Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాను ఏ యే దేశాల యెడల శత్రుపూరిత వైఖరి అవలంబిస్తోందో ఆ యా దేశాలమీద ఆంక్షలను విధించడం అమెరికా విధానం. దాని ఫలితంగా ప్రపంచం అంతా రిజర్వు కరెన్సీగా పరిగణిస్తున్న డాలర్ ఆధిపత్యం ప్రమాదంలో పడుతున్న సంగతి చాలామందికి ఎప్పటినుంచో కనిపిస్తూనేవుంది. ఆ విషయాన్ని ఇన్నాళ్ళకి అమెరికా ఆర్థికశాఖ కార్యదర్శి జానెట్ యెల్లెన్ మొత్తానికి ఒప్పుకున్నారు. ఒకటో, రెండో దేశాలమీద గనుక ఆంక్షలు విధిస్తే అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. కాని ఈ మధ్య అమెరికా డజన్లకొద్దీ దేశాలమీద ఆంక్షలు విధిస్తోంది. అప్పుడు ఆంక్షలకు గురైన ఆ దేశాలన్నీ కూడబలుక్కుని తమలో తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఆంక్షల ప్రభావాన్ని తట్టుకుని నిలబడడానికి పూను కుంటున్నాయి. ఆ విధమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని సవాలుచేసే విధంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థమీద అమెరికా చెలాయిస్తున్న పెత్తనాన్ని సవాలుచేస్తున్నాయి.
ఒకవైపు ఆంక్షల వలన ఎదురుదెబ్బ తగులుతోందని అంగీకరిస్తూనే మరోవైపు ఆ విధంగా ఆంక్షలు విధించడం సరైన విధానమే అని జానెట్ యెల్లెన్ ప్రకటించడంమాత్రం విడ్డూరంగా ఉంది. తమకు ప్రతికూల విధానాలను అవలంబిస్తున్న దేశాలమీద ఆంక్షలు విధించినంతమాత్రాన ఆ దేశాలు తమ విధానాలు మార్చుకునేలా చేయడం సాధ్యం కావడం లేదని అంటూనే, ఆంక్షల ఫలితంగా ఆ దేశాల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె అంగీకరించారు. ఇందుకు ఉదాహరణగా ఇరాన్‌ను ప్రస్తావించారు. సంవత్సరాల తరబడి ఇరాన్ మీద ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ అనుసరిస్తున్న విధానాలలో మార్పు లేదని, ఆ విధానాలు అమెరికాకు ప్రతికూలంగానే కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు. ఒకపక్క ఇరానియన్ ప్రజలు ఆంక్షల ఫలితంగా చాలా ఇబ్బందులు పడుతున్నా, ఇరాన్ ప్రభుత్వం మాత్రం తన విధానాలను మార్చుకోలేదని అన్నారు. ''మేము విధించిన ఆంక్షలు ఇరాన్లో వాస్తవానికి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించాయి. అందువలన ఆర్థికంగా ఇరాన్ చాలా ఎక్కువగా నష్టపోతోంది. కాని ఆంక్షలు ఇరాన్ తన విధానాన్ని మార్చుకునేలా చేయగలిగాయా అంటే మాత్రం మేం ఆశించిన విధంగా జరగలేదనే చెప్పాలి'' అని ఆమె అన్నారు. ఒకపక్క ఈ విధంగా ఆంక్షల వలన ప్రయోజనం లేదని అంగీకరిస్తూనే, అమెరికా ఇరాన్ పై విధించిన ఆంక్షలను ఆమె సమర్థించడమే గాక వాటిని మరింత కఠినంగా అమలు చేయడం ఎలా అన్నదే తమ ఆలోచన అని అన్నారు.
అమెరికా నుండి ఆంక్షలకు గురైన దేశాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసుకోవడం, అటువంటి ఏర్పాట్లు అమెరికా ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థమీద చెలాయిస్తున్న పెత్తనాన్ని దెబ్బతీసేవిగా పరిణమించడం అనేది ప్రస్తుతం కళ్ళముందు కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలకు గురైన రష్యా ఇప్పుడు చాలా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మళ్ళీ ఏర్పరచుకుంటోంది. గతంలో సోవియట్ యూనియన్‌గా ఉన్న కాలంలో ఏవిధంగా రూబుల్‌కు, ఆ యా దేశాల కరెన్సీలకు మధ్య ఒక నిర్థారిత మారకపు రేటుకు ఒప్పందానికి వచ్చి వ్యాపార లావాదేవీలను జరిపేవారో, అదే మాదిరిగా ఇప్పుడు చేస్తోంది. తద్వారా డాలర్ ప్రమేయంలేని వ్యాపారం నిర్వహిస్తోంది.
