు చేయించి, అంతకు ముందు ప్రభుత్వం తీసుకొచ్చిన పాఠ్య పుస్తకాల్ని తొలగించారు. పాఠ్యాంశాల్ని తయారు చేసేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న మేధావుల్ని వారి రాజకీయ సానుభూతినిబట్టి కాక వారి మేథస్సు ఆధారంగా ఎంపిక చేశారు. ఇది స్వాగతించాల్సిన విషయమే కానీ ఆరెస్సెస్ పాఠశాలల్లో లేదా మైనారిటీ మతాలు నడిపే పాఠశాలల్లో బోధించే చరిత్ర పాఠాల ద్వారా వేగవంతమైన మతీకరణను యుద్ధ ప్రాతిపదికన సవాల్ చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో దురదృష్టవశాత్తు లౌకికశక్తులు విఫలం చెందాయి.
''హేతుబద్ధీకరణ'' ప్రక్రియలో భాగంగానే ఇటీవల కాలంలో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుండి కొన్ని భాగాల్ని తొలగించాల్సి వచ్చిందని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ వివరణ ఇచ్చారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి వల్ల విద్యా కార్యక్రమాల్ని కోల్పోయిన పిల్లలపై భారాన్ని తగ్గించడానికే ఈ తొలగింపులని ఆయన అన్నాడు.
చరిత్ర, సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రాల పాఠ్యపుస్తకాల నుండి తొలగింపులు, ఆ సందర్భంగా పాలక పార్టీ సభ్యుల రాజకీయ ప్రకటనలు, చరిత్ర వక్రీకరణ కోసం హిందూ మతతత్వవాదులు సుదీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాల చరిత్రను విశ్లేషిస్తే మనకు విషయం స్పష్టమవుతుంది. మతోన్మాదులు చారిత్రకంగా ప్రదర్శించిన మోసపూరిత వైఖరి కూడా ఇదే. వీరు అసలు తమ చర్యలకు బాధ్యత వహించరు. తమ చర్యలకు బాధ్యత వహించి, దేశాంతర వాసం, జైలుశిక్ష, మరణ శిక్షలతో సహా అనేక పరిణామాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న భగత్ సింగ్, గాంధీజీ, తిలక్ ఇంకా అనేకమంది ఇతరుల వలె కాకుండా, గాంధీజీ హత్యకు ఏ సంస్థ బాధ్యత వహించలేదనీ (బాధ్యతను నిర్థారించే కొన్ని పేరాల్ని ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుండి తొలగించారు), బాబ్రీ మసీదు కూల్చివేత ''నేరపూరిత చర్య'' అని పేర్కొన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు ఎవరూ కట్టుబడి లేరనీ, గుజరాత్ నరమేధానికి ఎవరూ బాధ్యత వహించలేదని మాకు చెప్పారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుండి ఈ భాగాలన్నింటినీ తొలగించారు.
చరిత్రను వక్రీకరించే చారిత్రక వర్ణనలు
మతపరమైన ప్రాజెక్టుకు మతపరమైన భావజాలం చాలా ముఖ్యం అని ఆర్ఎస్ఎస్ చాలా ముందుగానే గుర్తించింది. ఒక నిర్దిష్టమైన చారిత్రక దృక్పథం క్రమంగా ఒక మతపరమైన భావజాలాన్ని రూపొందిస్తుంది. కాబట్టి మహాత్మాగాంధీ హత్య నేపథ్యంలో ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ తమ సంస్థ కేవలం ఒక సాంస్కృతిక సంస్థగానే పని చేస్తుందని ప్రమాణం చేసిన తరువాత మాత్రమే ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని తొలగించారు. తరువాత ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని వ్యాప్తి చేసే పనిలో నిమగమైంది. 1950 నుండి ఆర్ఎస్ఎస్ తన పాఠశాలలు(మొట్టమొదటి సరస్వతీ శిశుమందిర్‌కు నాటి ఆర్ఎస్ఎస్ అధినేత ఎం.ఎస్. గోల్వాల్కర్ ప్రారంభోత్సవం చేశాడు), తన పాఠ్యపుస్తకాల ద్వారా వక్రీకరించబడిన చరిత్రను, పూర్తిగా ఊహాజనితమైన చారిత్రక దృక్పథాన్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నించింది. ఈ దృక్పథం ఇతర మతాలకు చెందిన వారిని ప్రమాదకారులుగా కూడా చిత్రించింది.
