Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యాయవ్యవస్థ సౌధానికి నిలువెత్తు పగుళ్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ ఇక ఎంత మాత్రం రాజ్యాంగ మౌలిక స్వభావ పరిరక్షకురాలు కాజాలదన్న భయం కలుగుతూ ఉన్నది. ఇది భారత ప్రజాస్వామ్యానికి మాత్రమే కాదు, భారత విశాల ప్రజా సామాన్యానికి కూడా పొంచి ఉన్న పెద్ద ప్రమాదమని గ్రహించాలి. ప్రజాస్వామ్య విలువలే వమ్మయిపోతే మనకు దిక్కేది? అయితే ముంచుకొస్తున్న హిందూ అధిక సంఖ్యాక ఆధిపత్య వాదానికి సాధారణ ప్రజానీకం అధిక మూల్యం చెల్లిస్తున్నది.
ప్రజాస్వామ్య మూలస్తంభాలకు బీటలు పడిపో తున్నాయి. ప్రతిరోజు రాజ్యాంగం అపహాస్యం చేయబడుతోంది. చట్టబద్ధ సంస్థలన్నీ ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయబడుతున్నాయి. వాతావరణం ద్వేషపూరితమై భగ్గున మండుతోంది. 2014లో భారత ప్రజాస్వామ్యంపై ఫాసిస్టు కొండచరియ విరిగిపడ్డ తర్వాత, అప్పటిదాకా నామమాత్రంగా నైనా నడిచిన ప్రజాస్వామ్య వ్యవస్థలన్ని ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. సాంఘిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు విద్వేష బీజాలను నేరుగా వ్యక్తుల మనస్సులోనే నాటుతున్నాయి.
మానవ సమాజం మెరుగైన పాలనా వ్యవస్థ కోసం చరిత్ర పొడవున సాగించిన సుదీర్ఘ మేధో సంఘర్షణ ఫలితంగా ఆవిష్కరించబడిన ప్రజాస్వామ్య భావనకు, ప్రజా సమస్యలు, ప్రజా సంక్షేమమే కేంద్రం కావాలి. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, వ్యవసాయం, అభివృద్ధి, వాతావరణ సంక్షోభం వంటివి దేశ రాజకీయ యవనికపై చర్చించబడవలసిన అంశాలుగా ఉండాల్సింది. అయితే హిందూత్వ శక్తులు అధికారం చేపట్టిన తరువాత మసీదులు, గుళ్ళు, ట్రిపుల్ తలాక్, గోమాంసం, హిజాబ్ చుట్టూ మన చర్చ కేంద్రీకృతమై పోతున్నది. పెరుగుతున్న ధరలు, ప్రయివేటు పరం అవుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రయివేటు వ్యక్తుల పరం అవుతున్న వనరులు, జాతి ఉమ్మడి సంపద చర్చించబడవలసిన అంశాలు కావన్నంతగా మన దృష్టి మరల్చబడింది. వాస్తవాలకు అద్దం పట్టవలసిన ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభం అధికారంతో మిలాఖతై దృష్టి మళ్లింపు రాజకీయాలకు కావాల్సినంత దోహదపడుతున్నది. గత దశాబ్ద కాలంగా సాంఘిక, ప్రసార మాధ్యమాల ద్వారా అదే పనిగా కొనసాగుతున్న విద్వేష, అసత్య ప్రచారం మన సహజ వివేకాన్ని మసకబార్చింది, మనల్ని మానవీయ స్పందనలకు దూరం చేసినట్టుంది.
అందుకేనేమో కేవలం ఆవు మాంసం కలిగి ఉన్నాడన్న అనుమానంతో మహమ్మద్ అఖ్లాక్ను, ఆవుల్ని కబేళాకు తరలిస్తున్నాడన్న అనుమానంతో పెహలు ఖాన్ అనే పాడి రైతును బహిరంగంగా కొట్టి చంపినా మన 'సామూహిక వివేచన'కు చీమకుట్టినట్టైనా కాలేదు. హత్రాస్‌లో అగ్రవర్ణాల వారి చేతిలో లైంగిక దాడికి గురైన 19ఏండ్ల దళిత అమ్మాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చివరి చూపుకు కూడా అవకాశం ఇవ్వకుండా అర్థరాత్రి రెండు గంటలకు పోలీసులే దహనం చేసినప్పుడు కూడా మనం కనీసం మనవీయ స్పందన లేకుండా పోయాం.
అంతెందుకు మొన్నటికి మొన్న గుజరాత్ అల్లర్లలో గర్భిణీ అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై లైంగికదాడి చేసిన 11మందిని 'సత్ప్రవర్తన' కలిగి ఉన్నారన్న నెపంతో విడుదల చేసినప్పుడు కూడా మన మానవత్వం మిన్నకుండి పోయింది. నిజానికి మనలోని మానవత్వం ఎందుకిలా ఆవిరి అవుతున్నది. ద్వేషం అసహనపు విషపు గాలికి మనం ఎందుకు అలవాటు పడుతున్నాం. మనిషి ప్రాణం కన్నా ఆవు ప్రాణం విలువైనదని ఎవరు చెబుతున్నారు? మనిషి కోసం మతం కాదని మతం కోసమే మనిషి అన్నంతగా వాతావరణన్ని ఎవరు వేడెక్కిస్తున్నారు? ప్రశ్నించే గొంతులకు చెరసాలలే ఎందుకు బహుమానాలు అవుతున్నాయి? ఇలా మనం దృష్టి పెట్టవలసిన అంశాలేవి సాంఘిక మాధ్యమాలలో గాని, ప్రసార మాధ్యమాలలో గాని చర్చకు రావటం లేదు. చర్చనంత మతం చుట్టూ మత విశ్వాసాల చుట్టూ నడపటానికి, కీలకమైన విషయాల నుంచి మన దృష్టి మళ్లించటానికి, మన ప్రాధామ్యాల్లో మతాన్ని, పరమత విద్వేషాన్ని ముందుంచటానికి విశ్వప్రయత్నం చేస్తున్న వికృతకాలం గుండా మన ప్రజాస్వామ్యం కష్టతర ప్రయాణం చేస్తున్నది.
రాజ్యాంగం అన్నా, రాజ్యాంగ విలువలు అన్నా వీసమెత్తు గౌరవం లేని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మన రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నట్టే కదా! భారత రాజ్యాంగం సనాతన ధర్మానికి భారతీయ విలువలకు అనుగుణంగా లేదని సంఫ్‌ు పెద్ద అంటాడు. రాజ్యాంగాన్ని మార్చటానికే వచ్చామని ప్రభుత్వ పెద్దలంటారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెచ్చిన చట్టాలు చాలా వరకు రాజ్యాంగానికి వ్యతిరేకమైనవే. గత ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలు చేయనేలేదని కాదు గాని, అలాంటి చట్టాలు అనేకం కోర్టుల్లో ఓడిపోయేవి. ప్రజాస్వామ్య వాదులకు గానీ, సామాన్య ప్రజానీకానికి గానీ, అన్యాయమైన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి న్యాయం పొందటానికి కోర్టులు ఆలంబనగా ఉండేవి. కానీ 2014 తర్వాత, అది అయోధ్య తీర్పు అయితేనేమి, ట్రిపుల్ తలాక్, హిజాబ్, అగ్రకుల, వర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ తీర్పులు అయితేనేమి, ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న తీర్పులన్నీ న్యాయవ్యవస్థర నిస్పాక్షికతను సందేహాస్పదం చేస్తున్నాయి.
న్యాయవ్యవస్థ సౌధానికి నిలువెత్తు పగుళ్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ ఇక ఎంత మాత్రం రాజ్యాంగ మౌలిక స్వభావ పరిరక్షకురాలు కాజాలదన్న భయం కలుగుతూ ఉన్నది. ఇది భారత ప్రజాస్వామ్యానికి మాత్రమే కాదు, భారత విశాల ప్రజా సామాన్యానికి కూడా పొంచి ఉన్న పెద్ద ప్రమాదమని గ్రహించాలి. ప్రజాస్వామ్య విలువలే వమ్మయిపోతే మనకు దిక్కేది? అయితే ముంచుకొస్తున్న హిందూ అధిక సంఖ్యాక ఆధిపత్య వాదానికి సాధారణ ప్రజానీకం అధిక మూల్యం చెల్లిస్తున్నది.
హిందుత్వవాద శక్తులు అధికారంలోకి వచ్చాక, మొదటి సంవత్సరాలలో గోరక్షణ, ట్రిపుల్ తలాక్ రద్దు, సీఏఏ, ఎన్ఆర్సీ వంటి అంశాలతో దేశం దృష్టిని ముస్లిం మైనారిటీల పట్ల విద్వేషాన్ని నింపటానికి శత విధాల ప్రయత్నించింది. భీమా కోరేగాం అల్లర్ల పేరుతో తప్పుడు కేసులు బనాయించి దేశంలోని ప్రగతిశీల శక్తులను అక్రమంగా జైల్లో నిర్బంధించింది. దక్షిణ భారతదేశంలో సైతం విద్వేష రాజకీయాలను పెంచి పోషిస్తూ ఉన్నది. మన రాష్ట్రంలో సైతం హేతువాదులు, నాస్తికులు, అంబేద్కర్‌వాదులు ప్రగతిశీల శక్తులపై భౌతిక దాడులు జరుపుతున్నది. అయితే 2002 సంవత్సరంలో ముస్లిం మైనారిటీలపై వారు సాగించిన నరమేధానికి పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల యువతను వాడుకున్నట్టే, ఇక్కడ సైతం ఈ వర్గాల యువతనే దాడులకు ఉసిగొలుపు తున్నది. నరేంద్ర దబోల్కర్, గోవిందుపన్సారే, కలబుర్గి, గౌరీ లంకేష్ వంటి వారి హత్యల కోసం ఉపయోగించింది బడుగు బలహీన వర్గాల యువకులనే.మన రాష్ట్రంలో సైతం ప్రగతిశీల, అభివృద్ధి కాముక శక్తులపై దాడులకు ఉపయోగిస్తున్నది బడుగు బలహీన వర్గాల యువకులనే. 'భారత నాస్తిక సమాజం' సంస్థకు రాష్ట్ర బాధ్యుడైన బైరి నరేష్, అంబేద్కర్ వాది రేంజర్ల రాజేష్, నిర్మల్ ప్రాంతానికి చెందిన అంబేద్కర్ వాది మగ్గడి దిగంబర్, బోధన్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లికార్జున్‌లపై ఇటీవల జరిగిన దాడులన్నింటిలో వెనకబడ్డ, దళిత యువకులనే వాడుకున్నారు. ఈ దాడులన్నీ జరిగింది, అనేక రకాలైన ప్రగతిశీల ఉద్యమాలు నడిచిన మన ప్రాంతంలోనే, మన రాష్ట్రంలోనే. అనేక సంఘసంస్కరణ, నాస్తిక, హేతువాద ఉద్యమాలు నడిచి, ప్రజా సామాన్యంలో ప్రగతిశీల చర్చకు దారి తీసిన చోటే దాడులు జరుగుతున్నాయి. ఆలోచనలో, ఆచరణలో ఒక అడుగు ముందే ఉన్న మన ప్రాంతంలోనే హిందుత్వ శక్తులు బరితెగించి దాడులు చేస్తూ ఉండటం, భిన్న పాయలుగా, విడివిడిగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న ప్రగతిశీల వాదులకు ఒక హెచ్చరిక లాంటిదే. మన సమాజం క్రమంగా నియంతృత్వం నుంచి ఫాసిజం లోకి ఒక్కొక్క అడుగు వేస్తున్న దనటానికి ఇది ఒక తిరుగులేని సూచిక.
- టి. హరికృష్ణ
9494037288