Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే కీలకం. కానీ ప్రతిపక్షాలు లేకుండా ఏకపక్షపాలన చేయాలనుకుంటుంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం. తొమ్మిదేండ్ల కిందట అధికారంలోకి రాకముందు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అవినీతికి తావులేని పాలన అందిస్తామని నమ్మబలికిన బీజేపీ గద్దెనెక్కాక అది పూర్తిగా విస్మరించింది. పేదలను కొట్టి పెద్దలకు పెట్టే చర్యలనే అమలు చేస్తున్నది. ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం, తమ అనుయాయుల కోసం మాత్రమే పాలన సాగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారడంతో అధికారంలోకి వచ్చింది బీజేపీ. కానీ నేడు మోడీ పాలనంతా బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగానే ఉన్నది. ఓవైపు కరెన్సీ విలువ పడిపోతున్నది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. ఇంకోపక్క ఆర్థిక సంక్షోభం అలుముకుంటున్నది. జీడీపీ తలకిందుల వుతున్నది. వస్తు ఉత్పత్తి తగ్గిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటినీ పక్కనపెట్టి వాస్తవాలు మాట్లాడ కుండా, తెలియనీయకుండా మభ్యపెట్టే ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. ఈ సంక్షోభం ఇలా కొనసాగుతుంటే కార్పొరేట్ల సంపద మాత్రం లక్షల కోట్లకు పెరిగిపో తున్నది. ఇది తొమ్మిదేండ్ల పాలనలో దేశం తొంభై ఏండ్లు వెనక్కి వెళ్లేలా మోడీ సాధించిన ఘనత. మోడీని ప్రజలు ఎన్నుకున్నది తమ బతుకులను బాగుచేస్తాడని? ఉపాధి కల్పిస్తాడని, ప్రజలం దరిని సోదరభావంతో కలిపి ఉంచుతాడని. ఒక్కసారి కాదు రెండుసార్లు గద్దెనెక్కించి ఇప్పుడు కడగండ్ల పాలవు తున్నారు.ఇదేం పాలన? అని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వరంగాలు ప్రయివేటుపరం
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కోసం ఆనాడు పంచవర్ష ప్రణాళికలలో భాగంగా ప్రభుత్వ రంగాన్ని నెలకొల్పి ప్రజా సంక్షేమానికి, దేశ ప్రగతి కోసం ఏర్పాటు చేసింది నెహ్రూ ప్రభుత్వం. దేశ ప్రజలకు అవసరమైన బిలాయి, విశాఖ లాంటి ఉక్కు కర్మగారాలను, బడా మందుల సంస్థలను, ఎల్ఐసి లాంటి ప్రజాప్రయోజన వ్యవస్థలను, ఈసీఐఎల్ లాంటి సాంకేతిక పరిశ్రమలను, షిప్పింగ్ కార్పొరేషన్లను వందల, వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసింది.కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమక్ర మంగా నష్టాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసే ప్రక్రియ ప్రారంభించింది. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, కారుచౌకగా అమ్మకాలను తలుపులు తెరిచింది. తన సంపన్న మిత్రులకు దోచిపెడుతోంది. గత ఏడు సంవత్సరాలుగా నిరాటంకంగా బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, స్టీల్ లాంటి లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను అంబానీలకు, అదానీ లాంటి పారి శ్రామిక దిగ్గజాలకు కారుచౌకగా కట్టబెడుతున్నది.అందులో భాగంగానే ఎన్నో త్యాగాలతో సంపాదించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాలకు తెరలేపింది. ఇప్పటికే రోడ్డున పడ్డ కార్మికులు, కుటుంబాలు ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకునే పరిస్థితిలో లేదు మోడీ ప్రభుత్వం. అధికారంలోకి వస్తే ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఊసే మరిచింది. పరిశ్రమలు క్రమంగా మూతపడేలా చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడంతో చదివిన చదువులకు ఉద్యోగాలకు రాక నిరుద్యోగం పెరిగింది. ఇది రానురానూ దేశాన్ని దారిద్య్రరేఖకు తీసుకెళ్లడమే తప్ప అభివృద్ధికి వైపు తీసుకెళ్లే చర్యలు ఏమాత్రం కావు. వామపక్షాలు సాధించిన ఉపాధి చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసింది. బడ్జెట్లో నిధులకు కోత పెట్టింది. సంస్కరణల పేరుతో రైతాంగానికి వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా మూడు వ్యవసాయక చట్టాలు తీసుకొచ్చి రైతులను అగచాట్ల పాలుచేసింది. దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తడంతో వెనక్కితగ్గింది. కార్మిక చట్టాలను సవరణ పేరుతో నాలుగు కోడ్లుగా విభజించి పరిశ్రమల యాజమాన్యాలకు మేలు చేకూర్చింది. దీంతో అప్పటిదాకా ఏండ్లుగా పోరాడి సాధించుకున్న 8గంటల పని కూడా 12గంటలకు మార్చబడింది.
