Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బుద్ధుడు వేదానికైనా, జాతికైనా, పౌరోహిత్యానికైనా, ఆచారానికైనా తలొంచనివాడు. సత్యాన్వేషణలో నిబ్బరం, దిట్టతనం ఉంచుకుని, సర్వ ప్రాణులపైన ప్రేమ, కరుణ కురిపించిన ఉన్నతమైన వ్యక్తి. అలాంటి వాడు ప్రపంచంలో మరొకరు లేరు. నేను బుద్ధుడి సేవకుడికి సేవకుణ్ణి. అతనికి ముందుగానీ, వెనకాల గానీ ఎవరూలేరు. ఆయన తన స్వంతానికి ఏమీ చేసుకోలేదు. ఎంతటి కరుణానిధీ? ఒక గొర్రెపిల్ల కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆకలితో ఉన్న ఒక పులి కోసం తనను తాను అర్పించుకోవడానికి సిద్ధమయ్యాడు. చండాలుడి ఆతిధ్యం సైతం స్వీకరించి ఆశీర్వదించాడు. మొత్తం ప్రపంచాన్ని కౌగలించుకునేంత అనుకంపనను అందించాడు. ఈ భూమి మీద జీవించిన శ్రేష్టమైన వారిలో బుద్ధుడు మిక్కిలి శ్రేష్టమైనవాడు. తనను ఒక మహా మానవుడిగా భావించి, అందరూ తనని ఆరాధించాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అది ఆయనకు ఇష్టంలేని పనికూడా!
- బుద్ధుడి గురించి స్వామి వివేకానంద
- (వేరు వేరు సందర్భాలలో చెప్పిన విషయాలు)
గౌతమ బుద్ధుడు సాధారణ శకానికి ముందు 563-483 బిసిఈ మధ్య జీవించిన వాడు. కపిలవస్తు సమీపంలోని లుంబిని వనంలో యువరాజు సిద్ధార్థగా జన్మించాడు. వీరిది శాక్య క్షత్రియవంశం. శాక్యవంశీయుడు. గనకనే తర్వాత కాలంలో శాక్యమునిగా వ్యవహరింపబడ్డాడు. జ్ఞానోదయం అయిన తర్వాత బుద్దుడయ్యాడు. బోధనల సారాంశమే 'బౌద్ధం' అయ్యింది. ఒక వ్యక్తి మంచి జీవితం గడపడానికి బుద్ధుని బోధనలు ఉపయోగపడతాయి. లుంబిని వనం ప్రస్థుతం నేపాల్‌లో ఉంది. అది ఆకాలంలో భారతదేశంలో అంతర్భాగం. సిద్ధార్థుడి తల్లి మహామాయ. ఆమె కొల్లియా యువరాణి. తండ్రి శుద్ధోధనుడు కపిలవస్తు రాజు. సిద్దార్థుడికి చిన్న వయసులోనే యశోధరతో వివాహం జరిపిస్తారు. సిద్ధార్థ - యశోధర దంపతులకు 'రాహుల్' అనే కుమారుడు పుడతాడు.
ఇరవై తొమ్మిదో యేట సిద్ధార్థుడు ఇంటిని త్యజించాడు. దానినే 'మహాభినిష్క్రమణం' అని అంటారు. రాజమందిరం వదలి అడవిలో తిరుగుతున్నప్పుడు ఆయనకు అలరా కలామాతో పరిచయమయ్యింది. అతనే సిద్ధార్థుడికి తొలి గురువు. ఆయనే ధ్యానం గురించి, సాంకేతిక పరిజ్ఞానం నేర్పించాడు. సిద్ధార్థుడు తన ముప్పయి అయిదవ యేట నిరంజన నది ఒడ్డున బుద్ధగయ వద్ద - బోధి వృక్షం కింద నలభై తొమ్మిది రోజులు ధాన్యం చేశాడు. నిరంతరాయంగా ఏకధాటిగా చేసిన ఆ ధాన్యం వల్ల, సిద్ధార్థుడికి జ్ఞానోదయమైంది. నిరంజన నదికి ఇప్పటిపేరు ఫల్గు. బుద్ధ గయ బీహార్‌లో ఒకప్పుడు చిన్న గ్రామం. ఇప్పుడు అది ఒక పెద్ద బౌద్ధక్షేత్రమయ్యింది. బుద్ధుడి వల్లనే గయకు బుద్ధగయ అనే పేరొచ్చింది. ఇప్పుడు అది జిల్లా కేంద్రం. మహాబోధి మందిరం, పద్మాలు పూసే సరస్సులూ అక్కడ ఉన్నాయి. మగధ విశ్వవిద్యాలయం కూడా అక్కడే ఉంది. బుద్ధుడికి జ్ఞానోదయమయ్యాక రెండు వందల ఏండ్లకు అశోక చక్రవర్తి ఆ స్థలాన్ని సందర్శించాడు. ఆ బోధివృక్షం మొదట్లో ఒక వజ్రాసనాన్ని ఏర్పరిచాడనీ, అక్కడే ఒక మందిరం కట్టించాడనీ చెపుతారు. ఇప్పుడు అవి అక్కడ లేవు గానీ, వాటి అవశేషాలు మాత్రం తప్పక కనిపిస్తాయి.
భారతదేశంలో రెండువేల ఆరువందల సంవత్సరాల క్రితం - మతంగా కాక, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మార్గంగా బౌద్ధం ప్రారంభమయ్యింది. బుద్ధుడు తన తొలి ఉపదేశం (బోధన), తన ఐదుగురు శిష్యులకు సారనాథ్‌లో చేశాడు. దీన్నే ధర్మచక్రం అంటారు. ఇది ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. ఇక్కడి ధమేక స్థూపం చాలా పెద్దది. ఇది సాధారణ శకం 500లో నిర్మాణమైంది. తెల్లని మకరానా పాలరాయితో నలభైమూడు మీటర్ల ఎత్తు - నిర్మించబడింది. బుద్ధుడి ఐదుగురు శిష్యుల పేర్లు - కౌండిన్య, అస్సాజి, భద్దియ, వప్పా, మహానామా, జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట గడిపాడు. ఆ క్రమంలో ఏడవవారం ఆగేయంలో ఉన్న రాజాయతన వృక్షం కింద గడిపాడు. ఇక్కడ బుద్ధుణ్ణి ఇద్దరు బర్మాదేశపు వ్యాపారస్తులు కలిశారు. వారు ప్రార్థన రూపంలో బుద్ధుణ్ణి శరణుకోరారు. ''బుద్ధం శరణం గచ్చామి'' - అని అన్నారు. అంటే నేను బుద్ధుణ్ణి శరణు కోరుతున్నాను అని అర్థం అదే ఆ తర్వాత ప్రార్థనగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం బుద్ధగయలో అనేక మఠాలు, స్మారక కట్టడాలు, దేశంలోనే అతి పెద్ద బుద్ధ విగ్రహం - అక్కడ ఉన్నాయి.
బౌద్ధంలో త్రిరత్నాలు అంటే మూడు ఆభరణాలు ఉన్నాయి. అవి ఏవంటే 1. బుద్ధుడు 2. ద్ధమ్మం 3. సంఘం. ఇవే బుద్ధం శరణం గచ్చామి. ధమ్మం శరణం గచ్చామి. సంఘం శరణం గచ్ఛామిగా మనకు తెలుసు. బుద్ధుడు నాలుగు గొప్ప సత్యాలు చెప్పాడు. 1. దుఃఖం - అంటే బాధ. అందులో నిజం ఉంది. బౌద్ధం ప్రకారం ప్రతిదీ బాధే! అందుకే 'సబ్బం దుఃఖం' అన్నారు. అంటే సర్వం దుఃఖమయమే అని అర్థం! ఇది నొప్పిని అనుభవించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి అనుభవించే అసలైన నొప్పి - బాధ... దుఃఖం మాత్రమే! సముదాయ బాధకు ఒక కారణం ఉంటుంది.
2. తృష్ణ (కోరిక) బాధకు ప్రధాన కారణం అదే. బాధ జీవితంలో ఒక భాగం. 3. నిరోధ - అంటే బాధకు ముగింపు. అందుకు అష్టాంగిక మార్గం ఉంది. 4. నిబ్బానా అంటే మోక్షం. దుఃఖాలకు అంతం. బాధలకు ముగింపు. బాధల ముగింపునకు అష్టాంగిక మార్గాలు ఉపయోగపడతాయి. అవి ఏవంటే...
1. సమ్మా దిత్తి -సరైన అవగాహన.
2. సమ్మ సంకల్ప - సరైన ఆలోచన
3. సమ్మ కమ్మంట - సరైన చర్య
4. సమ్మ అజీవ - సరైన జీవనోపాధి
5. సమ్మ వాయమా - సరైన ప్రయత్నాలు
6. సమ్మ వాకా - సరైన ప్రసంగం
7. సమ్మా సతి - సరైన బుద్ధి
8. సమ్మ సమాధి - సరైన ఏకాగ్రత
బాధల ముగింపు ఎనమిది విధాలుగానూ ఎనిమిది రెట్లుగానూ ఉంటుంది.
సాధారణ శకానికి ముందు 483 బిసిఈలో బుద్ధుడు తన 80వ యేట ఖుషీనగర్లో మరణించాడు. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఒక పట్టణం. గోరక్‌పూర్‌కు తూర్పున 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడది ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం. ఇక్కడే బుద్ధుడు 'మహా పరినిర్వాణం' చెందాడని బౌద్ధం చెపుతుంది. బుద్ధుడు తన సిద్ధాంతాలలో మధ్యమ మార్గానికి ప్రాధాన్యమిచ్చాడు. అయితే బుద్ధుడి జనన మరణాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 563 బిసిఈలో పుట్టాడని కొందరు చెపితే, లేదు 480 బిసిఈ అని మరికొందరంటారు. 483 బిసిఈలో పరినిర్వాణం చెందాడని కొందరంటే 400 బిసిఈ అని మరికొందరంటున్నారు. కొన్ని సంత్సరాల తేడా ఉన్నా, అందరూ ఒప్పుకున్నది సాధారణ శకానికి ముందే అని! 80ఏండ్లు జీవించాడని!! సంస్కృత భాషా ప్రభావంతో ఆయన పేర్లు - సిద్ధార్థుడు, గౌతముడుగా మారాయి. అసలైతే ఆనాటి పాలి భాషలో సిద్ధత్తా అని, గోటమా అని అనాలి. సంస్కృత ప్రభావంతోనే పాలి-పాళీ అయ్యింది. ధమ్మం - ధర్మం అయ్యింది.
సంస్కృత భాష మీద బ్రాహ్మణుల గుత్యాధిపత్యం ఉండేది. అందుకు విరుద్ధంగా బుద్ధుడు తన సందేశాల్ని ఆనాటి ప్రజల భాష అయిన పాలి భాషలో సరళంగా, మృదువుగా ప్రజలకు అందించేవాడు. అతని దయా గుణం, ప్రశాంత వదనం, సౌమ్య వచనం - చక్రవర్తిగా రాజ్యమేలాల్సినవాడు, సర్వస్వాన్నీ త్యజించి, ప్రజల కోసం పరిత్యాగ జీవితం కోరుకున్న ఆయన - ప్రజల్ని విశేషంగా ఆకర్షించేవాడు. ప్రజా సమస్యలకు ఆయన దగ్గర నైతిక పరిష్కారాలు సిద్ధంగా ఉండేవి. తెరచిన పుస్తకం లాంటి ఆయన జీవితమే ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజలకు గొప్ప స్ఫూర్తినిస్తోంది. దేశంలోను విదేశాలలోనూ బౌద్ధం గొప్ప ప్రజాదరణ పొందడానికి, కాలక్రమంలో బలహీన పడడానికీ అనేక కారణాలు ఉన్నాయి. అశోక చక్రవర్తి మద్దతుతో, చొరవతో మధ్య ఆసియా దేశాలలో, శ్రీలంకలో బౌద్ధం ఉచ్ఛస్థితికి చేరింది. తన తర్వాత రాజు కావల్సిన వాణ్ణి - తన కుమారుడైన మహేంద్రను, కూతురు సంఘమిత్రను అశోకుడు బౌద్ధ ప్రచారం కోసం శ్రీలంకకు పంపాడు. ప్రసేన్‌జిత్, బింబిసారుడు, కనిష్కుడు మొదలైన రాజులు బౌద్ధాన్ని ఆదరించారు. రాజుల ప్రోత్సాహం, రాజపోషకుల కారణంగా ఆనాడు బౌద్ధం అనేక దేశాలకు వేగంగా వ్యాపించింది. బౌద్ధం వ్యాపించడానికి మరికొన్ని ముఖ్యకారణాలు ఉన్నాయి. వైదిక ధర్మం లాగా ఇది పిడివాదంగా లేదు. ఉదారవాదంగా ఉంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఉండం వల్ల అన్ని కులాల వారూ దీనిపట్ల ఆకర్షితులయ్యారు. పైగా మహిళలను కూడా సంఘంలో చేర్చుకోవడం వల్ల, బౌద్ధం అట్టడుగు హృదయాలను గెలుచుకుంది. ఆనాటి మగధలోని బ్రాహ్మణులు శూద్రులను చిన్నచూపు చూసి అవమానించేవారు. అందువల్ల కూడా, కుల కట్టుబాట్లను తెంచుకుని అధిక సంఖ్యలో ప్రజలు బౌద్ధాన్ని అక్కున చేర్చుకున్నారు. వివేకవంతులైన కొందరు బ్రాహ్మణులు కూడా బౌద్ధం స్వీకరిస్తూ ఉండేవారు.
ఆ రోజుల్లోనే కాదు, ఆధునిక కాలంలో కూడా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆరు లక్షల మందితో బౌద్ధం స్వీకరించారు. ఈ దేశానికి ఒక దిశా నిర్దేశం చేశారు. దాన్ని 'నవయానం' అన్నారు. మొన్నటికి మొన్న గుజరాత్లో 50వేల మంది బౌద్ధం స్వీకరించారు. మనుషులందరిదీ ఒకే స్థాయి - నైతికతే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది - మానవీయ విలువలే ముఖ్యం - లాంటి విషయాలకు ఆకర్షితులై... మతాల అడ్డుగోడలు కూల్చి బౌద్ధమార్గం స్వీకరిస్తున్నారు. విదేశాల నుండి ప్రముఖులు ఎవరు వచ్చినా మన దేశభక్తి - దేశ నాయకులు వారికి ఒక బుద్ధ విగ్రహం బహూకరిస్తున్నారు. అది మంచి పనే - కానీ, బుద్ధుడు చెప్పిన ఒక్క అంశమైనా మన దేశ నాయకులు తమ మెదళ్ళకు ఎక్కించుకుంటున్నారా? అన్నది అనుమానం! ఎక్కడి పాట అక్కడ పాడే వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా దేశ ప్రజలు అనుమానిస్తారే గాని, విశ్వసించరు. మానవీయ విలువలు నిలుపుకోలేనివారు ఎంతటి వారైనా - వారు, మనిషి కన్నా తక్కువే - బుద్ధుడు తెలియనివారు ఎవరూ ఉండరు. నిజానికి ప్రపంచంలో అత్యధికంగా తయారవుతున్న విగ్రహాలు బుద్ధుడివే. ఇంట్లో ఓ బుద్ధ విగ్రహం పెట్టుకోగానే సరిపోదు. 2500ఏండ్ల క్రితమే ఆ మహా మానవుడు ఏం చెప్పాడన్నది కొద్దిగానైనా తెలుసుకోవాలి. మనిషిగా మిగలాలంటే ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఉండాలి. తరాలు మారుతున్నాయి. నిజమే- కానీ, ఆ మహాజ్యోతి అందించిన స్ఫూర్తి యొక్క తీవ్రత - ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే బుద్ధుడు ఇంకా సజీవంగానే ఉన్నాడు!
- డాక్టర్ దేవరాజు మహారాజు
(నేడు బుద్ధ జయంతి)
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ
అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.