Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల చదువు కొనసాగిస్తాం
- ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది : సీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రం చేస్తున్న అప్పులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోని 28 రాష్ట్రాలు అప్పులు చేసే క్రమంలో తెలంగాణ 25వ ర్యాంకులో ఉందన్నారు. మనకంటే 24 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేశాయని చెప్పారు. కాంగ్రెస్ పాలించే రాజస్థాన్, పంజాబ్‌లో కూడా ఎక్కువగానే అప్పులు చేశారన్నారు. అప్పులు చేయడం వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదనీ, దీనిపై ఎవరూ రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటున్న ప్రతిపక్షాలు.. వాటిని నిధుల సమీకరణగా చూడాలన్నారు. సంస్కారవంతమైన ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా పాటించడం వల్లే తక్కువ అప్పులతో ఎక్కువ వృద్ధిని సాధించగలుగుతున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మూడు మెడికల్ కాలేజీలు ఉండేవనీ, వాటి సంఖ్యను ఇప్పుడు 33కి పెంచుతున్నామనీ, నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మార్చిలోపు 40 వేల కుటుంబాలకు దళితబంధు ఇస్తామనీ, ఏటా రెండు లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకురుస్తామన్నారు. దేశ తలసరి ఆదాయంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. తెచ్చిన అప్పులను జాగ్రత్తగా.. ఎలాంటి లోపం లేకుండా వినియోగిస్తున్నామన్నారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన రాష్ట్ర విద్యార్థులు 740 మందికి, చదువు మధ్యలో ఆగకుండా, ఖర్చుకు వెనకాడకుండా దేశంలోనే వైద్య విద్యను పూర్తిచేయిస్తామని చెప్పారు.