Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్గ చైతన్యమే వర్గ పునాది అని భావించినవారు, ఆ చైతన్యాన్నే పరమావధిగా తలచి ఎప్పటికప్పుడు అధ్యయనంతో తమ ప్రాపంచిక వర్గ దృక్పథాన్ని పదును పెట్టుకుంటూ ఉంటారు. తాము తెలుసుకున్న జ్ఞానాన్ని శ్రేణులకు, స్నేహితులకు, ఆ తర్వాత ప్రజలకు ఉద్యమాల ద్వారా వంట పట్టించేలా పాటుపడతారు. తత్సంబంధిత వ్యూహాలు, ప్రణాళికలు రచించి పాఠశాలలు, గోష్టులు, సదస్సులు నిర్వహించడం కమ్యూనిస్టులకు కొత్తేం కాదు. అయితే ఇది నిబద్దతతో కూడిన నిత్య ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఏ మాత్రం అలక్ష్యం, శూన్యం ఆవహించినా, ఆ శూన్యంలోకి అన్యవర్గ భావజాలమో, ఆధిపత్య భావజాలమో రాకమానదు. అందుకే చైతన్య వంతమైన కార్యకర్తలు నిత్య జాగురకతతో ఎప్పటికప్పుడు అప్ర మత్తులవుతూ ఉంటారు. ఎందుకంటే మానవాళి విముక్తికి దారిదీపం వర్గ సంఘర్షణే కదా!
సాంస్కృతిక చైతన్యం అనేది విడదీయలేని జంటపదం. సంస్కృతి స్థలకాలాదులకు లోబడి ఉంటుంది. ప్రాంతం ప్రాంతానికి, తరతరానికి మారుతూనే ఉంటుంది. ఓ సామూహిక జీవన విధానంగా 'సంస్కృతి'ని నిర్వచించినప్పుడు ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, అలవాట్లతో పాటు భాష, భావధార (ఆలోచనాతీరు) కూడా సంస్కృతిలో అంతర్భాగం అవుతుంది.
సాంస్కృతిక ఆధిపత్యం (హెజిమోని) అంటే సైద్ధాంతిక సాంస్కృతిక మార్గాల్లో పాలకులు పట్టు సంపాయించడం అని గ్రాంసీ పేర్కొంటాడు. అందుకు విలువలు, ఆలోచనలు, అంచనాలు చివరకు ప్రాపంచిక దృక్పథాన్ని సైతం వారు తలకిందులు చేయగలరు. ఆచరణలో అవి అలా బలంగా సాగేలా అధికారంలో ఉన్నవారు వ్యవహరిస్తారు. మీడియాతో సహా సకల రాజకీయ, ఆర్థిక సంస్థలను వారికి దాసోహం అయ్యేలా వారు చేసుకుంటారు.
పాలకవర్గం తనదైన ఆధి పత్యాన్ని, దృక్పధాన్ని రూపొందిం చే క్రమంలో సాంస్కృతిక జాతీయ వాదాన్ని సృష్టించి బలంగా రుద్దుతుంది. దేశ సమాజం కోసమే తమ ఆర్థిక, రాజకీయ, నిర్మాణాలని పదే పదే చెబుతుంది. నిజంగానే వీటిని మేధావులతో సహా చాలామంది విశ్వసిస్తారు కూడా. అయితే వాస్తవంగా ఆ నిర్మాణాలు పాలక వర్గానికే ఉపయోగ పడతాయి. 'పాలకవర్గం వాటిని గుప్పెట పట్టి వాటి ద్వారా సమాజంపై పట్టును బిగదీస్తుంది' అని అంటాడు గ్రాంసీ.
రాజ్యాంగ వ్యవస్థలు - ఎన్నికల కమిషన్, కోర్టు, ఈడీ, ఐ.టి, మీడియా మొదలైనవాటిని తమకు అనుకూలంగాను, ప్రత్యర్థులకు వ్యతిరేకం గానూ ఉపయోగించడం నేడు మనం కళ్ళారా చూస్తున్నాం.
దీనినే మరొలా కూడా చెప్తాడు గ్రాంసీ. 'పాలకవర్గం భావాలు కేవలం రాజ్యం ద్వారా మాత్రమే తమ ఆధిపత్యాన్ని చెలాయించలేవు. రాజ్యం అనేది కేవలం కోటముంగిట ఉండే కందకం వంటిది మాత్రమే. కోట - కోటలోపల అనేక మార్గాలు, కట్టడాలు మాదిరి అనేక అంశాలు, వ్యవస్థలు పాలకవర్గ సాంస్కృతిక ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తాయి.
20వ శతాబ్దంలో ప్రజాస్వామ్య సంస్కృతి బలోపేతం అయింది. రెండు ప్రపంచ యుద్ధాల ద్వారా పెల్లుబికిన విశ్వశాంతి ఉద్యమం, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, వలస పాలనా విముక్తి స్వతంత్ర పోరాటాలు, అన్నింటికీ మించి దోపిడీ. అణచివేత వ్యతిరేక పోరాటాలు మానవీయ పతాకను ఎత్తిపట్టాయి. మనిషిని మనిషిగా చూడాలనే ఆధునిక భావనకు ఊపిరిలూదాయి. ఈ క్రమంలో ప్రజాస్వామ్య సంస్కృతి అనేది ఓ జీవన విధానంగా రాజకీయ కార్యకలాపాల్లోనే కాకుండా నిత్య దైనందిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయింది. అంతిమంగా సాటి మనిషిని గౌరవించడం, వారి హక్కులను గుర్తించడం, బాధితులకు, శ్రామికులకు అండగా నిలబడటం ఓ మానవీయ సంస్కృతిగా పరిఢవిల్లింది.
గ్రాంసీ మానవహక్కుల కోణంలో మనిషి సంస్కృతిని పరిశీలించే తీరు ఆసక్తిగా ఉంటుంది. ఇందుకు నాలుగు ప్రతిపాదనలు చేసాడు.
1. ప్రతి వ్యక్తి సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాడో, తిరిగి సమాజంచేత ఏ విధంగా ప్రభావితం అవుతాడో తెలుసుకోవడం అవసరం. మనిషి సామాజిక జీవి అయినప్పుడు, అతని సామాజిక స్పృహను అంచనా వేసుకోవాలి. తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం అంటే సమాజాన్ని మార్చుకోవడం అని గ్రహించాలి.
మనిషిని గురించి అంచనా వేసే మార్గంలో ఆ మానవ సమాజానికి లభిస్తున్న విజ్ఞాన శాస్త్రానికి, పారంపర్యంగా వస్తున్న తత్వజ్ఞానానికి మధ్య గల సంబంధాన్ని కూడా అధ్యయనం చేయాలని చెపుతాడు. ఇదే వైయుక్తిక అంశానికి - ప్రాకృతిక ప్రపంచానికి గల అంతర్లీన సంబంధంగా భావిస్తాడు.
2. మానవ హక్కుల కేంద్రం సమాజమే తప్ప రాజ్యం కాదు అని తేల్చిచెబుతాడు. అంతేకాదు చైతన్య రహిత తిరుగుబాటు మానవ హక్కులకు ప్రమాదం అని కూడా అంటాడు.
మనిషి తన అవసరాలు తీర్చుకునే క్రమంలో ఏర్పరుచుకున్న ఉత్పత్తి (మానవ) సంబంధాలను, ప్రకృతిని మార్చుకోవలసి ఉంటుంది. ఆ ఘర్షణలో మానవ హక్కులు ఉనికిలోకి వస్తాయి.
మానవ హక్కుల ఉద్యమం - మనుగడ పరిణతిపైనే రాజ్యం స్వభావం ఆధారపడి ఉంటుంది. రాజ్యాన్ని ప్రధాన ఛోదక శక్తిగా చేసి సమాజాన్ని ద్వితీయ శ్రేణిగా భావిస్తే మానవ హక్కుల అభివృద్ధి తిరోగమనంలో పడుతుందని గ్రాంసీ వివరిస్తాడు.
అంటే ఇక్కడ ఉపశ్రేణులను, ప్రజా సంఘాలను, ప్రజా ఉద్యమాలను నిత్యం పనిలో ఉంచుతూ సామాజిక చైతన్యానికి అగ్ర తాంబూలం ఇవ్వాలని వక్కాణిస్తాడు.
3. కింది వర్గాలలో చైతన్య మవుతున్నవారిని తమకు అనుకూలంగా మార్చుకుని, ఆ కింది వర్గాలపైనే పెత్తనం చేసే పద్ధతిని 'అణు పరిణామం'గా వర్ణిస్తాడు. నయానో, భయానో వారిని రాజ్యాధికారంలో కలుపు కోవడం. ఇది నిజంగా పీడితవర్గాల స్వేచ్ఛాభి వృద్ధికి పెద్ద ఆటంకం. ఈ ప్రక్రియ ద్వారా వారి సాంస్కృతికీ చైతన్యం గందరగోళంలో పడుతుంది.
సమాజంలో అణచివేతకు గురయ్యే అట్టడుగు వర్గాలవారు సహజంగానే తమ హక్కులను కోల్పోతారు. ఆ కోల్పోయే తీరును అనివార్యంగా తమ కళల్లో వ్యక్తీకరిస్తారు. అటువంటి కళాకృతులను 'సబ్-ఆల్టర్న్' అంటాడు గ్రాంసీ. వీటిని లోతుగా అధ్యయనం చేస్తేనే సామాజిక - సాంస్కృతిక చైతన్యం ఒకదానితో ఒకటి పెనవేసుకున్న తీరు అర్థం కాదు. వీటిని శ్రద్ధగా వృద్ధిచేసుకోవాలి.
4. ఇక చివరిగా రాజ్యం - పౌర సమాజం - వర్గం అనే త్రికోణంలో బందీ అయిన మనిషి, ఏ ఒక్కదాన్నో విమర్శించి, మిగిలినవాటి పట్ల అంత శ్రద్ధ చూపకపోతే మనిషి సమూలంగా విముక్తికావడం అసాధ్యం అని పేర్కొంటాడు.
అందుకే సాంస్కృతికరంగంలో వర్గపోరాటం అంటే కేవలం రాజ్యంపై అస్త్రాలను ఎక్కుపెడితే చాలదు. తనతో సహా తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిత్య జాగురుకతతో పరిశీలించడం, సరిచేసుకోవడం, అధ్యయనం చేయడం, శాంతియుత సహజీవనానికి నడుం కట్టడం అనివార్యం. ఈ కృషిలో పీడిత వర్గాల నుండి లేదా నిస్వార్థంగా ఆ వర్గాల హక్కులకు కట్టుబడే సజాతి కళాకారులు, మేధావుల (ఆర్గానికి ఆర్టిస్ట్స్, ఇంటలెక్టువల్స్) కృషి అపారంగా తోడ్పడుతుందని తెలుపుతాడు. ఇప్పుడు మనకు ఎదురవుతున్న ఫాసిస్టు ప్రమాదంలో సాంస్కృతిక ప్రతి వ్యూహంగా మనం చేపట్టాల్సిన పనులు ఇవే.
- కె శాంతారావు
9959745723