Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తలసేమియా ఒక జన్యు సంబంధమైన వ్యాధి. ఎముక మూలుగలో హిమోగ్లోబిన్ ఉండే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి నిలిచిపోవడాన్ని 'తలసేమియా' వ్యాధి అంటారు. బిడ్డకు జన్మనిచ్చే తల్లి నుండే ప్రాణాంతక తలసేమియా వ్యాధి సంక్రమిస్తుంది. దీనిద్వారా జన్యువాహకులైన తల్లిదండ్రులకు జన్మించే బిడ్డల్లో 25-30శాతం మంది పుట్టక తోనే వ్యాధిగ్రస్తులయ్యే అవకాశం ఉంది. తలసేమియా అనేది గ్రీక్ పదం. గ్రీక్ భాషలో తలసేమియా అంటే సముద్రం అని అర్థం. ఈ వ్యాధికి గురైన వారికి జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. ఈవ్యాధి ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి ఆల్ఫా తలసేమియా, రెండు బీటా తలసేమియా. తలసేమియా రక్తంపైన తన ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసతో పీల్చుకునే ఆక్సిజన్‌ను రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ హిమోగ్లోబిన్ అందిస్తుంది. తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. ఒకవేళ ఉత్పత్తయినా ఎక్కువకాలం అది నిల్వ ఉండదు. హిమోగ్లోబిన్ నిల్వలు పడిపోయిన ప్రతిసారీ హిమోగ్లోబిన్‌ని కృత్రిమంగా రక్తం ఎక్కించి అందించాలి. సకాలంలో రక్తం ఎక్కించకపోతే చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. తలసేమియా ఆప్రభావమైన ఆటోషోమాల్ పద్ధతిలో వ్యాపిస్తుంది. తల్లిదండ్రుల్లో ఉండే జన్యుపరమైన లోపాల కారణంగా కానీ, జన్యువుల్లో ఉండే వ్యత్యాసాల కారణంగా తలసేమియా సంక్రమిస్తుంది. మనదేశంలో 4.50కోట్ల మంది తలసేమియా బారిన పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో గ్రామీణ ప్రాంతంలో సుమారు 68.8శాతం మంది తలసేమియా వ్యాధి కలిగిన వారు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 31.2 శాతం తలసేమియా వ్యాధి కలిగిన వారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 3వేల మంది తలసేమియా బాధితులు ఉన్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం, సంగారెడ్డి జిల్లాలో బీటా తలసేమియా వ్యాధి వేగంగా విస్తరిస్తుంది. మైనార్టీ, దళిత, గిరిజన, బీసీలలో ఇతర ప్రజల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఏటా 2.7కోట్ల మంది పిల్లలు జన్మిస్తే 32,400మంది పిల్లలు తీవ్రమైన హిమోగ్లోబిన్ రుగ్మతతో జన్మిస్తున్నరని అనేక అధ్యయనాలు తెలియ చేస్తున్నాయి.
పట్టణ ప్రాంతాల్లో జన్మించే 12,000మందిలో కొద్ది మంది మాత్రమే సరైన వైద్యం పొందగలుగుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో తలసేమియా రోగుల రక్త మార్పిడి కోసం 2 మిలియన్ యూనిట్ల ప్యక్డ్ రెడ్ సెల్స్ అవసరం అవుతున్నాయని అంచనా. ఈ వ్యాధి మూడు నెలల వయస్సు నుంచి 18నెలల వయసు మధ్యలో బయటపడుతుంది. ముఖం పీక్కుపోయి, బాల్యంలోనే ముడతలు పడినట్టుగా తయారవుతుంది. శరీర రంగు తేడాగా ఉంటూ, పాలి పోయినట్టుగా మారుతుంది. శారీరక ఎదుగుదల ఉండదు. బొడ్డు భాగంలో వాపుంటుంది. తరచుగా అనారోగ్యాలకు గురవుతుంటారు. తలసేమియా వ్యాధి కలిగిన వారికి ఉన్న లక్షణాల ఆధారంగా చికిత్స చేయాలి. శరీరంలో ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచడానికి 15 నుంచి 20 రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కిస్తారు. ఎముకల మూలుగలో ఉన్న రక్త కణాలను మార్పిడి చేసి వ్యాధిని నివారించవచ్చు. దీన్ని వైద్య పరిభాషలో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. తలసేమియా వ్యాధి కుటుంబాలను జన్యుపరమైన పరీక్షలకు హాజరు కావటం అవసరం. గర్భిణీలు తలసేమియా వ్యాధి సంబంధిత పరీక్షలకు హాజరుకావాలని ది అమెరికన్ కాలేజీ అఫ్ అబ్సిట్రేటి యాన్స్ అండ్ జినేకోలోజిస్ట్స్ సూచించింది. ప్రపంచ వ్యాపితంగా వివిధ దేశాలలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సంఖ్యను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తల్లితండ్రులను పరీక్షించటం ద్వారా ప్రతి 158మంది శిశువులలో ఒక్కరికి మాత్రమే తలసేమియా ఉండే పరిస్థితి నుండి బయట పడవచ్చు.
తలసేమియా వ్యాధి పూర్తి సమాచారం కోసం అనేక జాతులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. చిన్న భౌగోళిక ప్రాంతాలు కొన్ని తెగల్లో తలసేమియా ఎక్కువగా ఉంటుంది. జాతీయ తలసేమియా నియంత్రణ కార్యక్రమం రూపొందించిన లక్ష్యాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు స్క్రీనింగ్ కోసం తగిన కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తలసేమియా వ్యాధి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సరైన వైద్యం అందించేందుకు ప్రినేటల్ డయాగసిస్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ప్రసూతి వైద్యులు, సోనాలజిస్ట్లకు పిండం నమూనా విధానాలపై శిక్షణను క్రమం తప్పకుండా నిర్వహించడం అవసరం. ఇప్పటికే ఉన్న వాళ్లు తలసేమియా రోగులకు వైద్యం అందించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అన్ కమ్యూనిటీ కంట్రోల్ ఆఫ్ తలసేమియా రూపొందించిన కార్యక్రమం మన దేశంలో బీటా తలసేమియాను కనుగొనేందుకు దోహదపడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేసి తక్కువ రిస్క్ ఉన్న వారికి స్టెమ్ సెల్ మార్పిడి కోసం ప్రోత్సహించాలి. జాతీయ తలసేమియా నియంత్రణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి. దీనికి ఎన్జీఓలు, తలసేమియా సొసైటీలు, కార్పొరేట్ సంస్థల సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
(మే 8న అంతర్జాతీయ తలసేమియా డే)
- ఎం. అడివయ్య
9490098713