Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం వంటి కీలకాంశాలపై ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి వైఖరిని తీసుకోగలిగితే, ప్రజా సమస్యలపై ఐక్య కార్యాచరణ చేపట్టగలిగితే, మొత్తం ప్రతిపక్షం విశ్వసనీయత పెరుగుతుంది. అప్పుడు ప్రజలు వాటిని బీజేపీకి ప్రత్యామ్నాయంగా భావించడం మొదలుపెడతారు. లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు, ఈ ఐక్యతా చొరవలన్నీ ప్రతిపక్ష పార్టీలకు (అవి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోనప్పటికీ) ఏదోఒక విధంగా ఉపయోగపడతాయి. అందువల్ల అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒకేచోటకు చేర్చేందుకు ప్రస్తుతం జరుగుతున్న యత్నాలు ఒక స్పష్టమైన డైరెక్షన్లో ముందుకు సాగేలా చూడడం అత్యంత కీలకం.
ఈ మధ్య ప్రతిపక్షాల ఐక్యత గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం వినిపిస్తోంది. వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశాల మీద సమావేశాలు జరుపుతుండటంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండవ అర్థభాగంలో 18ప్రతిపక్ష పార్టీలు ప్రదర్శించిన ఐక్యవైఖరి నేపథ్యంలో ఈ అంశం ముందుకొచ్చింది. అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జె.పి.సి) వేయాలని ఆ పార్టీలన్నీ డిమాండ్ చేశాయి. అలాగే, ప్రతిపక్ష నేతలను ఈడీ, సిబిఐ లక్ష్యంగా చేసుకోవడాన్ని కూడా అవి సమైక్యంగా వ్యతిరేకించాయి.
క్రిమినల్ పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి శిక్ష విధించడం, ఆ వెంటనే రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినప్పుడు ఐక్యంగా వ్యవహరించాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇతర నేతల అరెస్టు, విచారణ చూశాక, నిరంకుశ ప్రభుత్వం నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మనుగడ కోసం సాగే పోరాటంగా చాలామంది గుర్తించారు. అయితే ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలన్న లక్ష్యాన్ని సాధించేందకు అనుసరించిన మార్గం, వివిధ రాజకీయ వ్యాఖ్యాతలు, మీడియా ఈ విషయమై చేస్తున్న ఊహాగానాలు చూస్తుంటే... దీని గురించి వాటికి స్పష్టమైన ఆలోచన కొరవడిందని, అవాస్తవిక అంచనాలతో వున్నాయని అర్థమవుతోంది. అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకే వేదికపైకి వస్తే అది అఖిల భారత ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటుకు ఆలంబనగా ఉంటుందని చెప్పడం చాలా తేలికైన భావన. జాతీయ స్థాయిలో ప్రతిపక్షం తరపున బరిలో నిలిచే నేత ఎవరనే దాని గురించి చర్చించడం మరో వ్యర్థ ప్రయత్నం. రాష్ట్రంలోని అత్యంత బలమైన ప్రతిపక్ష పార్టీ... అది ప్రాంతీయ పార్టీ అయినా లేదా జాతీయ పార్టీ అయినా సరే... బీజేపీ, దాని మిత్రపక్షాలతో ముఖాముఖి పోటీ పడగలిగేలా ఇతర పార్టీలతో అవగాహనకు అవసరమైన షరతులు, నిబంధనలను రూపొందించు కోవడానికి లేదా నిర్దేశించడానికి అనుమతించాలనేది ఈ చర్చలో వచ్చిన మరో ముఖ్యమైన అంశం.
ఈ సూచనలన్నీ క్షేత్ర స్థాయిలో వాస్తవికతకు దూరంగా ఉన్నవే. ప్రతిపక్ష పార్టీల భిన్నమైన స్వభావాలు, సంక్లిష్టతలను ఇవి ఏమాత్రం పరిగణనలోకి తీసుకున్నట్టుగా లేదు. మొట్టమొదట స్పష్టం చేయాల్సిన అంశం ఏమిటంటే అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో కూడిన కూటమి లేదా ఫ్రంట్ రూపంలో ప్రతిపక్షాల ఐక్యతను జాతీయ స్థాయిలో రూపొందించలేమని అర్థంచేసుకోవాలి. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో ముఖాముఖి పోటీ ఉండేలా చూడటం ద్వారా బీజేపీపై విజయం సాధించవచ్చనేది మరో భావన. సంకుచిత ఎన్నికల దృక్పథం నుండి వచ్చిన తప్పుడు ఆలోచన ఇది.
ప్రజాస్వామ్యంపై మూకుమ్మడి దాడి, రాజ్యాంగ విధ్వంసం, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రాష్ట్రాల హక్కులు, సమాఖ్యవాదంపై వ్యవస్ధాగతమైన దాడి, హిందూత్వ సిద్ధాంతాలను విద్యా రంగంలోకి చొప్పించడం, మైనారిటీలపై దాడులు వంటి ప్రధానమైన జాతీయ, కీలకమైన రాజకీయ అంశాలపై తీసుకునే ఉమ్మడి వైఖరే ప్రతిపక్షాల ఐక్యతకు ముఖ్య ప్రాతిపదిక అని గ్రహించాలి.
