Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వరంగ సంస్థల మిగులు భూములను, భవనాలను అమ్మకానికి పెట్టడానికి వీలుగా నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్(ఎన్‌ఎల్‌ఎంసీ) ఏర్పాటుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందనీ, దీన్ని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. మిగులు భూమి నగదీకరణకు రూ.5 వేల కోట్ల ప్రారంభ అధీకృత షేర్ క్యాపిటల్, రూ.150 కోట్ల పెయిడ్ ఆఫ్ షేర్ క్యాపిటల్‌తో పూర్తి యాజమాన్య సంస్థగా ఈ కార్పొరేషన్‌ను ప్రారంభించనుందని తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన భూమి, భవనాలతో పాటు గణనీయంగా ఉపయోగించని నాన్‌కోర్ ఆస్తులను అమ్మకానికి పెట్టడం ఈ నిర్ణయంలోని ముఖ్య లక్ష్యమని ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయమని పేర్కొన్నారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలలో భాగంగానే ఇటువంటి నష్టదాయక నిర్ణయాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టడం ప్రభుత్వరంగ సంస్థల విధ్వంసానికే దారితీస్తుందని పేర్కొన్నారు. నేషనల్ మానిటైజేషన్ ప్రాజెక్టుకు కొనసాగింపే ఈ చర్య అని తెలిపారు. కార్మికుల శ్రమతో నిర్మించిన జాతి సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు.