Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాక్రాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా మూడున్నర నెలలుగా ఫ్రెంచ్ కార్మికవర్గం నిరవధిక పోరాటం సాగిస్తోంది. ఇప్పటికి ఓ డజను సార్లు దేశవ్యాప్త ఆందోళనలు జరిగాయి. మేడే రోజు ఉధృతరూపం దాల్చింది. వందల మంది ఉద్యమ కారులను అదుపులోకి తీసుకున్నారు. అయినా ఫ్రెంచ్ కార్మికవర్గం తన ఆందోళనల్ని ఆపడానికి సిద్ధంగా లేదు. పెన్షన్ సంస్కరణలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఏకపక్షంగా అమలు చేయబూనుకున్న పింఛను సంస్కరణలను 83శాతానికిపైగా ఫ్రెంచి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నూతన సంస్కరణలు అమలులోకి వస్తే పదవీ విరమణ అనంతరం ఓ కార్మికుడు పూర్తి పెన్షన్ పొందాలంటే 43ఏండ్ల పాటు పనిచేయడంతో బాటు, సదరు యాజమాన్యం నగదు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. 62 ఏండ్లు ఉన్న కార్మికులు మరో రెండేండ్ల పాటు పదవి విరమణ కోసం వేచి చూడాల్సివుంది. అప్రతిష్టాకరమైన ఈ సంస్కరణలను వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. జనవరి 31న 12లక్షలమంది రోడ్డు మీదకొచ్చి నిరసనల్లో పాల్గొనగా, మాక్రాన్ ప్రభుత్వం నిర్బంధాన్ని ఎంతగా ప్రయోగించినా లెక్కచేయకుండా జనం పెద్దఎత్తున కదులుతున్నారు. దీంతో కొన్ని చోట్ల ప్రదర్శకులకు, పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. పారిస్, ఇతర ప్రధాన నగరాల్లో జరుగుతున్న ఆందోళనలపై ప్రధానంగా అందరూ దృష్టి కేంద్రీకరిస్తున్నా, దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలు, నగరాల్లో ప్రజల ప్రాతినిధ్యం కూడా చాలా ఎక్కువగానే ఉంది. లోయిరే రీజియన్‌లోని మోంటార్గిస్లో వేలాది మంది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలియజేశారు. పారిశుధ్య కార్మికులు కూడా సమ్మెలోకి దిగడంతో పారిస్ వీధుల్లో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. రైల్వే ట్రాకులన్నీ ఆందోళన జరుపుతున్న కార్మికులతో కిక్కిరిసిపోయాయి. విధులను బహిష్కరించి, వీధుల్లోకి రావాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా రిఫైనరీలలో సమ్మెలు జరుగుతున్నాయి. పారిస్‌లోని చెత్త కార్మికుల సమ్మెతో 'సిటీ ఆఫ్ లైట్స్' 'చెత్త నగరం'గా మారిపోయింది. రవాణా కార్మికులు, ఉపాధ్యాయులు కూడా సమ్మె చేశారు. ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ఫ్రెంచ్ అగ్నిమాపక సిబ్బంది మండుతున్న చెత్త డబ్బాలను ఆర్పివేస్తున్నారు. పలు యూనియన్లు, వామపక్ష సంస్థల ఆధ్వర్యంలో రవాణా, విద్య, ఇంధన రంగాలకు చెందిన కార్మికులు ఫ్రాన్స్‌లోని ప్రధాన నగరాల్లో భారీ ప్రదర్శనలు చేపట్టారు. ఈ బిల్లుని ఉపసంహరిం చాలంటూ లక్షలాది మంది కార్మికులు ఇప్పటికే ఆందోళనలు చేపడున్నారు. మొత్తం జనాభాలో ఐదవ వంతు మంది రోడ్లపైనే ఉన్నారు. తమకు గుర్తున్నంతవరకు ఇవి అతిపెద్ద నిరసన ప్రదర్శనలు అని ఫ్రెంచ్ విశ్లేషకులు చెప్తున్నారు. జూన్ 6న మరోసారి ఫ్రెంచ్ కార్మిక సంఘాలు దేశవ్యాప్త ఆందోళనా దినం ప్రకటించాయి. దాదాపు 14 ఏండ్ల తర్వాత (2009 తర్వాత)మే ఒకటి, 2023న ఫ్రాన్స్‌కి చిందిన 8 కార్మిక సంఘాలు ఒక్క తాటి మీదకి వచ్చి నిరసనలలో సమరశీలంగా పాల్గొన్నాయి.