అదానీ సేవలో మోడీ
పేద, మధ్య తరగతి వర్గాలపై అధిక భారాలు మోపుతూ పెద్దలకు మాత్రం రాయితీల మీద రాయితీలు కల్పిస్తూ వారికి అంతులేని లాభాలను కట్టబెడుతోంది మోడీ ప్రభుత్వం. గుజరాత్‌కు సీఎంగా ఉన్నప్పటి నుంచే గౌతమ్అదానీ మోడీకి మధ్య ఉన్న బంధం తెలిసిందే. ఆయన ప్రధాని అయ్యాక ప్రపంచ కుబేరుల్లో భారత్ నుంచి స్థానం సంపాదించుకున్నవాడు అదానీ. అంటే దీనికి కారణం మోడీ అందదండలే. తాజాగా అదానీ కంపెనీకి చెందిన ఎన్ఎమ్ఐఏఎల్ సంస్థకు రూ.12,770 కోట్ల రుణాన్ని ఎస్బీఐ మాఫీ చేసింది. ఆదాని ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ గ్రీనీఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు ఆర్థిక పరమైన ఇబ్బందులకు ముగింపు పలికింది. 2021 జులైలో అదాని ఏయిర్ పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్ ద్వారా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్‌ను సొంతం చేసుకున్నట్లు ఎన్ఎంఐఏఎల్ వెల్లడించింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అదానీ డొల్ల వ్యాపారాలను బహిర్గతమైన తర్వాత పార్ల మెంట్లో మోడీ నిర్లజ్జగా వెనుకేసుకు రావడం వెనక వాస్తవాలు ఏమిటో దేశ ప్రజలకు తెలియాలి? పార్లమెంట్లో చర్చ జరగకుండా, అదాని గుట్టు బయటపడకుండా మోడీ ప్రభుత్వం కాపాడింది. మోడీయే అదాని, అదానీయే మోడీ అన్నట్లుగా దేశ ప్రజల ముందు అప్పుడే వెల్లడైంది. అధికారంలోకి రాకముందు నల్లధనం వెలికితీసి ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. తొమ్మిదేండ్లు గడిచినా పైసా కూడా బయటికి రాలేదు. కనీసం రూ.15 అయినా సామాన్యుని ఖాతాలో జమ కాలేదు. కానీ అదానీ లాంటి బడాబాబుల ఆస్తులు మాత్రం రూ.లక్షల కోట్లకు ఎగబాకాయి. ఇదీ మోడీ పాలనా నిర్వాకం. ఇదేకాదు బీజేపీ పాలిత రాష్రమైన గుజరాత్‌లోనూ బీజేపీ సర్కార్ రూ.లక్ష కోట్ల స్కామ్‌కు తెరలేపిందని వార్తలు వెలువడుతున్నాయి. కాగ్ నివేదికలో ఈ విషయం బట్ట బయలైంది. గత ఐదేండ్లలో 2017 నుంచి 2022 మధ్యకాలంలో ఇతర రాష్ట్రాలకు నిధులు నిలుపుదల చేసి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఇతర పద్దుల కింద రూ.1.18లక్షల కోట్ల ప్రజాధనం పం పిణీ పేరుతో అయిన వాళ్లకు అందించింది. గ్రాంట్లకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోందని కాగ్ తన నివేదికలో ఆరోపించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తు తెలియని సంస్థలకు, ఏజెన్సీలకు ఏకంగా రూ.24,764,54 కోట్లను చెల్లించింది. మోడీ సొంత రాష్ట్రమైన గుజ రాత్‌కు మాత్రం భారీగా నిధులు గ్రాంట్ల రూపంలో విడుదల చేస్తూ సహకారమందిస్తున్నది. తనకు అననుకూలమైన రాష్ట్రాలకు ఆర్థిక పరమైన చెల్లింపులలో మోకాలడ్డుతున్నది.అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి.
ప్రజాస్వామ్యం స్థానంలో నియంతృత్వం
భిన్నత్వంలో ఏకత్వంగా సాగుతున్న ప్రజల్ని కులం పేర, మతం పేర చీల్చే ప్రయత్నాలు చేస్తున్నది. అధికారమే పరమావధిగా తన విధానాలను నిరంకుశంగా కొనసాగిస్తున్నది. దేశభక్తి పేరుతో బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల పట్ల గొంతెత్తినా పత్రికల్లో రాసినా, మీడియాలో చూపినా అక్రమ అరెస్టులు, కేసులు, జైళ్ల పాలు చేస్తూ భయానకమైనటువంటి పరిస్థితులను కల్పిస్తున్నది. అందులో భాగమే ఇటీవలి వరుస ఘటనలు. నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాలే పెంచి పోషించిన నేరస్తులను పోలీసుల సమక్షంలోనే కాల్చివేసిన ఉదంతం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. విలేకరుల ముసుగులో 'జైశ్రీరామ్, జై భజరంగబళి' అంటూ పోలీ సులు చుట్టూ ఉండగానే జరిగిన కాల్పుల ఘటన ఏ సంకేతాలను అందిస్తున్నదో గమనించాలి! యూపీలో ఇప్పటి వరకు యోగి పాలన నేరచరిత్ర పేరిట 233మందిని ఎన్కౌంటర్ చేసింది. 4484మందిని నేరస్తుల పేరుతో కస్టడీలో మగ్గేలా చేసింది. ఇదిలావుంటే... చట్టసభల్లో ఉన్న 403మంది శాసనసభ్యు లలో 205మందీ నేరచరిత్రేనని ఇటీవల అమీరస్ క్యూరీ నివేదిక వెల్లడించింది. ఈ దేశ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హంతకులతో పాటు, ఉగ్రవాదులు అద్మల్ కసబ్, పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురులను కూడా చట్ట ప్రకారం కోర్టు బోనుల్లో నిలిపి శిక్షలు పడే విధంగా చేసినటు వంటి దేశంలో... ప్రస్తుతం అరాచకం రాజ్యమేలుతున్నదనేది అందరికీ తెలియాల్సిన అంశం. తమ మాట వినని ప్రతిపక్షాలను, నాయకులను అక్రమ కేసులు పెట్టి ఈడీ, సిబిఐ సంస్థల ద్వారా లొంగ దీసుకుంటున్నది. గవర్నర్లను రబ్బర్ స్టాంపులుగా ఉపయోగించుకుంటూ ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టే విధానాలను అనుసరిస్తున్నది.తాజాగా మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతోంది. తమ స్వార్థ, రాజకీయ ప్రయో జనాలకు మతాన్ని వాడుకుంటూ ప్రజల్ని రెచ్చగొడుతున్నది.
పుల్వామా ఘోరం..మోడీ పాపం
ఇటీవల జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మోడీ ప్రభుత్వంపై సంచలమైన ఆరోపణ చేశారు. పుల్వామా ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరే కారణమని ఆయన వైర్, టెలిగ్రాఫ్ మీడి యాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తాను జమ్ము కాశ్మీర్లో పరిస్థితులను వివరించి సైన్యాన్ని తరలించడానికి విమానాలను ఉపయోగించాలని తెలిపినా కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. కేంద్రం అసమర్థత, చేతకానితనం వల్లనే 40మంది జవానులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే పుల్వామా ఘోరం మోడీ పాప ఫలితమేనన్నది సత్యపాల్ మాటల సారాంశం. ఇలాంటి విధానాలు మోడీ ప్రభుత్వానికి మాయని మచ్చగా ఉన్నాయి. అంబేద్కర్ పేరు చెబుతూ రాజ్యాంగాన్ని నీరు గారుస్తున్నది. ఈడీ, సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థలను గుప్పెట పెట్టుకుని ప్రతిపక్షాలపై ప్రయోగిస్తున్నది. రాజ్యాంగ రహిత పరిపాలన సాగిస్తున్నది. దళితులపై, మైనార్టీలపై, మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నా మౌనం వహిస్తున్నది. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో బిల్కిస్‌బానోపై సామూహిక లైంగికదాడి కేసులో నిందితులు పదకొండుమందిని ప్రభుత్వం నిర్దోషులుగా విడు దల చేయటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బీజేపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల్లో ఇదొక ఉదాహరణ మాత్రమే! కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒడిగడుతున్న ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను సంఘటితంగా ఎదుర్కొనేందుకు వామపక్షాలతో సహా దేశంలోని వివిధ ప్రతిపక్షాలన్నీ ప్రతిఘటిస్తున్నాయి. అయినా మోడీ నిస్సిగ్గుగా తను చేయదలుచుకున్నది చేస్తూ పోతున్నాడు. ''నియంతలు ధరాధి పతులై చరిత్ర కెక్కిరి'' అన్న విధంగా మోడీ పరిపాలన కొనసాగుతుందని చెప్పకతప్పదు. అయితే మోడీ ఈ తొమ్మిదేండ్ల పాలన తొంబై ఏండ్లు తిరోగమన పరిపాలనగా దేశాన్ని అధోగతి పాలు చేసింది. నియంత పాలనను గద్దెదించేందుకు జరుగుతున్న పోరాటంలో ప్రజ లందరూ భాగస్వాములవ్వాలి. 'మోడీ హటావో! కార్పొరేట్ హటావో!', నినాదాలతో ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యాన్నీ, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.
- జూలకంటి రంగారెడ్డి