Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేదరికం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వాలు అదుపు చేయలేని అధిక ధరలు, నిరుద్యోగం, ఉద్యోగాల తొలగింపులు, పెన్షన్, ఆరోగ్య సంరక్షణ, శ్రామిక మహిళల హక్కులు, ధనిక, పేద అంతరాలు 2023 మేడే సంద ర్భంలో సాక్షాత్కరిస్తున్న ప్రధానమైన సమస్యలు. వీటిని పరిష్కరించుకోకుండా శ్రామికులను, పేద ప్రజల జీవితాలకు విముక్తిరాదు. దోపిడీ రహిత సమ సమాజం నిర్మితమైతేనే మౌలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ లక్ష్య సాధనకు శ్రామికవర్గ ఐక్యత కీలకం. అనేక దేశాల్లో, మన దేశంలోని కేంద్ర ప్రభుత్వంతో సహా కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించడం, ప్రత్యామ్నాయ, విధానాల కోసం కార్మికవర్గ పోరాటాలను ఉధృతం చేయడమే కర్తవ్యాలు, కర్తవ్య సాధన కోసం కార్మికవర్గం కార్యోన్ముఖులై మేడే స్ఫూర్తితో పోరాటాలను ఉధృతం చేద్దాం.
మేడే అనగానే మనకు గుర్తొచ్చేది.. ఎనిమిది గంటల పనిదినం..
కష్టజీవుల రక్తంతో తడిసిన ఎర్రపతాకం.. చికాగో అమరవీరుల త్యాగఫలితం..
పోరాడి సాధించుకున్న హక్కుల దినం.. సంపదకు మూలం శ్రామిక స్వేదం..
బానిసత్వాన్ని ఎదిరించిన వీరత్వం.. రణ, గణ గొంతుకలై ధ్వనించిన ధీరత్వం..
ఉవ్వెత్తున ఎగిసే అగ్నికణికలు.. పాలకవర్గాలను పడగొట్టే ఉక్కు పిడికిళ్ళు..
మేడే అనేది ప్రపంచ కార్మిక దినోత్సవం. దీని సుధీర్ఘ పోరాట చరిత్ర ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ కుటుంబం చర్చించుకోవడం అనివార్యం. ఎందుకంటే ఉదయం లేవగానే ఫ్యాక్టరీకి వెళ్లే కార్మికుడు, చేతిలో బ్యాగు పట్టుకుని ఆఫీస్‌కు వెళ్లే ఉద్యోగి వరకు అందరూ ఏదో ఒక రంగంలో పనిచేస్తున్నవారే. అలాంటి శ్రమజీవులందరికీ ఈ రోజు 8 గంటల పనిదినం వారి హక్కుగా పరిణమించింటే దానికి కారణం ఆనాటి చికాగో కార్మికుల త్యాగఫలం. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి హక్కులు సాధించుకున్న రోజును మనం మేడేను ఒక దీక్షాదినంగా, అమరవీరుల సంస్మరణలో, స్ఫూర్తిదాయకంగా జరుపుతున్నాం. ఇది ఏ మాత్రం సహించని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పాలకవర్గం మేడే చరిత్రను చెరిపేయాలని చూస్తోంది. కార్మిక చట్టాల అమలు పేరుతో పెట్టుబడిదారులకు అను కూలమైన లేబర్కోడ్లు తెచ్చింది. అధిక పని గంటలు పెంచి శ్రమదోపిడీ చేస్తోంది.పాలకవర్గాల నియం తృత్వంతో అధిక పని గంటలను నిరసిస్తూ నాడు అమెరికాలో సాగిన మహోజ్వలిత పోరాట అగ్నిజ్వాలలు నేడు ఇండియాలో ఇంకా రగులుతూనే ఉన్నాయి.ఇది మోడీ నిరంకుశత్వానికి పరాకాష్ట.