దివాలా కోరు పెన్షన్ సంస్కరణలు!
రెండో ప్రపంచ యుద్ధం తరువాత అనేక దేశాలు కమ్యూనిస్టు ప్రభావంలోకి వెళ్లిపోతాయేమో అని అప్పటి పెట్టుబడిదారీ దేశాలు భయపడిపోయాయి. సోవియట్ యూనియన్ తరహాలో అనేక సంక్షేమ పథకాలను (న్యూ డీల్, మార్షల్ ప్లాన్ పేరుతో) ప్రజలకు అమలు చేశారు. యూరోపియన్ దేశాలు సోషల్ కాంట్రాక్ట్ పేరుతో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అమలు చేశాయి. కార్మికులకు కనీస వేతనాలు, నిర్దిష్ట పనిగంటలు అమలు చేయడం, కార్మిక ఉమ్మడి బేరసారాల హక్కును గుర్తించడం, నిరుద్యోగ యువతకు స్టైఫండ్లు ఇవ్వడం, కార్మికులకు, ఉద్యోగులకు పింఛన్లు జారీ చేస్తుండటం వంటివి చేశాయి. ఫ్రాన్స్‌లో సోషల్ కాంట్రాక్ట్ కింద ప్రజలందరికీ విద్య, వైద్యంలో చక్కటి ప్రయోజనాలు ఉన్నాయి. కార్మికులందరికీ ప్రభుత్వ పెన్షన్ ఉంది. వారానికి 35గంటల పనిదినం అమలవుతోంది. పెన్షన్ కోసం వారి జీతాలను బట్టి వారు పెన్షన్ ఫండ్‌కు చెల్లించవలసి ఉంటుంది. యూరోపియన్ దేశాలతో పోలిస్తే పదవీ విరమణ పొందిన కార్మికుల్లో తక్కువ పేదరికం ఫ్రెంచ్ పెన్షనర్లలో ఉంది. అమెరికా, బ్రిటన్‌లో లాగా ప్రయివేటు పింఛను పథకాలు ఫ్రాన్స్‌లో ఉండవు.అందుకే పెన్షన్ సంస్కరణలను ఫ్రాన్స్‌లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. 1995, 2010లోనూ రిటైర్మెంట్ వయసు పెంపు విషయంలో ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు.
మాక్రాన్ సర్కార్ అడ్డగోలు వాదనలు
యూరోపియన్ దేశాల్లో పోలిస్తే ఫ్రాన్స్‌లో రిటైర్మెంట్ వయసు తక్కువ. రిటైర్మెంట్ వయసు ఫ్రాన్స్‌లో 62గా ఉంటే, బ్రిటన్‌లో 66, జర్మనీలో 67, స్పెయిన్‌లో 65గా ఉంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతో ఫ్రాన్స్‌లో సగటు ఆయు ప్రమాణం 83గా ఉంది. యూరోపియన్ దేశాల్లో ఇది 80 నుండి 85గా ఉంది. దీంతో అనేక యూరోపియన్ దేశాల్లో రిటైర్మెంట్ వయసు 64 పైబడి ఉంది. మరొక పక్క పెన్షనర్ల సంఖ్య ప్రతీ ఏడాదీ పెరుగుతోంది. 2004లో ఫ్రాన్స్‌లో 40లక్షల పెన్షనర్లు ఉంటే ఇప్పుడు కోటి 17లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. పెన్షన్ ఖర్చు ఫ్రాన్స్ జీడీపీలో 14శాతంగా ఉంది. భవిష్యత్‌లో ఇది మోయలేని భారంగా మారుతుంది. 2000 సంవత్సరంలో సగటున ప్రతి పెన్షనర్‌కి 2.1 ఉద్యోగులు ఉంటే, నేటికి అది 1.7కి పడిపోయింది. ఇప్పటికే ఫ్రాన్స్ దేశ జీడీపీలో జాతీయ అప్పు 113.4శాతం ఉంది. బ్రిటన్‌లో ఇది 100.2శాతం, జర్మనీలో 66.6శాతం, స్పెయిన్‌లో 115.6 శాతం, పోర్చుగల్‌లో 120శాతంగా ఉంది. రష్యా మీద ఆంక్షలు విధించడం వలన ఇంధనం ధరలు పెరిగి అది పరోక్షంగా ద్రవ్యోల్బణానికి దారి తీసిన స్థితిలో ఆర్థిక పరిస్థితిని ఒక దారిలోకి తేవాలంటే ఇలాంటి చర్యలు తప్పదు. ఇప్పటికే అనేక యూరోపియన్ దేశాలు మాంద్యంలో ఉన్న నేపథ్యంలో, ఫ్రాన్స్‌లో పెన్షన్ సంస్కరణలు చేయకపోతే ఆర్థిక పరిస్థితులు దిగజారుతాయని మాక్రాన్ సర్కార్ వాదిస్తోంది.
ఫ్రాన్స్ కార్మిక సంఘాల వాదన
ఫ్రాన్స్ ప్రభుత్వం చెపుతున్న ఆర్థిక సంక్షోభం ఇప్పుడు దేశంలో ఏమాత్రం లేదని, మాక్రాన్ ప్రభుత్వం బుకాయింపులకు దిగుతోందని ఫ్రెంచ్ కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి! 62ఏండ్ల నుండి 64ఏండ్లకి రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచడం వలన వచ్చే రెండేండ్ల వరకు కేవలం జీతాలు ఇస్తే సరిపోతుంది. అందుకే, ఈ ప్రతిపాదన అంటున్నాయి! అయితే రిటైర్మెంట్ వయసు పెంచడం ఒకటే కాదు, ఆ ముసుగులో కొత్త కార్మిక చట్టాలని తేవాలని ప్రతిపాదించడం కూడా కార్మికుల ఆందోళనలకు ముఖ్య కారణం. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం ఈ సెప్టెంబర్, 2023 నుండి 2030 వరకు ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ వయస్సు మూడు నెలలు పెరుగుతుంది. అలాగే పూర్తి పెన్షన్ కావాలంటే 43ఏండ్ల పాటు కార్మికులు పనిచేయాలి. శారీరకంగా లేదా మానసికంగా కష్టతరంగా భావించే ఉద్యోగాలలో ఉన్న కొంతమంది కార్మికులు చాలా మంది శ్రామిక జనాభా కంటే ముందుగానే పదవీ విరమణ చేసే హక్కును కలిగి ఉంటారు. కానీ, ఇప్పుడది కష్టం అవుతుంది. ఈ కొత్త ప్రతిపాదనలు తక్కువ జీతాలు ఆర్జించే కార్మికుల మీదా, మహిళల మీదా తీవ్రంగా పడుతుంది. ఇప్పుడిప్పుడే కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి ఇది భారంగా మారుతుంది. అందుకే, వారి నుంచి ప్రతిఘటన తీవ్రంగా ఉంది. అధ్యక్షుడు మాక్రాన్ కార్పొరేట్ వ్యాపార వర్గాలకి మేలు చేకూర్చే విధంగా కార్మిక చట్టాలని సవరించాలని చూస్తున్నాడని, ఇప్పటికే కార్పొరేట్ సంస్థల మీద పన్ను తగ్గింపు లాంటి చర్యలు తీసుకున్నాడని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తచట్టానికి శ్రీకారం చుడితే అది కార్మికులకి అన్యాయం చేసినట్లు అవుతుంది. నిజానికి ఫ్రాన్స్‌లో లాభాలు ఆర్జించలేని కార్పొరేట్ సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ లాభాలు లేక మూసివేయాల్సివస్తే కార్మికులకి చెల్లింపులు జరపాల్సి వస్తున్నది, అది రద్దు చేయాలని కార్పొరేట్ వర్గాలు మాక్రాన్ మీద ఒత్తిడి తెస్తున్నాయి కొంత కాలం నుండి ఫ్రాన్స్‌లో కార్పొరేట్, భారీ పరిశ్రమలలో, వ్యాపారాలలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. దీనికి కారణం బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి వైదొలిగినప్పుడు చాలా దేశాలు బ్రిటన్ నుండి తమ పెట్టుబడులని ఉపసంహరించి ఫ్రాన్స్ దేశంలో పెట్టుబడులు పెట్టాయి. ఏదన్నా సంస్థ కనుక పూర్తిగా మూసివేయాల్సి వస్తే కార్మికులకి ఇచ్చే నష్ట పరిహారం విషయంలో తమకి కొంచెం వెసులుబాటు ఇవ్వాలని కార్పొరేట్, పారిశ్రామిక సంస్థలు కోరుతున్నాయి. కార్పొరేట్ల ప్రయోజనం కోసమే మాక్రాన్ ప్రభుత్వం కొత్త పెన్షన్ చట్టాలను తీసుకువస్తోందనే వాదన ఉంది.
దుందుడుకుగా రాజ్యాధికార ప్రయోగం
పార్లమెంటు సభ్యుల ఓటింగ్‌తో నిమిత్తం లేకుండా పెన్షన్ సంస్కరణలను దూకుడుగా తీసుకు రావడానికి అధ్యక్షుడు మాక్రాన్ తన ప్రత్యేక రాజ్యాంగాధికారాన్ని ఉపయోగించారు. ఫ్రెంచ్ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 49.3ను కార్మికుల పదవీ విరమణ వయస్సును పెంచడానికి, పూర్తి పెన్షన్ కావాలంటే 43ఏండ్ల పాటు కార్మికులు పనిచేయాలని, ప్రభుత్వ రవాణా, ఇంధన కార్మికులు కలిగివున్న కొన్ని ప్రత్యేక పెన్షన్ సదుపాయాలు తొలగించడానికి ప్రయోగించారు. ఈ చర్యపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలోని ఎగువసభలో పెన్షన్ సంస్కరణల చట్టం ఓటింగ్‌కి పెట్టకుండా బిల్ పాస్ చేయడానికి మాక్రాన్ ప్రభుత్వం ప్రయత్నించిన తరుణంలో హింస ప్రజ్వరిల్లింది! ఎటువంటి చట్టం అయినా, ప్రజాస్వామ్యయుతంగా చర్చకు పెట్టి, పాస్ చేయాలి తప్ప ఏకపక్షంగా రుద్దడమేమిటని కార్మికులు, పెన్షనర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధ్యక్షుడు మాక్రాన్ మీద రెండు సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే అది వీగిపోయింది. ఫ్రాన్స్ కాంస్టిట్యూషనల్ కౌన్సిల్ పెన్షన్ సంస్కరణలకు దాదాపుగా జై కొట్టడంతో, ఇదే అదనుగా మాక్రాన్ పెన్షన్ సంస్కరణల చట్టాన్ని ఏప్రిల్ 15న ఆమోదించారు. ఫ్రాన్స్ అధ్యక్షుని ఏకపక్ష ధోరణి వల్ల ప్రజాకోర్టులోనే ఈ అంశాన్ని తేల్చుకోవాలని కార్మికవర్గం భావిస్తోంది. ఇప్పటికే తన ఏకపక్ష ధోరణులతో మాక్రాన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. ఆయన రేటింగ్ 28శాతానికి పడిపోయినట్లు సర్వే సంస్థలు తెలియచేస్తున్నాయి. 2010లో రిటైర్మెంట్ వయసును 60 నుండి 62కి పెంచినప్పుడు అప్పటి అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ తీవ్ర నిరసనలు ఎదుర్కొని, తదనంతరం తన పదవిని కోల్పోయారు. ఎటువంటి చర్చ లేకుండా, వివాదాస్పదమైన పెన్షన్ సంస్కరణలను అమలు చేయాలని అధ్యక్షుడు మాక్రాన్ చేస్తున్న దుందుడుకు ప్రయత్నాలను ఫ్రెంచ్ ప్రజానీకం నిరసిస్తున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ పరిణామాల ప్రభావం అటు యూరోపియన్ దేశాల పైనా, ఇటు ఓపీఎస్(గ్యారంటీ పింఛను పథకం) కావాలని నిరసనలు జరుగుతున్న మన దేశంపైనా పడే అవకాశం ఉంది.
- పి. సతీష్