ఉదాహరణకు... నాల్గవ తరగతి చదివే తొమ్మిది సంవత్సరాల వయస్సు గల పిల్లల లేత మనసులపై ముద్రపడే విధంగా ఇస్లాం గురించి ఇలా బోధిస్తారు: ''వారు ఎక్కడికి వెళ్ళినా, వారి చేతిలో ఒక కత్తి ఉంటుంది. వారి మార్గానికి అడ్డొచ్చిన ఏ దేశాన్ని అయినా ధ్వంసం చేస్తారు. ప్రార్థనా మందిరాల్ని, విశ్వవిద్యాలయాల్ని ధ్వంసం చేశారు. గ్రంథాలయాల్ని దగ్ధం చేశారు. మతపరమైన గ్రంథాల్ని ధ్వంసం చేశారు. తల్లులు, అక్కాచెల్లెళ్ళను కూడా అవమానించి, హింసించారు. జాలి, న్యాయం అనే పదాలు వారికి అసలు తెలియదు.'' ఇంకా ''ఢిల్లీలోని ఖుతుబ్ మినార్ను వాస్తవానికి సముద్రగుప్తుడు అనే చక్రవర్తి కట్టించాడు. దాని అసలు పేరు విష్ణుస్తంభం. ఖుత్బుద్దీన్ ఐబక్ అనే సుల్తాన్ వాస్తవంగా ఈ విష్ణుస్తంభంలోని కొన్ని భాగాలను కూల్చివేయించాడు. తరువాతే దాని పేరు మార్చబడింది.''
భారతదేశం ''పితృభూమి''గా, ''పవిత్ర భూమి''గా ఉన్న వారు మాత్రమే భారతీయులు అనే సావర్కర్ నిర్వచనాన్ని ఉపయోగించి ముస్లింల వలె క్రైస్తవులు, పార్శీలు కూడా ''విదేశీయులే'' అని, వారు కూడా పౌరసత్వ హక్కులకు తగిన వారు కాదని, వారిపై కూడా నిందారోపణలు చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి హాస్యాస్పదమైన నిర్వచనాన్ని యూరోప్, అమెరికా, కొరియాలోని క్రైస్తవులకు, లేదా జపాన్‌లోని బౌద్ధులకు అన్వయిస్తే, వారి పవిత్ర స్థలాలు వారు నివసించే దేశంలో లేవు కాబట్టి వారి స్వంత దేశంలోనే వారు విదేశీయులు అవుతారు.
చరిత్ర వక్రీకరణకు ఉపయోగపడుతున్న రాజ్యాధికారం
ఒకవైపు ఆర్ఎస్ఎస్ పాఠశాలల్లో ఇలాంటి చరిత్రను ప్రచారంలోకి తెచ్చే ప్రయత్నంతో పాటు, ఇంతకంటే ప్రమాదకరమైన మరొక అంశం ఏమిటంటే, రాజ్యాధికారాన్ని చేపట్టిన ప్రతీ సందర్భంలో ఇలాంటి చరిత్రను ప్రభుత్వ పాఠశాలల్లోను, కేంద్ర విద్యా సంస్థల్లోను ప్రవేశపెట్టి, లౌకిక వైజ్ఞానిక చరిత్రపై దాడిని ప్రారంభించడానికి ఆరెస్సెస్ తన రాజ్యాధికారాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది.
1977-79 మధ్య కాలంలో కేంద్రంలో జనతాపార్టీ అధికారం చేపట్టిన సమయంలో మొదటిసారి చరిత్రపై పెద్ద దాడి జరిగింది. అప్పటికే ఆరెస్సెస్ రాజకీయ అనుబంధ సంస్థ జనసంఫ్‌ు, జనతాపార్టీలో విలీనమై అధికారంలో భాగస్వామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించిన మేథావులైన రొమిల్లా థాపర్, బిపన్ చంద్ర, సతీష్ చంద్ర, ఆర్.ఎస్.శర్మ, అర్జున్ దేవ్ లాంటి వారిచే రచించబడిన ప్రస్తుత ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను నిషేధించాలని కోరారు. కానీ ఆ సమయంలో భారతదేశంలోని సంస్థలు అప్పటికే స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. ఆ రచనలపై నిషేధం విధించాలనే ప్రయత్నాన్ని ఎన్సీఈఆర్టీ లోపల, మీడియా, విశ్వ విద్యాలయాల్లో దేశ వ్యాప్తంగా ప్రతిఘటించారు. కానీ అవే పాఠ్యపుస్తకాలు ఉనికిలో ఉన్నాయి.
ఆ తరువాత 1999లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. ఆరెస్సెస్‌కు ఒకప్పుడు రాజకీయ అంగంగా ఉన్న జనసంఫ్‌ు స్థానంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వానికి సారథ్యం వహించింది. గతంలోని అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని, (లౌకిక వైజ్ఞానిక చరిత్రకారులపై దాడిని ప్రారంభించడానికి ముందు) సిలబస్ కమిటీలలోని కీలకమైన వ్యక్తుల్ని, ఎన్సీఈఆర్టీ, యూజీసీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సంస్థల్లో ఉన్నత స్థానాల్లోని కీలక వ్యక్తులను తొలగించింది. మతపరమైన భావనలు గాయపడ్డాయనే కారణంగా ఆర్.ఎస్ శర్మ, రొమిల్లా థాపర్, బిపన్ చంద్ర, సతీష్ చంద్ర లాంటి వారిచే రచించబడిన ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లోని 41పేరాలను తొలగించాలని కోరారు. ఆ పేరాల్ని ఇప్పటికే తొలగించారు. ఎన్ సీఈఆర్టీకి నూతన డైరెక్టర్‌గా నియమితుడైన జే.ఎస్.రాజ్ పూత్ రచించిన వ్యాసంలో లౌకిక మేధావులు, వారిని సమర్థించిన వారిని (వీరిలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, దేశంలో వృత్తిపరమైన చరిత్రకారుల ప్రతినిధి బృందం, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, భారత రాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్, ప్రధాన వార్తాపత్రికల సంపాదకులు ఉన్నారు) ''జాతి వ్యతిరేకులు''గా అభివర్ణించాడు. ఆర్ఎస్ఎస్ ఛీఫ్ కే.ఎస్.సుదర్శన్ వారిని ''హిందూ వ్యతిరేక యూరో ఇండియన్లు''గా ముద్ర వేశాడు.
హిందూ మతోన్మాద చారిత్రక దృక్పథాన్ని అంగీకరించని వారిపై దాడి చేసే ధోరణి, ముఖ్యంగా భారత జాతీయవాదానికి స్వీయ నియమిత రక్షకులుగా చెప్పుకునే ఒక గ్రూప్ వారు నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మురళీమనోహర్ జోషి ఇంటి వద్ద చేరి, రొమిల్లా థాపర్, ఆర్ఎస్ శర్మ, అర్జున్ దేవ్ లాంటి చరిత్రకారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసినప్పుడు స్పష్టం అయింది. ఈ చరిత్ర పండితులు రచించిన చరిత్రను ''మేథో తీవ్రవాదం''గా ముద్ర వేయడం ద్వారా వారి ఫాసిస్ట్ ధోరణికి విద్యామంత్రి మరింత ఆజ్యం పోశాడు. అంతేకాక ఈ ''మేథో తీవ్రవాదం సరిహద్దు తీవ్రవాదం కంటే ప్రమాదమైనదనీ'', దీనిని సమర్థవంతంగా ఎదుర్కొవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి వ్యాఖ్యానించాడు. చివరకు ''తీవ్రవాద మేథావులు'' రచించిన ప్రస్తుత ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు తొలగించి, కొత్త పాఠ్యపుస్తకాలను తెప్పించారు. తిరిగి 2004లో కేంద్రంలో హిందూ మతోన్మాదశక్తులు అధికారం కోల్పోవడంతో మతతత్వదాడుల నుంచి కొంత ఉపశమనం కలిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న పండిత మేధావుల టీమ్‌ను భాగస్వాముల్ని చేసి కొత్త పాఠ్యపుస్తకాలను తయారు చేయించి, అంతకు ముందు ప్రభుత్వం తీసుకొచ్చిన పాఠ్య పుస్తకాల్ని తొలగించారు. పాఠ్యాంశాల్ని తయారు చేసేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న మేధావుల్ని వారి రాజకీయ సానుభూతినిబట్టి కాక వారి మేథస్సు ఆధారంగా ఎంపిక చేశారు. ఇది స్వాగతించాల్సిన విషయమే కానీ ఆరెస్సెస్ పాఠశాలల్లో లేదా మైనారిటీ మతాలు నడిపే పాఠశాలల్లో బోధించే చరిత్ర పాఠాల ద్వారా వేగవంతమైన మతీకరణను యుద్ధ ప్రాతిపదికన సవాల్ చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో దురదృష్టవ శాత్తు లౌకికశక్తులు విఫలం చెందాయి. (మిగతా రేపటి సంచికలో)
(''ద వైర్'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్, 9848412451
- ఆదిత్య ముఖర్జీ
- మృదుల ముఖర్జీ