Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 583 జారీచేశామని హైకోర్టుకు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తొమ్మిది నెలల కింద రిలీవైనా క్యాట్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీస్‌లోకి తీసుకోని ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్, హైకోర్టుల ఆదేశాల మేరకు మహంతిని తెలంగాణ రాష్ట్ర సర్వీస్‌లోకి తీసుకుంటూ ఈ నెల 14న జీవో 583ను జారీ చేసింది. దీంతో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) విచారణకు స్వయంగా హాజరుకు చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్‌కు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. క్యాట్, హైకోర్టుల ఆదేశాల మేరకు మహంతిని సర్వీస్‌లో తీసుకున్నట్టు ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు. జీవో ప్రతిని హైకోర్టుకు అందజేశారు. వాటిని పరిశీలించిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రధాన కేసు విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర సర్వీసు అధికారుల విభజనలో భాగంగా మహంతిని ఏపీకి కేటాయించారు. దీనిపై ఆయన క్యాట్‌లో సవాల్ చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయాలనీ తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలని క్యాట్ ఆదేశాలిచ్చింది. దీంతో ఏపీ రిలీవ్‌చేసిందిగానీ తెలంగాణ ప్రభుత్వం సర్వీస్‌లోకి తీసుకోలేదు. దీనిపై క్యాట్ సీరియస్ అయ్యింది.