Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.3 వేలతో బతికేదెట్టా?
- మధ్యాహ్నభోజన కార్మికులకు కనీస వేతనమివ్వాలి
- పెండింగ్ సమస్యలపై పోరాటాలకు అండగా ఉంటాం
- చలో హైదరాబాద్ కార్యక్రమంలో జూలకంటి రంగారెడ్డి
- 28,29 తేదీల్లో సమ్మెను జయప్రదం చేయాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని పెంచటం సంతోషమేగానీ..ఆ రూ.3 వేలతో వారు ఎట్లా బతకాలో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. వారికి కనీస వేతనాలివ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు వందలాది మంది తరలొచ్చారు. 'మెనూ చార్జీలు పెంచాలి...పథకం నిర్వహణను ప్రయివేటు సంస్థలకు అప్పగించొద్దు...ప్రభుత్వమే గుడ్లను సరఫరా చేయాలి...పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి..' అని నినదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ మాత్రం పారితోషికం పెంపునైనా రాష్ట్ర సర్కారు ఉత్తిగే చేయలేదనీ, దీని వెనుక మధ్యాహ్న భోజన కార్మికుల పోరాటాల కృషి వల్లనే జరిగిందని తెలిపారు. పోరాడి గౌరవ వేతనాలు పెంచుకున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఇదే స్ఫూర్తితో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆ పోరాటాలకు తమ అండ ఉంటుందని హామీనిచ్చారు. క్షేత్రస్థాయిలో వారు పాఠశాలల్లో బండెడు చాకిరీ చేస్తున్నారని చెప్పారు. ఇచ్చేదే అరకొర పారితోషికం..అదీ నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం అన్యాయమన్నారు. వెంటనే వారి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. వారిని కార్మికులుగా గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ..వేలమంది అణగారిన తరగతులకు చెందిన పిల్లలకు అన్నం వండిపెడుతున్న కార్మికుల సమస్యలు సీఎం కేసీఆర్‌కు పట్టవా? అని ప్రశ్నించారు. ఆరేడు గంటలు పనిచేస్తే రోజుకు 99 రూపాయలే ఇవ్వడం దారుణమన్నారు. అదీ 10 నెలలకే కట్టివ్వడం ఇంకా అన్యాయమన్నారు. ఆ డబ్బులతో పిల్లలను ఎట్ల చదివించుకోవాలి? కుటుంబాన్ని ఎలా నడపాలి? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పాఠశాలలకు గుడ్లను సరఫరా చేయాలనీ, అలాగైతే మూడు కాదు..ముప్పయి గుడ్లు పెట్టడానికైనా తమకేమి ఇబ్బంది లేదన్నారు. వారికి వెంటనే గుర్తింపు కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. నిక్కచ్చిగా పనిచేద్దాం..హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేద్దాం అని పిలుపునిచ్చారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ.. మంచినూనె ప్యాకెట్ రూ.200 దాటిందనీ, కేజీ బియ్యం రూ.50 పైనే ఉన్న నేపథ్యంలో అరకొర వేతనాలతో బతకడం ఎలా అని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాటాలతో విజయాలు సాధ్యమని ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటం నిరూపితం చేసిందన్నారు. నిర్విరామ పోరాటాల ద్వారానే ఐకేపీ ఉద్యోగులకు వేతనాలు పెరిగాయనీ, ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకున్నారని చెప్పారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ మాట్లాడుతూ...ఏడు రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలకు లక్ష రూపాయల గిఫ్ట్ ఇవ్వడంగాదు..రోజు ఆరేడు గంటలు కష్టపడుతున్న మధ్యాహ్నభోజన కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ప్రశాంత్ కిశోర్ సలహాలు గాదు క్షేత్రస్థాయిలో ప్రజలు, చిరుద్యోగుల బాధలను గుర్తెరిగి పాలన చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనురిస్తున్నదని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రయివేటు సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతున్నదని చెప్పారు. ఇలాంటి తరుణంలో కేంద్రం విధానాలను నిరసిస్తూ 28, 29 తేదీల్లో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ ఉపాధ్యక్షులు సి. చక్రపాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్.ప్రవీణ్, రాష్ట్ర కార్యదర్శి ఎం.సులోచన, రాష్ట్ర నాయకులు రాజేశ్వరి, సుల్తాన్, సరస్వతి, స్వప్న, బొట్ల చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.