Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈనెల 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలనీ, అందులో భాగస్వాములు కావాలని టెక్స్‌టైల్, పవర్‌లూమ్ కార్మికులకు సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె హేమలత పిలుపునిచ్చారు. టెక్స్‌టైల్ సంఘాల ప్రతినిధుల సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను రద్దు చేస్తున్నదని విమర్శించారు. పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నదనీ, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్పారు. కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా లేబర్‌కోడ్‌లను తెచ్చిందన్నారు. దీనివల్ల కార్మికులకు తీవ్ర నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాల చట్టాన్ని సవరించి అమలు చేయడం లేదని అన్నారు. ఉన్న వేతనాలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయాలు చేస్తున్నదని చెప్పారు. ఎనిమిది గంటల పనివిధానాన్ని సవరించి పది నుంచి పన్నెండు గంటలపాటు కార్మికులు పనిచేస్తున్నారని వివరించారు. కార్మికుల శ్రమను కార్పొరేట్ శక్తులు దోచుకుంటున్నాయని విమర్శించారు.
మోడీ సర్కారు కార్పొరేట్ అనుకూలమనీ, కార్మికులకు వ్యతిరేకమని అన్నారు. టెక్స్‌టైల్ రంగం మీద కేంద్రం జీఎస్టీని విధించిందని చెప్పారు. ఈ రంగంపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి లేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. టెక్స్‌టైల్ రంగంపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెలో టెక్స్‌టైల్, పవర్‌లూమ్‌తోపాటు అనుబంధంగా ఉన్న కార్మికులు పాల్గొనాలని కోరారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలన్నారు. రాబోయే కాలంలో ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పారు. అఖిల భారత స్థాయిలో టెక్స్‌టైల్, పవర్‌లూమ్, స్పిన్నింగ్‌మిల్లుల యూనియన్ల జాతీయ కన్వెన్షన్‌ను మే 17న తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహిస్తామని వివరించారు. ఈ కన్వెన్షన్‌కు వివిధ రాష్ట్రాల్లోని సమస్యలను చర్చించి తీర్మానాలను చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు. సీఐటీయూ జాతీయ కార్యదర్శి కరిమలయన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు, కేరళ నాయకులు గోపినాథ్, తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర పాలడుగు సుధాకర్‌తోపాటు తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ ప్రతినిధులు పాల్గొన్నారు.