ప్రపంచ దిక్సూచిగా చికాగో పోరాటం
పదిగంటల పని దినం నిర్ణయించాలన్న డిమాండ్‌పై 19వ శతాబ్ధం ప్రారంభంలో అమెరికాలో ప్రతి పారిశ్రామిక కేంద్రంలోనూ సమ్మెలు చెలరేగాయి. ఫిలడెల్ఫియాలోని మెకానిక్స్ యూనియన్ చేసిన 10గంటల పనిదినం పోరా టాన్ని తట్టుకోలేక అమెరికన్ ప్రభుత్వం 1837లో 10 గంటల పనిదినం నిర్ణయిస్తూ శాసనం చేసింది. తర్వాత ఈ 10గంటల పనిదినం ఉద్యమం అట్లాంటిక్ మహాసముద్రం దాటి యూరప్ ఖండంలో ప్రవేశించి అక్కడి కార్మికవర్గాన్ని ఉత్తేజపరిచింది. యూరప్ ఖండంలో కార్మికులు జరిపిన పోరాటాల ఫలితంగా అనేక దేశాలు 10గంటలు పని దినం అంగీకరిస్తూ చట్టాలు చేశాయి.1870 నాటికే పారిశ్రామిక, వాణిజ్య, బ్యాంకింగ్ రంగాల్లో గుత్తాధిపత్యం రూపుదాల్చి బలపడింది. పెట్టుబడిదారీ వర్గం అధిక లాభాలు పోగు చేసుకోవడానికి ఆ వర్గానికి మంచి అవకాశాలు ఏర్పడ్డాయి. కానీ కార్మికవర్గం జీవితాల్లో అభివృద్ధి మాత్రం దిగజారాయి. దానితో కార్మికవర్గం పనిగంటల తగ్గింపు కోసం ఉద్య మించింది. 1881 చికాగో నగరంలో వివిధ కార్మిక సంఘాలు కలిసి ఒక సమాఖ్యను నూతనంగా ఏర్పాటు చేసు కున్నాయి. దానికి ''అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్'' అని పేరు పెట్టారు.1884 అక్టోబర్ 7న ఈ సమాఖ్య 4వ సమావేశంలో 8గంటల పని దినం కోసం చారిత్రాత్మకమైన తీర్మానం చేయబడింది.1886మే మొదటి తేదీన దేశ మంతటా కార్మికవర్గం ఈ హక్కును సాధించుట కోసం సమ్మె పోరాటాలను నిర్వహించాలని కూడా నిర్ణయించాయి. చికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శన ఈ మేడే పుట్టుకకు నాంది పలికింది. 8గంటల పనిదినం గురించి నినదిస్తూ 1886, మే 1న వేలాది మంది కార్మికులు పోరాటం ప్రారంభించారు. దీనికి మద్దతుగా నాలుగు రోజుల తరువాత నగరంలో భారీ ప్రదర్శన జరిపారు. ఆనాటి పాలకవర్గం ఆదేశాలతో పోలీసులు ప్రదర్శన కారులపై విచక్షణా రహితంగా జరిపిన కాల్పులలో ఆ ప్రారతమంతా రక్తసిక్తమైంది. ఒక పోలీసును హత్య చేశారనే నిరాధార అభియోగంతో కార్మిక నాయకులను ఉరితీశారు. అయినా పని గంటల కుదింపు అగ్నిజ్వాలలు అంతరించలేదు. ఆ పోరాటంలో చికాగో అమరులు నినదించిన 'ప్రపంచ కార్మికులారా! ఏకంకండి' అనే నినాదం విశ్వవ్యాప్తమై మారు మోగింది. శ్రామికవర్గంలో చైతన్యాన్ని రగిలించింది.ఈ శ్రామికవర్గ విజయానికి చిహ్నంగా 8గంటల పని దినం చట్టబద్ధం చేయబడింది. అదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవానికి అంకురార్పణ అయ్యింది.
1890 మే 1న అమెరికా కార్మిక సంస్థ (ఎ.ఎఫ్.ఎల్) ప్రతి యేటా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరపాలని పిలుపునిచ్చింది. 1900 నుండి 1920 వరకూ యూరప్‌లో ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీని ఎండ గడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే 1న నిరసన ప్రదర్శనలు జరిగేవి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మేడే సందర్భంగా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు. తరువాతి దశకంలో మే 1న నాజీల వ్యతిరేక దినోత్స వంగా జరిపేవారు. హిట్లర్ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగా కూడా జరుపుకున్నారు. భారత దేశంలో మొట్టమొదటిసారిగా మద్రాసు కేంద్రంగా 1923 మే 1న కమ్యూనిస్టు నాయకుడు సింగారవేలు నాయ కత్వంలో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందూస్థాన్ మేడేని నిర్వహించింది. 1920లో కార్మిక సంఘం ఏర్పడడంతో మేడే అప్రతిహతంగా కొనసాగుతున్నది. చికాగోలోని కార్మిక యోధులు చేసిన రక్తతర్పణం. ఆ అమరుల త్యాగం కేవలం తమ దేశంలో కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగులను ప్రసాదించింది. తమ శ్రమను పెట్టుబడి దారులు రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుం టాయని శ్రామిక వర్గం గొంతెత్తింది. ఈ చాకిరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి 8గంటల పనిదినం కోసం నినదిం చింది. చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించి పోరాటం చేయడం వల్ల 24గంటల్లో 8గంటల పని, 8 గంటల విశ్రాంతి, ఇంకా 8 గంటల వినోదం కోసం ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత జరిగిన పెద్ద మార్పు.
కార్మిక సంక్షేమాన్ని విస్మరించిన మోడీ
నేటి కార్మిక దుస్థితిని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్, మతోన్మాదులతో చేసే చెలిమి, నియంతృత్వ పోకడలను గమనిసే మళ్ళీ మేడే ఆవిర్భావానికి పూర్వం ఉన్న పరిస్థితులు పునరావృతమవుతున్నాయా అని అనిపిస్తుంది. మోడీ పాలనలో గత 8ఏండ్లుగా స్వదేశీ, విదేశీ పారిశ్రామికవేత్తల ఆర్థిక ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 లేబర్ కోడ్లను తెచ్చారు. 8 గంటల పనిదినాన్ని 12గంటలకు పొడిగించేందుకు, పని భారం పెంచేందుకు శ్రీకారం చుట్టారు. యూనియన్లు పెట్టుకునే హక్కును నిరాకరిస్తున్నారు. కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనాలివ్వాలన్న చట్టబద్ధ ఆదేశాలను, న్యాయస్థానాల తీర్పులను బుట్టదాఖలు చేస్తున్నారు. కార్మిక సంక్షేమం, సాం ఘిక భద్రత, ఉపాధి, ఉద్యోగ రక్షణ లేకుండా పోతున్నాయి. భారతదేశంలో కార్మికులు రోజుకి 521నిమిషాలు, వారానికి 60గంటల 47నిమిషాల పాటు ఉత్పత్తి ప్రక్రియలో పనిచేస్తున్నారు. చైనాలో వారానికి 46గంటలు, యునైటెడ్ కింగ్డమ్లో వారానికి 36గంటలు, యునైటెడ్ స్టేట్స్లో 37గంటలు, జర్మనీలో 37గంటలు మాత్రమే పని చేస్తున్నారు. పారిశ్రామిక రంంలో పెట్టుబడిదారుని వాటా 15.7శాతం నుండి 53.8శాతానికి పెరిగితే, వేతనాల్లో కార్మికుడి వాటా 51.5శాతం నుండి 14.8శాతానికి పడిపోయింది.2019లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన లేబర్ కోడ్‌లో గత ఫ్యాక్టరీ చట్టంలో నిర్దేశించినట్లు పని గంటలు గురించి స్పష్టంగా ఎటువంటి నిబంధనలు పేర్కొనలేదు. 8 గంటల పనిదినాన్ని పొడిగించుకునే అధికారాన్ని ఆయా ప్రభుత్వాలకు అధికారాన్ని కట్టబెట్టారు. ఫ్యాక్టరీ చట్టంలో ఉన్న పదిన్నర గంటల స్ప్రైడ్ - ఓనర్ సమయాన్ని ఇప్పుడు దాన్ని 12 గంటలకు పెంచారు. ఇప్పటికే బీజేపీ అధి కారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెం చుతూ తమ అసెంబ్లీలో తీర్మానాలు చేశాయి. శ్రామిక శక్తిపై ఉత్పాదకత పేరుతో హద్దులేని దాడి చేస్తున్నారు. రోబో టిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో అత్యంత ఆధునిక మానవ యంత్రంపై పని తీవ్రతను తీవ్ర స్థాయికి పెంచారు.ఈ యంత్రాలు ఎప్పుడు ఆగవు. అనేక యంత్రాలపై పనిచేసే కార్మికులు ఊపిరి కూడా ఆడటం లేదు. ఆధు నాతన యంత్రాలతో తక్కువ సమయంలో ఎక్కువ విలువను సృష్టిస్తున్నారు.ఐటి, అనుబంధ రంగాల్లో వర్క్ ఫ్రమ్ హౌమ్ పద్ధతిని ప్రవేశపెట్టి పరోక్షంగా 24గంటల పని దినాన్ని ఆచరణాత్మకంగా విస్తరించారు. ఇవన్నీ మేడే స్ఫూర్తికి విఘాతం కలిగించే అంశాలే.
దేశ సంపదను లూఠీ చే(యి)స్తున్న బీజేపీ
మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను వాటాల విక్రయంతో పాటు ఆ సంస్థల మిగులు భూములను అమ్మడానికి పూనుకున్నది. ఉద్యోగుల భవిష్యనిధి (పీ.ఎఫ్)పై వడ్డీ తగ్గించాలనే ప్రతిపాదనలు చేసింది. పీ.ఎఫ్ నిధులతో సహాఇన్సూరెన్స్, బ్యాంకింగ్‌లలో వాటాలను షేర్ మార్కెట్లో పెట్టి ఆదానీ లాంటి కార్పొరేట్స్‌కు లబ్ధి చేకూ రలా నిర్ణయించింది. విలువైన జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, రైళ్ళు, పవర్‌గ్రిడ్స్, స్టేషన్లు, గ్యాస్ పైప్లైన్లు తన అనుయాయులకు కట్టబెడుతూ దేశ సంపదను లూఠీ చేస్తున్నది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రతి ఏటా లక్షల కోట్ల రాయితీలు కట్టబెడుతూ, ప్రజలపై భారాలు వేస్తున్నది. దేశం అంటే అంబానీ - ఆదానీల సొత్తుగా మార్చుతున్నది. గ్యాస్, పెట్రోల్, డీజిల్‌తో సహా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచుతున్నది. సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు, రూ.15లక్షలు పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ధరలు తగ్గిస్తామని తదితర హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసింది. తినే తిండిపైనా, కట్టే బట్టపైనా, ప్రతి వస్తువుపైన జీఎస్టీ విధించింది. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచింది. బడ్జెట్లో కోతలు పెట్టింది. కేంద్ర స్కీంలకు నిధులను తగ్గించింది. అత్యంత ప్రమాదకరమైన విద్యుత్ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది.ఈ పరిస్థితుల్లో కార్మికవర్గం తమ ఉద్యోగాలు, వేతనాలు, పని పరిస్థితులు, పోరాడి త్యాగాలతో సాధించుకున్న హక్కులను కాపాడు కునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పోరాడుతున్నది. సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారి దోపిడీకి వ్యతిరేకంగా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (డబ్ల్యుఎఫ్‌టియు) నికరంగా పోరాడుతున్నది. అమెరికా, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, యూకే, జర్మనీ తదితర దేశాల్లో కార్మికవర్గం భారీ సమ్మెలు, ప్రదర్శనలతో సహా పోరుబాటలో పయనిస్తున్నాయి. పదవీ విరమణ వయస్సును వ్యతిరేకిస్తూ ఫ్రెంచ్ కార్మికవర్గం సార్వత్రిక సమ్మె చేశారు. ధరల పెరుగుదల, దిగజారు తున్న జీవన ప్రమాణాలు, పని పరిస్థితులు, సామాజిక భద్రత లోపం, పని ప్రదేశాల్లో ట్రేడ్ యూనియన్ కార్య కలాపాల కుదింపు, పెరుగుతున్న నిరుద్యోగం, ప్రజా సంపదను కొల్లగొట్టడం వంటి చర్యలను నిరసిస్తూ ఇజ్రాయిల్ కార్మికవర్గం సమ్మెలోకి దిగడానికి సిద్ధమైంది.అమెరికన్ సామ్రాజ్యవాదం క్రూరమైన దిగ్బంధం, ఆంక్షలను ప్రతిఘటిస్తూ సోషలిస్ట్ క్యూబా ప్రజలు వీరోచితంగా పోరాడుతున్నారు. తమ మాతృభూమి హక్కుల కోసం పాలస్తీనా చైతన్యయుతంగా పోరాడుతున్నది.
పేదరికం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వాలు అదుపు చేయలేని అధిక ధరలు, నిరుద్యోగం, ఉద్యోగాల తొలగింపులు, పెన్షన్, ఆరోగ్య సంరక్షణ, శ్రామిక మహిళల హక్కులు, ధనిక, పేద అంతరాలు 2023 మేడే సంద ర్భంలో సాక్షాత్కరిస్తున్న ప్రధానమైన సమస్యలు. వీటిని పరిష్కరించుకోకుండా శ్రామికులను, పేద ప్రజల జీవితాలకు విముక్తిరాదు. దోపిడీ రహిత సమ సమాజం నిర్మితమైతేనే మౌలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ లక్ష్య సాధనకు శ్రామికవర్గ ఐక్యత కీలకం. అనేక దేశాల్లో, మన దేశంలోని కేంద్ర ప్రభుత్వంతో సహా కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించడం, ప్రత్యామ్నాయ, విధానాల కోసం కార్మికవర్గ పోరాటాలను ఉధృతం చేయడమే కర్తవ్యాలు, కర్తవ్య సాధన కోసం కార్మికవర్గం కార్యోన్ముఖులై మేడే స్ఫూర్తితో పోరాటాలను ఉధృతం చేద్దాం.
- పాలడుగు భాస్కర్