దీని ఫలితంగా ప్రపంచ వాణిజ్యంలోని ఒక గణనీయమైన భాగంలో డాలర్ మారక సాధనంగా చెలామణీలో ఉండనవసరం లేకుండా పోయింది. అందువలన డాలర్ పెత్తనానికి పెద్ద ప్రమాదం ఎదురవుతోంది. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో సరకుల ధరలను డాలర్లలో నిర్థారిస్తున్నారు. అయితే డాలర్ ఆధిపత్యానికి అది మూలకారణం కానేకాదు. వ్యాపార లావాదేవీలు నిర్వహించడానికి డాలర్లు వాస్తవంగా అవసరం అవడమే దాని ఆధిపత్యానికి కారణం. అంటే అంతర్జాతీయ వాణిజ్యం అత్యధికభాగం డాలర్లలోనే వాస్తవంగా సాగుతోంది. ఆ ప్రత్యేక పరిస్థితి వలన డాలర్‌కి అంత ప్రాధాన్యత వచ్చింది.
అంతే కాదు, ప్రపంచవ్యాప్తంగా తమ సంపదను దాచుకోవాలను కునేవారు డాలర్ల రూపంలోనే దాచుకుంటున్నారు. డాలర్ల రూపంలోనే లావాదేవీలన్నీ సాగుతూ వుండడమే దీనికి ప్రధానకారణం. డాలర్‌కి స్వతఃసిద్ధమైన విలువ ఏమీ లేదు. డాలర్లను తయారుచేయడానికి పెద్దగా శ్రమ పడనక్కరలేదు. అదే మనం ఉపయోగించే వేరే ఏ సరుకునైనా ఉత్పత్తి చేయాలంటే కొంత శ్రమ అవసరం. అందుచేత ఆ సరుకుకి స్వతఃసిద్ధంగా కొంత విలువ ఉంటుంది. డాలర్‌కి అటువంటి విలువ ఏమీ లేదు. అయితే ప్రతీ సరుకువిలువనూ లెక్కించేటప్పుడు, ఆ సరుకులను అంతర్జాతీయ మార్కెట్లో మారకం చేసేటప్పుడు డాలర్‌ను మారకపు సాధనంగా వాడుతున్నందువల్ల డాలర్‌కి ఆ విధమైన ఆధిపత్యం వచ్చింది. డాలర్ ఆ విధమైన ఏకైక మారకపు సాధనంగా అంతర్జాతీయ మార్కెట్లో లేనిరోజున డాలర్ ఆధిపత్యం దెబ్బ తింటుంది. ఇప్పుడు ఆంక్షలకు గురైన దేశాలు తమ మధ్య ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం వలన ఆ దేశాల నడుమ జరిగే వ్యాపార లావాదేవీలలో డాలర్ ఒక మారకపు సాధనంగా లేకుండాపోతోంది. అది అంతిమంగా డాలర్ పెత్తనాన్ని దెబ్బ తీస్తుంది.
అయితే, డాలర్ పెత్తనం దెబ్బ తినడానికి ఒక్క ఆంక్షలు మాత్రమే కారణం కాదు. చాలా దేశాలు, తమమీద ఆంక్షలు లేకపోయినా, డాలర్ ఆధిపత్యం నుండి బైటపడి తమ వ్యాపార మార్కెట్లను, అవకాశాలను విస్తృతపరుచుకోవాలని భావిస్తున్నాయి. అటువంటి దేశాలు డాలర్ మారకపు సాధనంగాలేని వ్యాపార ఒప్పందాలు చేసుకోడానికి సిద్ధపడుతున్నాయి. సోవియట్ యూనియన్‌గా ఉన్న కాలంలో భారతదేశం ఆ దేశంతో సాగించిన ద్వైపాక్షిక వ్యాపారం అటువంటిదే. అమెరికా మనదేశం మీద ఆంక్షలు విధించకపోయినా, డాలర్ ఆధిపత్యంలో నడిచే అంతర్జాతీయ వ్యాపారపు పరిమితులనుండి బైటపడి తన వ్యాపారాన్ని విస్తృత పరచుకోవాలన్న ఆకాంక్ష నుండే భారతదేశం సోవియట్ యూనియన్‌తో వ్యాపార ఒడంబడికలు చేసుకుంది. అందుచేత నయా ఉదారవాద సిద్ధాంతవేత్తలు అటువంటి ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలమీద నిరంతరాయంగా సైద్ధాంతిక దాడి సాగించడం అంత ఆశ్చర్యపరిచేదేమీ కాదు. డాలర్ ఆధిపత్యంలో మాత్రమే అంతర్జాతీయ వాణిజ్యం యావత్తూ జరగాలన్నది వారి సిద్ధాంతం. కాని ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలలో అటువంటి సిద్ధాంతం ఏమీ లేదు. తాజాగా చైనా, బ్రెజిల్ దేశాలు కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలలో కూడా ఆ రెండు దేశాల కరెన్సీలలోనే లావాదేవీలన్నీ జరుగ నున్నాయి. అమెరికా ఆ రెండింటిలోనూ దేనిమీదా ఏ ఆంక్షలూ విధించలేదు. అయినా అవి ఆ విధమైన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాయి. అది కేవలం తమ రెండు దేశాల స్వంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఆ విధంగా చేస్తున్నాయి.