దేశ భవిష్యత్‌కు సంబంధించి కీలకమైన, ప్రాథమికమైన అంశాలు ఇవి. హిందూత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం కోసం పోరాడేందుకు వారు ఎంతవరకు ఐక్యంగా కలిసి వస్తారనేది ప్రతిపక్షాల ఐక్యతకు ఒక పరీక్షగా నిల్చింది. వీటితో పాటు ప్రధానిని, ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసే అనేక కీలకాంశాలు ఉన్నాయి. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై పార్లమెంట్లో అన్ని రకాల చర్చలకు అడ్డుగోడగా మోడీ ప్రభుత్వం నిలవడం, పార్లమెంట్లో మోడీ చేసిన ప్రసంగంలో అదానీ పేరును కనీసం ప్రస్తావించకపోవడం ఈ మొత్తం వ్యవహారం మీద సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడానికి తిరస్కరించిన తీరు ఇవన్నీ కలిసి పార్లమెంట్లో ప్రతిపక్షాల విస్తృత ఐక్యతకు దోహదపడ్డాయి. పార్లమెంట్ వెలుపల కూడా ఇదే ఐక్యత కొనసాగాలి.
అదానీ అసాధారణంగా ఎదిగిన తీరుపై ప్రధానిని జవాబుదారీ చేయడం, పుల్వామా దాడికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వెల్లడించిన అంశాలపై జవాబు రాబట్టేలా చూడటం వంటివన్నీ ప్రతిపక్షాలను ఏకంచేసే అంశాలే. అదే సమయంలో, రాష్ట్రాల హక్కులపై, సమాఖ్యవాదంపై కేంద్రం దాడిని సమైక్యంగా తిప్పికొట్టేందుకు బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కనీసం ఒక్కసారైనా సమావేశం కాకపోవడం మొత్తం ప్రతిపక్ష పార్టీల ఆలోచనా ధోరణిలో సమగ్రత కొరవడిన విషయాన్ని తెలియచేస్తోంది.
అన్ని కీలకమైన విధానపరమైన అంశాలపై తమ ప్రత్యామ్నాయ వైఖరిని ప్రతిపక్షాలు ముందుకు తేగలిగితే, ప్రజాస్వామ్యం లౌకికవాదం, సమాఖ్యవాదం వంటి వాటి పరిరక్షణకు అవి గట్టిగా నిలబడగలిగితే, అది, సమైక్య ప్రత్యామ్నాయాన్ని సాధించే దిశగా వేసిన ఒక ముందడుగుగా భావించవచ్చు. ప్రజా సమస్యల పైన అలాగే ప్రజల జీవనోపాధుల పైన నిరంతరం సాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రచారాలు, నిరసనలకు పిలుపు ఇవ్వడం వంటివి చేయాలి.
ఇటువంటి పిలుపులను పలు పార్టీలు కలిసి ఉమ్మడి వేదికల ద్వారాగాని, ఐక్య కార్యాచరణ ద్వారాగాని చేయాలి. ఇది సాధ్యం కాని రాష్ట్రాల్లో సంబంధిత పార్టీలు సమాంతర కార్యాచరణ ద్వారా విడిగా నిర్వహించుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఉమ్మడిగా పిలుపునిచ్చినా, కొన్ని రాష్ట్రాల్లో అది అమలు చేయలేని పరిస్థితుల్లో కొన్ని పార్టీలు ఉన్నందున ముందుకెళ్లాల్సిన వాస్తవిక మార్గమిదే.
బీజేపీ వ్యతిరేక ఓట్లను గరిష్ట స్థాయిలో సమీకరించేందుకు రాష్ట్రస్థాయిలో ఎన్నికల ఎత్తుగడలను రూపొందించుకునేందుకు అనువైన పరిస్థితిని కల్పించే సూచనలే ఇవన్నీ. ప్రస్తుతానికి, బీజేపీ, దాని కూటమిపై పోరాడేందుకు విస్తృత అవగాహన కుదిరిన రాష్ట్రాలు రెండే రెండు ఉన్నాయి. అవే తమిళనాడు, బీహార్.
ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం వంటి కీలకాంశాలపై ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి వైఖరిని తీసుకోగలిగితే, ప్రజా సమస్యలపై ఐక్య కార్యాచరణ చేపట్టగలిగితే, మొత్తం ప్రతిపక్షం విశ్వసనీయత పెరుగుతుంది. అప్పుడు ప్రజలు వాటిని బీజేపీకి ప్రత్యామ్నాయంగా భావించడం మొదలుపెడతారు. లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు, ఈ ఐక్యతా చొరవలన్నీ ప్రతిపక్ష పార్టీలకు (అవి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోనప్పటికీ) ఏదోఒక విధంగా ఉపయోగపడతాయి. అందువల్ల అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒకేచోటకు చేర్చేందుకు ప్రస్తుతం జరుగుతున్న యత్నాలు ఒక స్పష్టమైన డైరెక్షన్లో ముందుకు సాగేలా చూడడం అత్యంత కీలకం. ముఖ్యమైన జాతీయ సమస్యలపై స్పష్టమైన ప్రత్యామ్నాయంతో ఐక్యంగా ముందుకు కదలడం, రాష్ట్రాలలో బీజేపీపై పోరుకు ప్రజలను సమీకరించి వీలైన చోటల్లా ఐక్య కార్యాచరణకు పూనుకోవడం, బీజేపీ వ్యతిరేక ఓట్లను గరిష్ట స్థాయిలో ఒకేచోట చేర్చడం వంటివి చేసినప్పుడే ఆ ఐక్యతా యత్నాలకు సార్థకత.
- 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం