Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగ భతి ఏమైంది? : జీవన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఆర్భాటం చూస్తే ఆశ్చర్యం వేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ బిస్వాల్ కమిటీ లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు చెప్పిందన్నారు. నిరుద్యోగులను ఆత్మహత్యలకు పురిగొల్పి.. ఇవాళ ఆర్భాటం చేస్తున్నారని విమర్శించారు. అదనపు జిల్లాలతో అదనపు ఉద్యోగాలు ఎందుకు సృష్టించడం చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న ఖాళీలు, రిటైర్‌మెంట్‌తో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి ఇంత హంగామా అవసరమా? అని ప్రశ్నించారు. కేవలం 13 వేల ఉపాధ్యాయ ఖాళీలకు ఇంత ఆర్భాటమా?.. నిరుద్యోగ భతి ఏమైందని ప్రశ్నించారు. స్థానికత పట్ల చిత్తుశుద్ధి ఉంటే ప్రయివేట్‌లో కూడా స్థానికులకే అవకాశం దక్కేలా చూడాలన్నారు. 80 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణీత కాల వ్యవధి ప్రకటించాలన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించిన దుర్మార్గుడు కేసీఆర్ అనీ, కనీసం టెట్ కూడా నిర్వహించలేదని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. గ్రూప్ వన్ పోస్టుకు జోనల్ వ్యవస్థ ఎందుకు అడ్డు వచ్చిందో చెప్పాలన్నారు.