బ్రిక్స్ బ్యాంక్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు బ్రిక్స్‌గా ఒక కూటమిలో ఉన్నాయి)కు తాజాగా అధ్యక్షురాలిగా నియమించబడిన దిల్మా రౌసెఫ్ (ఈమె గతంలో బ్రెజిల్ అధ్యక్షురాలిగా పనిచేశారు) ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం 2022 నుండి 2026 మధ్య ఆ బ్యాంకు సభ్యదేశాలకు ఇవ్వబోయే రుణంలో 30శాతం ఆ యా దేశాల కరెన్సీల రూపంలోనే ఇస్తారు. తద్వారా ఆ మేరకు డాలర్ ప్రమేయం తగ్గిపోతుంది. అంతర్జాతీయ వాణిజ్యం యావత్తూ డాలర్ల రూపంలోనే జరిగితే దాని వలన అమెరికాకు రెండు ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది: డాలర్ అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా పరిగణించబడుతుంది గనుక అమెరికా తన వాణిజ్య చెల్లింపులలో లోటు తలెత్తినా, ఏమాత్రమూ ఆందోళన పడనవసరం లేదు. ఏ యే దేశాలకు తాను చెల్లింపులు చేయవలసివుందో, ఆ దేశాలకు తాను బాకీ ఉన్నట్టు హామీపత్రాలు రాసిఇస్తే చాలు. ఆ పత్రాలకు డాలర్లకు ఉన్నంత విలువ ఉంటుంది గనుక వాటికి ఆమోదం ఉంటుంది. ఆ క్రమంలో ఆమెరికా వాణిజ్య లోటు పెరిగినప్పటికీ, అంతర్జాతీయంగా వాణిజ్యానికి, తద్వారా ఆర్థిక పరిస్థితికి అదనపు వ్యయం ద్వారా అదనపు డిమాండ్ తీసుకువచ్చి, దాని ఫలితంగా కొంత ఊపు తీసుకురావచ్చు. ఇక రెండో ప్రయోజనం: డాలర్ ఆధిపత్యం ఉంటే అది అమెరికన్ బ్యాంకుల వ్యాపారాన్ని కూడా బాగా పెంచుకోడానికి తోడ్పడుతుంది. ప్రపంచంలో కేవలం అమెరికన్ బ్యాంకులు మాత్రమే డాలర్ల లావాదేవీలు నడుపుతాయని కాదు కాని, డాలర్ ఆధిపత్యం తక్కిన ఏదేశాల బ్యాంకులకన్నా అమెరికన్ బ్యాంకులకే ఎక్కువగా ఉపయోగపడతాయి.
డాలర్ ఆధిపత్యం కొనసాగితే సంపన్న పశ్చిమ దేశాలకు ఒనగూరే ప్రయోజనం ఇంకొకటి, అతి ముఖ్యమైనది ఉంది. తమకు ముడిపదార్ధాలను సరఫరా చేసే మూడో ప్రపంచ దేశాలమీద అవి తమ పట్టును మరింత బిగించగలుగుతాయి. ఆ ముడిసరుకుల ధరలను పెరగకుండా అదుపులో ఉంచడానికి, తద్వారా ఆ మూడో ప్రపంచదేశాల ఆదాయాలలో పెరుగుదల లేకుండా చేయడానికి డాలర్ ఆధిపత్యం తోడ్పడుతుంది.
ఆ క్రమం ఈ విధంగా ఉంటుంది: మూడో ప్రపంచదేశాలలో ఉత్పత్తి అయే ఒకానొక ముడిసరుకుకి అంతర్జాతీయంగా అదనపు డిమాండ్ ఏర్పడిందనుకోండి. అప్పుడు దాని ధర ఆ దేశపు స్థానిక కరెన్సీ లెక్కల్లో పెరుగుతుంది. స్థానికంగా సరుకు ధర పెరిగిందంటే దాని ఫలితంగా ఆ స్థానిక కరెన్సీ విలువ డాలర్లతో పోల్చినప్పుడు పడిపోతుందన్న అంచనాలకు అది దారితీస్తుంది. ఒక రిజర్వు కరెన్సీగా ఉన్నందున డాలర్ విలువ సాపేక్షంగా స్థిరంగా ఉంటుందన్న అభిప్రాయం వలన ఈ విధంగా జరుగుతుంది. దానివలన తమసంపదను స్థానిక కరెన్సీలో కాకుండా డాలర్లలో దాచుకోడానికి తయారవుతారు. అందువలన ఆ మూడో ప్రపంచ దేశంనుండి పెట్టుబడి అమెరికాకు తరలిపోతుంది. అప్పుడు ఆ మూడో ప్రపంచదేశంలో నిజంగానే డాలర్ల కొరత ఏర్పడుతుంది. దాని ఫలితంగా ఆ దేశపు స్థానిక కరెన్సీ విలువ నిజంగానే పడిపోతుంది. దానిని అదుపు చేయడానికి ఆ దేశం తన వడ్డీ రేట్లను పెంచవలసివస్తుంది. అప్పుడు ఆ దేశంలో ఆదాయాలు పడిపోతాయి. దాని ఫలితంగా ఆ ముడిసరుకును ఆ దేశంలో వినియోగించడం తగ్గిపోతుంది. మొదట అంతర్జాతీయంగా ఆ సరుకుకు పెరిగిన డిమాండ్ కాస్తా ఇప్పుడు స్వంతదేశంలో తగ్గిపోయిన వినియోగం కారణంగా తగ్గుతుంది. సంపన్న పశ్చిమ దేశాలకు కావలసిన పరిమాణంలో ఆ ముడిసరుకు వారికి ధర ఏమీ పెరగకుండానే దొరుకుతుంది.
గతంలో వలసపాలన ఉన్నరోజుల్లో వలస దేశాల్లో ముడిసరుకుల వినియోగాన్ని కుదించడానికి వీలుగా ఆ దేశాల ప్రజల ఆదాయాలు తగ్గిపోయే విధంగా చర్యలు తీసుకునేవారు. అప్పుడు తమ దేశాలకు కావలసినంత ముడిసరుకును ధర పెంచకుండానే తరలించుకుపోగలిగేవారు. ఇప్పుడు డాలర్ మాధ్యమంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని నిర్వహించడం ద్వారా అదే ఫలితాన్ని పొందగలుగుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ విధమైన దోపిడీ ద్వారా తన మనుగడ కొనసాగించ గలుగుతోంది. డాలర్ మాధ్యమంలో వాణిజ్యం జరగడం అటువంటి కీలకపాత్ర పోషిస్తోంది.
ఇప్పుడు డాలర్ల ప్రమేయంలేని అంతర్జాతీయ వాణిజ్యం పెరుగుతున్నకొద్దీ అది ఈ పశ్చిమ సంపన్నదేశాల ఆధిపత్యాన్ని దెబ్బతీస్తూపోతుంది. ఇదేదో ఒక కరెన్సీకి బదులు ఇంకొక కరెన్సీలో వ్యాపారం చేయడం మాత్రం కాదు. మూడో ప్రపంచదేశాలను కొల్లగొట్టి తమ పెట్టుబడిదారీ వ్యవస్థలను పదిలంగా కొనసాగించుకోగలుగుతున్న సంపన్న పశ్చిమదేశాల ఆధిపత్యానికి గండి కొట్టడం. అందువల్లనే అమెరికాతోబాటు తక్కిన సంపన్న పశ్చిమదేశాలన్నీ చాలా గట్టిగా డాలర్ ఆధిపత్యం దెబ్బతినకుండా ఉండడానికి కావలసిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. కేవలం ఆర్థిక ఆంక్షలకే అవి పరిమితం కాకపోవచ్చు కూడా. ఇతర రూపాలలో సైతం అవి తక్కిన దేశాలమీద వత్తిడులను తీసుకువస్తాయి. అందుచేత డాలర్ల ప్రమేయం లేకుండా అంతర్జాతీయ వాణిజ్యాన్ని నడపాలన్న ప్రయత్నాలు ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి సంకేతం. అందుకే అటువంటి ప్రయత్నాలను అడ్డుకోడానికి సామ్రాజ్యవాదులు ఏ దుర్మార్గానికైనా ఒడిగట్టడానికి తయారవుతారు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్